ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో కామత్
ముంబై: కరోనా నేపథ్యంలో చెల్లింపులు ఆగిపోయిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించే విషయమై కేవీ కామత్ ప్యానెల్ సమర్పించిన సిఫారసులకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. రుణాల పునర్‌వ్యవస్థీకరణ విషయంలో ఐదు రకాల ఫైనాన్షియల్ రేషియోలు, 26 రంగాలకు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిమితులను ప్యానెల్ సూచించింది. మాజీ బ్యాంకర్ కేవీ కామత్ అధ్యక్షతన రుణాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన సూచనల కోసం ఆగస్ట్ 7న ఆర్‌బీఐ ప్యానెల్‌ను నియమించగా, ఈ నెల 4న ప్యానెల్ ఆర్‌బీఐకి తన నివేదికను సమర్పించింది. ఈ సిఫారసులకు పూర్తిగా అంగీకారం తెలిపినట్టు సోమవారం ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది.
కరోనాకు ముందు రుణగ్రహీత ఆర్థిక పనితీరు, కరోనా కారణంగా కంపెనీ నిర్వహణ, ఆర్థిక పనితీరుపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని రుణ పరిష్కార ప్రణాళికను ఖరారు చేయాలని సెంట్రల్ బ్యాంకు ఆదేశించింది. కామత్ ప్యానెల్ ఎంపిక చేసిన 26 రంగాల్లో.. విద్యుత్, నిర్మాణం, ఐరన్ అండ్ స్టీల్ తయారీ, రోడ్లు, రియల్టీ, టెక్స్‌టైల్స్, కెమికల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్/ఎఫ్‌ఎంసీజీ, నాన్ ఫెర్రస్ మెటల్స్, ఫార్మా, లాజిస్టిక్స్, జెమ్స్ అండ్ జ్యుయలరీ, సిమెంట్, వాహన విడిభాగాలు, హోటళ్లు, మైనింగ్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, వాహన తయారీ, ఆటో డీలర్‌షిప్‌లు, ఏవియేషన్, చక్కెర, పోర్ట్‌లు, షిప్పింగ్, బిల్డింగ్ మెటీరియల్స్, కార్పొరేట్ రిటైల్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఐదు రంగాలకు సంబంధించి రేషియోలను సూచించకుండా.. బ్యాంకుల మదింపునకు విడిచిపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment