రెండేళ్ల బెయిలవుట్ ఇవ్వండి..
రుణ పునర్‌వ్యవస్థీకరణ కోసం ఈయూకి గ్రీస్ విజ్ఞప్తి
తుది పరిణామాలపై ఉత్కంఠ
డీల్ కుదరకపోతే దివాలా...
ఏథెన్స్: పీకల్లోతు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన గ్రీస్- ఇందులో నుంచి తాత్కాలికంగా బయటపడ్డానికి తుది ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు తాను చెల్లించాల్సిన 1.6 బిలియన్ డాలర్ల బకాయి చెల్లించలేని పరిస్థితి ఉందని స్పష్టంచేసిన ఆ దేశం... రెండేళ్ల బెయిలవుట్ డీల్‌కు సహకరించాలని యూరోపియన్ యూనియన్‌కు తాజాగా విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనపై భారత్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఈయూ అధినేతలు టెలికాన్ఫెరెన్సింగ్ ద్వారా చర్చలు ప్రారంభిస్తారు.
ఐఎంఎఫ్‌కు రుణవాయిదా చెల్లింపులో గ్రీస్ డిఫాల్ట్ అయితే... యూరో నుంచి గ్రీస్ వైదొలగడం, ఆయా అంశాలు యూరోపియన్ యూనియన్‌తోపాటు, అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తలెత్తే అవకాశాలు ఉత్పన్నమవుతాయి. ఈ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో గ్రీస్ నుంచి తాజా ‘రెండేళ్ల బెయిలవుట్’ ప్రతిపాదన ముందుకు వచ్చింది.
ప్రధాని కార్యాలయ ప్రకటన...
గ్రీక్ ప్రధాని కార్యాలయం తాజా ప్రకటన ప్రకారం, గ్రీస్ పూర్తి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రెండేళ్ల బెయిలవుట్ నిధుల్ని యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం (ఈఎస్‌ఎం) నుంచి విడుదల చేయాలి. రుణ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి సహాయ చర్యలను అందించాలి. యూరోజోన్‌లో ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి కాపాడ్డానికి, ఈ ప్రాంతంలో సింగిల్ కరెన్సీ యూరో స్థిరంగా ఉండడానికి చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించి 2012లో ఈఎస్‌ఎం ఏర్పాటయ్యింది. గ్రీస్ తాజా విజ్ఞప్తికి యూరోగ్రూప్ చీఫ్ జిరోయాన్ నుంచి తక్షణ స్పందన వెలువడింది. యూరోజోన్ ఆర్థిక మంత్రులు గ్రీస్ విజ్ఞప్తిపై టెలికాన్ఫరెన్స్ జరపనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
జింబాబ్వే తరువాత...:భారత్ కాలమానం ప్రకారం, మంగళవారం అర్థరాత్రి 3.30 గంటల లోపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు (ఐఎంఎఫ్) రుణ బకాయి 1.6 బిలియన్ డాలర్లను గ్రీస్ చెల్లించాల్సి ఉంది. లేదంటే... దేశం డిఫాల్టర్‌గా మిగులుతుంది. సకాలంలో బకాయి చెల్లించలేకపోతే, 2001 జింబాబ్వే తరువాత డిఫాల్టర్‌గా మారే తొలిదేశం గ్రీస్ అవుతుంది.