న్యూఢిల్లీ: రుణాల చెల్లింపులపై విధించిన ఆరునెలల మారటోరియం గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియడంతో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక సూచన చేశారు. రుణ పునర్‌వ్యవస్థీకరణలకు సంబంధించి సెప్టెంబర్ 15లోపు ఒక సుస్పష్ట ప్రణాళికను ప్రకటించాలన్నది ఆ సూచన సారాంశం.
ఇందుకు సంబంధించి బ్యాంక్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలపై రుణ గ్రహీతలకు అవగాహన కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. కోవిడ్–19 నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న రుణ గ్రహీతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సైతం ఆమె సూత్రప్రాయంగా పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె గురువారం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల చీఫ్‌లతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది.
సమావేశంలో ఆమె ఇంకా ఏమన్నారంటే... కరోనా ప్రేరిత కష్టాల్లో ఉన్న అర్హత కలిగిన రుణ గ్రహీతలను గుర్తించాలి. వారి రుణాలకు సమర్థవంతమైన రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను అందించాలి. ఆర్థిక ఒత్తిడిలేని పరిస్థితిలో వ్యాపార పునరుద్ధరణకు వీలుకలిగించే బ్యాంకింగ్ పునర్‌వ్యవస్థీకరణ రుణ విధానం ఉండాలి. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లో బ్యాంకింగ్ తమ వెబ్‌సైట్లలోని ఎఫ్‌ఏక్యూ (ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ క్వశ్చన్స్) విభాగంలో అప్‌డేట్ చేయాలి. అలాగే సంబంధిత ప్రణాళికను తమ ప్రధాన, బ్రాంచ్ కార్యాలయాల్లో సర్క్యులేట్ చేయాలి.
అంతా సిద్ధం: బ్యాంకర్లు...
కాగా, ఆర్‌బీఐ ఆగస్టు 6న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను దాదాపు సిద్ధం చేసినట్లు బ్యాంకర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ ప్రణాళికకు వాస్తవ అర్హత కలిగిన రుణ గ్రహీతల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందన్నారు. ఆర్‌బీఐ నిర్దేశించిన విధంగా నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు.
త్వరలో కామత్ కమిటీ నివేదిక
ఇదిలావుండగా, రుణ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ప్రముఖ బ్యాంకర్, బ్రిక్స్ బ్యాంక్ మాజీ చైర్మన్, కేవీ కామత్ నేతృత్వంలో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ త్వరలో తన నివేదికను సమర్పించాల్సి ఉంది. నిజానికి నివేదిక సమర్పణకు గడువు నెలరోజులుకాగా, ఈ గడువు ఈ నెల 7వ తేదీతో ముగిసిపోనుంది.
కరోనా వైరస్ నేతృత్వంలో మొండిబకాయిల పరిధిలోకి జారిపోయే ఖాతాల పరిస్థితి ఏమిటి? ఈ తరహా ఒత్తిడిలో ఉన్న రుణ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలు, ప్రమాణాలు ఏమిటి? రుణ పునర్‌వ్యవస్థీకరణలు ఏ ప్రాతిపదిక జరగాలి? వంటి అంశాలపై కమిటీ సిఫారసులు చేయనుంది. దివాకర్ గుప్తా, టీఎన్ మనోహరన్ కమిటీలో ఇతర సభ్యులు. అశ్విన్ పరేఖ్ వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈఓ ప్యానల్ మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. ఈ నివేదికను సమర్పించిన అనంతరం, దీని ప్రాతిపదికన బ్యాంకింగ్ రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలు మరింత పటిష్టంగా రూపుదిద్దుకునే వీలుంది.
మొండి బాకీల భారం తీవ్రం...
భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్‌సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఇటీవలి ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్వయంగా ప్రకటించిన విషయం గమనార్హం. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలకు, కామత్ కమిటీ ఇవ్వనున్న నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment