ఆర్‌బీఐ రుణ చికిత్స! | Shaktikanta Das rolls out stimulus measures amid 2nd Covid wave | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ రుణ చికిత్స!

Published Thu, May 6 2021 12:57 AM | Last Updated on Thu, May 6 2021 3:31 AM

Shaktikanta Das rolls out stimulus measures amid 2nd Covid wave - Sakshi

ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్‌ఎంఈలు) తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు మరింత సమయం ఇచ్చింది. రుణాలను రెండేళ్ల కాలానికి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. టీకాల తయారీ సంస్థలు, ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు, కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్య రంగం కింద రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతించింది.

ఇందు కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.50,000 కోట్ల లిక్విడిటీని(నిధుల లభ్యత) అందించనుంది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు పొందేందుకు ఉద్దేశించిన నిబంధనలను వచ్చే సెప్టెంబర్‌ 30వరకు సడలించింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమం(జీ–సాప్‌) కింద 2 వారాల్లో రూ.35,000 కోట్లకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు. ఆర్‌బీఐ మధ్యంతర నిర్ణయాలను ఆయన బుధవారం ప్రకటించారు.

మారటోరియం కాదు.. రుణ పునరుద్ధరణే
వాస్తవానికి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థలు ఒక్క విడత రుణ మారటోరియంను మూడు నెలలకు కల్పించాలని ఆర్‌బీఐని ఇటీవలే కోరాయి. కానీ, ఒక్క విడత రుణ పునరుద్ధరణకు.. అది కూడా రూ.25 కోట్ల వరకు రుణాలకే అవకాశం కల్పిస్తూ ఆర్‌బీఐ నిర్ణయించింది. గతేడాది రుణ మారటోరియం ముగిసిన తర్వాత రుణాల పునరుద్ధరణ అవకాశాన్ని వినియోగించుకోని వాటికే ప్రస్తుతం ఈ సదుపాయం రెండేళ్ల కాలానికి లభిస్తుంది. 2021 మార్చి వరకు స్టాండర్డ్‌ ఖాతాలుగా (సక్రమంగా చెల్లింపులు చేస్తున్న) ఉన్న వాటికి ఈ వెసులుబాటు పరిమితం. 90 శాతం రుణ గ్రహీతలు ఇందుకు అర్హత సాధిస్తారని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ అంచనా.

రూ.50,000 కోట్ల సాయం..
ఆరోగ్య సేవలు, సదుపాయాల రంగంలో ఉన్న కంపెనీలకు రూ.50,000 కోట్లతో ఆన్‌ట్యాప్‌ లిక్విడిటీ విండోను ఆర్‌బీఐ ప్రకటించింది. కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం దీనికింద లభిస్తుంది. రెపో రేటుపై, మూడేళ్ల కాల వ్యవధికి రుణాలు అందిస్తామని.. ఈ విండో 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని శక్తికాంతదాస్‌ చెప్పారు.

బ్యాంకులు ఈ పథకం కింద టీకాల తయారీ కంపెనీలు, టీకాల దిగుమతి దారులు, సరఫరాదారులు, వైద్య పరికరాలు, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, పాథాలజీ ల్యాబ్‌లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల తయారీదారులు, సరఫరాదారులు, కరోనా సంబంధిత ఔషధ దిగుమతిదారులు, లాజిస్టిక్స్‌ సంస్థలకు తాజా రుణాలను మంజూరు చేయవచ్చు. వీటిని ప్రాధాన్య రంగ రుణాలుగా ఆర్‌బీఐ పరిగణిస్తుంది. ఈ పథకం కింద మంజూరు చేసే రుణాలతో ప్రత్యేక పుస్తకాన్ని బ్యాంకులు నిర్వహించొచ్చు. బ్యాంకులు తమ దగ్గర మిగులుగా ఉన్న నిధులను కరోనా రుణ పుస్తక పరిమాణం స్థాయిలో ఆర్‌బీఐ వద్ద ఉంచడం ద్వారా.. రెపో రేటు కంటే 0.25%  తక్కువగా వడ్డీని పొందొచ్చు.  

రూ.35,000 కోట్లతో జీ–సెక్యూరిటీలు
ఈ నెలలోనే రూ.35,000 కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలను (జీ–సెక్‌లు) ఆర్‌బీఐ కొనుగోలు చేయనుంది. ఆర్‌బీఐ గత నెలలోనూ రూ.25,000 కోట్లకు జీ–సెక్‌లను కొనుగోలు చేయడం గమనార్హం. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్‌ను 6 శాతంలోపునకు తీసుకొచ్చే లక్ష్యంతో, ప్రభుత్వ వృద్ధి కార్యక్రమాలకు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఆర్‌బీఐ తీసుకొచ్చింది. జీ–సెక్‌ ఈల్డ్స్‌ తగ్గితే ప్రభుత్వానికి ఉపశమనం లభించినట్టే.

కేవైసీ విషయంలో ఇబ్బంది పెట్టొద్దు
బ్యాంకులు, నియంత్రిత ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లు 2020 డిసెంబర్‌ చివరికి కేవైసీ (కస్టమర్‌ గురించి తెలుసుకోవడం) వివరాలను అప్‌డేట్‌ చేయని కస్టమర్ల విషయంలో కఠిన చర్యలకు దిగొద్దని ఆర్‌బీఐ కోరింది. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి వరకు ఈ అవకాశం కల్పించింది. అలాగే, వీడియో కేవైసీకి అనుమతించింది.  

250 మందితో క్వారంటైన్‌ కేంద్రం
కరోనా సంక్షోభంలో కీలక కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఆర్‌బీఐ ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 250 మంది సిబ్బంది ఈ కేంద్రంలోనే ఉంటూ కీలక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు శక్తికాంతదాస్‌ తెలిపారు.

ఎస్‌ఎఫ్‌బీలకు 10వేల కోట్లు
స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు (ఎస్‌ఎఫ్‌బీలు) ప్రత్యేక దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్‌ విండో (ఎస్‌ఎల్‌టీఆర్‌వో)ను సైతం దాస్‌ ప్రకటించారు. ‘‘ప్రస్తుత కరోనా తీవ్రతతో ఎక్కువగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతు అందించేందుకు ప్రత్యేకంగా మూడేళ్ల కాల వ్యవధిపై రూ.10,000 కోట్లకు ఎస్‌ఎల్‌టీఆర్‌వో నిర్వహించాలని నిర్ణయించాం. రెపో రేటుకే ఎస్‌ఎఫ్‌బీలకు ఈ నిధులు అందిస్తాం’’ అని దాస్‌ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌ 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే, రూ.500 కోట్ల వరకు ఆస్తులు కలిగిన సూక్ష్మ రుణ సంస్థలకు ఎస్‌ఎఫ్‌బీలు అందించే రుణాలను ప్రాధాన్యరంగ రుణాలుగా పరిగణిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు.

భవిష్యత్తుపై ఎంతో అనిశ్చితి
భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి నెలకొందన్నారు దాస్‌. తాజా సంక్షోభాన్ని ఎదుర్కోగల బలమైన మూలాలపై భారత్‌ ఉందని అభిప్రాయపడ్డారు. వృద్ధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు అంగీకరించారు. ‘‘భారత్‌ బలంగా కోలుకునే క్రమంలో సానుకూల వృద్ధిలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్‌ కర్వ్‌ వంగిన కొన్ని వారాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా కారణంగా ఏర్పడే పరిస్థితులను ఆర్‌బీఐ అనుక్షణం పరిశీలిస్తూ అవసరం ఏర్పడితే అన్ని రకాల వనరులను, అసాధారణ సాధనాలను ఆచరణలోకి తీసుకొస్తుంది’’ అని శక్తికాంతదాస్‌ చెప్పారు. సాధారణ నైరుతి రుతుపవనాలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉపశమిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  

డిమాండ్‌ తగ్గుదల కొంతే...
డిమాండ్‌పై లాక్‌డౌన్‌ల ప్రభావం గతేడాదితో పోలిస్తే మోస్తరుగానే ఉంటుందని శక్తికాంతదాస్‌ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ తాత్కాలికంగా తగ్గిపోవచ్చని, ముఖ్యంగా రిటైల్, ఆతిథ్య రంగాల్లో ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పారు. మొత్తం మీద కీలక గణాంకాలు మిశ్రమ సంకేతాలను ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

సకాలంలో సరైన నిర్ణయాలు
ఆర్‌బీఐ ప్రకటించిన నిర్ణయాలను నిపుణులు, పరిశ్రమ వర్గాలు ఆహ్వానించాయి. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్న క్రమంలో సకాలంలో సరైన నిర్ణయాలను ప్రకటించినట్టు పేర్కొన్నాయి. ఆరోగ్యసంరక్షణ, అనుబంధ రంగాలు పెరిగిన డిమాండ్‌తో, సరఫరా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రూ.50వేల కోట్లతో ఆన్‌టాప్‌ లిక్విడిటీని ప్రకటించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చేదిగా సీఐఐ పేర్కొంది.  ‘చిన్న వ్యాపార సంస్థలు, ఫైనాన్షియల్‌ సంస్థలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న భారాన్ని ఆర్‌బీఐ చాలా వరకు గుర్తించింది. వారికి మద్దతుగా చర్యలను ప్రకటించింది. లకి‡్ష్యత వర్గాలను ఉద్దేశించిన చర్యలు ప్రస్తుత తరుణంలో ఎంతో అనుకూలమైనవి’ అని అసోచామ్‌ వ్యాఖ్యానించింది.

పలు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తగ్గించే లక్ష్యంతో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అనూహ్యమైన నిర్ణయాలు ప్రకటించారు. ప్రకటించిన చర్యలు వినూత్నంగా ఉన్నాయి. కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు రూ.50,000 కోట్ల ప్రత్యేక నిధి ప్రకటించడం అన్నది ఆర్థిక ఆరోగ్యమే కాదు, ప్రజారోగ్యం ఎదుర్కొంటున్న సమస్యలపైనా దృష్టి పెట్టినట్టుంది.
– దినేష్‌ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్‌

సరైన సమయంలో ప్రకటించిన లిక్విడిటీ చర్యలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు ఉపశమనం కల్పిస్తాయి. వ్యక్తులు, చిన్న పరిశ్రమలకు నిధులు లభించేలా చేస్తాయి.
– శక్తి ఏకాంబరం, కోటక్‌ మహీంద్రా బ్యాంకు గ్రూపు ప్రెసిడెంట్‌

దిగజారుతున్న పరిస్థితులకు స్పందనగా ఆర్‌బీఐ.. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రూ.25 కోట్ల వరకు రుణాలను ఒక్కసారి పునరుద్ధరించుకునే అవకాశాన్నిచ్చింది. గతేడాది ఇచ్చిన మారటోరియంతో పోలిస్తే ఈ చర్య చిన్నదే. పునరుద్ధరించుకునే రుణాల పరిమాణం తక్కువగానే ఉంటుంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత దిగజారే అవకాశం ఉందని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి.
– మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement