సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రపంచంలో అతివేగంగా అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌ది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పదేపదే చెబుతున్నారు. ఆయన మాటల్లో నిజం ఎంత ? గత మూడున్నర ఏళ్లుగా ఫ్యాక్టరీల ఉత్పత్తులు పెరగలేదు. పారిశ్రామిక రంగంలోకి అదనపు పెట్టుబడులు రావడం లేదు. విదేశీ పెట్టుబడులు కూడా వెనక్కి మళ్లుతున్నాయి. దేశీయ ప్రాజెక్టులు కూడా మూత పడుతున్నాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగం గత 49 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 6.1 శాతానికి చేరుకుంది. వ్యవసాయంపై పెట్టుబడులు రెట్టింపయినా, ఆదాయం మాత్రం 2018 సంవత్సరానికి గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగువ స్థాయికి పడిపోయింది. అయినా ఆర్థిక వ్యవస్థ అభివద్ధి చెందుతుందా ? చెందుతుంటే అందుకు కారణాలు ఏమిటీ?
భారత ఆర్థిక వ్యవస్థ అభివద్ధి పురోగమిస్తూనే ఉందని ‘ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్’ సంస్థ విడుదల చేసిన గణాంకాలు రుజువు చేస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2030 సంవత్సరానికి 4 ఎక్స్ అంటే 400 శాతం పెరుగుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక కూడా అంచనా వేసింది ? ఎలా ? అంతా వినియోగదారుడి మహత్యం. అన్ని రంగాల్లో వినియోగదారుడి నుంచి ఊహించని స్థాయిలో కొనుగోళ్లు పెరగడమే అసలు కారణం. విమాన ప్రయాణాలు బాగా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు పెరిగాయి. ఆన్‌లైన్ షాపింగ్ పెరిగింది. ఆటోమొబైల్ అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివద్ధి చెందుతోంది.
పెరిగిన విమాన ప్రయాణాలు
దేశీయ విమాన ప్రయాణాల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. 2018, డిసెంబర్ నెల నాటికి భారత దేశీయ విమాన సర్వీసుల మార్కెట్ ప్రపంచంలోనే నాలుగవ స్థానానికి చేరుకుంది. 2025 నాటికి మన ఈ మార్కెట్ ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ మార్కెట్‌గా అవతరిస్తుందని మార్కెట్ వర్గాల అంచనాలు తెలియజేస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు స్థిరంగా లేకపోయినా, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ పతనమైనా, ఈ దేశీయంగా పోటీ ఎక్కువగా ఉన్నా ఈ మార్కెట్ విస్తరించడం విశేషం. అయినప్పటికీ జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్ విమాన సర్వీసుల సంస్థలు మార్కెట్లో నిలదొక్కుకోవడానికి కష్టాలు పడుతున్నాయి.
ఆటోమొబైల్ రంగం
ఆటో మొబైల్ రంగం కూడా అనూహ్యంగా అభివద్ధి చెందుతోంది. 2016లో పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో నాలుగు చక్రాల వాహనాల కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. నోట్ల ప్రభావం 2017, ఏప్రిల్ నెల వరకు కొనసాగింది. అప్పటి నుంచి అనూహ్యంగా అమ్మకాలు పెరిగాయి. క్యాబ్ సర్వీసుల కోసం అమ్మకాలు ఎక్కువగా పెరిగాయి. అయితే అవన్ని బల్క్ అమ్మకాలవడం వల్ల ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదని మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ ప్రకటించాయి. 2021 సంవత్సరానికి ప్రపంచ ప్రయాణికుల మార్కెట్ భారత మార్కెట్ మూడవ అతిపెద్ద మార్కెట్ అవుతుందని లండన్‌లోని ‘ఐహెచ్‌ఎస్ మార్కిట్’ అంచనా వేసింది.
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల వెల్లువ
భారత దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం దారులు పెరుగుతుండడంతో అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడు పోతున్న పది ఫోన్లలో ఒకదాన్ని భారత్ కొనుగోలు చేస్తోంది. గతేడాదిలో వీటి అమ్మకాలు దేశీయంగా 14.5 శాతం పెరిగాయి. గతేడాది 14.23 కోట్ల స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే ఈ రంగంలో దేశీయ సంస్థలు లాభ పడింది తక్కువ. షావోమీ, వీవో, అప్పో, వాహ్‌వాయ్ లాంటి చైనా కంపెనీలు ఎక్కువగా లాభ పడుతున్నాయి. మరోపక్క టెలికాం సర్సీస్ ప్రొవైడర్ల రంగంలోకి రిలయెన్స్ జియో లాంటి సంస్థ అడుగు పెట్టడంతో పోటీ పెరిగి చార్జీలు గణనీయంగా తగ్గించాల్సి రావడంతో 2018లో ఒక్క ఈ రంగంలోనే 90 వేల ఉద్యోగులు రోడ్డున పడాల్సి వచ్చింది.
ఈ–వాణిజ్య రంగం
నేడు భారతీయులు ఉప్పు, పప్పు దగ్గరి నుంచి బంగారు ఆభరణాల వరకు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తుండడంతో ఈ మార్కెట్ అనూహ్యంగా విస్తరించింది. ఈ మార్కెట్ ఈ ఐదేళ్ల కాలంలో బాగా విస్తరించి అమ్మకాలు ప్రస్తుతం 3,850 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ రంగం 2020 మార్చి నెల నాటికి 12,500 నుంచి 15,000 కోట్ల డాలర్ల మధ్యన విస్తరిస్తుందని ‘కేర్ రేటింగ్స్’ అంచనా వేసింది. ఈ మార్కెట్ ఇంతగా విస్తరించినప్పటికీ ఈ రంగంలో పెద్ద సంస్థలయినా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వేలకోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి. ఆ సంస్థలు భవిష్యత్తు లాభాలను దష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కేవలం మార్కెట్‌ను విస్తరించుకోవడం పట్లనే దష్టిని సారిస్తున్నాయి.
ఆర్థిక సుస్థిరత సాధ్యమా?
భారత ఆర్థిక వ్యవస్థలో పగుళ్లు కనిపిస్తున్నాయి. వినియోగదారుడి కొనుగోళ్లతోపాటు ప్రభుత్వ కొనుగోళ్లు కూడా పెరగడం వల్లనే నేడు ఆర్థిక వ్యవస్థ పురోభివద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా వినియోగదారుడి కొనుగోళ్లపై ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. పారిశ్రామిక రంగం విస్తరిస్తూ ఉత్పత్తి రంగం ఊపందుకున్నప్పుడే వినియోగదారుడు దానిపై ఆధారపడుతూ తన కొనుగోలు శక్తిని పెంచుకోగలడు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చే అన్ని రంగాల్లో అభివద్ధి సాధించాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment