Debt restructuring
-
స్పైస్‌జెట్ రుణ పునర్వ్యవస్థీకరణ
ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ రుణ పునర్వ్యవస్థీకరణకు తెరతీసింది. రుణాలను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా కార్లయిల్ ఏవియేషన్ పార్టనర్స్‌కు కంపెనీలో 7.5 శాతం ఈక్విటీ వాటాను కేటాయించనుంది. కార్గో బిజినెస్(స్పైస్‌ఎక్స్‌ప్రెస్)లోనూ కార్లయిల్ ఏవియేషన్ వాటాను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్)కు సెక్యూరిటీల జారీ ద్వారా మరో రూ. 2,500 కోట్లు సమకూర్చుకోనుంది. విమాన లీజింగ్ కంపెనీ కార్లయిల్ ఏవియేషన్‌కు చెల్లించవలసిన 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 830 కోట్లు)కుపైగా రుణాలను ఈక్విటీతోపాటు తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే డిబెంచర్లు(సీసీడీలు)గా మార్పిడి చేయనుంది. ఇందుకు స్పైస్‌జెట్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షేరుకి రూ. 48 లేదా సెబీ నిర్ధారిత ధరలో 7.5 శాతం వాటాను కార్లయిల్(2.95 కోట్ల డాలర్లు)కు స్పైస్‌జెట్ కేటాయించనుంది. కార్గో బిజినెస్‌కు చెందిన సీసీడీలను(6.55 కోట్ల డాలర్లు) కార్లయిల్‌కు బదిలీ చేయనుంది. వెరసి 10 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకోనుంది. -
ఎస్బీఐ పరిస్థితి భేష్
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ నాణ్యత బాగుందని చైర్మన్ దినేశ్ ఖారా గురువారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో అంచనాలకు మించి జరుగుతున్న రికవరీ– బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ లో ప్రతికూలతలను పరిమిత స్థాయిలోనే కట్టడి చేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అయితే కోవిడ్–19కు సంబంధించి రుణ పునర్ వ్యవస్థీకరణ సంబంధ అంశాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించలేదు. త్వరలో ప్రకటించనున్న బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలే దీనికి కారణమని పేర్కొన్నారు. భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే విడుదల చేసిన ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని, ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని నివేదిక వివరించింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండి బకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో చూసినా 9.7 శాతం– 16.2 శాతాల శ్రేణిలో ఉండే వీలుందని తెలిపింది. తీవ్ర స్థాయిల్లో పీఎస్‌బీల ఎన్పీఏలు 17.6 శాతం పెరిగే అవకాశమూ లేకపోలేదని ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ బ్యాంక్ రుణ నాణ్యతపై ఖరా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూస్తే... ► ఎకానమీకి సంబంధించి ఏప్రిల్‌లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో అన్ని రంగాల్లో రికవరీ ప్రక్రియ ఊపందుకుంది. ► ఒక దశలో దేశ ఆర్థిక రంగానికి సంబంధించి కీలక విభాగాలు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయి. కార్పొరేట్లకు నగదు లభ్యతపై సైతం ఆందోళన నెలకొంది. ఇప్పుడు పరిస్థితులు వేగంగా కుదుటపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు ఇందుకు కారణం. ► కోవిడ్–19 రోగులకు ఉత్తమ చికిత్స, వ్యాక్సినేషన్ ఊపందుకోవడం వంటి అంశాలు ఆర్థిక రికవరీని వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడుతున్నాయి. ► ప్రస్తుత కీలక తరుణంలో బ్యాంకులు రుణ గ్రహీతకు అవసరమైన సలహాలను అందించాలి. ► బడ్జెట్ అంచనాలపై ఇప్పుడే చేసే వ్యాఖ్య ఏదీ లేదు. ప్రభుత్వంతో జరిగిన సమావేశాల్లో మా అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. 600 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూ లిస్టింగ్ అంతక్రితం ఇండియా ఐఎన్ఎక్స్ గ్లోబల్ సెక్యూరిటీస్ మార్కెట్ (జీఎస్ఎం) ప్లాట్‌ఫామ్‌పై ఎస్బీఐ 600 మిలియన్ డాలర్ల ఫారిన్ కరెన్సీ బాండ్ ఇష్యూ లిస్టింగ్ కార్యక్రమంలో ఖరా పాల్గొన్నారు. తన 10 బిలియన్ డాలర్ల గ్లోబల్ మీడియం టర్మ్ నిధుల సమీకరణ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ లండన్ బ్రాంచ్ తాజా ఇష్యూ లిస్ట్ చేసింది. బాండ్ కూపన్ రేటు 1.80 శాతం. 2008 తర్వాత ఇంత తక్కువ కూపన్ రేటు ఇదే తొలిసారి. ఇండియా ఐఎన్ఎక్స్పై భారీగా ఫారిన్ కరెన్సీ ఇష్యూ చేస్తున్న జాబితాలో ఎస్బీఐ ఒకటి. తాజా లిస్టింగ్‌తో కలిపి దాదాపు 2.6 బిలియన్ డాలర్ల బాండ్లను బ్యాంక్ ఇప్పటికి లిస్ట్ చేసింది. తద్వారా నిధుల సమీకరణ బ్యాంకుకే కాకుండా, భారత్ ఆర్థిక వ్యవస్థలోనూ విశ్వాసాన్ని నింపుతుందని గురువారం కార్యక్రమం సందర్భంగా ఖరా అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ఎస్బీఐ చాటి చెబుతోందని పేర్కొన్నారు. -
కామత్ కమిటీ ఏం సూచించింది..?
న్యూఢిల్లీ: రుణాల పునర్నిర్మాణానికి సంబంధించి కేవీ కామత్ కమిటీ సిఫారసులను తమ ముందు రికార్డుల రూపంలో ఉంచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా రుణాల మారటోరియం విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, ఉత్తర్వులను కూడా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకు రుణ చెల్లింపులపై విరామానికి (మారటోరియం) ఆర్బీఐ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇలా ఈఎంఐలు చెల్లించని కాలానికి వడ్డీతోపాటు.. వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం సోమవారం కూడా ఈ కేసులో తన విచారణను వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కొనసాగించింది. వ్యక్తిగత రుణ గ్రహీతలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.2 కోట్ల వరకు రుణాలకు గాను వడ్డీపై వడ్డీ భారం వేయకుండా.. ఆ భారాన్ని తాము భరిస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ అఫిడవిట్ సమర్పించింది. కేంద్రం, ఆర్బీఐ ఈ విషయమై ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల వివరాలను తమ ముందుంచాలంటూ సెప్టెంబర్ 10నాటి తమ ఆదేశాలను ధర్మాసనం గుర్తు చేస్తూ.. కేంద్రం స్పందనలో అవి లేవంటూ వారం రోజుల్లో ఆ వివరాలను తమ ముందు ఉంచాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదన కింద రియల్టీ రంగానికి ఎటువంటి ఉపశమనం లభించదంటూ ఆ రంగం తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం కోర్టుకు తెలియజేశారు. దీంతో రియల్ ఎస్టేట్, విద్యుదుత్పత్తి తదితర రంగాల అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. మరిన్ని వివరాల దాఖలు కు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది వి.గిరి కోర్టును కోరారు. కేంద్రం స్పందనపై పూర్తి స్థాయి అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని మరో న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. సమతూకం అవసరం.. బ్యాంకులు, రుణ గ్రహీతల అవసరాల మధ్య సమతూకం అవసరమని, ఈ విషయంలో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేస్తూ.. విచారణను ఈ నెల 13కు సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. కేంద్రం నిర్ణయంపై స్పందన తెలియజేయవచ్చంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) సహా భాగస్వామ్య పక్షాలన్నింటికీ సూచించింది. ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసిన 24 గంటల్లోగా బ్యాంకులు ప్రణాళికను అమలు చేయగలని ఐబీఏ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే తెలియజేశారు. కొన్ని రంగాలకు కేంద్రం తాజా ప్రతిపాదనలో చోటు లేకపోవడాన్ని.. మొత్తం పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన మీదట తీసుకున్న నిర్ణయంగా సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా పేర్కొన్నారు. ఆగస్ట్‌తో మారటోరియం గడువు తీరిపోవడంతో.. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. 26 రంగాలకు రుణ పునర్నిర్మాణ అవకాశం కల్పించాలంటూ కామత్ కమిటీ సూచించడం గమనార్హం. -
ఎస్బీఐ పోర్టల్‌లో రుణ పునర్వ్యవస్థీకరణ సమాచారం
ముంబై: కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో ఆర్బీఐ సూచనలకు అనుగుణంగా అర్హత కలిగిన రిటైల్ రుణ గ్రహీతలకూ తమ రుణాలను ఒక్కసారి పునర్వ్యవస్థీకరించుకునే సదుపాయాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది. రిటైల్ కస్టమర్లు తమ రుణ పునర్వ్యవస్థీకరణకు తాము అర్హులా, కాదా తెలుసుకునే సదుపాయాన్ని ఎస్బీఐ పోర్టల్‌లో ఏర్పాటు చేసినట్టు బ్యాంకు ఎండీ సీఎస్ శెట్టి తెలిపారు. రుణ పునర్ వ్యవస్థీకరణ అర్హత గురించి తెలుసుకునేందుకు కస్టమర్లు బ్యాంకు శాఖలను సందర్శించడానికి బదులుగా ఆన్లైన్లోనే ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అర్హత కలిగిన కస్టమర్లు తర్వాత పేపర్లపై సంతకాలు చేసేందుకు బ్యాంకు శాఖకు వెళితే సరిపోతుందన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ కోరుకుంటే, మిగిలిన చెల్లింపుల కాలానికి అదనంగా 0.35 శాతం వార్షిక వడ్డీని రుణదాతలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు బ్యాంకు పోర్టల్‌ను 3,500 మంది సందర్శించగా, వారిలో 111 మంది రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హత ఉన్నవారిగా చెప్పారు. రిస్క్‌కు విముఖం కాదు.. డిమాండ్ లేదంతే.. బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు వెనకాడవని, అదే సమయంలో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాతి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన వివేకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా రజనీష్ మాట్లాడారు. -
26 రంగాలకు రుణ పునర్వ్యవస్థీకరణ
ముంబై: కరోనా నేపథ్యంలో చెల్లింపులు ఆగిపోయిన రుణాలను పునర్వ్యవస్థీకరించే విషయమై కేవీ కామత్ ప్యానెల్ సమర్పించిన సిఫారసులకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. రుణాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ఐదు రకాల ఫైనాన్షియల్ రేషియోలు, 26 రంగాలకు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిమితులను ప్యానెల్ సూచించింది. మాజీ బ్యాంకర్ కేవీ కామత్ అధ్యక్షతన రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన సూచనల కోసం ఆగస్ట్ 7న ఆర్బీఐ ప్యానెల్‌ను నియమించగా, ఈ నెల 4న ప్యానెల్ ఆర్బీఐకి తన నివేదికను సమర్పించింది. ఈ సిఫారసులకు పూర్తిగా అంగీకారం తెలిపినట్టు సోమవారం ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. కరోనాకు ముందు రుణగ్రహీత ఆర్థిక పనితీరు, కరోనా కారణంగా కంపెనీ నిర్వహణ, ఆర్థిక పనితీరుపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని రుణ పరిష్కార ప్రణాళికను ఖరారు చేయాలని సెంట్రల్ బ్యాంకు ఆదేశించింది. కామత్ ప్యానెల్ ఎంపిక చేసిన 26 రంగాల్లో.. విద్యుత్, నిర్మాణం, ఐరన్ అండ్ స్టీల్ తయారీ, రోడ్లు, రియల్టీ, టెక్స్టైల్స్, కెమికల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్/ఎఫ్ఎంసీజీ, నాన్ ఫెర్రస్ మెటల్స్, ఫార్మా, లాజిస్టిక్స్, జెమ్స్ అండ్ జ్యుయలరీ, సిమెంట్, వాహన విడిభాగాలు, హోటళ్లు, మైనింగ్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, వాహన తయారీ, ఆటో డీలర్‌షిప్‌లు, ఏవియేషన్, చక్కెర, పోర్ట్‌లు, షిప్పింగ్, బిల్డింగ్ మెటీరియల్స్, కార్పొరేట్ రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. ఐదు రంగాలకు సంబంధించి రేషియోలను సూచించకుండా.. బ్యాంకుల మదింపునకు విడిచిపెట్టింది. -
15లోపు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక
న్యూఢిల్లీ: రుణాల చెల్లింపులపై విధించిన ఆరునెలల మారటోరియం గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియడంతో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక సూచన చేశారు. రుణ పునర్వ్యవస్థీకరణలకు సంబంధించి సెప్టెంబర్ 15లోపు ఒక సుస్పష్ట ప్రణాళికను ప్రకటించాలన్నది ఆ సూచన సారాంశం. ఇందుకు సంబంధించి బ్యాంక్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలపై రుణ గ్రహీతలకు అవగాహన కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. కోవిడ్–19 నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న రుణ గ్రహీతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సైతం ఆమె సూత్రప్రాయంగా పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె గురువారం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల చీఫ్‌లతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఆమె ఇంకా ఏమన్నారంటే... కరోనా ప్రేరిత కష్టాల్లో ఉన్న అర్హత కలిగిన రుణ గ్రహీతలను గుర్తించాలి. వారి రుణాలకు సమర్థవంతమైన రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను అందించాలి. ఆర్థిక ఒత్తిడిలేని పరిస్థితిలో వ్యాపార పునరుద్ధరణకు వీలుకలిగించే బ్యాంకింగ్ పునర్వ్యవస్థీకరణ రుణ విధానం ఉండాలి. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లో బ్యాంకింగ్ తమ వెబ్సైట్లలోని ఎఫ్ఏక్యూ (ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్) విభాగంలో అప్డేట్ చేయాలి. అలాగే సంబంధిత ప్రణాళికను తమ ప్రధాన, బ్రాంచ్ కార్యాలయాల్లో సర్క్యులేట్ చేయాలి. అంతా సిద్ధం: బ్యాంకర్లు... కాగా, ఆర్బీఐ ఆగస్టు 6న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను దాదాపు సిద్ధం చేసినట్లు బ్యాంకర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ ప్రణాళికకు వాస్తవ అర్హత కలిగిన రుణ గ్రహీతల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందన్నారు. ఆర్బీఐ నిర్దేశించిన విధంగా నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు. త్వరలో కామత్ కమిటీ నివేదిక ఇదిలావుండగా, రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రముఖ బ్యాంకర్, బ్రిక్స్ బ్యాంక్ మాజీ చైర్మన్, కేవీ కామత్ నేతృత్వంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ త్వరలో తన నివేదికను సమర్పించాల్సి ఉంది. నిజానికి నివేదిక సమర్పణకు గడువు నెలరోజులుకాగా, ఈ గడువు ఈ నెల 7వ తేదీతో ముగిసిపోనుంది. కరోనా వైరస్ నేతృత్వంలో మొండిబకాయిల పరిధిలోకి జారిపోయే ఖాతాల పరిస్థితి ఏమిటి? ఈ తరహా ఒత్తిడిలో ఉన్న రుణ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలు, ప్రమాణాలు ఏమిటి? రుణ పునర్వ్యవస్థీకరణలు ఏ ప్రాతిపదిక జరగాలి? వంటి అంశాలపై కమిటీ సిఫారసులు చేయనుంది. దివాకర్ గుప్తా, టీఎన్ మనోహరన్ కమిటీలో ఇతర సభ్యులు. అశ్విన్ పరేఖ్ వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈఓ ప్యానల్ మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. ఈ నివేదికను సమర్పించిన అనంతరం, దీని ప్రాతిపదికన బ్యాంకింగ్ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలు మరింత పటిష్టంగా రూపుదిద్దుకునే వీలుంది. మొండి బాకీల భారం తీవ్రం... భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఇటీవలి ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వయంగా ప్రకటించిన విషయం గమనార్హం. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలకు, కామత్ కమిటీ ఇవ్వనున్న నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
మార్కెట్ నుంచే నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: నిధుల సాయం కోసం ఈ విడత కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఎండీ ఎస్ఎస్ మల్లికార్జున రావు స్పష్టం చేశారు. మార్కెట్ నుంచే నిధులను సమీకరించాలనుకుంటున్నట్టు చెప్పారు. రూ.14,000 కోట్లను మార్కెట్ నుంచి సమీకరించేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారని, ఇందులో రూ.7,000 కోట్లు ఈక్విటీ రూపంలో ఉంటుందని సోమవారం మీడియాతో వర్చువల్ గా నిర్వహించిన సమావేశం సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఇష్యూలకు తగినంత ఆసక్తి ప్రభుత్వ బ్యాంకుల నిధుల అవసరాలను తీర్చే అనుకూల పరిస్థితులు మార్కెట్లో కనిపిస్తున్నాయని మల్లికార్జునరావు చెప్పారు. బీవోబీ, పీఎన్బీ ఇటీవలే చేపట్టిన టైర్–2 బాండ్ ఇష్యూకు వడ్డీరేటు సహేతుకంగా ఉండడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాదే(2020–21) రియల్ ఎస్టేట్ ఆస్తుల విక్రయం రూపంలో మరో రూ.500 కోట్లను సమీకరించుకోనున్నట్టు చెప్పారు. దివాలా కేసుల రూపంలో రూ.8,000 కోట్లు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా చట్టం కింద కేసుల పరిష్కారం రూపంలో రూ.6,000–8,000 కోట్లు రావచ్చని తాము అంచనా వేస్తున్నట్టు మల్లికార్జునరావు తెలిపారు. అనుబంధ సంస్థ పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్ లో ప్రిఫరెన్షియల్ ఇష్యూ లేదా రైట్స్ ఇష్యూ రూపంలో రూ.600 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. 4–6 శాతం మేర రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎన్బీ రుణ వితరణలో 4–6 శాతం మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని మల్లికార్జునరావు చెప్పారు. అక్టోబర్ నుంచి ఆర్థికరంగ కార్యకలాపాలు బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. 40,000 కోట్ల రుణాల పునర్ వ్యవస్థీకరణ ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఆగస్ట్ తర్వాత పీఎన్ బీ సుమారు రూ.40,000 కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉందని మల్లికార్జునరావు వెల్లడించారు. కరోనా కారణంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకు రుణ చెల్లింపులపై మారటోరియం అవకాశం ఇచ్చిన ఆర్ బీఐ, అనంతరం ఒక్కసారి రుణ పునర్ వ్యవస్థీకరణకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. పీఎన్బీ లాభం రూ.308 కోట్లు 2020–21 ఏడాది తొలి త్రైమాసికానికి (ఏప్రిల్–జూన్) పీఎన్బీ రూ.308 కోట్ల స్టాండలోన్ లాభాన్ని(అనుబంధ సంస్థల ఫలితాలు కలపకుండా) ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకుకు వచ్చిన లాభం రూ.1,018 కోట్లతో పోలిస్తే రెండొంతులు తగ్గిపోయింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పీఎన్బీలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం కావడంతో, ఈ ఆర్థిక సంవత్సరం జూన్ ఫలితాలను క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చలేమని బ్యాంకు పేర్కొంది. -
ఎకానమీకి ‘రుణ’ పునరుత్తేజం!
ముంబై: బ్యాంకింగ్ రుణ పునర్వ్యవస్థీకరణ ఆర్థికరంగం పునరుత్తేజానికి దోహదపడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విశ్లేషించారు. రుణ పునఃచెల్లింపులకు తగిన సమయం కల్పించడం వల్ల ద్రవ్య లభ్యత విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంస్థలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆయన అన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ వల్ల వ్యాపార పునరుద్ధరణ జరుగుతుందని, దీనితో ఉపాధి అవకాశాలకు విఘాతం కలగదని గవర్నర్ అన్నారు. అంతిమంగా ఇది ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందన్నారు. ఒక వార్తా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత స్టాక్ మార్కెట్ సర్దుబాటు జరగాలి. వాస్తవ ఆర్థిక పరిస్థితిని మార్కెట్ ప్రతిబింబించడం లేదు. ► ఒకవైపు బ్యాంకుల ఆర్థిక పరిపుష్ఠి ఎంతో ముఖ్యమైన అంశం. మరోవైపు కోవిడ్–19 నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న చిన్న వ్యాపార సంస్థల ప్రయోజనాల పరిరక్షణా ముఖ్యం. ఈ రెండు అంశాల సమతౌల్యతకు తగిన ప్రయత్నం జరుగుతుంది. ► రుణ చెల్లింపులపై మారటోరియం గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది. ‘‘మారటోరియం’’ అనేది తాత్కాలిక పరిష్కార మార్గమే. దీనిని దీర్ఘకాలికంగా కొనసాగించలేము. ► ఆరు నెలల మారటోరియం ముగిసిపోతే, మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉంది. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద కొత్త మారటోరియం విధానం తీసుకురావడం, లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియంనే కొనసాగించడం వంటి చర్యలు తీసుకోడానికి బ్యాంకులకు తగిన సౌలభ్యత ఉంటుంది. ► కరోనా వైరస్ నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతునివ్వడానికి పాలనా, అధికార యంత్రాంగం తగిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. మొండిబకాయిలు 2 దశాబ్దాల గరిష్టానికి చేరిన నేపథ్యంలో ఫైనాన్షియల్ రంగం స్థిరత్వం అవసరం. ఆర్థిక వృద్ధికి దోహదపడే దిశలో రుణ వృద్ధి జరిగేందుకు బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్బీఐ అవసరమైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ► కంపెనీల రుణ పునర్వ్యవస్థీకరణ విషయంలో నియమించిన నిపుణుల కమిటీ త్వరలో తన సిఫారసులను చేయనుంది. అనంతరం ఈ విషయంలో అనుసరించాల్సిన విధానాలను సెప్టెంబర్ 6 లోపు ప్రకటించడం జరుగుతుంది. ఏ అకౌంట్‌కు సంబంధించి రుణ పునర్వ్యవస్థీకరణ అవసరమో బ్యాంకులు అంతర్గతంగా ఒక నిర్ధారణకు రాగలుగుతాయి. ► రుణ పునర్వ్యవస్థీకరణ రియల్టీ రంగానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాం. ► కరోనాపై పోరులో మనం విజయం సాధిస్తాము. అయితే దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను. అయితే విజయం మాత్రం కచ్చితంగా మనదే. ► సరళతర ద్రవ్య పరపతి విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. వడ్డీరేట్లు తగ్గుదలకే అవకాశం ఉంది. అయితే అత్యంత జాగరూకత, పరిపక్వతతో ఈ విధానాన్ని రూపొందించాల్సి ఉంది. ద్రవ్యోల్బణం అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై నిర్ణయించాల్సింది కేంద్రమే. దీనిపై కేంద్రం అడిగితే, ఆర్బీఐ తన అభిప్రాయాలను తెలియజేస్తుంది. ► ప్రైవేటు బ్యాంకుల యాజమాన్య సమీక్షకు ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌లో ఇది తుది నివేదికను అందజేస్తుంది. మొండిబకాయిల ప్రస్తుత స్థితి... 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఇటీవల విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. రుణ నిబంధనలు తరచూ మార్చేయొద్దు బ్యాంకులకు ఆర్బీఐ సూచన ముంబై: వ్యాపార సంస్థలకిచ్చే రుణాలకు సంబంధించిన నిబంధనలను సహేతుక కారణాలు లేకుండా తరచూ మార్చేయొద్దని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు సూచించింది. రుణ సదుపాయాలను సమీక్షించేందుకు క్రమబద్ధంగా నిర్దిష్ట కాలవ్యవధిని నిర్దేశించాలని, మధ్యలో పదే పదే సమీక్షలు జరపడాన్ని నివారించాలని పేర్కొంది. సమీక్ష ఎప్పుడెప్పుడు జరపాలి, ఏ విధానాలను పాటించాలి తదితర అంశాలకు సంబంధించి బోర్డు ఆమోదిత విధానాన్ని రూపొందించుకోవాలని తెలిపింది. బ్యాంకులు ఒక్కో రకంగా భారీ స్థాయిలో వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వం ఉద్దీపనలు ఇస్తున్నా వ్యాపార సంస్థలకు తగు విధంగా ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
రూ.8.4 లక్షల కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ
ముంబై: ఒక్కసారి రుణ పునర్వ్యవస్థీకరణకు అనుమతిస్తూ ఆర్బీఐ ఇటీవల పరపతి విధాన కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోగా.. ఈ కారణంగా బ్యాంకులు సుమారు రూ.8.4 లక్షల కోట్ల మేర రుణాలను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో ఇది 7.7 శాతం అవుతుందని పేర్కొంది. ఒకవేళ రుణాల పునరుద్ధరణకు అవకాశం లేకపోతే ఈ రూ.8.4 లక్షల కోట్ల రుణాల్లో సుమారు 60 శాతానికి పైగా ఎన్ పీఏలుగా మారొచ్చని అంచనాకు వచ్చింది. పునర్ వ్యవస్థీకరణ బ్యాంకుల లాభాలను కాపాడుతుందని, చేయాల్సిన కేటాయింపులు తగ్గుతాయని పేర్కొంది. కరోనా కారణంగా లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికి రెండు విడతల పాటు మొత్తం ఆరు నెలలు (2020 మార్చి నుంచి ఆగస్ట్) రుణ చెల్లింపులపై మారటోరియం (విరామం)కు అవకాశం ఇచ్చింది. మూడో విడత మారటోరియం కాకుండా పునర్ వ్యవస్థీకరణకు అవకాశం ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసిన వినతుల నేపథ్యంలో ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అన్నిరంగాలకు చెందిన అన్ని రుణాలకు కాకుండా పునర్ వ్యవస్థీకరణ విషయంలో ఒక్కో ఖాతాను విడిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. గత సంక్షోభ సమయాల్లో మాదిరిగా కాకుండా ఈ విడత కార్పొరేట్, నాన్ కార్పొరేట్, చిన్న వ్యాపార సంస్థలు, వ్యవసాయ రుణాలు, రిటైల్ రుణాలకు ఈ విడత పునర్ వ్యవస్థీకరణలో అధిక వాటా ఉండనుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో పునర్వ్యవస్థీకరించిన రుణాల్లో 90 శాతం కార్పొరేట్ రుణాలేనని పేర్కొంది. ఈ విడత (ఆగస్ట్ తర్వాత) పునర్వ్యస్థీకరణ రుణాల్లో రూ.2.1 లక్షల కోట్లు నాన్ కార్పొరేట్ విభాగాల నుంచే ఉంటాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. కార్పొరేట్ లో ఎక్కువ రిస్క్ కార్పొరేట్ విభాగంలో రూ.4 లక్షల కోట్ల రుణాలు కరోనా ముందు నుంచే ఒత్తిడిలో ఉన్నాయని, ఇవి మరో రూ.2.5 లక్షల కోట్ల మేర పెరగనున్నాయని ఇండియా రేటింగ్స్ అంచనాగా ఉంది. ‘‘కార్పొరేట్ విభాగంలో పునర్ వ్యవస్థీకరించే రుణాల మొత్తం రూ.3.3 లక్షల కోట్ల నుంచి రూ.6.3 లక్షల కోట్ల వరకు ఉంటాయి. బ్యాంకులు అనుసరించే విధానాలపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ విభాగంలోని రుణాల్లో 53 శాతం అధికరిస్క్ తో కూడినవే. మరో 47 శాతం రుణాలకు మధ్యస్థ రిస్క్ ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఎయిర్ లైన్స్, హోటల్స్, విచక్షణారహిత వినియోగ రంగాల్లో ఎక్కువ రుణాలను పునరుద్ధరించాల్సి రావచ్చు. అయితే విలువ పరంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్, నిర్మాణ రంగానికి చెందిన రుణాలు ఎక్కువగా ఉండొచ్చు. నాన్ కార్పొరేట్ విభాగంలో పునరుద్ధరించాల్సిన రుణాల్లో సగం ఎంఎస్ఎంఈ విభాగం నుంచి ఉంటాయి. మొత్తం మీద బ్యాంకింగ్ రంగంలో కేటాయింపులు 16–17 శాతం తగ్గుతాయి’’అని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో వివరించింది. -
కరోనా కష్టాల్లో రుణగ్రహీతలు
ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో రుణగ్రహీతలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణాలను 2021 దాకా వన్–టైమ్ ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించేందుకు అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కోరాయి. అలాగే రుణ వాయిదాలపై మారటోరియం వెసులుబాటు తమకూ ఇవ్వాలని, ప్రొవిజనింగ్ నిబంధనల సడలింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఆర్బీఐతో జరిగిన సమావేశంలో పరిశ్రమ వర్గాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేసినట్లు ఎన్‌బీఎఫ్‌సీల సమాఖ్య ఆర్థిక రంగ అభివృద్ధి మండలి (ఎఫ్ఐడీసీ) వెల్లడించింది. లాక్‌డౌన్‌తో తమ కస్టమర్ల ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలం కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐకి తెలిపాయి. ప్రధానంగా రవాణా ఆపరేటర్లు, కాంట్రాక్టర్లు, లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మొదలైన వాటిపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం ఉందని ఎన్బీఎఫ్సీలు వివరించాయి. ‘ఈ నేపథ్యంలో మొండిపద్దుల కింద వర్గీకరించే పరిస్థితి రాకుండా.. 2021 మార్చి దాకా రుణాల రీపేమెంట్ షెడ్యూల్స్‌ను సవరించేందుకు లేదా వాయిదాలను పొడిగించేందుకు లేదా ఈఎంఐలను పునర్వ్యవస్థీకరించేందుకు వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్‌కు అనుమతివ్వాలి‘ అని కోరినట్లు ఎఫ్ఐడీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన రుణాలను 2020 డిసెంబర్ దాకా వన్–టైమ్ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ అనుమతించింది. దీన్ని మిగతా రుణ గ్రహీతలందరికీ కూడా వర్తింపచేయాలని ఎన్బీఎఫ్సీలు కోరుతున్నాయి. ఇక మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేసుకునేందుకు ఆర్బీఐ ప్రకటించిన మారటోరియంతో రుణగ్రహీతలకు కాస్త ఉపశమనం లభించిందని ఎఫ్ఐడీసీ తెలిపింది. అయితే, పరిస్థితులు ఇంకా చక్కబడనందున నాలుగో నెలలోనూ వారు వాయిదాలు చెల్లించగలిగే అవకాశాలు ఉండకపోవచ్చని పేర్కొంది. నిధుల లభ్యత పెంచాలి .. తమ రుణ వితరణ కార్యకలాపాలు యథాప్రకారం సాగేలా తోడ్పడేందుకు రీఫైనాన్స్ మార్గం ద్వారా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి).. నాబార్డ్ నుంచి మరిన్ని నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని ఎన్బీఎఫ్సీలు కోరాయి. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ (టీఎల్టీఆర్వో 2.0)కి సగం స్థాయిలోనే బిడ్లు రావడమనేది .. బ్యాంకులు రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవడాన్ని సూచిస్తోందని ఎఫ్ఐడీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా మొత్తాన్ని సిడ్బి, నాబార్డ్లకు కేటాయించి తద్వారా తమకు నిధుల లభ్యత మెరుగుపడేలా చూడాలని కోరింది. ఇక, గడువు తీరి 1 రోజు దాటిన రుణ పద్దులన్నింటికీ 10 శాతం దాకా ప్రొవిజనింగ్ చేయాలన్న ఆదేశాలను కాస్త సడలించాలని కోరింది. తమ దగ్గర రుణాలు తీసుకునే ట్రక్కు ఆపరేటర్లు లాంటి వివిధ వర్గాలవారు పలు కారణాలతో ఈఎంఐలను కాస్త ఆలస్యంగా చెల్లించడం సాధారణమేనని పేర్కొంది. కొంత ఆలస్యమైనా 30 రోజుల్లోపే చెల్లించేస్తుంటారు కాబట్టి, ఈ పద్దులను క్రెడిట్ రిస్కు కింద పరిగణించడానికి లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనింగ్ నిబంధనను 30 రోజులు దాటిపోయిన రుణాలకు మాత్రమే వర్తింపచేసేలా అనుమతినివ్వాలని ఎన్బీఎఫ్సీలు విజ్ఞప్తి చేశాయి. పీఎస్బీలకు మొండిపద్దుల భారం ► ఈసారి 2–4% పెరుగుతాయి ► బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబాకీల భారం 2–4 శాతం మేర పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజి దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్‌ఏ) హెచ్చరించింది. దీనితో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ కింద ప్రభుత్వం 7–15 బిలియన్ డాలర్ల దాకా అదనపు మూలధనం సమకూర్చాల్సి రావొచ్చని పేర్కొంది. ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను వసూళ్లు పడిపోవడం, డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు నెరవేరే అవకాశాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా ద్రవ్య లోటు 2 శాతం మేర పెరగవచ్చని బీవోఎఫ్‌ఏ తెలిపింది. బ్యాంకులకు అదనపు మూలధనం అందించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం వివిధ మార్గాలు అన్వేషించాల్సి రావచ్చని వివరించింది.రీక్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేయడం లేదా ఆర్బీఐ దగ్గరున్న నిల్వల నుంచి కొంత భాగాన్ని వినియోగించడం వంటి అంశాలు పరిశీలించవచ్చని తెలిపింది. కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన పరిణామాలతో బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు భారీగా పెరగవచ్చంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బీవోఎఫ్‌ఏ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
రెండేళ్ల బెయిలవుట్ ఇవ్వండి..
రుణ పునర్వ్యవస్థీకరణ కోసం ఈయూకి గ్రీస్ విజ్ఞప్తి తుది పరిణామాలపై ఉత్కంఠ డీల్ కుదరకపోతే దివాలా... ఏథెన్స్: పీకల్లోతు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన గ్రీస్- ఇందులో నుంచి తాత్కాలికంగా బయటపడ్డానికి తుది ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు తాను చెల్లించాల్సిన 1.6 బిలియన్ డాలర్ల బకాయి చెల్లించలేని పరిస్థితి ఉందని స్పష్టంచేసిన ఆ దేశం... రెండేళ్ల బెయిలవుట్ డీల్‌కు సహకరించాలని యూరోపియన్ యూనియన్‌కు తాజాగా విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనపై భారత్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఈయూ అధినేతలు టెలికాన్ఫెరెన్సింగ్ ద్వారా చర్చలు ప్రారంభిస్తారు. ఐఎంఎఫ్‌కు రుణవాయిదా చెల్లింపులో గ్రీస్ డిఫాల్ట్ అయితే... యూరో నుంచి గ్రీస్ వైదొలగడం, ఆయా అంశాలు యూరోపియన్ యూనియన్‌తోపాటు, అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తలెత్తే అవకాశాలు ఉత్పన్నమవుతాయి. ఈ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో గ్రీస్ నుంచి తాజా ‘రెండేళ్ల బెయిలవుట్’ ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రధాని కార్యాలయ ప్రకటన... గ్రీక్ ప్రధాని కార్యాలయం తాజా ప్రకటన ప్రకారం, గ్రీస్ పూర్తి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రెండేళ్ల బెయిలవుట్ నిధుల్ని యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం (ఈఎస్ఎం) నుంచి విడుదల చేయాలి. రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సహాయ చర్యలను అందించాలి. యూరోజోన్‌లో ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి కాపాడ్డానికి, ఈ ప్రాంతంలో సింగిల్ కరెన్సీ యూరో స్థిరంగా ఉండడానికి చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించి 2012లో ఈఎస్ఎం ఏర్పాటయ్యింది. గ్రీస్ తాజా విజ్ఞప్తికి యూరోగ్రూప్ చీఫ్ జిరోయాన్ నుంచి తక్షణ స్పందన వెలువడింది. యూరోజోన్ ఆర్థిక మంత్రులు గ్రీస్ విజ్ఞప్తిపై టెలికాన్ఫరెన్స్ జరపనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. జింబాబ్వే తరువాత...:భారత్ కాలమానం ప్రకారం, మంగళవారం అర్థరాత్రి 3.30 గంటల లోపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు (ఐఎంఎఫ్) రుణ బకాయి 1.6 బిలియన్ డాలర్లను గ్రీస్ చెల్లించాల్సి ఉంది. లేదంటే... దేశం డిఫాల్టర్‌గా మిగులుతుంది. సకాలంలో బకాయి చెల్లించలేకపోతే, 2001 జింబాబ్వే తరువాత డిఫాల్టర్‌గా మారే తొలిదేశం గ్రీస్ అవుతుంది. -
అద్దెలు.. ప్రకటనలు..
న్యూఢిల్లీ: నిధుల కొరతనెదుర్కొంటున్న ఎయిరిండియా ఆదాయాలు పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాపర్టీల్లో కొన్నింటిని అద్దెకు ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే విమానాల లోపల (ఇన్‌ఫ్లయిట్) ప్రకటనలను అనుమతించే అంశాన్నీ పరిశీలిస్తోంది. ‘కొత్త ప్రణాళిక ప్రకారం ప్రధాన నగరాల్లో మా భవంతులను బ్యాంకులు, ఇతర కంపెనీలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఎయిరిండియా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే 22 ప్రాపర్టీలను గుర్తించామని, 19 ప్రాపర్టీలకు సంబంధించి బిడ్లు కూడా వచ్చాయని ఆయన వివరించారు. అలాగే, ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న 22 అంతస్తుల ఎయిరిండియా భవంతిలో మరిన్ని ఫ్లోర్లను కూడా అద్దెకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు అధికారి వివరించారు. ఈ భవంతిలో చదరపు అడుగుకు కనీసం రూ. 300-350 దాకా అద్దె లభించగలదని అంచనా. ఈ భవంతిని అద్దెకు ఇస్తే ఏటా కనీసం రూ. 100 కోట్లయినా ఆదాయం వస్తుందని ఎయిరిండియా అంచనా వేస్తోంది. ప్రాపర్టీలను అద్దెకు ఇవ్వడంతో పాటు తమ విమానాల వెలుపల, లోపల కూడా ప్రకటనలను అనుమతించాలని కంపెనీ భావిస్తున్నట్లు సంస్థ అధికారి తెలిపారు. -
బ్యాంకు ఖాతాల్లేకపోవడం సిగ్గుచేటు
పుణే: భారతీయుల్లో చాలా మందికి బ్యాంకులు అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కేవైసీ ప్రమాణాల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం పుణెలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ సదస్సులో రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతాపరమైన అంశాల్లో రాజీపడకుండానే బ్యాంకులను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేవిధంగా కేవైసీ ప్రమాణాలను మెరుగుపర్చవచ్చా అని ఆయన ప్రశ్నించారు. ‘పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బ్యాంకు అకౌంటు ప్రారంభించడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేకపోవడంతో ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి. బ్యాంకు ఖాతా ప్రారంభించడంలోనూ, ఇతర ద్రవ్య లావాదేవీల్లోనూ కేవైసీ (మీ ఖాతాదారును తెలుసుకోండి) ప్రమాణాలను కఠినతరం చేసిన దువ్వూరికే ఇలాంటి అనుభవం ఎదురవడం ఆశ్చర్యకరం. ఆర్బీఐ మాజీ ఉన్నతాధికారే బ్యాంకు అకౌంటును ప్రారంభించలేకపోయారంటే వ్యవస్థలోనే లోపం ఉందని భావించాలి...’ అని రాజన్ వ్యాఖ్యానించారు. దేశ జనాభా 123 కోట్లుండగా కేవలం 35 కోట్ల మందికే బ్యాంకు ఖాతాలున్నాయని ఈ సదస్సులో ప్రసంగించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ తెలిపారు. మొండిబకాయిలపై...: అంతకంతకూ పెరిగిపోతున్న మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యను పరిష్కరించేందుకు సరైన మార్గాలు వెతకాలే తప్ప పైపై మెరుగులు దిద్దేందుకు ప్రయత్నించరాదని బ్యాంకులకు రాజన్ సూచించారు. వరుసగా మూడేళ్లు కట్టకపోయినంత మాత్రాన సదరు రుణాలను మొండిబకాయిలుగా లెక్కించకుండా, మరికొంత సమయం ఇవ్వాలంటూ బ్యాంకులు, కార్పొరేట్ల నుంచి తమకు అభ్యర్థనలు వచ్చినట్లు ఆయన చెప్పారు. ‘రుణం తీసుకున్న వారు నేడు కట్టకపోతే.. రేపు కూడా కట్టలేకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించాలంటే.. సదరు రుణాన్ని ఏ విధంగా మళ్లీ రాబట్టుకోవచ్చన్న దానిపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) డిసెంబర్ క్వార్టర్లో ఆల్‌టైమ్ గరిష్టమైన 5 శాతం పైకి పెరిగిన సంగతి తెలిసిందే. వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు బ్యాంకింగ్ లెసైన్సులు రాని సంస్థలపై రాజన్ వ్యాఖ్య పుణే: బ్యాంకింగ్ లెసైన్సుల కోసం 25 దరఖాస్తులు రాగా రెండు సంస్థలకు మాత్రమే వాటిని జారీచేయడాన్ని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సమర్థించుకున్నారు. దరఖాస్తు చేసిన సంస్థల్లో కొన్ని ప్రత్యేక సేవల (డిఫరెన్షియేటెడ్) బ్యాంకులుగా మెరుగ్గా పనిచేస్తాయని ఎంపిక కమిటీ భావించిందని చెప్పారు. ఆర్బీఐ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ (ఎన్ఐబీఎం) వార్షిక సదస్సు సందర్భంగా శుక్రవారం పుణెలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దరఖాస్తుల జాబితాను మేం సమగ్రంగా పరిశీలించాం. బిమల్ జలాన్ కమిటీ, ఆర్బీఐ సంతృప్తి వ్యక్తం చేసిన జాబితా ఇది. ప్రస్తుతం లెసైన్సులు లభించని వారు మేం మళ్లీ లెసైన్సుల జారీని ప్రారంభించినపుడు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాం. అంతేకాదు, ప్రత్యేక సేవల బ్యాంకింగ్ లెసైన్సులను కూడా సృష్టిస్తాం. పూర్తి లెసైన్సు కంటే ప్రత్యేక సేవల లెసైన్సును అభ్యర్థించడం కొందరు దరఖాస్తుదారులకు మంచిది కావచ్చు..’ అని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేసే ఐడీఎఫ్సీ, కోల్‌కతాకు చెందిన బంధన్ సంస్థలకు రిజర్వు బ్యాంకు ఇటీవల బ్యాంకింగ్ లెసైన్సులు మంజూరు చేసిన సంగతి విదితమే. ఇండియా పోస్ట్‌కు లెసైన్సు ఇవ్వదలచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా సంప్రదించడం మంచిదని బిమల్ జలాన్ కమిటీ పేర్కొందని రాజన్ చెప్పారు.