డర్టీ డజన్ పేర్లు త్వరలో వెల్లడి
♦ దివాలా ప్రక్రియకు 180 రోజులు
♦ కొన్ని కేసుల్లో 90 రోజుల వరకు అదనపు గడువు
♦ రాత్రికి రాత్రి చర్యలు సాధ్యం కావు
♦ వేగంగా విచారణ పూర్తి చేసేందుకు చర్యలు
♦ కేంద్ర ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు భారీగా రుణ బకాయి పడిన 12 సంస్థల పేర్లు త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దివాలా చర్యలు చేపట్టేందుకు ఆయా సంస్థల పేర్లను ఆర్‌బీఐ గుర్తించిందని పేర్కొంది. దేశీయ బ్యాంకుల మొండి బాకీలు రూ.8లక్షల కోట్లకు చేరగా, అందులో 25 శాతం రూ.2 లక్షల కోట్లు ఎగ్గొట్టింది కేవలం 12 సంస్థలేనని ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ వాటి పేర్లను వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం స్పందించింది. ‘‘12 కేసులను గుర్తించడం జరిగింది. వీటి పేర్లను త్వరలోనే వెల్లడిస్తాం.
మొత్తం మొండి బాకీల్లో ఈ సంస్థలవే 25 శాతం ఉన్నాయి. వీరంతా రూ.5వేల కోట్లకుపైగా బకాయిలు పడినవే’’ అని ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారుడు సంజీవ్ సన్యాల్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ (రుణ బాకీలు, దివాలా కోడ్/ఐబీసీ) కింద ఈ కేసులను వేగంగా విచారించేందుకు వీలుగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను బలోపేతం చేయనున్నట్టు చెప్పారు. దివాలా ప్రక్రియ ప్రారంభించామంటే రాత్రికి రాత్రి ఆయా సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేయడం సాధ్యం కాదన్నారు. దివాలా చర్యలు చేపట్టేందుకు ఐబీసీ 180 రోజుల కనీస గడువు ఇచ్చిందన్నారు.
ఎన్‌సీఎల్‌టీని బలోపేతం చేయాలి: తపన్ రే
కాగా కేసుల విచారణను సత్వరమే చేపట్టేందుకు అనువైన మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించాల్సి ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తపన్‌రే తెలిపారు. మరింత మంది న్యాయ, సాంకేతిక నిపుణులను అందులో చేర్చడం ద్వారా ఆ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. అప్పడు ఈ కేసులను విచారించడం సాధ్యం అవుతుంది’’ అని తపన్‌రే వివరించారు.
నష్టాలు తప్పవు: యునైటెడ్ బ్యాంక్ ఎండీ
భారీ రుణ ఎగవేతదారుల కేసులపై యునైటెడ్ బ్యాంకు ఎండీ పవన్‌కుమార్ బజాజ్ స్పందిస్తూ... కొన్ని కేసుల్లో నికర విలువ కూడా హరించుకుపోయిందని, ఆయా కేసుల్లో హేర్ కట్స్ (రుణాలపై నష్టాలు) తప్పవని అభిప్రాయపడ్డారు. భారీ ఎన్‌పీఏ కేసుల్లో ప్రమోటర్లకు మిగిలేదేమీ ఉండకపోవచ్చని యూకో బ్యాంకు ఎండీ రవికృష్ణన్ పేర్కొన్నారు.
‘పరిష్కార కార్పొరేషన్’కు కేబినెట్ ఆమోదం
బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థల్లో ఎదురయ్యే దివాలా (అప్పులు తీర్చకుండా చేతులెత్తేయడం) సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ‘ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు –2017’కు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఆయా సంస్థలను ప్రజాధనంతో బయట పడేసే పరిస్థితిని నివారించడంతోపాటు, ఆయా సంస్థల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ తీసుకురావడమే ఈ బిల్లు లక్ష్యం. ‘‘ప్రస్తుతం అమల్లో ఉన్న డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ 1961 రద్దుకు ఇది దారితీస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అధికారాలు కొత్తగా ఏర్పాటయ్యే పరిష్కార కార్పొరేషన్‌కు బదిలీ అవుతాయి’’ అని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నూతన సంస్థ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడుతూ, ప్రజా ఆస్తులకు రక్షణ కల్పించనుంది.
టెల్కోల రుణాలపై బ్యాంకర్లలో ఆందోళన
భారీ రుణాలు పేరుకుపోయిన టెలికం రంగంలో పరిస్థితులు బ్యాంకులను కలవరపరుస్తున్నాయి. ఇవి డిఫాల్ట్‌కు దారి తీసే అవకాశముందని అవి ఆందోళన చెందుతున్నాయి. బుధవారం అంతర్‌మంత్రిత్వ శాఖల బృందం (ఐఎంజీ)తో భేటీ అయిన బ్యాంకర్లు ఇదే అంశం ప్రస్తావించారు. టెలికం రంగంలో ’ఒత్తిడి’ దరిమిలా ఆపరేటర్లు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐఎంజీతో సుమారు రెండు గంటల పాటు సమావేశమైన నాలుగు పెద్ద బ్యాంకుల (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్) అధికారులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమ్యూనికేషన్స్, ఆర్థిక శాఖకు చెందిన అధికారులతో కూడిన ఐఎంజీ.. టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారమార్గాలపై చర్చించేందుకు ఆపరేటర్లు, బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తోంది. టెలికం పరిశ్రమ మొత్తం రుణభారం సుమారు రూ. 4.6 లక్షల కోట్ల పైగా ఉంది. ఇందులో ఎస్‌బీఐ ఇచ్చిన రుణాలే ఏకంగా రూ. 80,000 కోట్ల మేర ఉన్నాయి.