
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచేందుకుగాను ఆర్థిక ఉద్దీపనలతో కూడిన మరో ప్యాకేజీని ప్రభుత్వం సరైన సమయంలో ప్రకటిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ తెలిపారు. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 15వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి సన్యాల్ ప్రసంగించారు. తదుపరి ఉద్దీపనలను ప్రకటించేందుకు వీలుగా అటు ద్రవ్యపరంగా, ఇటు పరపతి పరంగానూ వెసులుబాటు ఉన్నట్టు చెప్పారు. కరోనా కారణంగా మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం.. రూ.1.70 లక్షల కోట్ల విలువ చేసే పలు ఉద్దీపనలతో కేంద్రం ప్యాకేజీని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత భారత్‌ను తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని సైతం ప్రకటించింది. ‘‘సరైన సమయంలో తదుపరి ఉద్దీపనల అవసరాన్ని మేము (ప్రభుత్వం) గుర్తించాము’’ అని సన్యాల్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ క్షీణతపై వస్తున్న ఆందోళనలకు స్పందించారు. ఇతర దేశాల మాదిరి ముందుగానే భారీ డిమాండ్ కల్పనకు బదులు.. ఒత్తిడిలోని వర్గాలు, వ్యాపార వర్గాల వారికి రక్షణ కవచం ఏర్పాటుపై భారత్ దృష్టి పెట్టిందన్నారు.
మరో ప్యాకేజీకి వెసులుబాటు: కామత్
సంజీవ్ సన్యాల్ మాదిరి అభిప్రాయాలనే ప్రముఖ ఆర్థికవేత్త, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు మాజీ ప్రెసిడెంట్ కేవీ కామత్ సైతం వ్యక్తం చేశారు. మరో ప్యాకేజీకి వీలుగా ద్రవ్య, పరపతి పరమైన వెసులుబాటు ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ వచ్చే 25 ఏళ్ల పాటు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.