భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చాలా ఏళ్లుగా కీలకపాత్ర పోషిస్తోంది. ఏ దేశ సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌కైనా ఆర్థిక సవాళ్లు తప్పవు. ఇటీవల ఆర్‌బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధికమవుతున్న ఆహార ద్రవ్యోల్బణం, తగ్గుతున్న పారిశ్రామిక ఉత్పత్తి..వంటి చాలా సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. సంజయ్ మల్హోత్రా ముందున్న కొన్ని సవాళ్లను నిపుణులు విశ్లేష్తిస్తున్నారు.
ద్రవ్యోల్బణం
వార్షిక ద్రవ్యోల్బణం ఈ ఏడాది అక్టోబరులో గరిష్టంగా 6.21శాతానికి చేరింది. సెప్టెంబరులో ఇది 5.49శాతంగా నమోదైంది. మార్కెట్ అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం 2-4 ఉండాలి. కానీ దాన్ని మించిపోతుంది.
ఆహార ద్రవ్యోల్బణం
ఈ ఏడాది సెప్టెంబరులో 9.2 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం అక్టోబరులో 10.8 శాతానికి ఎగబాకింది. కూరగాయలు, వంట నూనెలు, ఉల్లి, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా చాలాచోట్ల విభిన్న వాతావరణ మార్పుల వల్ల ఆశించినమేర వ్యవసాయ దిగుబడి రావడంలేదు. దాంతో ఆహార పదార్థాల సప్లై-చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దానికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో దళారులు కృత్రిమకొరతను సృష్టించి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వర్షాభావం కారణంగా మహారాష్ట్ర వంటి అధికంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంటసాగు వెనకబడుతుంది. వంట నూనెలకు సంబంధించి ముడిఆయిల్ దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల సుంకాన్ని పెంచింది. దాంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి.
పెట్టుబడులు ఆకర్షించేలా..
ఇటీవల కాలంలో మార్కెట్లు భారీగా పడిపోయాయి. క్రమంగా రెండు నెలల కాలంలో దాదాపు లక్ష కోట్ల రూపాయాలకు పైగా ఎఫ్‌పీఐలు పెట్టుబడులు ఉపసంహరించారు. ఈరోజు (డిసెంబర్ 17) మధ్యాహ్నం 2 గంటల వరకు మార్కెట్ల నుంచి దాదాపు రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇలా మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఎఫ్‌పీఐలు గణనీయంగానే తమ పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. వారికి మరింత ధీమా కలిగేలా ఆర్‌బీఐ వ్యవహరించాల్సి ఉంటుంది. అగ్రరాజ్య విధానాల ప్రభావం ఈ పెట్టుబడులపై అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
డిజిటల్ మోసాలు
పెరుగుతున్న సాంకేతికతకు తోడుగా ఆర్థిక వ్యవస్థను పటిష్ట భద్రత కల్పించాలి. లేదంటే సైబర్‌ఫ్రాడ్‌ల రూపంలో ఆర్థిక మోసాలు అధికమవుతాయి. ప్రస్తుతం కాలంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వినియోగదారుల సమాచారానికి భంగం వాటిల్లకుండా, లావాదేవీలు సజావుగా సాగేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకోవాలి.
ఇదీ చదవండి: ఇంటి ధర రూ.85! రెనొవేషన్‌కు రూ.3.8 కోట్లు!!
డిపాజిట్లు.. ఎన్‌పీఏలు
బ్యాంకింగ్ వ్యవస్థపై వినియోగదారులకు నమ్మకం సన్నగిల్లకుండా చూడాల్సిన బాధ్యత ఆర్‌బీఐపై ఉంది. సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే బ్యాంకింగేతర రంగంలో డిపాజిట్లపై మరింత రాబడి వచ్చే ప్రత్నామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. దాంతో చాలా మంది కస్టమర్లు డిపాజిట్లపై మొగ్గు చూపడంలేదు. దాంతో బ్యాంకులు క్రిడిట్ ఇవ్వాలంటే ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఇచ్చిన అప్పులు వసూలుకాక నిరర్థక ఆస్తులు పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేసేలా ఆర్‌బీఐ మరింత సమర్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment