Sanjeev Sanyal
-
ఇక న్యాయ, పాలనా సంస్కరణలపై కేంద్రం దృష్టి
కోల్‌కతా: ప్రభుత్వం తదుపరి సంస్కరణల ఎజెండాలో దేశంలోని పరిపాలనా, న్యాయ రంగాలేనని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అన్నారు.ఇక్కడ భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (బీసీసీ)లో సన్యాల్ మాట్లాడుతూ, 2014లో కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఇన్నోవేషన్ (ఆవిష్కరణ) ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ‘‘2014 నుండి సంస్కరణల కొత్త పథం అమలులోకి వచ్చింది. గత దశాబ్దంలో, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు జరిగాయి. దివాలా కోడ్ (ఐబీసీ), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటి కీలక వ్యవస్థలు అమల్లోకి వచ్చాయి. ద్రవ్యోల్బణ లక్ష్యం నిర్దేశ విధానం ప్రారంభమైంది’’ అని ఆయన అన్నారు. ‘‘ఇప్పుడు రెండు ప్రధాన సంస్కరణలు.. పరిపాలనా– న్యాయపరమైన సంస్కరణలు అవశ్యం. దీనికి విస్తృత ప్రజా మద్దతు అవసరం’’ అని ఆయన అన్నారు. 7 శాతం వరకూ వృద్ధి స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సన్యాల్ విశ్లేíÙంచారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరత్వం ఉన్నాయని, కరెంట్ ఖాతా లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) తగిన స్థాయిలో ఉందని, 13 నెలలకు సరిపడా విదేశీ మారక నిల్వలు (600 బిలియన్ డాలర్లు) ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్దీపనలతో దేశంలో డిమాండ్ పరిస్థితులను పెంచాల్సిన తక్షణ అవసరం ఏదీ లేదని కూడా ఆయన ఉద్ఘాటించారు. ఇలాంటి విధానాలతో దిగుమతులు పెరిగితే అది క్యాడ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. కోవిడ్ సంవత్సరాల్లో తీవ్ర ప్రభావానికి గురయిన సరఫరాల వ్యవస్థను పటిష్టంగా ఉంచాల్సిన అవసరం మాత్రం తక్షణం ఉందని ఉద్ఘాటించారు. ద్రవ్యోల్బణంపై అప్పుడప్పుడు కూరగాయల ధరలు పెరుగుతున్న ప్రభావం మినహా అంతర్లీన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అంత బలంగా లేవని భరోసాను ఇచ్చారు. మౌలిక రంగం ఊతం మౌలిక రంగంలో గత పెట్టుబడులు ఇప్పుడు మనకు ప్రయోజనం సమకూర్చుతున్నట్లు సన్యాల్ తెలిపారు. ప్రపంచాన్ని నిరుత్సాహపరిచే పలు ఆర్థిక పరిస్థితలు నేపథ్యంలో భారత్ 6.5 శాతం వృద్ధి సాధించడం మామూలు విషయం కాదని కూడా స్పష్టం చేశారు. ఉద్దీపనల వంటి చర్యలతో వృద్ధి వేగాన్ని భారీగా పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం లేదని ఆయన పేర్కొంటూ, ‘‘స్పష్టమైన రహదారి ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం. ఇప్పుడు ఈ బాటలో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నాయి’’ అని విశ్లేíÙంచారు. స్థూల ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ఇప్పుడు కీలకమని పేర్కొన్న ఆయన ఈ విషయంలో బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరత, సరఫరాల వ్యవస్థలో లోపాలు లేకుండా చేయడం ముఖ్యమన్నారు. జర్మనీ, జపాన్ సరేకానీ... అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత ఐదవ స్థానంలో నిలిచిన భారత్ ఎకానమీ మన ముందు ఉన్న దేశాలను అధిరోహిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదని అన్నారు. అయితే తొలి రెండు దేశాలు మాత్రం మనకంటే ఎంతో ముందు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేశారు. రూపాయిని అంతర్జాతీయం చేసి, వాణిజ్య మారి్పడిలో కీలక మారకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందని సన్యాల్ అన్నారు. ‘‘అమెరికా డాలర్ విషయంలో ఈ విధానం ఎంతమాత్రం జోక్యం చేసుకోదు. రూపాయిని భవిష్యత్తులో యాంకర్ కరెన్సీగా ఉండాలన్నదే దేశ విధానం’’ అని ఆయన చెప్పారు. చివరిగా 2011లో జరిగిన జనాభా లెక్క జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తదుపరి జనాభా గణన చేయాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా సన్యాల్ పేర్కొన్నారు. -
అధిక వృద్ధి బాటలోనే భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాల్లో స్వల్ప కోతలు విధిస్తున్నప్పటికీ ఎకానమీ అధిక వృద్ధి బాటలోనే ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యుడు సంజీవ్ సన్యాల్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 6.5 శాతం వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితుల నేపథ్యంలో మిగతా ఏ దేశంతో పోల్చి చూసినా భారత్ చాలా ముందే ఉందని సన్యాల్ పేర్కొన్నారు. ‘ఏడీబీ (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్), ప్రపంచ బ్యాంక్ ఈ ఏడాదికి సంబంధించి వృద్ధి అంచనాలను స్వల్పంగానే కుదించాయి. ఈ అంచనాల ప్రకారం చూసినా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదిగే ఎకానమీగా ఉంటుంది‘ అని ఆయన చెప్పారు. వినియోగం మందగించడం, అంతర్జాతీయంగా కఠిన పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలను ఇటీవలే 6.3 – 6.4 శాతం శ్రేణికి ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు కుదించాయి. దీనివల్ల మనమేమీ వెనకబడిపోతున్నట్లుగా భావించాల్సిన అవసరం లేదని సన్యాల్ చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో 8 శాతం పైగా వృద్ధి రేటు సాధించే సత్తా ఉన్నప్పటికీ ఎగుమతులు, దిగుమతులపరంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా కొంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాకా భారత్ వృద్ధి రేటు మరింత వేగవంతం కాగలదని సన్యాల్ చెప్పారు. వివిధ సంస్కరణలతో బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసినందున అమెరికా, యూరప్ బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావాలు భారత ఆర్థిక రంగంపై ప్రత్యక్షంగా ఉండబోవని సన్యాల్ తెలిపారు. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నందున అప్రమత్తత కొనసాగించాల్సి ఉంటుందన్నారు. -
కోవిడ్–19 తర్వాత భారత్ మరింత శక్తివంతం
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి తర్వాత భారత్ ఎకానమీ మరింత శక్తివంతంగా మారిందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. పారిశ్రామిక వేదిక– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, చైనాకన్నా ఈ వేగం రెట్టింపు ఉందని అన్నారు. మహమ్మారి కాలంలో ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించిందని, దేశ బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసిందని అన్నారు. ఒప్పందాల సమర్థవంతమైన అమలు, జైలు సంస్కరణలు కేంద్రం తదుపరి సంస్కరణ ఎజెండాగా ఉండాలని పేర్కొన్నారు. -
‘టీకా’ వేశాం.. ఢోకాలేదు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సవాళ్లను అధిగమిస్తూ భారత్ అధిక వృద్ధి బాటలో ముందుకు దూసుకెళ్లనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా తన స్థానాన్ని నిలబెట్టుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 8–8.5% స్థాయిలో వృద్ధి సాధించనుంది. భారీ స్థాయిలో కొనసాగుతు న్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి వంటివి ఇందుకు దోహదపడనున్నాయి. సోమ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఎకానమీకి తోడ్పాటునిచ్చేందుకు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థికపరంగా తగినంత వెసులుబాటు ఉందని సర్వే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకోతగిన చర్యలను సూచించే దీన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మంగళవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా మంత్రి తగు ప్రతిపాదనలు చేస్తారన్న అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సర్వేలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదుపులోనే ద్రవ్యోల్బణం.. సరఫరా వ్యవస్థను మెరుగ్గా నిర్వహించడంతో పాటు ఇంధనాలపై సుంకాలను తగ్గించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ధరలు దాదాపు అదుపులోనే ఉన్నాయని సర్వే పేర్కొంది. వంటనూనెలు, పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల రేట్లు పెరిగిపోయాయని .. కానీ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి కొంత మేర కట్టడి చేసిందని తెలిపింది. రిస్కులూ ఉన్నాయ్.. ఇంధన ధరలు అధిక స్థాయిల్లో ఉంటున్న నేపథ్యంలో దిగుమతిపరమైన ద్రవ్యోల్బణం కాస్త ఆందోళనకరంగా ఉండవచ్చని ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు, ఎకనమిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. భారత్ తన ఇంధన అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంధన ధరలు అధికంగా ఉంటే ద్రవ్యోల్బణ రేటు కూడా భారీగా ఎగుస్తుంది. ‘‘ప్రపంచ ఎకానమీకి ఇది కష్టకాలం. మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితితో ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రభావాలు ఉండనున్నాయి. టెక్నాలజీలు, వినియోగదారుల ధోరణులు, సరఫరా వ్యవస్థలు, భౌగోళిక రాజకీయాం శాలు, వాతావరణం మొదలైన వాటన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ అనంతర ప్రపంచం గురించి అనిశ్చితి నెలకొంది’’ అని సన్యాల్ తెలిపారు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ప్రస్తుతం 90 డాలర్ల స్థాయిలో తిరుగాడుతున్నప్పటికీ.. వచ్చే ఏడాది 70–75 డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని సర్వే అంచనా వేసింది. అలాగే వర్షపాతం సాధారణంగానే ఉంటుందని, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు లిక్విడిటీ ఉపసంహరణను ఎకాయెకిన కాకుండా క్రమపద్ధతిలోనే చేయవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంకా అనిశ్చితి నెలకొందని, మిగతా దేశాల్లో అధిక వడ్డీ రేట్లు గానీ లభిస్తే భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. సర్వేలో పేర్కొన్న 2022–23 వృద్ధి.. ప్రపంచ బ్యాంకు అంచనాలకు అనుగుణంగా, ఎస్అండ్పీ.. మూడీస్ అంచనాలకన్నా కాస్త అధికంగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 9% కన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ప్రైవేట్ పెట్టుబడుల జోరు.. ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడే స్థాయిలోనే ఆర్థిక స్థితిగతులు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోగలవని సర్వే తెలిపింది. పన్ను వసూళ్లు మెరుగుపడటంతో ప్రభుత్వం తగు స్థాయిలో వ్యయాలు చేసేందుకు వెసులుబాటు లభించగలదని పేర్కొంది. క్రిప్టో కరెన్సీ పట్ల తటస్థ విధానం: సంజీవ్ సన్యాల్ దేశ ఆర్థిక స్థిరత్వంపై క్రిప్టో కరెన్సీల ప్రభావం ఉంటుంది కనుక.. వాటి నియంత్రణ విషయంలో తటస్థ వైఖరిని ప్రభుత్వం తీసుకుంటుందని సంజీవ్ సన్యాల్ అన్నారు. ప్రస్తుతానికి దేశంలో క్రిప్టో కరెన్సీల నిషేధం, అనుమతికి సంబంధించి ఎటువంటి చట్టాలు అమల్లో లేవు. సోమవారం పార్లమెంట్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఆర్థిక సర్వేలోనూ క్రిప్టోల ప్రస్తావన లేకపోవడంపై సన్యాల్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘మీకు తెలిసిందే ఈ అంశంపై ప్రభుత్వంలోను, ఆర్థిక శాఖ పరిధిలో, పార్లమెంట్‌లోనూ చర్చ నడుస్తోంది. ఆర్థిక స్థిరత్వ సమస్యలున్నాయి. మరోవైపు ఆవిష్కరణల కోణంలో చర్చ కూడా నడుస్తోంది. కనుక తటస్థ విధానాన్ని ఈ విషయంలో తీసుకోవడం జరుగుతుంది’ అని సన్యాల్ వివరించారు. సర్వేలో ఇతర హైలైట్స్.. ► ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కరోనా పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. 2022–23లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎకానమీ సర్వసన్నద్ధంగా ఉంది. ► కరోనా సవాళ్లను అధిగమించేందుకు ఇతర దేశాల తరహాలో ముందస్తుగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం కాకుండా భారత్ .. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా విధానాలను అమలు చేసింది. డిమాండ్ నిర్వహణ కాకుండా సరఫరా వ్యవస్థపరమైన సంస్కరణలతో మహమ్మారి సృష్టించిన సమస్యలను ఎదుర్కొంది. ► భారీ ఎగుమతుల వృద్ధి, మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న వెసులుబాటు తదితర అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధికి తోడ్పడనున్నాయి. ► ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉండటంతో ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా పుంజుకుని ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడగలవు. ► అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లోటు, రుణ భారాలు భారీగా పెరిగిపోయినప్పటికీ 2021–22లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది. ► విదేశీ మారకం నిల్వలపరంగా ‘బలహీనమైన అయిదు’ దేశాల్లో ఒకటిగా కొనసాగిన భారత్ ప్రస్తుతం అత్యధికంగా ఫారెక్స్ నిల్వలున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎదిగింది. దీంతో విధానపరంగా మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు లభించనుంది. ► బేస్ ఎఫెక్ట్ కారణంగానే టోకు ధరల ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంటోంది. ఇది క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ► అంతర్జాతీయంగా కంటైనర్ మార్కెట్లో అవాంతరాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్యంపై ఈ ప్రభావం కొనసాగనుంది. మహమ్మారి తొలగితే పెట్టుబడులు రయ్: నాగేశ్వరన్ కరోనా మహమ్మారి నియంత్రణలోకి వస్తే సానుకూల పెట్టుబడుల వాతావరణం జోరందుకుని, ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని నూతనంగా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) ఎ.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. తక్కువ ఆదాయ వర్గాల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కువ ఉపాధి కల్పించే నిర్మాణ రంగం ఇప్పటికే పుంజుకోవడం మొదలైనట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం 4 అంచెల విధానం అనుసరిస్తోంది. అనిశ్చిత సమయాల్లో ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా బాధిత వర్గాలకు అండగా నిలవడం. అదే సమయంలో ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం. మహమ్మారి కారణంగా నిర్మాణాత్మక, సరఫరా వైపు సంస్కరణల అవకాశాలను విడిచిపెట్టకపోవడం.. ఇలా ఎన్నో చర్యలు తీసుకుంది. సంస్కరణల ప్రక్రియపై ఎంతో శ్రద్ధ, ప్రాధాన్యం చూపిస్తోంది’ అని చెప్పారు. ‘‘ప్రపంచ ఎకానమీకి ఇది కష్టకాలం. పలు దఫాలుగా విజృంభిస్తున్న మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితితో ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రభావాలు ఉండనున్నాయి. టెక్నాలజీలు, వినియోగదారుల ధోరణులు, సరఫరా వ్యవస్థలు మొదలైన వాటన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ తర్వాత ప్రపంచమంతా అనిశ్చితి నెలకొన్నా భారత్ వీటిని అధిగమిస్తోంది ’’ – ఎకనమిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్ ఈసారి 9.2%, వచ్చేసారి 8.5%.. 2021–22 సర్వే అంచనా ► కరోనా కష్టకాలంలోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా భారత్ స్థానాన్ని నిలబెట్టుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 8–8.5% స్థాయిలో వృద్ధి సాధించనుంది. ► భారీ స్థాయిలో కొనసాగుతున్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. సోమవారం పార్ల మెంటులో ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ► 2025 ఆర్థిక సంవత్సరానికల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలని నిర్దేశించుకున్న క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై 1.4లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. ► ఎయిరిండియా విక్రయ వ్యవహారం.. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకే కాకుండా ప్రైవేటీకరణ ప్రక్రియకు గణనీయంగా ఊతం ఇవ్వగలదు. ► ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.6 శాతం. ఈ నేపథ్యంలో పంటల్లో వైవిధ్యానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. -
మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచేందుకుగాను ఆర్థిక ఉద్దీపనలతో కూడిన మరో ప్యాకేజీని ప్రభుత్వం సరైన సమయంలో ప్రకటిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ తెలిపారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 15వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి సన్యాల్ ప్రసంగించారు. తదుపరి ఉద్దీపనలను ప్రకటించేందుకు వీలుగా అటు ద్రవ్యపరంగా, ఇటు పరపతి పరంగానూ వెసులుబాటు ఉన్నట్టు చెప్పారు. కరోనా కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన అనంతరం.. రూ.1.70 లక్షల కోట్ల విలువ చేసే పలు ఉద్దీపనలతో కేంద్రం ప్యాకేజీని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత భారత్‌ను తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని సైతం ప్రకటించింది. ‘‘సరైన సమయంలో తదుపరి ఉద్దీపనల అవసరాన్ని మేము (ప్రభుత్వం) గుర్తించాము’’ అని సన్యాల్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ క్షీణతపై వస్తున్న ఆందోళనలకు స్పందించారు. ఇతర దేశాల మాదిరి ముందుగానే భారీ డిమాండ్ కల్పనకు బదులు.. ఒత్తిడిలోని వర్గాలు, వ్యాపార వర్గాల వారికి రక్షణ కవచం ఏర్పాటుపై భారత్ దృష్టి పెట్టిందన్నారు. మరో ప్యాకేజీకి వెసులుబాటు: కామత్ సంజీవ్ సన్యాల్ మాదిరి అభిప్రాయాలనే ప్రముఖ ఆర్థికవేత్త, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మాజీ ప్రెసిడెంట్ కేవీ కామత్ సైతం వ్యక్తం చేశారు. మరో ప్యాకేజీకి వీలుగా ద్రవ్య, పరపతి పరమైన వెసులుబాటు ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ వచ్చే 25 ఏళ్ల పాటు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. -
పటిష్ట వృద్ధికి వాజ్‌పేయి సంస్కరణలు దోహదం
బెంగళూరు: వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్రభుత్వ సంస్కరణలే దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడపీ) పటిష్ట వృద్ధికి దోహదపడ్డాయని ఆర్థిక శాఖకు ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఒక ఈ మెయిల్ ఇంటర్వూలో ఆయన వివిధ అంశాలపై సమాధానాలు ఇచ్చారు. మార్కెట్ సంస్కరణల ద్వారా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి పాటుపడిన వ్యక్తి వాజ్‌పేయి అని పేర్కొన్న ఆయన, తన దార్శనిక నాయకత్వంలో ప్రవేశపెట్టిన రెండో తరం సంస్కరణలు పెట్టుబడుల వాతావరణానికి తోడ్పడ్డాయన్నారు. ఫలితంగా భారత్ వేగంగా వృద్ధి సాధించేందుకు దోహదపడిందని వివరించారు. స్వర్ణ చుతుర్భుజి ప్రాజెక్టు, నూతన టెలికం విధానం, సర్వశిక్షా అభియాన్, ఫిస్కల్ రెస్పాన్స్‌బులిటీ యాక్ట్ వంటి చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వల్ల 2009 నుంచి 2014 మధ్య దేశ వృద్ధి కొంత ప్రతికూలతలకు గురయ్యిందని అన్నారు. 1999–2004 మధ్య భారత్ కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 0.5 శాతం మిగుల్లో ఉందని పేర్కొన్న ఆయన, 2004–09లో 1.2 శాతం లోటుకు మారిందన్నారు. 2009–14 మధ్య 3.3 శాతానికి పెరిగితే, 2014–18లో 1.2 శాతానికి మెరుగుపడినట్లు వివరించారు. అలాగే 2009–14 మధ్య 10.4 శాతంగా ఉన్న వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ప్రస్తుతం దాదాపు 4 శాతానికి దిగివచ్చిందని వివరించారు. -
డర్టీ డజన్ పేర్లు త్వరలో వెల్లడి
♦ దివాలా ప్రక్రియకు 180 రోజులు ♦ కొన్ని కేసుల్లో 90 రోజుల వరకు అదనపు గడువు ♦ రాత్రికి రాత్రి చర్యలు సాధ్యం కావు ♦ వేగంగా విచారణ పూర్తి చేసేందుకు చర్యలు ♦ కేంద్ర ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు భారీగా రుణ బకాయి పడిన 12 సంస్థల పేర్లు త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దివాలా చర్యలు చేపట్టేందుకు ఆయా సంస్థల పేర్లను ఆర్బీఐ గుర్తించిందని పేర్కొంది. దేశీయ బ్యాంకుల మొండి బాకీలు రూ.8లక్షల కోట్లకు చేరగా, అందులో 25 శాతం రూ.2 లక్షల కోట్లు ఎగ్గొట్టింది కేవలం 12 సంస్థలేనని ఆర్బీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ వాటి పేర్లను వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం స్పందించింది. ‘‘12 కేసులను గుర్తించడం జరిగింది. వీటి పేర్లను త్వరలోనే వెల్లడిస్తాం. మొత్తం మొండి బాకీల్లో ఈ సంస్థలవే 25 శాతం ఉన్నాయి. వీరంతా రూ.5వేల కోట్లకుపైగా బకాయిలు పడినవే’’ అని ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారుడు సంజీవ్ సన్యాల్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ (రుణ బాకీలు, దివాలా కోడ్/ఐబీసీ) కింద ఈ కేసులను వేగంగా విచారించేందుకు వీలుగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను బలోపేతం చేయనున్నట్టు చెప్పారు. దివాలా ప్రక్రియ ప్రారంభించామంటే రాత్రికి రాత్రి ఆయా సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేయడం సాధ్యం కాదన్నారు. దివాలా చర్యలు చేపట్టేందుకు ఐబీసీ 180 రోజుల కనీస గడువు ఇచ్చిందన్నారు. ఎన్సీఎల్టీని బలోపేతం చేయాలి: తపన్ రే కాగా కేసుల విచారణను సత్వరమే చేపట్టేందుకు అనువైన మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించాల్సి ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తపన్రే తెలిపారు. మరింత మంది న్యాయ, సాంకేతిక నిపుణులను అందులో చేర్చడం ద్వారా ఆ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. అప్పడు ఈ కేసులను విచారించడం సాధ్యం అవుతుంది’’ అని తపన్రే వివరించారు. నష్టాలు తప్పవు: యునైటెడ్ బ్యాంక్ ఎండీ భారీ రుణ ఎగవేతదారుల కేసులపై యునైటెడ్ బ్యాంకు ఎండీ పవన్‌కుమార్ బజాజ్ స్పందిస్తూ... కొన్ని కేసుల్లో నికర విలువ కూడా హరించుకుపోయిందని, ఆయా కేసుల్లో హేర్ కట్స్ (రుణాలపై నష్టాలు) తప్పవని అభిప్రాయపడ్డారు. భారీ ఎన్పీఏ కేసుల్లో ప్రమోటర్లకు మిగిలేదేమీ ఉండకపోవచ్చని యూకో బ్యాంకు ఎండీ రవికృష్ణన్ పేర్కొన్నారు. ‘పరిష్కార కార్పొరేషన్’కు కేబినెట్ ఆమోదం బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థల్లో ఎదురయ్యే దివాలా (అప్పులు తీర్చకుండా చేతులెత్తేయడం) సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ‘ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు –2017’కు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఆయా సంస్థలను ప్రజాధనంతో బయట పడేసే పరిస్థితిని నివారించడంతోపాటు, ఆయా సంస్థల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ తీసుకురావడమే ఈ బిల్లు లక్ష్యం. ‘‘ప్రస్తుతం అమల్లో ఉన్న డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ 1961 రద్దుకు ఇది దారితీస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అధికారాలు కొత్తగా ఏర్పాటయ్యే పరిష్కార కార్పొరేషన్‌కు బదిలీ అవుతాయి’’ అని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నూతన సంస్థ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడుతూ, ప్రజా ఆస్తులకు రక్షణ కల్పించనుంది. టెల్కోల రుణాలపై బ్యాంకర్లలో ఆందోళన భారీ రుణాలు పేరుకుపోయిన టెలికం రంగంలో పరిస్థితులు బ్యాంకులను కలవరపరుస్తున్నాయి. ఇవి డిఫాల్ట్‌కు దారి తీసే అవకాశముందని అవి ఆందోళన చెందుతున్నాయి. బుధవారం అంతర్మంత్రిత్వ శాఖల బృందం (ఐఎంజీ)తో భేటీ అయిన బ్యాంకర్లు ఇదే అంశం ప్రస్తావించారు. టెలికం రంగంలో ’ఒత్తిడి’ దరిమిలా ఆపరేటర్లు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంజీతో సుమారు రెండు గంటల పాటు సమావేశమైన నాలుగు పెద్ద బ్యాంకుల (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్) అధికారులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమ్యూనికేషన్స్, ఆర్థిక శాఖకు చెందిన అధికారులతో కూడిన ఐఎంజీ.. టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారమార్గాలపై చర్చించేందుకు ఆపరేటర్లు, బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తోంది. టెలికం పరిశ్రమ మొత్తం రుణభారం సుమారు రూ. 4.6 లక్షల కోట్ల పైగా ఉంది. ఇందులో ఎస్బీఐ ఇచ్చిన రుణాలే ఏకంగా రూ. 80,000 కోట్ల మేర ఉన్నాయి. -
ఆర్థిక శాఖ సలహాదారుగా సంజీవ్ సన్యాల్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సంజీవ్ సన్యాల్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్(ఏసీసీ) ఆమోదించిందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయన వేతన స్కేలు రూ.67,000–79,000 అని పేర్కొన్నారు. సంజీవ్ సన్యాల్.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఆక్స్ఫర్డ్,సెయింట్ జాన్స్ కాలేజ్‌ల్లో విద్యనభ్యసించారు. గతంలో సంజీవ్ సన్యాల్ డాషే బ్యాంక్ ఎండీగా పనిచేశారు.పలు పుస్తకాలను ఆయన రచించారు. ల్యాండ్ ఆఫ్ ద సెవెన్ రివర్స్: ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ జియోగ్రఫీ, ద ఇండియన్ రినైసెన్స్: ఇండియాస్ రైజ్ ఆఫ్టర్ ఏ ధౌజండ్ ఇయర్స్ ఆఫ్ డిక్లైన్, ద ఇన్క్రెడిబుల్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ జియోగ్రఫీ తదితర పుస్తకాలను ఆయన రచించారు. రాయల్ జియోగ్రఫికల్ సొసైటీ(లండన్) ఫెలోగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. పట్టణ అంశాలపై ఆయన చేసిన కృషికి గాను 2007లో ఐసెన్‌హోవర్ ఫెలోషిప్ లభించింది. 2014 వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో సింగపూర్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది.