KV Kamath
-
బ్యాంక్‌లు మారాలి.. లేదంటే మూత: కేవీ కామత్
ముంబై: బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలని.. విధానాలు, పని నమూనాలను కాలానికి అనుగుణంగా పనిచేసేలా చూసుకోవాలని వెటరన్ బ్యాంకర్ కేవీ కామత్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా చేయలేని బ్యాంక్‌లు వాటి దుకాణాలను మూతేసుకోవాల్సి వస్తుందని కొంత హెచ్చరికగా పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంక్‌లు నూతనతరం ఫిన్‌టెక్ కంపెనీలతో కలసి పనిచేయాలన్నారు. -
దూసుకుపోతున్న డిజిటల్ ఎకానమీ
ముంబై: డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు మరింతగా వృద్ధి చెందుతాయని, 2028–29 ఆర్థిక సంవత్సరం చివరికి అదనంగా సమకూరే దేశ జీడీపీలో పావు వంతు వాటా ఆక్రమిస్తాయని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ అంచనా వేశారు. 2029 మార్చి నాటికి దేశ జీడీపీ 7 ట్రిలియన్ డాలర్ల స్థాయిని చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం మన దేశ జీడీపీలో డిజిటల్ ఆర్థిక కార్యకలాపాల వాటా 4 శాతంగా ఉంటే, చైనాలో 40 శాతంగా ఉండడం గమనార్హం. డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కామర్స్, డిజిటల్ చెల్లింపులు, సేవలు తదితర వాటిని కామత్ ఉదాహరణగా పేర్కొన్నారు. చైనా జీడీలో డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు 40 శాతం సమకూరుస్తున్నాయని, మన దగ్గరా ఆ స్థాయికి చేరుకోకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని కామత్ పేర్కొన్నారు. ఇన్ఫ్రా అభివృద్ధి బ్యాంక్ (నాబ్‌ఫిడ్) చైర్మన్‌గా ప్రస్తుతం కామత్ పనిచేస్తున్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు మరిన్ని మౌలిక సదుపాయాల అవసరం ఉంది. రవాణా, ఎక్స్‌ప్రెస్‌వే, హైవేలు, ఎయిర్‌పోర్ట్‌లు, ఓడరేవులు, రైల్వే నెట్‌వర్క్‌ల పరంగా మనం ఎంతో చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ప్రజల రవాణాకు, వస్తు రవాణాకు వీలుగా ఎన్నో ఎక్స్‌ప్రెస్ రహదారులు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, పెద్ద ఎయిర్‌పోర్ట్‌లు వస్తాయి’’అని కామత్ వివరించారు. -
మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచేందుకుగాను ఆర్థిక ఉద్దీపనలతో కూడిన మరో ప్యాకేజీని ప్రభుత్వం సరైన సమయంలో ప్రకటిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ తెలిపారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 15వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి సన్యాల్ ప్రసంగించారు. తదుపరి ఉద్దీపనలను ప్రకటించేందుకు వీలుగా అటు ద్రవ్యపరంగా, ఇటు పరపతి పరంగానూ వెసులుబాటు ఉన్నట్టు చెప్పారు. కరోనా కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన అనంతరం.. రూ.1.70 లక్షల కోట్ల విలువ చేసే పలు ఉద్దీపనలతో కేంద్రం ప్యాకేజీని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత భారత్‌ను తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని సైతం ప్రకటించింది. ‘‘సరైన సమయంలో తదుపరి ఉద్దీపనల అవసరాన్ని మేము (ప్రభుత్వం) గుర్తించాము’’ అని సన్యాల్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ క్షీణతపై వస్తున్న ఆందోళనలకు స్పందించారు. ఇతర దేశాల మాదిరి ముందుగానే భారీ డిమాండ్ కల్పనకు బదులు.. ఒత్తిడిలోని వర్గాలు, వ్యాపార వర్గాల వారికి రక్షణ కవచం ఏర్పాటుపై భారత్ దృష్టి పెట్టిందన్నారు. మరో ప్యాకేజీకి వెసులుబాటు: కామత్ సంజీవ్ సన్యాల్ మాదిరి అభిప్రాయాలనే ప్రముఖ ఆర్థికవేత్త, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మాజీ ప్రెసిడెంట్ కేవీ కామత్ సైతం వ్యక్తం చేశారు. మరో ప్యాకేజీకి వీలుగా ద్రవ్య, పరపతి పరమైన వెసులుబాటు ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ వచ్చే 25 ఏళ్ల పాటు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. -
కామత్ కమిటీ ఏం సూచించింది..?
న్యూఢిల్లీ: రుణాల పునర్నిర్మాణానికి సంబంధించి కేవీ కామత్ కమిటీ సిఫారసులను తమ ముందు రికార్డుల రూపంలో ఉంచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా రుణాల మారటోరియం విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, ఉత్తర్వులను కూడా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకు రుణ చెల్లింపులపై విరామానికి (మారటోరియం) ఆర్బీఐ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇలా ఈఎంఐలు చెల్లించని కాలానికి వడ్డీతోపాటు.. వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం సోమవారం కూడా ఈ కేసులో తన విచారణను వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కొనసాగించింది. వ్యక్తిగత రుణ గ్రహీతలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.2 కోట్ల వరకు రుణాలకు గాను వడ్డీపై వడ్డీ భారం వేయకుండా.. ఆ భారాన్ని తాము భరిస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ అఫిడవిట్ సమర్పించింది. కేంద్రం, ఆర్బీఐ ఈ విషయమై ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల వివరాలను తమ ముందుంచాలంటూ సెప్టెంబర్ 10నాటి తమ ఆదేశాలను ధర్మాసనం గుర్తు చేస్తూ.. కేంద్రం స్పందనలో అవి లేవంటూ వారం రోజుల్లో ఆ వివరాలను తమ ముందు ఉంచాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదన కింద రియల్టీ రంగానికి ఎటువంటి ఉపశమనం లభించదంటూ ఆ రంగం తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం కోర్టుకు తెలియజేశారు. దీంతో రియల్ ఎస్టేట్, విద్యుదుత్పత్తి తదితర రంగాల అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. మరిన్ని వివరాల దాఖలు కు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది వి.గిరి కోర్టును కోరారు. కేంద్రం స్పందనపై పూర్తి స్థాయి అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని మరో న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. సమతూకం అవసరం.. బ్యాంకులు, రుణ గ్రహీతల అవసరాల మధ్య సమతూకం అవసరమని, ఈ విషయంలో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేస్తూ.. విచారణను ఈ నెల 13కు సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. కేంద్రం నిర్ణయంపై స్పందన తెలియజేయవచ్చంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) సహా భాగస్వామ్య పక్షాలన్నింటికీ సూచించింది. ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసిన 24 గంటల్లోగా బ్యాంకులు ప్రణాళికను అమలు చేయగలని ఐబీఏ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే తెలియజేశారు. కొన్ని రంగాలకు కేంద్రం తాజా ప్రతిపాదనలో చోటు లేకపోవడాన్ని.. మొత్తం పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన మీదట తీసుకున్న నిర్ణయంగా సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా పేర్కొన్నారు. ఆగస్ట్‌తో మారటోరియం గడువు తీరిపోవడంతో.. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. 26 రంగాలకు రుణ పునర్నిర్మాణ అవకాశం కల్పించాలంటూ కామత్ కమిటీ సూచించడం గమనార్హం. -
26 రంగాలకు రుణ పునర్వ్యవస్థీకరణ
ముంబై: కరోనా నేపథ్యంలో చెల్లింపులు ఆగిపోయిన రుణాలను పునర్వ్యవస్థీకరించే విషయమై కేవీ కామత్ ప్యానెల్ సమర్పించిన సిఫారసులకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. రుణాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ఐదు రకాల ఫైనాన్షియల్ రేషియోలు, 26 రంగాలకు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిమితులను ప్యానెల్ సూచించింది. మాజీ బ్యాంకర్ కేవీ కామత్ అధ్యక్షతన రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన సూచనల కోసం ఆగస్ట్ 7న ఆర్బీఐ ప్యానెల్‌ను నియమించగా, ఈ నెల 4న ప్యానెల్ ఆర్బీఐకి తన నివేదికను సమర్పించింది. ఈ సిఫారసులకు పూర్తిగా అంగీకారం తెలిపినట్టు సోమవారం ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. కరోనాకు ముందు రుణగ్రహీత ఆర్థిక పనితీరు, కరోనా కారణంగా కంపెనీ నిర్వహణ, ఆర్థిక పనితీరుపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని రుణ పరిష్కార ప్రణాళికను ఖరారు చేయాలని సెంట్రల్ బ్యాంకు ఆదేశించింది. కామత్ ప్యానెల్ ఎంపిక చేసిన 26 రంగాల్లో.. విద్యుత్, నిర్మాణం, ఐరన్ అండ్ స్టీల్ తయారీ, రోడ్లు, రియల్టీ, టెక్స్టైల్స్, కెమికల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్/ఎఫ్ఎంసీజీ, నాన్ ఫెర్రస్ మెటల్స్, ఫార్మా, లాజిస్టిక్స్, జెమ్స్ అండ్ జ్యుయలరీ, సిమెంట్, వాహన విడిభాగాలు, హోటళ్లు, మైనింగ్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, వాహన తయారీ, ఆటో డీలర్‌షిప్‌లు, ఏవియేషన్, చక్కెర, పోర్ట్‌లు, షిప్పింగ్, బిల్డింగ్ మెటీరియల్స్, కార్పొరేట్ రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. ఐదు రంగాలకు సంబంధించి రేషియోలను సూచించకుండా.. బ్యాంకుల మదింపునకు విడిచిపెట్టింది. -
బ్యాంకింగ్‌లో మరిన్ని ఏకీకరణలు
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం మంచి అడుగు: కేవీ కామత్ న్యూఢిల్లీ: ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల విలీనం ఓ మంచి తొలి అడుగుగా బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు, బ్రిక్స్ దేశాలకు చెందిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) చైర్మన్ కేవీ కామత్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశ అవసరాలు తీర్చాలంటే పెద్ద బ్యాంకులు ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, బ్యాంకింగ్ రంగానికి తలనొప్పిగా మారిన నిరర్థక ఆస్తుల(ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి బ్యాడ్ బ్యాంక్ అవసరం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటులోనూ.. ‘‘మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం దృష్ట్యా మరిన్ని పెద్ద బ్యాంకుల అవసరం ఉంది. కనుక ప్రభుత్వ రంగంలో మరిన్ని బ్యాంకుల మధ్య ఏకీకరణకు వీలుంది. అంతేకాదు, ప్రైవేటు రంగంలోనూ వీలీనాల అవసరం ఉంది. ఎందుకంటే, మన ఆర్థిక వ్యవస్థ అవసరాలు తీర్చాలంటే చాలా పెద్ద బ్యాంకులు కావాలి. బ్యాంకులు సొంతంగా అయినా ఆ స్థాయికి ఎదగాలి. లేదా విలీనాలను అయినా చేపట్టాలి’’ అని కామత్ అన్నారు. ఎన్డీబీ రెండో వార్షికోత్సవ సమావేశం నేపథ్యంలో ఢిల్లీకి వచ్చిన ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇది కేవలం కొన్ని బ్యాంకులను ఒక్కటి చేయడం లేదా రెండు బ్యాంకులను ఒకటిగా మార్చడమన్న అంకెలుగానే ఉండరాదన్నారు. బ్యాడ్ బ్యాంకుకు ఎన్డీబీ నిధులు అందించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు లేదంటూ, తమ దృష్టి అంతా మౌలిక సదుపాయాలకు నిధులు అందించడంపైనేనని స్పష్టం చేశారు. -
రుణ వృద్ధిపై ఎన్డీబీ దృష్టి: కామత్
దావోస్: బ్రిక్ దేశాల నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) రుణ వృద్ధిపై దృష్టి సారిస్తోంది. వచ్చే రెండు మూడేళ్లూ... ప్రతి ఏడాదీ తన రుణాన్ని రెట్టింపు చేసుకోవడంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బ్యాంక్ ప్రెసిడెంట్ కేవీ కామత్ తెలిపారు. తన 10 బిలియన్ డాలర్ల మూలధనాన్ని వినియోగించుకుని బ్యాంక్ మొదటి 6 నుంచి 7 సంవత్సరాల్లో భారీ రుణవృద్ధి లక్ష్యంగా వ్యూహాలను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం బ్యాంక్ సిబ్బంది సంఖ్య 130 వరకూ ఉందనీ, దీనిని మూడు రెట్లు పెంచాలన్నది లక్ష్యమని ఇక్కడ పేర్కొన్నారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎం.కె.శర్మ
న్యూఢిల్లీ: కె.వి. కామత్ స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎం.కె. శర్మ నియమితులయ్యారు. ఆయన గతంలో హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జూలై 1 నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఆయన, సంస్థకు తన సేవలను ఐదేళ్లపాటు అందించనున్నారు. ఆయన కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించిన పలు కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఇన్ఫోసిస్‌లో భారీ మార్పు
భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ మార్పునకు తెరతీసింది. ఇన్నాళ్లూ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న కేవీ కామత్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రెసిడెంట్‌గా నియమితులై.. రాజీనామా చేస్తున్నందున ఆయన స్థానంలో రామస్వామి శేషసాయిని నియమించారు. శేషసాయి నియామకాన్ని కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఆయన తక్షణం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 67 ఏళ్ల శేషసాయి ఇన్ఫోసిస్ బోర్డులో 2011 జనవరి నుంచి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గాను, ఆడిట్ కమిటీకి ఛైర్‌పర్సన్‌గాను వ్యవహరిస్తున్నారు. శేషసాయిని తన వారసుడిగా ఎంచుకోవడం ద్వారా బోర్డు చాలా సరైన నిర్ణయం తీసుకుందని కేవీ కామత్ అన్నారు. ఆయన అనుభవం కంపెనీకి అన్నిరకాలుగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా ఇన్ఫోసిస్‌కు సేవలందించిన కామత్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శేషసాయికి ఆహ్వానం పలికారు. -
'10 రోజుల్లో పదవి చేపడతారు'
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా ఎంపికైన ప్రఖ్యాత భారతీయ బ్యాంకర్ కేవీ కామత్ 10 రోజుల్లో పదవి చేపట్టనున్నారని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి వెల్లడించారు. కొన్ని కంపెనీల బోర్డుల్లో విధులు నిర్వహిస్తున్న ఆయన వాటికి రాజీనామా చేశారని తెలిపారు. వచ్చే వారం లేదా 10 రోజుల్లో బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారని చెప్పారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. 67 ఏళ్ల కామత్ దేశీ ప్రైవేటు బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కామత్ వ్యవహరిస్తున్నారు.