dirty dozen
-
‘జ్యోతి స్ట్రక్చర్స్’పై దివాలా చర్యలు ప్రారంభం
డర్టీ డజన్లో ఇది మొదటిది ముంబై: మొండిబకాయిలకు సంబంధించి డర్టీ డజన్ సంస్థలపై దివాలా చర్యల దిశలో తొలి అడుగు పడింది. తొలిగా జ్యోతి స్ట్రక్చర్స్‌పై చట్టపరమైన చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీంతో దివాలా చట్టం (ఐబీసీ) కింద ఎన్సీఎల్టీలో విచారణను ఎదుర్కొనబోయే 12 కేసుల్లో జ్యోతి స్ట్రక్చర్స్‌దే తొలి కేసు కానుంది. కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకుల తరఫున లీడ్ బ్యాంకరుగా ఎస్బీఐ ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీ ఫైలింగ్స్ ప్రకారం కంపెనీ మొత్తం రుణభారం రూ.7,000 కోట్లుగా ఉంది. ఐబీసీ చర్యలను కంపెనీ వ్యతిరేకించనందున విచారణకు బ్యాంకర్ల దరఖాస్తును ఆమోదించినట్లు ఎన్సీఎల్టీ ప్రిసైడింగ్ సభ్యుడు బీఎస్వీ ప్రకాశ్ కుమార్ మంగళవారం తెలిపారు. అలాగే ఎస్బీఐ విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా జ్యోతి స్ట్రక్చర్స్ నిర్వహణకు బీడీవో ఇండియా కన్సల్టింగ్ సంస్థ నియామకాన్ని ట్రిబ్యునల్ ఆమోదించింది. తమ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ఓ సంస్థ ఆసక్తిగా ఉందంటూ ఎన్సీఎల్టీకి జ్యోతి స్ట్రక్చర్స్ గత గురువారం నివేదించింది. దాదాపు రూ.2.5 లక్షల కోట్ల రుణభారం పేరుకుపోయిన 12 కంపెనీల గురించి ఎన్సీఎల్టీని ఆశ్రయించాలంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
‘డర్టీ డజన్’పై నేటి నుంచి బ్యాంకర్ల సమావేశాలు
ముంబై: భారీగా రుణాలు ఎగవేసిన 12 సంస్థలపై చర్యల విషయంలో ఏవిధంగా వ్యవహరించాలన్న ప్రణాళికను ఖరారు చేసేందుకు బ్యాంకర్లు సోమవారం నుంచి సమావేశం కానున్నారు. ఈ సంస్థలపై ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలు చేపట్టాలని ఆర్బీఐ గతవారం ఆదేశించడంతో, వెంటనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో కేసులు దాఖలు సహా తీసుకోవాల్సిన చర్యల్ని బ్యాంకర్లు ఖరారు చేయనున్నారు. వీటిలో భూషణ్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు), ఆమ్టెక్ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్ ఇస్పాత్ (రూ.12,115 కోట్లు) కేసులపై బ్యాంకులు చర్చించనున్నట్టు ఓ బ్యాంకర్ వెల్లడించారు. వీటిపై ఈ నెలాఖరులోపు ఎన్సీఎల్టీని ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. ఇన్సాల్వెన్సీ నిపుణులను నియమిస్తామని, పరిష్కార ప్రణాళికను రూపొందించి వారు బ్యాంకులకు సమర్పిస్తారని పేర్కొన్నారు. భారీ రుణ ఎగవేతల కేసులు కావడం, ఒకటికి మించిన బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉండటంతో న్యాయ పోరాటం విషయంలో ఉమ్మడి అభిప్రాయం మేరకు వ్యవహరించడంపై చర్చించనున్నారు. ఆర్బీఐ తొలి జాబితాలోని మిగిలిన సంస్థల్లో ల్యాంకో ఇన్ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్ఫ్రా (రూ. 10,065 కోట్లు), జైపీ ఇన్ఫ్రాటెక్ (రూ.9,635 కో ట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్ (రూ.5,165 కోట్లు) ఉన్నట్టు ఓ బ్యాంకర్ తెలిపారు. కేవలం ఈ 12 సంస్థలు ఎగ్గొట్టిన మొత్తం రుణాలే రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాం కుల మొత్తం మొండి బకాయిల్లో ఇవి 25 శాతం. -
డర్టీ డజన్ పేర్లు త్వరలో వెల్లడి
♦ దివాలా ప్రక్రియకు 180 రోజులు ♦ కొన్ని కేసుల్లో 90 రోజుల వరకు అదనపు గడువు ♦ రాత్రికి రాత్రి చర్యలు సాధ్యం కావు ♦ వేగంగా విచారణ పూర్తి చేసేందుకు చర్యలు ♦ కేంద్ర ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు భారీగా రుణ బకాయి పడిన 12 సంస్థల పేర్లు త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దివాలా చర్యలు చేపట్టేందుకు ఆయా సంస్థల పేర్లను ఆర్బీఐ గుర్తించిందని పేర్కొంది. దేశీయ బ్యాంకుల మొండి బాకీలు రూ.8లక్షల కోట్లకు చేరగా, అందులో 25 శాతం రూ.2 లక్షల కోట్లు ఎగ్గొట్టింది కేవలం 12 సంస్థలేనని ఆర్బీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ వాటి పేర్లను వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం స్పందించింది. ‘‘12 కేసులను గుర్తించడం జరిగింది. వీటి పేర్లను త్వరలోనే వెల్లడిస్తాం. మొత్తం మొండి బాకీల్లో ఈ సంస్థలవే 25 శాతం ఉన్నాయి. వీరంతా రూ.5వేల కోట్లకుపైగా బకాయిలు పడినవే’’ అని ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారుడు సంజీవ్ సన్యాల్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ (రుణ బాకీలు, దివాలా కోడ్/ఐబీసీ) కింద ఈ కేసులను వేగంగా విచారించేందుకు వీలుగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను బలోపేతం చేయనున్నట్టు చెప్పారు. దివాలా ప్రక్రియ ప్రారంభించామంటే రాత్రికి రాత్రి ఆయా సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేయడం సాధ్యం కాదన్నారు. దివాలా చర్యలు చేపట్టేందుకు ఐబీసీ 180 రోజుల కనీస గడువు ఇచ్చిందన్నారు. ఎన్సీఎల్టీని బలోపేతం చేయాలి: తపన్ రే కాగా కేసుల విచారణను సత్వరమే చేపట్టేందుకు అనువైన మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించాల్సి ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తపన్రే తెలిపారు. మరింత మంది న్యాయ, సాంకేతిక నిపుణులను అందులో చేర్చడం ద్వారా ఆ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. అప్పడు ఈ కేసులను విచారించడం సాధ్యం అవుతుంది’’ అని తపన్రే వివరించారు. నష్టాలు తప్పవు: యునైటెడ్ బ్యాంక్ ఎండీ భారీ రుణ ఎగవేతదారుల కేసులపై యునైటెడ్ బ్యాంకు ఎండీ పవన్‌కుమార్ బజాజ్ స్పందిస్తూ... కొన్ని కేసుల్లో నికర విలువ కూడా హరించుకుపోయిందని, ఆయా కేసుల్లో హేర్ కట్స్ (రుణాలపై నష్టాలు) తప్పవని అభిప్రాయపడ్డారు. భారీ ఎన్పీఏ కేసుల్లో ప్రమోటర్లకు మిగిలేదేమీ ఉండకపోవచ్చని యూకో బ్యాంకు ఎండీ రవికృష్ణన్ పేర్కొన్నారు. ‘పరిష్కార కార్పొరేషన్’కు కేబినెట్ ఆమోదం బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థల్లో ఎదురయ్యే దివాలా (అప్పులు తీర్చకుండా చేతులెత్తేయడం) సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ‘ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు –2017’కు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఆయా సంస్థలను ప్రజాధనంతో బయట పడేసే పరిస్థితిని నివారించడంతోపాటు, ఆయా సంస్థల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ తీసుకురావడమే ఈ బిల్లు లక్ష్యం. ‘‘ప్రస్తుతం అమల్లో ఉన్న డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ 1961 రద్దుకు ఇది దారితీస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అధికారాలు కొత్తగా ఏర్పాటయ్యే పరిష్కార కార్పొరేషన్‌కు బదిలీ అవుతాయి’’ అని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నూతన సంస్థ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడుతూ, ప్రజా ఆస్తులకు రక్షణ కల్పించనుంది. టెల్కోల రుణాలపై బ్యాంకర్లలో ఆందోళన భారీ రుణాలు పేరుకుపోయిన టెలికం రంగంలో పరిస్థితులు బ్యాంకులను కలవరపరుస్తున్నాయి. ఇవి డిఫాల్ట్‌కు దారి తీసే అవకాశముందని అవి ఆందోళన చెందుతున్నాయి. బుధవారం అంతర్మంత్రిత్వ శాఖల బృందం (ఐఎంజీ)తో భేటీ అయిన బ్యాంకర్లు ఇదే అంశం ప్రస్తావించారు. టెలికం రంగంలో ’ఒత్తిడి’ దరిమిలా ఆపరేటర్లు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంజీతో సుమారు రెండు గంటల పాటు సమావేశమైన నాలుగు పెద్ద బ్యాంకుల (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్) అధికారులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమ్యూనికేషన్స్, ఆర్థిక శాఖకు చెందిన అధికారులతో కూడిన ఐఎంజీ.. టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారమార్గాలపై చర్చించేందుకు ఆపరేటర్లు, బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తోంది. టెలికం పరిశ్రమ మొత్తం రుణభారం సుమారు రూ. 4.6 లక్షల కోట్ల పైగా ఉంది. ఇందులో ఎస్బీఐ ఇచ్చిన రుణాలే ఏకంగా రూ. 80,000 కోట్ల మేర ఉన్నాయి.