వ్యవసాయ బిల్లులపై నిరసన వ్యక్తంచేస్తూ శనివారం పంజాబ్‌లోని పాటియాలాలో భారీ ఎత్తున ఆందోళనకు దిగిన రైతులు
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, పేదల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన ‘ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు–2020’కు రాజ్యసభ స్వల్ప చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దేశంలో కోవిడ్ నేపథ్యంలో వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు వీలు కల్పిస్తూ ఇందులో సవరణలు చేశారు.
ఇందుకు సంబంధించి జూన్‌లో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇది అమల్లోకి రానుంది. బిల్లుపై చర్చ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. సీపీఎంకు చెందిన కేకే రాగేశ్ మాట్లాడుతూ..‘కోవిడ్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారంగాన్ని, కార్పొరేట్లను గట్టెక్కించేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇదే విషయాన్ని రైతులకు ఎందుకు వర్తింపజేయరు? రైతులూ దివాలా తీశారు. వారిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? వారి రుణాలపై వడ్డీని ఎందుకు మాఫీ చేయదు?’ అని నిలదీశారు.
పీఎం కేర్స్‌లో పారదర్శకత లేదు
పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటును లోక్‌సభలో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని ఆరోపించాయి. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీకి చెందిన నేతలు పీఎం కేర్స్ ఏర్పాటుపై మండిపడ్డారు. ఈ నిధిని కాగ్ సమీక్ష పరిధికి వెలుపల ఉంచడమేంటని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment