Indian economic System
-
శతమానం భారతి.. లక్ష్యం 2047
భారతదేశ ఆర్థిక వ్యవస్థను రెండు ప్రధాన దశలుగా పరిగణించాలి. ఒకటి 1947 నుంచి 1990 వరకు. రెండవది 1991లో మొదలైన అర్థిక సంస్కరణలు, సరళీకరణల దశ. తొలి దశలో బ్రిటిష్ పాలకుల వల్ల క్షీణించిన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు జవహర్లాల్ నెహ్రూ పారిశ్రామికీకరణపై భారీ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు. 1991లో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పీవీ నరసింహారావు ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించి మూలధనాన్ని సమీకరించడం, సాధారణ ప్రజలకు సైతం ఆ వాటాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించడం మన ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి తోడ్పడింది. కోవిడ్ ప్రభావం వల్ల ఈ రెండేళ్లలో కొన్ని ఒడిదుడుకులు సంభవించినప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఆశాజనకంగా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల అన్నారు. చదవండి: (దేశమాత స్వేచ్ఛ కోరి.. తిరుగుబాట్లు.. ఉరికొయ్యలు) 2021లో దేశం ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకుంది. 1991 జూలై 24న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ రోజును నేటికీ కొందరు ఆర్థిక వేత్తలు భారతదేశ ఆర్థిక స్వాతంత్య్ర దినంగా అభివర్ణిస్తున్నారు. దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచడం, లైసెన్సింగ్ రాజ్‌ను ముగించడం, కంపెనీలకు పర్మిట్ల నుంచి విముక్తి కల్పించడం, ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులు వంటి లక్ష్యాలతో నాటి బడ్జెట్‌కు రూపకల్పన జరిగింది. సాఫ్ట్వేర్ ఎగుమతి కోసం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 హెచ్హెచ్సి కింద పన్ను మినహాయింపు కూడా ప్రకటించారు. ఇవన్నీ ఈ ముప్పై ఏళ్లలో అనేక సత్ఫలితాలను ఇచ్చాయి. రానున్న 25 ఏళ్లలో ఆర్థిక పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రస్తుత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
కరోనాపై ఏం చేద్దాం చెప్పండి..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎకానమీపై ప్రభావాలు, తీసుకోతగిన చర్యల గురించి చర్చించేందుకు పరిశ్రమవర్గాలు, కార్పొరేట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజల ప్రాణాలు, జీవనోపాధిని కాపాడేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని ఆమె వివరించారు. ‘ఒక్కో వ్యాపార సమాఖ్యతో టెలిఫోన్ ద్వారా సంభాషించాను. పరిశ్రమలు, అసోసియేషన్లపరమైన అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకున్నాను. కోవిడ్–19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం వివిధ స్థాయుల్లో తీసుకుంటున్న చర్యల గురించి వివరించాను‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో మంత్రి ట్వీట్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో జీడీపీ ఏకంగా 23.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెకండ్‌వేవ్ మొదలవుతున్న తొలినాళ్లలోనే కార్పొరేట్లతో ఆర్థిక మంత్రి చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కోటక్, ఫిక్కీ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్, అసోచాం ప్రెసిడెంట్ వినీత్ అగర్వాల్‌తో పాటు టాటా స్టీల్ ఎండీ టీవీ నరేంద్రన్, ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్, టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథన్, మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ, టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, హీరో మోటో కార్ప్ ఎండీ పవన్ ముంజాల్ తదితరులతో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. -
భారత్‌లో మాంద్యం లేదు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి వుండవచ్చుకానీ మాంద్యంలోకి మాత్రం జారిపోదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన మొదటి బడ్జెట్లో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా అంశాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని వివరించారు. ఆటోమొబైల్ వంటి కొన్ని రంగాలు రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయ పరిస్థితులపై ఆందోళనలు అక్కర్లేదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలనూ (2019 ఏప్రిల్–అక్టోబర్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, అటు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇటూ వస్తు, సేవల పన్ను వసూళ్లు పెరిగాయని ఆర్థికమంత్రి తెలిపారు. అయితే కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని వల్లెవేస్తున్నారు తప్ప, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ఆయా పార్టీలు విమర్శించాయి. వరుసగా రెండు త్రైమాసికాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరక్కపోగా, మైనస్‌లోకి జారితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు. ఆర్థిక మంత్రి సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి చర్యనూ తీసుకోవడం జరుగుతోంది. ► యూపీఏ–2 ఐదేళ్ల కాలంతో పోల్చిచూస్తే, 2014 నుంచీ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. ద్రవ్యోల్బణం అదుపులో నిర్దేశిత శ్రేణి (2 శాతం ప్లస్ లేదా మైనస్ 2తో)లో ఉంది. ఆర్థిక వృద్ధి తీరు బాగుంది. ఇతర ఆర్థిక అంశాలు కూడా బాగున్నాయి. ► గడచిన రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి మందగించిన మాట వాస్తవం. అయితే ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్యాంకింగ్ మొండిబకాయిల భారం. రెండవది కార్పొరేట్ భారీ రుణ భారం. ఈ రెండు అంశాలూ యూపీఏ పాలనా కాలంలో ఇచ్చిన విచక్షణా రహిత రుణ విపరిణామాలే. ► జూలై 5 బడ్జెట్ తరువాత బ్యాంకింగ్‌కు రూ.70,000 కోట్ల అదనపు మూలధన మంజూరు జరిగింది. దీనితో బ్యాంకింగ్ రుణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ► బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) సమస్య లేదు. ► దివాలా కోడ్ వంటి సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయి. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లుగా ఉన్నాయి. ► 2014–15లో జీడీపీలో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి 5.5 శాతం ఉంటే, 2018–19లో ఈ నిష్పత్తి 5.98 శాతానికి పెరిగింది. ► 2009–14 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 189.5 బిలియన్ డాలర్లయితే, తరువాతి ఐదేళ్లలో ఈ మొత్తం 283.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ► 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలుష్య ప్రమాణాలు ప్రస్తుత బీఎస్ 4 నుంచి బీఎస్ 6కు మారాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వాహన రంగంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రభుత్వ చర్యలతో క్రమంగా ఈ రంగం రికవరీ బాట పడుతోంది. -
భారత ఆర్థిక వ్యవస్థ బలపడిందా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రపంచంలో అతివేగంగా అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌ది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పదేపదే చెబుతున్నారు. ఆయన మాటల్లో నిజం ఎంత ? గత మూడున్నర ఏళ్లుగా ఫ్యాక్టరీల ఉత్పత్తులు పెరగలేదు. పారిశ్రామిక రంగంలోకి అదనపు పెట్టుబడులు రావడం లేదు. విదేశీ పెట్టుబడులు కూడా వెనక్కి మళ్లుతున్నాయి. దేశీయ ప్రాజెక్టులు కూడా మూత పడుతున్నాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగం గత 49 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 6.1 శాతానికి చేరుకుంది. వ్యవసాయంపై పెట్టుబడులు రెట్టింపయినా, ఆదాయం మాత్రం 2018 సంవత్సరానికి గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగువ స్థాయికి పడిపోయింది. అయినా ఆర్థిక వ్యవస్థ అభివద్ధి చెందుతుందా ? చెందుతుంటే అందుకు కారణాలు ఏమిటీ? భారత ఆర్థిక వ్యవస్థ అభివద్ధి పురోగమిస్తూనే ఉందని ‘ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్’ సంస్థ విడుదల చేసిన గణాంకాలు రుజువు చేస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2030 సంవత్సరానికి 4 ఎక్స్ అంటే 400 శాతం పెరుగుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక కూడా అంచనా వేసింది ? ఎలా ? అంతా వినియోగదారుడి మహత్యం. అన్ని రంగాల్లో వినియోగదారుడి నుంచి ఊహించని స్థాయిలో కొనుగోళ్లు పెరగడమే అసలు కారణం. విమాన ప్రయాణాలు బాగా పెరిగాయి. స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లు పెరిగాయి. ఆన్లైన్ షాపింగ్ పెరిగింది. ఆటోమొబైల్ అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివద్ధి చెందుతోంది. పెరిగిన విమాన ప్రయాణాలు దేశీయ విమాన ప్రయాణాల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. 2018, డిసెంబర్ నెల నాటికి భారత దేశీయ విమాన సర్వీసుల మార్కెట్ ప్రపంచంలోనే నాలుగవ స్థానానికి చేరుకుంది. 2025 నాటికి మన ఈ మార్కెట్ ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ మార్కెట్‌గా అవతరిస్తుందని మార్కెట్ వర్గాల అంచనాలు తెలియజేస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు స్థిరంగా లేకపోయినా, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ పతనమైనా, ఈ దేశీయంగా పోటీ ఎక్కువగా ఉన్నా ఈ మార్కెట్ విస్తరించడం విశేషం. అయినప్పటికీ జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్ విమాన సర్వీసుల సంస్థలు మార్కెట్లో నిలదొక్కుకోవడానికి కష్టాలు పడుతున్నాయి. ఆటోమొబైల్ రంగం ఆటో మొబైల్ రంగం కూడా అనూహ్యంగా అభివద్ధి చెందుతోంది. 2016లో పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో నాలుగు చక్రాల వాహనాల కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. నోట్ల ప్రభావం 2017, ఏప్రిల్ నెల వరకు కొనసాగింది. అప్పటి నుంచి అనూహ్యంగా అమ్మకాలు పెరిగాయి. క్యాబ్ సర్వీసుల కోసం అమ్మకాలు ఎక్కువగా పెరిగాయి. అయితే అవన్ని బల్క్ అమ్మకాలవడం వల్ల ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదని మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ ప్రకటించాయి. 2021 సంవత్సరానికి ప్రపంచ ప్రయాణికుల మార్కెట్ భారత మార్కెట్ మూడవ అతిపెద్ద మార్కెట్ అవుతుందని లండన్‌లోని ‘ఐహెచ్ఎస్ మార్కిట్’ అంచనా వేసింది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాల వెల్లువ భారత దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం దారులు పెరుగుతుండడంతో అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడు పోతున్న పది ఫోన్లలో ఒకదాన్ని భారత్ కొనుగోలు చేస్తోంది. గతేడాదిలో వీటి అమ్మకాలు దేశీయంగా 14.5 శాతం పెరిగాయి. గతేడాది 14.23 కోట్ల స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ రంగంలో దేశీయ సంస్థలు లాభ పడింది తక్కువ. షావోమీ, వీవో, అప్పో, వాహ్వాయ్ లాంటి చైనా కంపెనీలు ఎక్కువగా లాభ పడుతున్నాయి. మరోపక్క టెలికాం సర్సీస్ ప్రొవైడర్ల రంగంలోకి రిలయెన్స్ జియో లాంటి సంస్థ అడుగు పెట్టడంతో పోటీ పెరిగి చార్జీలు గణనీయంగా తగ్గించాల్సి రావడంతో 2018లో ఒక్క ఈ రంగంలోనే 90 వేల ఉద్యోగులు రోడ్డున పడాల్సి వచ్చింది. ఈ–వాణిజ్య రంగం నేడు భారతీయులు ఉప్పు, పప్పు దగ్గరి నుంచి బంగారు ఆభరణాల వరకు ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తుండడంతో ఈ మార్కెట్ అనూహ్యంగా విస్తరించింది. ఈ మార్కెట్ ఈ ఐదేళ్ల కాలంలో బాగా విస్తరించి అమ్మకాలు ప్రస్తుతం 3,850 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ రంగం 2020 మార్చి నెల నాటికి 12,500 నుంచి 15,000 కోట్ల డాలర్ల మధ్యన విస్తరిస్తుందని ‘కేర్ రేటింగ్స్’ అంచనా వేసింది. ఈ మార్కెట్ ఇంతగా విస్తరించినప్పటికీ ఈ రంగంలో పెద్ద సంస్థలయినా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వేలకోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి. ఆ సంస్థలు భవిష్యత్తు లాభాలను దష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కేవలం మార్కెట్‌ను విస్తరించుకోవడం పట్లనే దష్టిని సారిస్తున్నాయి. ఆర్థిక సుస్థిరత సాధ్యమా? భారత ఆర్థిక వ్యవస్థలో పగుళ్లు కనిపిస్తున్నాయి. వినియోగదారుడి కొనుగోళ్లతోపాటు ప్రభుత్వ కొనుగోళ్లు కూడా పెరగడం వల్లనే నేడు ఆర్థిక వ్యవస్థ పురోభివద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా వినియోగదారుడి కొనుగోళ్లపై ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. పారిశ్రామిక రంగం విస్తరిస్తూ ఉత్పత్తి రంగం ఊపందుకున్నప్పుడే వినియోగదారుడు దానిపై ఆధారపడుతూ తన కొనుగోలు శక్తిని పెంచుకోగలడు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చే అన్ని రంగాల్లో అభివద్ధి సాధించాల్సిందే! -
స్వాతంత్య్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ
భారతదేశంపై ఆంగ్లేయులు రెండు శతాబ్దాల పాటు తిరుగులేని సామ్రాజ్యాధికారాన్ని చెలాయించారు. ఈ కాలంలో దేశ సంపదను కొల్లగొట్టి, ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పిచేశారు. బ్రిటిష్ పాలనలో భారతదేశ ముడి పదార్థాలను ఎగుమతి చేస్తూ వారి పారిశ్రామిక వస్తువులను దిగుమతి చేసేవారు. దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా నష్టపోయింది. బ్రిటిష్‌వారికి రాజ్యాధికారం ఉండటం వల్ల ఆర్థికపరమైన విధాన నిర్ణయాలన్నీ వారికి అనుకూలంగా(లాభదాయకంగా ఉండేలా) తీసుకున్నారేతప్ప భారతదేశ ప్రగతి దృష్ట్యా గానీ, ప్రజా సంక్షేమం దృష్ట్యా గానీ తీసుకోలేదు. బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రకమైన దోపిడీ మూడు రూపాల్లో కొనసాగింది. అవి.. 1.వ్యాపార దోపిడీ (మర్చెంట్ క్యాపిటల్ అండ్ ది ఎక్స్‌ప్లాయిటేషన్): వ్యాపార ముసుగులో దోపిడీ భూమి శిస్తు రూపంలో రైతాంగం నుంచి దోపిడీ లంచగొండి, అవినీతి అధికారుల దోపిడీ 2.పారిశ్రామిక దోపిడీ (ఇండస్ట్రియల్ క్యాపిటల్ అండ్ ది ఎక్స్‌ప్లాయిటేషన్): భారతదేశం నుంచి ముడి సరుకుల ఎగుమతి భారతదేశానికి పారిశ్రామిక వస్తువుల దిగుమతి బ్రిటిష్ ప్రయోజనాలకు అనుగుణంగా జనపనార పరిశ్రమ అభివృద్ధి బ్రిటిష్ ప్రభుత్వం.. వారికి అనుకూలమైన రాబడి, వ్యయ విధానాలను అవలంబించడం 3. విత్త దోపిడీ (ఫైనాన్స క్యాపిటల్ అండ్ ది ఎక్స్‌ప్లాయిటేషన్): రైల్వేల్లో పెట్టుబడి రబ్బర్, గనులు, పేపర్, బ్యాంకింగ్ మొదలైన అనేక రంగాల్లో పెట్టుబడులు జాతీయ ఆదాయ అంచనాలు స్వాతంత్య్రానికి పూర్వం మన దేశంలో జాతీయ ఆదాయానికి సంబంధించిన అధికారిక లెక్కలు లేనప్పటికీ దాదాభాయ్ నౌరోజీ తన గ్రంథం(పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా)లో 1867-68 సంవత్సర జాతీయ ఆదాయాన్ని రూ.340 కోట్లుగా అంచనా వేశారు. అప్పటి జనాభా సుమారు 17 కోట్లు ఉండటం వల్ల తలసరి ఆదాయాన్ని రూ.20గా పేర్కొన్నారు. పేదరిక స్వభావం బ్రిటిష్ పాలనలో పేదరికానికి సంబంధించి మొదటి వంద ఏళ్లలో ఏవిధమైన గణాంకాలు లేవు. అయితే నాటి రచనలను, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తే బ్రిటిష్ పాలనకు ముందు ప్రజలు మెరుగైన జీవనాన్ని గడిపినట్లు తెలుస్తోంది. దాదాభాయ్ నౌరోజీ తన గ్రంథంలో మన దేశ పేదరికం గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశం అనేక విధాలుగా సతమతమవుతూ పేదరికంలో మగ్గిపోతోందని పేర్కొన్నారు. 19వ శతాబ్దం చివర్లో భారత గ్రామీణ ప్రజల జీవనం అమెరికాలోని కట్టు బానిసల కన్నా హీనంగా ఉందని తెలిపారు. బానిసల బాగోగులను చూడటానికి వారి యజమానులైనా ఉన్నారు కానీ వీరికి కనీసం ఆ దిక్కు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వ స్టాటిస్టిక్స్ డెరైక్టర్ జనరల్ డబ్ల్యూ హంటర్ తన రచన(ఇంగ్లండ్స వర్క ఇన్ ఇండియా)లో భారత్‌లో 40 మిలియన్ల మంది ఆహారలేమితో జీవిస్తున్నారని పేర్కొన్నారు. నిజ వేతన ధోరణలు ఒక దేశ ఆర్థికాభివృద్ధిని తెలుసుకోవడానికి ఆ దేశ ‘నిజ వేతనంలో పెరుగుదల ధోరణులు’ మేలైన సూచిక. కానీ బ్రిటిష్ కాలంలోని నిజ వేతనాలకు సంబంధించిన సరైన గణాంకాలు లభించట్లేదు. అయితే యునెటైడ్ ప్రావిన్సెస్ (ఉత్తరప్రదేశ్) నిజ వేతన సూచీ(1600వ సంవత్సరం నుంచి 1938 వరకు)ని డాక్టర్ రాధాకమల్ ముఖర్జీ రూపొందించారు. ఇతని ప్రకారం 1928లో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని శ్రామికుల నిజ వేతనం.. 1807లో ఉన్న నిజ వేతనంలో సగం (50 శాతం) మాత్రమేనని లెక్కించారు. దీన్ని బట్టి అప్పటి శ్రామికుల జీవన స్థితిగతులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జనాభా వృత్తుల వారీ వర్గీకరణ మన దేశంలో జనాభా లెక్కలు 1881లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి వృత్తుల వారీ వర్గీకరణకు సంబంధించిన గణాంకాలు లభిస్తున్నాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారు 1881లో 61 శాతం ఉండగా 1921 నాటికి 73 శాతం పెరిగింది. వ్యవసాయ ఆధారిత ప్రజానీకం ఎక్కువ ఉండటం వెనకబాటుతనానికి సూచిక. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు బ్రిటిష్ పాలనలో వ్యవసాయ, సేద్య పద్ధతుల్లో ఎలాంటి నూతన పోకడలు చోటుచేసుకోలేదు. వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగింది. చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వాణిజ్య దృష్టితోకాక జీవనోపాధిగానే కొనసాగించారు. భారత రైతాంగానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించకుండా ఇంగ్లండ్ వారికి లాభదాయకంగా ఉండే రైల్వే మార్గాల నిర్మాణాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. బలహీన పారిశ్రామిక స్వరూపం బ్రిటిష్ పాలనకు ముందు మన దేశం కళాత్మక చేతివృత్తులకు పెట్టింది పేరు. బ్రిటన్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల మన దేశంలోని చేనేత, కళాత్మక చేతివృత్తుల పనివారు ఉపాధి కోల్పోయి వ్యవసాయంపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే అప్పట్లో కొన్ని పెద్ద పరిశ్రమల స్థాపన జరిగినప్పటికీ అవి శీఘ్ర పారిశ్రామికీకరణకు దోహదపడలేదు. బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు- ఆర్థిక వెనుకబాటుతనం మన దేశం బ్రిటిష్ పాలన కాలంలో అభివృద్ధి చెందకపోవడానికి అధిక జనాభా, మత విశ్వాసాలు, సామాజిక స్వరూపం, మూలధన, సాంకేతిక పరిజ్ఞాన కొరత మొదలైనవి కారణాలని వలస సామ్రాజ్యవాదాన్ని సమర్థించే ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దాదాభాయ్ నౌరోజీ, రమేశ్ దత్ మొదలైనవారు ఈ అభిప్రాయంతో ఏకీభవించక మన దేశ వెనుకబాటుతనానికి బ్రిటిష్ ప్రభుత్వం అవలంబించిన విధానాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. 1. భూస్వామ్య పద్ధతులు 1793లో కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన జమీందారీ పద్ధతి.. రైతుల స్థితిగతులను అగాథంలోకి నెట్టేసింది. జమీందారులు ప్రభుత్వానికి చెల్లించే శిస్తు పరిమాణంలో మార్పు లేకపోయినప్పటికీ వారు రైతుల నుంచి ఎప్పటికప్పుడు అధికంగా వసూలు చేసేవారు. ఈ క్రమంలో రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసేవారు. పైగా రైతాంగం బాగోగులను పట్టించుకోకుండా విలాసాల్లో మునిగి తేలేవారు. గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పట్టున్న జమీందారీ వర్గం బ్రిటిష్ ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలకటం వల్ల రైతాంగం గోడును పట్టించుకునేవారు కరువయ్యారు. ఫలితంగా వ్యవసాయ రంగం పురోభివృద్ధిలేక స్థబ్దతకు గురైంది. 2. పారిశ్రామిక, వాణిజ్య విధానాలు బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లో అవలంబించిన పారిశ్రామిక, వాణిజ్య విధానాల ముఖ్యోద్దేశం మన దేశాన్ని ఇంగ్లండ్‌కు పూరక దేశంగా మార్చడం. ఈ దిశగా వారు తమ పారిశ్రామిక వస్తువులను అమ్ముకోవడానికి మన దేశాన్ని మార్కెట్‌గా ఉపయోగించుకున్నారు. వారి పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలను సరఫరా చేయడానికి వీలుగా మన దేశాన్ని వ్యవసాయంపై ఆధారపడే విధంగా చేశారు. భారత్ ఎగుమతులపై అనేక ఆంక్షలు విధించి మన దేశ పరిశ్రమలను కోలుకోని రీతిలో దెబ్బతీశారు. 3. ఆర్థిక దోపిడీ దాదాభాయ్ నౌరోజీ అంచనా ప్రకారం 1835-1872 మధ్య కాలంలో మన దేశం నుంచి 50 కోట్ల పౌండ్లు హోం చార్జీలు, కంపెనీ చెల్లించాల్సిన వడ్డీల రూపంలో ఇంగ్లండ్‌కు తరలిపోయాయి. దీన్నే ఆయన ఆర్థిక దోపిడీ(డ్రెయిన్ ఆఫ్ వెల్త్ లేదా డ్రెయిన్ థియరీ)గా పేర్కొన్నారు. అప్పట్లో మన దేశ ఎగుమతుల విలువ ఎక్కువగా, దిగుమతుల విలువ తక్కువగా ఉండటంతో విదేశీ మిగులు ఉండేది. ఆ మిగులును మన దేశాభివృద్ధికి బదులు ఇంగ్లండ్ అభివృద్ధికి ఉపయోగించారు. 4. హోం చార్జీలు 1829-1865 మధ్య కాలంలో 10 కోట్ల పౌండ్లు కేవలం హోం చార్జీలకే తరలించారని దాదాభాయ్ నౌరోజీ అంచనా వేశారు. హోం చార్జీల్లో ఉండే అంశాలు.. ఈస్టిండియా కంపెనీ తన షేర్ హోల్డర్లకు చెల్లించాల్సిన డివిడెండ్లు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఇంగ్లండ్‌లో తీసుకున్న అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలు భారతదేశంలో ఉన్న ఇంగ్లండ్ మిలటరీకి అయ్యే ఖర్చు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో పనిచేసి రిటైర్డ అయిన ఉద్యోగుల పెన్షన్లు బ్రిటిష్ ఇండియా అధికారులు సెలవుపై ఇంగ్లండ్‌కు వెళ్లినప్పుడు వారి ప్రయాణాలకయ్యే ఖర్చు మన దేశంలో బ్రిటిష్‌వారు కొనసాగించిన యుద్ధాలకైన ఖర్చు భారతదేశాన్ని అనేక మంది స్వదేశీ, విదేశీ రాజులు చాలా ఏళ్లపాటు పాలించినప్పటికీ దేశ, ప్రజా శ్రేయస్సు పట్ల కొంత మొగ్గు చూపారు. అయితే ఇంగ్లండ్వారి రెండు శతాబ్దాల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ అన్ని విధాలుగా కుదేలై ంది. ‘‘మనకు కావాల్సింది భారతదేశ సంపదను ఎట్లా తరలించుకుపోవాలన్నదే కానీ భారతదేశాన్ని ఎట్లా బాగుచేయాలన్నది కాదు’’ అన్న శాలిస్ ప్రభువు మాటలు బ్రిటిష్ పాలకుల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి.