బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంతదాస్ మంగళవారం పదవీ విరమణ చేశారు. సంజయ్ మల్హోత్రా పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త ఆర్‌బీఐ గవర్నర్ మాట్లాడారు.
‘ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, విశ్వాసం, వృద్ధి మూడు మూల స్థంభాల్లాంటివి. వీటిని కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. అందుకు భారత సెంట్రల్ బ్యాంక్ నిరంతరం కృషి చేస్తోంది. కొన్నేళ్లుగా ఆర్‌బీఐ పనితీరు, అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. ఇందుకోసం చాలామంది సిబ్బంది శ్రద్ధతో పని చేశారు. వారు కాపాడుతూ వచ్చిన ఆర్‌బీఐ ప్రతిష్టను నేను మరింత ముందుకు తీసుకెళ్తాను. 2047 వరకు ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దాన్ని సాధించేందుకు సమర్థమంత నిర్ణయాలు అవసరం. ఈ సంస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తుంది’ అని సంజయ్ మల్హోత్రా చెప్పారు.
అపార అనుభవం..
56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్‌లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఇదీ చదవండి: కంటెంట్ ఖండాలు దాటేలా యూట్యూబ్ కొత్త ఫీచర్
నిన్నటి వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment