అలహాబాద్ హైకోర్టు పవర్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఎన్‌పీఐలపై ఆర్‌బీఐ చర్యలపై మధ్యంతర ఊరటనిచ్చేందుకు సోమవారం నిరాకరించింది. ఈ తీర్పుతో దాదాపు 60కిపైగా దిగ్గజ కంపెనీలను భారీగా ప్రభావితం చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్‌ను సమర్ధించిన కోర్టు ప్రధానంగా విద్యుత్ సంస్థలకు ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. ఆర్‌బీఐ మంజూరు చేసిన 180 గ్రేస్ పీరియడ్(ఆరునెలలు) నేటితో ముగియనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది.
భారీగా రుణ పడిన సంస్థలు చెల్లింపులను ఆలస్యం చేస్తే వెంటనే చర్యల్నిప్రారంభించాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఒకసర్క్యులర్ జారీ చేసింది. రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశిస్తూ ఈ సర్క్యులర్ జారీ చేసింది. రూ. 2,000 కోట్ల పైబడిన రుణఖాతాల పరిష్కారానికి 180 రోజుల డెడ్‌లైన్ విధించింది. ఈ గడువు దాటితే ఆయా పద్దులపై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించాలని సూచించింది. దీనిపై కొన్ని విద్యుత్ కంపెనీలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో దివాలా పిటిషన్లపై సుప్రీంకోర్టులో రేపు (మంగళవారం) వాదనలు జరగనున్నాయి.
కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ హ్యారీ డౌల్ చెప్పారు. ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు ఐబీసీ క్రింద చర్యల్ని ప్రారంభిస్తాయనీ, అలాగే కంపెనీలు స్వతంత్రంగా పై కోర్టుకు అప్పీల్ చేయవచ్చని ఆయన చెప్పారు. నిరర్దక ఆస్తుల వ్యవహారంలో ఆర్‌బీఐ సర్క్యులర్‌ను అనుసరించాల్సి ఉంటుందని యుకో బ్యాంకు వెల్లడించింది.
కాగా దేశవ్యాప్తంగా దాదాపు 34 విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు భారీ రుణాల భారంతో సతమతమవుతున్నాయి. విద్యుత్ రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న/నిరర్థక ఆస్తులుగా మారిన ప్రాజెక్టులు ఇపుడు దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు.. విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాలు దాదాపు 1.74 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment