‘జ్యోతి స్ట్రక్చర్స్’పై దివాలా చర్యలు ప్రారంభం
డర్టీ డజన్‌లో ఇది మొదటిది
ముంబై: మొండిబకాయిలకు సంబంధించి డర్టీ డజన్ సంస్థలపై దివాలా చర్యల దిశలో తొలి అడుగు పడింది. తొలిగా జ్యోతి స్ట్రక్చర్స్‌పై చట్టపరమైన చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేసింది. దీంతో దివాలా చట్టం (ఐబీసీ) కింద ఎన్‌సీఎల్‌టీలో విచారణను ఎదుర్కొనబోయే 12 కేసుల్లో జ్యోతి స్ట్రక్చర్స్‌దే తొలి కేసు కానుంది. కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకుల తరఫున లీడ్ బ్యాంకరుగా ఎస్‌బీఐ ఈ పిటీషన్ దాఖలు చేసింది.
ఎన్‌సీఎల్‌టీ ఫైలింగ్స్ ప్రకారం కంపెనీ మొత్తం రుణభారం రూ.7,000 కోట్లుగా ఉంది. ఐబీసీ చర్యలను కంపెనీ వ్యతిరేకించనందున విచారణకు బ్యాంకర్ల దరఖాస్తును ఆమోదించినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రిసైడింగ్ సభ్యుడు బీఎస్‌వీ ప్రకాశ్ కుమార్ మంగళవారం తెలిపారు. అలాగే ఎస్‌బీఐ విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా జ్యోతి స్ట్రక్చర్స్ నిర్వహణకు బీడీవో ఇండియా కన్సల్టింగ్ సంస్థ నియామకాన్ని ట్రిబ్యునల్ ఆమోదించింది. తమ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ఓ సంస్థ ఆసక్తిగా ఉందంటూ ఎన్‌సీఎల్‌టీకి జ్యోతి స్ట్రక్చర్స్ గత గురువారం నివేదించింది.
దాదాపు రూ.2.5 లక్షల కోట్ల రుణభారం పేరుకుపోయిన 12 కంపెనీల గురించి ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాలంటూ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.