న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎకానమీపై ప్రభావాలు, తీసుకోతగిన చర్యల గురించి చర్చించేందుకు పరిశ్రమవర్గాలు, కార్పొరేట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజల ప్రాణాలు, జీవనోపాధిని కాపాడేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని ఆమె వివరించారు. ‘ఒక్కో వ్యాపార సమాఖ్యతో టెలిఫోన్ ద్వారా సంభాషించాను. పరిశ్రమలు, అసోసియేషన్లపరమైన అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకున్నాను. కోవిడ్–19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం వివిధ స్థాయుల్లో తీసుకుంటున్న చర్యల గురించి వివరించాను‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో మంత్రి ట్వీట్ చేశారు.
గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో జీడీపీ ఏకంగా 23.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెకండ్‌వేవ్ మొదలవుతున్న తొలినాళ్లలోనే కార్పొరేట్లతో ఆర్థిక మంత్రి చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కోటక్, ఫిక్కీ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్, అసోచాం ప్రెసిడెంట్ వినీత్ అగర్వాల్‌తో పాటు టాటా స్టీల్ ఎండీ టీవీ నరేంద్రన్, ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఏఎం నాయక్, టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథన్, మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ, టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, హీరో మోటో కార్ప్ ఎండీ పవన్ ముంజాల్ తదితరులతో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment