Non Banking Financial Company
-
ఎన్బీఎఫ్సీలు అవుట్‌లుక్ మరింత మెరుగు: ఐసీఆర్ఏ
నాన్–బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ–రిటైల్) హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ–రిటైల్) రుణాలు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు తన అవుట్‌లుక్‌ను ఎగువముఖంగా సవరించింది. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలోని రిటైల్ రుణాలు (ఏయూఎం) 2023 మార్చి నాటికి రూ.14 లక్షల కోట్లు ఉంటే, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది 18 నుంచి 20 శాతం పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 12 నుంచి 14 శాతంగా ఉంది. ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల రిటైల్ రుణాలు 2023 మార్చి నాటికి రూ.7లక్షల కోట్లయితే, 2023–24లో 12 నుంచి 14 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 11 నుంచి 13 శాతం. ఇక మౌలిక రంగానికి సంబంధించి మొత్తం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలు మార్చి 2023 నాటికి రూ.40 లక్షల కోట్లయితే, ఈ విభాగంలో 2023–24లో క్రితం అంచనాల (10 నుంచి 12 శాతం)కన్నా అధికంగా 13 నుంచి 15 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. -
బంగారు రుణ ఎన్బీఎఫ్సీలు జిగేల్!
ముంబై: బ్యాంకుల నుంచి పోటీ తీవ్రతరం అవుతుండటంతో బంగారంపై రుణాలిచ్చే బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరింత దూకుడుగా తమ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. లిక్విడిటీపరంగా సురక్షితమైన బంగారం రుణాలపై అధిక రాబడికి ఆస్కారం ఉండటంతో ప్రస్తుతం చాలా మటుకు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యంకులు గోల్డ్ లోన్ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఉదాహరణకు బ్యాంకుల బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో 2021 ఆరి్థక సంవత్సరంలో 89 శాతం ఎగిసి రూ. 60,700 కోట్లకు, ఆ తర్వాత 2022 ఆరి్థక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ. 70,900 కోట్లకు చేరినట్లు వివరించింది. ‘బ్యాంకుల నుంచి తీవ్ర పోటీ నెలకొనడం, పసిడి ధరల్లో భారీ పెరుగుదల అవకాశాలు (గతంలో చూసినంతగా) కనిపించకపోతుండటంతో ఎన్బీఎఫ్సీలు.. ముఖ్యంగా భారీ స్థాయిలో గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఉన్నవి.. తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు దూకుడుగా వ్యూహాలు అమలు చేయవచ్చు. కార్యకలాపాలను మరింత విస్తరించవచ్చు‘ అని ఏజెన్సీ పేర్కొంది. మార్జిన్ల విషయంలో రాజీపడినా సరే.. గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలు తమ కస్టమర్లను పోగొట్టుకోకుండా వీలైన ప్రయత్నాలు అన్నీ చేయ నున్నాయి. అవసరమైతే భారీ రుణాలపై మార్జిన్లను తగ్గించుకోవడంతో పాటు నిబంధనలను సరళతరం చేయడం మొదలైనవి చేసే అవకాశం ఉంది. దీని వల్ల నిర్వహణ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కోవిడ్ కష్టాలతో వేలం.. కరోనా వైరస్ కష్టకాలం కారణంగా బంగారం రుణ గ్రహీతలకు ఆరి్థక ఇబ్బందులు నెలకొనడం, గతేడాది జూన్–సెపె్టంబర్ మధ్య కాలంలో పసిడి ధరలు 10 శాతం మేర కరెక్షన్కు లోనవడం తదితర అంశాల కారణంగా ఎన్బీఎఫ్సీలు ఏప్రిల్–డిసెంబర్ కాలంలో తనఖా పెట్టిన బంగారాన్ని భారీ స్థాయిలో వేలం వేయాల్సి వచ్చింది. అక్టోబర్ నుంచి పసిడి ధరలు కాస్త స్థిరపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆరి్థక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వేలం విషయంలో పరిస్థితులు కాస్త చక్కబడగలవని నివేదిక అభిప్రాయపడింది. ఎన్బీఎఫ్సీల్లో పసిడి వేలం భారీగా పెరిగినప్పటికీ.. బ్యాంకుల్లో మాత్రం దీని తీవ్రత అంతగా నమోదు కాలేదని పేర్కొంది. బంగారం విలువపై బ్యాంకులు ఇచ్చే రుణం (ఎల్టీవీ) నిష్పత్తి ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. -
‘కూడోస్’ సీఈవో అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మొబైల్ యాప్స్ ద్వారా రుణా లిచ్చి అధికవడ్డీలతో వేధించిన కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 39 చైనా యాప్స్‌కు (ఫిన్టెన్ కంపెనీలు) తన ఎన్బీఎఫ్సీ (నాన్‌బ్యాంకింగ్ ఫైనా న్స్ కంపెనీ) కూడో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సహకరించిన సంస్థ డైరెక్టర్ కమ్ సీఈవో పవిత్రా ప్రదీప్ వాల్వేకర్‌ను ఈడీ శనివారం అరెస్ట్ చేసింది. కమిషన్ కోసం ఆశపడ్డ సంబంధిత సంస్థ 39 చైనా యాప్స్‌కు తన ఎన్బీఎఫ్సీ ద్వారా సర్వీస్ ప్రొవైడర్స్‌గా ఉంటూ, సంబంధిత ఫిన్‌టెక్ కంపెనీల మొబైల్ యాప్ ఏర్పాటుకు సహకరించిందని, ఇందులో భాగంగా కూడోస్కు చెందిన కాల్‌సెంటర్ల ద్వారా వేధింపు లకు పాల్పడి దేశవ్యాప్తంగా రూ. 2,224 కోట్ల మేర లోన్స్ రివకరీ పేరుతో వసూలు చేసినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడించింది. ఇలా లోన్ల రూపేనా ఇచ్చిన డబ్బుకు అదనంగా వచ్చిన రూ. 544 కోట్ల సొమ్మును ఇతర దేశాలకు సంబంధిత యాప్స్ కంపెనీలు బదిలీ చేసినట్టు, ఈ మొత్తం స్కాంలో కూడోస్ సంస్థ రూ.24 కోట్ల మేర లబ్ధిపొందినట్టు ఈడీ గుర్తించింది. -
ప్రైవేటు రుణాల్లో 12% వరకూ రాబడి!
న్యూఢిల్లీ: ప్రైవేటు రుణాల విషయంలో రాబడులు 12 శాతం వరకూ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విభాగంపై నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), క్రెడిట్ ఫండ్స్ దృష్టి సారించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) విశ్లేషించింది. ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో ఈ విభాగంలోకి 89 బిలియన్ డాలర్ల(రూ.6,67,500 కోట్లు) వరకూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు వెలువడిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► వచ్చే ఐదేళ్లలో ఒత్తిడిలో ఉన్న ఆస్తులపై పెట్టుబడి అవకాశాలు, ఎన్పీఏల కొనుగోళ్లు, తాజా క్రెడిట్ డిఫాల్ట్‌లు అన్నీ పరిశీలిస్తే ప్రైవేటు రుణ అవకాశాల విలువ దాదాపు 25 బిలియన్ డాలర్లు. ► ప్రైవేట్ క్రెడిట్ పెట్టుబడిదారులకు భారత్ చక్కటి వ్యవస్థాగత అవకాశాన్ని అందిస్తుంది. మొండి బకాయిల సమస్య నేపథ్యంలో ఇబ్బందికరమైన పెట్టుబడులకు రుణ దాతలు దూరంగా ఉన్నారు. ► ఎన్బీఎఫ్సీలు 2018లో వాటిని చుట్టుముట్టిన లిక్విడిటీ సంక్షోభం నుండి ప్రస్తుతం కోలుకుంటున్నాయి. ► ప్రైవేట్ క్రెడిట్ వార్షికంగా సంవత్సరానికి 12–18 శాతం మధ్య అంతర్గత రాబడిని అందజేస్తుందని అంచనా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేటు రుణ పెట్టుబడి 39–89 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ► ఒత్తిడితో కూడిన రుణ విభాగంపై సైతం ప్రైవేటు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రాబడులు 18–24 శాతం వరకు ఉంటాయని భావించడమే దీనికి కారణం. ► స్థిర కరెన్సీ, అధిక ఆర్థిక వృద్ధి వంటి అంశాలు పెట్టుబడిదారు విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడులపై 12 శాతం నుంచి 24 శాతం వరకూ రాబడి లభిస్తుందని అంచనా. ► వడ్డీరేట్లు మున్ముందు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రైవేటు రుణ ఇన్వెస్టర్లలో ఉంది. ఇంకా తగ్గించలేని కనిష్ట స్థాయిలో వడ్డీరేట్లు, కమోడిటీ ధరలు పుంజుకోవడం, ద్రవ్యోల్బణం ఆందోళనలు, రుణదాత హక్కుల అమల్లో జాప్యం నివారణకు ఇటీవలి చర్యలు వంటి అంశాలు దీనికి కారణం. ► అయితే ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ కొన్ని సవాళ్లనూ ఎదుర్కొంటోంది. అధికారిక దివాలా ప్రక్రియలో జాప్యం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఫ్రేమ్‌వర్క్ వెలుపల తీర్మానాలలో జాప్యం, కార్పొరేట్ పాలన సమస్యలు, సర్ఫేసీ చట్టం వాస్తవ అమల్లో అడ్డంకులు వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించదగినవి. ► ప్రైవేట్ క్రెడిట్ గొడుగు కింద జరిగే అనేక ఒప్పందాలు చోటుచేసుకుంటున్నాయి. దివాలా చట్టాల కింద ఒత్తిడికి గురైన వ్యాపారాన్ని కొనుగోలు చేయడం, వన్–టైమ్ సెటిల్మెంట్, అవకాశాలకు అనుగుణంగా లేదా ప్రత్యేక పరిస్థితుల లావాదేవీల వంటివి ఇందులో ఉన్నాయి. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వంటి ఆఫ్‌షోర్ మార్గంలో లేదా ఏఐఎఫ్, ఎన్బీఎఫ్సీ, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు ద్వారా ఆన్‌షోర్ పెట్టుబడులు ద్వారా ప్రైవేటు రుణ మార్కెట్ మరింత విస్తరించే వీలుంది. -
ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, తస్మాత్ జాగ్రత్త !
న్యూఢిల్లీ: ‘నిధి’ కంపెనీలపట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం మరోసారి పేర్కొంది. నిబంధనలు పాటించడంలో కనీసం 348 కంపెనీలు విఫలమైనట్లు తెలియజేసింది. వెరసి పెట్టుబడులు చేపట్టేముందు కంపెనీ పూర్వాపరాలు పరిశీలించమంటూ ఇన్వెస్టర్లకు సూచించింది. గత ఆరు నెలల్లో నిధి కంపెనీలపట్ల జాగ్రత్త వహించమంటూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ రెండోసారి హెచ్చరించడం గమనార్హం! భారీ సంఖ్యలోని నిధి కంపెనీలు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయడంలేదని ప్రభుత్వం వెల్లడించింది. కంపెనీల చట్టం 2013, నిధి నిబంధనలు 2014ను అమలు చేయడంలో వైఫల్యం పొందుతున్నట్లు వివరించింది. నిధి కంపెనీలు బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థల పరిధిలోకి వస్తాయి. సెక్షన్ 406తోపాటు, సవరించిన నిధి నిబంధనల ప్రకారం ఎన్‌డీహెచ్–4 కోసం దరఖాస్తు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. 2021 ఆగస్ట్ 4వరకూ చూస్తే నిధి చట్టంకింద దరఖాస్తు చేసిన కంపెనీలలో 348వరకూ తగినస్థాయిలో నిబంధనలను అందుకోలేకపోయినట్లు వెల్లడించింది. చదవండి : జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది -
బంగారంపై రుణం అందరికీ ఆమోదమే!
భారతీయులకు బంగారంతో అనుబంధం ఎంతో ప్రత్యేకం. ఆభరణాలు, బంగారంతో చేసిన వస్తువులు.. ఇలా ఏదో ఒక రూపంలో బంగారం కలిగి ఉండడాన్ని హోదాగానూ చూస్తారు. బంగారాన్ని సంపదగా భావిస్తుంటారు. అందుకే సామాన్యుడి కుటుంబంలోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఇదే బంగారం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు మరో రూపంలో ఆదుకుంటోంది. ఆదాయాలు పడిపోయి, ఉపాధి కరువైన వేళ బంగారంపై సులభంగా రుణాలు పొందే పరిస్థితి వారికి కొంత ఊరటనిస్తోంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) సైతం బంగారం రుణాలు ఆమోదనీయంగా ఉంటున్నాయి. రుణ గ్రహీతలు చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో వారు తనఖాగా ఉంచిన బంగారాన్ని వేలం వేసుకునే సౌలభ్యం వాటికి ఉంటుంది. కనుక రిస్క్ తక్కువ. రుణ గ్రహీతలకూ తక్కువ రేటుపైనే రుణాలు లభించే పరిస్థితి. వెరసి ఇరువురికీ ఆమోదనీయమైన బంగారం రుణాల మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి రాకతో బంగారం రుణ మార్కెట్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారీ వృద్ధిని చూసిందని చెప్పుకోవాలి. ఆర్బీఐ గణాంకాలను పరిశీలించినట్టయితే.. బ్యాంకుల రుణ పుస్తకంలో 2020 మార్చి నాటికి రూ.33,303 కోట్లుగా ఉన్న బంగారం రుణాలు.. 2021 మార్చి నాటికి ఏకంగా 86 శాతం పెరిగి రూ.60,464 కోట్లకు విస్తరించాయి. 2019 మార్చి నుంచి 2020 మార్చి మధ్యన చూసినా కానీ బ్యాంకుల బంగారం రుణాలు 33.9 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఇవి కేవలం ఆర్బీఐ వద్దనున్న బ్యాంకుల రుణ పుస్తకాల్లోని గణాంకాలే. ప్రత్యేకంగా బంగారం రుణాలను మంజూరు చేసే ముత్తూట్, మణప్పురం ఇతర ఎన్‌బీఎఫ్‌సీల పరిధిలోని గణాంకాలనూ కలిపి చూస్తే ఈ వృద్ధి మరింత ఎక్కవగానే ఉంటుంది. కరోనా కష్టాల్లో ఆసరా.. బంగారం రుణాల మార్కెట్ ఏటేటా భారీ వృద్ధినే నమోదు చేస్తోంది. ఇందుకు పెరిగిన బంగారం ధరలు రూపంలో అనుకూలత ఏర్పడింది. ఇక 2020 మార్చిలో కరోనా నియంత్రణకు లాక్డౌన్లు విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధిని కోల్పోగా.. కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తీసుకున్న రుణాలపై ఆరు నెలల మారటోరియంను బ్యాంకులు కల్పించాయి. గతేడాది ఆగస్ట్‌లో మారటోరియం ముగిసిన తర్వాత వ్యాపార కార్యకలాపాల కోసం ఈ బంగారం రుణాలే చాలా పరిశ్రమలను, వ్యాపారులను ఆదుకున్నాయి. అదే సమయంలో ఆర్బీఐ సైతం బంగారం రుణాల విషయంలో నిబంధనలను సడలించి ఆశలు కలి్పంచింది. లోన్ టు వ్యాల్యూ (అంటే బంగారం విలువలో మంజూరు చేసే రుణం పరిమాణం/ఎల్టీవీ)ను పెంచుతూ 2020 ఆగస్ట్‌లో ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాల కోసం మంజూరు చేసే బంగారం రుణాలకు ఎల్టీవీని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచింది. ప్రభుత్వ బ్యాంకుల పాత్ర బంగారం ఆభరణాలు, వస్తువుల తాకట్టుపై ఎస్బీఐ మంజూరు చేసిన రుణాలు (సాధారణ అవసరాల కోసం ఇచ్చినవి) మార్చి 31 నాటికి ఏడాది కాలంలో ఏకంగా 465 శాతం పెరిగి రూ.20,987 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వి రూ.3,715 కోట్లుగానే ఉండడం గమనార్హం. బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర రిటైల్ బంగారం రుణాలు 2021 మార్చి నాటికి రూ.1,370 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవతత్సరంలో 11 రెట్ల వృద్ధి నమోదైంది. బ్యాంకు ఆఫ్ బరోడా రిటైల్ బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో కూడా 2020 మార్చి నాటికి ఉన్న రూ.436 కోట్ల నుంచి.. 2021 మార్చి నాటికి రూ.1,101 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటురంగంలోని ఫెడరల్ బ్యాం కు 70 శాతం, సీఎస్బీ బ్యాంకు 61 శాతం మేర బంగారం రుణాల్లో ప్రగతిని చూపించాయి. లిక్విడిటీ ఎక్కువ.. బంగారం రుణాలకు సంబంధించి పూర్తి సామర్థ్యాలను గతంలో తమ బ్యాంకు చూడలేదని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవో రాజీవ్ ఎండీ పేర్కొన్నారు. దీంతో బంగారం రుణాల్లో మార్కెట్‌ను పెంచుకునేందుకు సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో, కస్టమర్లకు అనుకూలమైన పథకాన్ని రూపొందించినట్టు చెప్పారు. ‘‘క్లిష్ట సమయాల్లో చాలా మంది వ్యక్తులు, చిన్న వ్యాపారస్థులు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. తక్షణ నిధుల అవసరాలను బంగారం రుణాలు తీరుస్తున్నాయి. మా బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో 2021 మార్చి నాటికి రూ.1,939 కోట్లకు పెరిగింది. అంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే ఏడు రెట్ల వృద్ధి నమోదైంది. ఇప్పటికైతే బంగారం రుణ పుస్తకం రూ.2,100 కోట్లుగా ఉంటుంది’’ అని రాజీవ్ బంగారం రుణాల విస్తృతి గురించి వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో రూ.5,000 కోట్లకు విస్తరిస్తుందని అంచనా వ్యక్తం చేశారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో పెరిగిన తమ రుణ పుస్తకంలో ఎక్కువ వృద్ధి బంగారం రుణాల విభాగం నుంచే ఉన్నట్టు సీఎస్బీ బ్యాంకు ఎండీ, సీఈవో రాజేంద్రన్ సైతం ఇటీవలే పేర్కొనడం గమనార్హం. 76 శాతం వృద్ధి బంగారం రుణాల నుంచే వచ్చినట్టు చెప్పారు. ‘‘బంగారం రుణాల్లో వృద్ధి ఎంతో బాగుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలో అంత చురుగ్గా లేవు. ఒక్క సారి కస్టమర్ ఎన్బీఎఫ్సీ నుంచి బ్యాంకుకు బంగారం రుణం కోసం వస్తే.. ఇక తిరిగి ఎప్పటికీ ఎన్బీఎఫ్సీ సంస్థల వద్దకు వెళ్లరు. ఎందుకంటే చాలా ఆకర్షణీయమైన వడ్డీ రేటుకే బ్యాంకులో బంగారంపై రుణాలు లభిస్తాయి’’ అంటూ బంగారం రుణాలకు సంబంధించి బ్యాంకులు మంచి ఎంపిక అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగారం రుణాలు సురక్షితమైనవి (సెక్యూర్డ్ లోన్స్). డిఫాల్ట్ (రుణ ఎగవేతలు) రిస్క్ చాలా తక్కువ. దీంతో బ్యాంకులకు బంగారం రుణాలు ఆకర్షణీయంగా మారాయి. పెరిగిన ధరలతో అధిక రుణం ఒకవైపు అధిక ఎల్టీవీ, మరోవైపు పెరిగిన బంగారం మార్కెట్ ధరలు.. తనఖా బంగారంపై ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే పరిస్థితికి దారితీశాయి. మరోవైపు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు సైతం ఎక్కువ మందికి బంగారంపై రుణాలు అనుకూల మార్గంగా తోచాయి. ప్రభుత్వరంగంలోని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర అయితే 7.35 శాతం, ఎస్బీఐ 7.50 వార్షిక వడ్డీ రేటుపై బంగారం రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా బంగారం రుణాల మార్కెట్‌ను అధిక శాతం ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలే శాసిస్తుంటాయి. కానీ, ఆకర్షణీయమైన రుణ రేట్లతో ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం ఈ మార్కెట్లోకి బలంగా చొచ్చుకుపోతున్నాయి. దీంతో వినియోగదారులు కష్ట సమయాల్లో తక్కువ రేటుపైనే రుణాలు పొందే సౌలభ్యం ఏర్పడింది. నిజానికి ఎన్బీఎఫ్సీ సంస్థలైన ముత్తూట్, మణప్పురం సంస్థలు బంగారం రుణాలపై అధిక రేట్లను వసూలు చేస్తుంటాయి. ప్రకటనల్లోనే 12 శాతం వడ్డీ రేటు అని చెబుతాయి కానీ.. ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా రూ.30వేలకు మించి ఈ రేటుపై రుణాలను ఇవ్వవు. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే 18, 24 శాతం వడ్డీ రేటును చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. కానీ, బ్యాంకుల్లో 60 పైసల వడ్డీ రేటుకే బంగారంపై రుణాలు లభిస్తున్నాయి. ఇక్కడ కాల వ్యవధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్బీఎఫ్సీలు మూడు నెలలు, ఆరు నెలలకే రుణాలు ఇస్తుంటాయి. వడ్డీని ప్రతీ నెలకోసారి చెల్లించుకోవాలి. లేదంటే దానిపై మరింత చార్జీలను బాదుతాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అలా కాదు. ఏడాది, రెండేళ్లకూ రుణాలను ఇవ్వడమే కాకుండా.. వడ్డీని ఏడాదికోసారి చెల్లించే విధంగా పథకాలను రూపొందిస్తున్నాయి. కాకపోతే కాలవ్యవధి తీరిన తర్వాత వడ్డీ మాత్రమే చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకోవాలంటే ప్రక్రియను మొదటి నుంచి బ్యాంకులు అనుసరిస్తున్నాయి. దీంతో తిరిగి బంగారం అప్రైజర్ (విలువ మదింపుదారు) చార్జీలు, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ చార్జీల రూపంలో భారాన్ని భరించాల్సి ఉంటుంది. -
ఎన్‌బీఎఫ్‌సీల అసెట్స్‌లో 15 శాతం వృద్ధి
ముంబై: బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్సీ) సుమారు 42 శాతం సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం తమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎ) 15 శాతం పైగా వృద్ధి చెందుతుందని ఆశాభావంతో ఉన్నట్లు ఇక్రా రేటింగ్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఎన్బీఎఫ్సీలపై కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావాలను, వాటి భవిష్యత్ అంచనాలను తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ వివరించింది. పరిశ్రమ ఏయూఎంలో 60 శాతం వాటా ఉన్న 65 ఎన్బీఎఫ్సీలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపింది. చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు తమ ఏయూఎం 10 శాతం దాకా వృద్ధి చెందవచ్చని అంచనా వేసుకుంటున్న నేపథ్యంలో మొత్తం పరిశ్రమ వృద్ధి 7–9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నట్లు ఇక్రా రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ మనుశ్రీ సగ్గర్ తెలిపారు. ఎన్బీఎఫ్సీ సెగ్మెంట్లో అంతర్గతంగా సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ), చిన్న సంస్థలకు రుణాలిచ్చేవి, అఫోర్డబుల్ హౌసింగ్ రుణాలిచ్చే సంస్థలు మిగతా వాటికన్నా మరింత అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. లాక్డౌన్ల సడలింపు, కొత్త కోవిడ్ కేసులు ఒక మోస్తరు స్థాయికి పరిమితం అవుతుండటం, టీకాల ప్రక్రియ పుంజుకోవడం వంటి అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మిగతా భాగంలో గత ఆర్థిక సంవత్సరం కన్నా వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని ఎన్బీఎఫ్సీలు భావిస్తున్నట్లు ఇక్రా రేటింగ్స్ తెలిపింది. -
ఫ్లెక్స్‌పే డిజిటల్ క్రెడిట్ కార్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన హైదరాబాద్‌కు చెందిన వివిఫై ఇండియా ఫైనాన్స్.. ఫ్లెక్స్‌పే పేరుతో భారత్‌లో తొలిసారిగా యూపీఐ చెల్లింపుల ఆధారిత డిజిటల్ క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్ తనకున్న క్రెడిట్ లిమిట్ మేరకు ఫ్లెక్స్‌పే యాప్ ద్వారా దుకాణాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్స్, యూపీఐ ఐడీని స్కాన్ చేసి చెల్లింపులు జరపవచ్చు. లేదా తన బ్యాంకు ఖాతాకు క్రెడిట్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. కస్టమర్ ఆదాయం, గతంలో తీసుకున్న రుణం, చెల్లింపుల తీరు, సిబిల్ స్కోర్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి ఆధారంగా చేసుకుని 15 నిమిషాల్లో డిజిటల్ క్రెడిట్ కార్డ్ రెడీ అవుతుంది. రూ.500 మొదలుకుని రూ.2 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. క్రెడిట్ లిమిట్, వినియోగదారుడినిబట్టి వడ్డీ ఏడాదికి 36 శాతం వరకు వసూలు చేస్తారు. వాడుకున్న మొత్తాన్ని గరిష్టంగా 36 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎలా పనిచేస్తుందంటే.. ఫ్లెక్స్‌పే యాప్ డౌన్లోడ్ చేసి, పాన్ కార్డ్, గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. కంపెనీ ఏజెంట్ వీడియో కాల్ ద్వారా కస్టమర్‌ను, పత్రాలను ధ్రువీకరించుకుంటారని వివిఫై ఇండియా ఫైనాన్స్ ఫౌండర్ అనిల్ పినపాల బుధవారం తెలిపారు. ‘15 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. 5,000 డేటా పాయింట్ల ఆధారంగా కస్టమర్ అర్హుడా కాదా, ఎంత క్రెడిట్ ఇవ్వాలనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెబుతుంది. నగదు వాడుకున్న కాలానికే వడ్డీ ఉంటుంది. అంటే రెండు రోజుల్లో కూడా వెనక్కి చెల్లించవచ్చు. ఇప్పటికే 30,000 మంది ఫ్లెక్స్‌పే కస్టమర్లు ఉన్నారు. 2017లో ప్రారంభమైన వివిఫై ఇప్పటి వరకు 60,000 మంది వినియోగదార్లకు రూ.220 కోట్లు రుణంగా ఇచ్చింది’ అని ఆయన వివరించారు. వివిఫై ఫౌండర్ అనిల్ -
15లోపు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక
న్యూఢిల్లీ: రుణాల చెల్లింపులపై విధించిన ఆరునెలల మారటోరియం గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియడంతో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక సూచన చేశారు. రుణ పునర్వ్యవస్థీకరణలకు సంబంధించి సెప్టెంబర్ 15లోపు ఒక సుస్పష్ట ప్రణాళికను ప్రకటించాలన్నది ఆ సూచన సారాంశం. ఇందుకు సంబంధించి బ్యాంక్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలపై రుణ గ్రహీతలకు అవగాహన కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. కోవిడ్–19 నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న రుణ గ్రహీతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సైతం ఆమె సూత్రప్రాయంగా పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె గురువారం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల చీఫ్‌లతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఆమె ఇంకా ఏమన్నారంటే... కరోనా ప్రేరిత కష్టాల్లో ఉన్న అర్హత కలిగిన రుణ గ్రహీతలను గుర్తించాలి. వారి రుణాలకు సమర్థవంతమైన రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను అందించాలి. ఆర్థిక ఒత్తిడిలేని పరిస్థితిలో వ్యాపార పునరుద్ధరణకు వీలుకలిగించే బ్యాంకింగ్ పునర్వ్యవస్థీకరణ రుణ విధానం ఉండాలి. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లో బ్యాంకింగ్ తమ వెబ్సైట్లలోని ఎఫ్ఏక్యూ (ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్) విభాగంలో అప్డేట్ చేయాలి. అలాగే సంబంధిత ప్రణాళికను తమ ప్రధాన, బ్రాంచ్ కార్యాలయాల్లో సర్క్యులేట్ చేయాలి. అంతా సిద్ధం: బ్యాంకర్లు... కాగా, ఆర్బీఐ ఆగస్టు 6న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను దాదాపు సిద్ధం చేసినట్లు బ్యాంకర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ ప్రణాళికకు వాస్తవ అర్హత కలిగిన రుణ గ్రహీతల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందన్నారు. ఆర్బీఐ నిర్దేశించిన విధంగా నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు. త్వరలో కామత్ కమిటీ నివేదిక ఇదిలావుండగా, రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రముఖ బ్యాంకర్, బ్రిక్స్ బ్యాంక్ మాజీ చైర్మన్, కేవీ కామత్ నేతృత్వంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ త్వరలో తన నివేదికను సమర్పించాల్సి ఉంది. నిజానికి నివేదిక సమర్పణకు గడువు నెలరోజులుకాగా, ఈ గడువు ఈ నెల 7వ తేదీతో ముగిసిపోనుంది. కరోనా వైరస్ నేతృత్వంలో మొండిబకాయిల పరిధిలోకి జారిపోయే ఖాతాల పరిస్థితి ఏమిటి? ఈ తరహా ఒత్తిడిలో ఉన్న రుణ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలు, ప్రమాణాలు ఏమిటి? రుణ పునర్వ్యవస్థీకరణలు ఏ ప్రాతిపదిక జరగాలి? వంటి అంశాలపై కమిటీ సిఫారసులు చేయనుంది. దివాకర్ గుప్తా, టీఎన్ మనోహరన్ కమిటీలో ఇతర సభ్యులు. అశ్విన్ పరేఖ్ వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈఓ ప్యానల్ మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. ఈ నివేదికను సమర్పించిన అనంతరం, దీని ప్రాతిపదికన బ్యాంకింగ్ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలు మరింత పటిష్టంగా రూపుదిద్దుకునే వీలుంది. మొండి బాకీల భారం తీవ్రం... భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఇటీవలి ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వయంగా ప్రకటించిన విషయం గమనార్హం. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలకు, కామత్ కమిటీ ఇవ్వనున్న నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఎన్‌బీఎఫ్‌సీల దివాలా ప్రక్రియకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: బ్యాంకులు కాకుండా వ్యవస్థాగతంగా కీలకమైన ఇతరత్రా ఆర్థిక సేవల సంస్థల(ఎఫ్ఎస్పీ) దివాలా ప్రక్రియ, మూసివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ వీటిని నోటిఫై చేసింది. దివాలా కోడ్‌లోని సెక్షన్ 227 ప్రకారం.. వ్యవస్థాగతంగా ఏయే ఎఫ్‌ఎస్‌పీలు కీలకమైనవి, ఏవి ఆ పరిధిలోకి రావన్నది కేంద్ర ప్రభుత్వం కేటగిరీల వారీగా నిర్ణయిస్తుంది. ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు సంక్షోభంలో ఉన్న ఎఫ్‌ఎస్‌పీల దివాలా ప్రక్రియ గురించి నోటిఫై కూడా చేయొచ్చు. దివాలా ప్రక్రియ కింద చర్యలెదుర్కొనే ఎఫ్‌ఎస్‌పీల నిర్వహణకు సంబంధించి నియంత్రణ సంస్థ ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటర్‌ను నియమిస్తుంది. అలాగే, సదరు సంస్థ నిర్వహణలో తగు సలహాలు, సూచనలు చేసేందుకు సలహాదారు కమిటీని కూడా ఏర్పాటు చేయొచ్చు. బ్యాంకులు, ఇతర ఎఫ్ఎస్పీలకు సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలను రూపొందించే దాకా ఈ తాత్కాలిక మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, కార్పొరేట్ రుణగ్రహీతలకు పూచీకత్తు ఇచ్చిన వ్యక్తిగత గ్యారంటార్లకు సంబంధించి దివాలా చట్ట నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. -
మెరుగైన రిస్క్ టూల్స్‌ను అనుసరించాలి
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) మెరుగైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని ఆర్బీఐ కోరింది. అలాగే, నిర్దేశించిన లిక్విడిటీ కవరేజీ రేషియో (నిధుల నిర్వహణ నిష్పత్తి)కు అనుగుణంగా తగినంత నిధులను కలిగి ఉండాలని ఆదేశించింది. రూ.10,000 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తులను కలిగిన ఎన్బీఎఫ్సీలు, అలాగే, డిపాజిట్లను స్వీకరించని అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి నూతన నిబంధనలను ఆర్బీఐ ఇటీవలే విడుదల చేసింది. నూతన నిబంధనలను 2020 డిసెంబర్ నుంచి కచ్చితంగా ఆచరించాలని నిర్దేశించింది. లిక్విడిటీ కవరేజీ రేషియోలో కనీసం 50 శాతం అధిక నాణ్యతతో కూడిన లిక్విడిటీ ఆస్తులను కలిగి ఉండాలని, 2024 డిసెంబర్ నాటికి 100%కి దీన్ని తీసుకెళ్లాలని ఆర్బీఐ పేర్కొంది. పారితోషికంపై కొత్త నిబంధనలు: విదేశీ, ప్రైవేటు, స్మాల్ ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకుల్లో హోల్‌టైమ్ డైరెక్టర్లు, సీఈవోలకు చెల్లించే పారితోషికం విషయమై ఆర్బీఐ కొత్త నిబంధనలు తెచ్చింది. వేరియబుల్ పే (పనితీరు ఆధార చెల్లింపులు)ల్లో నగదు పరిమాణం 67 శాతానికి మించరాదని నిర్దేశించింది. ఉద్యోగులకు సంబంధించి సమగ్ర చెల్లింపుల విధానాన్ని బ్యాంకులు రూపొందించుకోవాలని, వార్షికంగా వాటిని సమీక్షించాలని పేర్కొంది. -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.10,749 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో అతి పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.10,749 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గతేడాది ఇదే క్వార్టర్లో లాభం, రూ.6,097 కోట్లుతో పోల్చితే 76% వృద్ధి సాధించామని హెచ్డీఎఫ్సీ తెలిపింది. గృహ్ ఫైనాన్స్‌లో వాటా విక్రయం, అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్ ఆదాయం బాగా పెరగడం, పన్ను భారం తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. ఆదాయం రూ.22,951 కోట్ల నుంచి రూ.32,851 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 18 శాతం రుణ వృద్ధి...: పన్ను భారం రూ.1,022 కోట్ల నుంచి రూ.569 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో రూ.6 కోట్లుగా ఉన్న డివిడెండ్ ఆదాయం ఈ క్యూ2లో 186 రెట్లు ఎగసి రూ.1,074 కోట్లకు పెరిగింది. 18% రుణ వృద్ధి సాధించామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధితో రూ.3,078 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లో ఎలాంటి మార్పు లేకుండా 3.3 శాతం రేంజ్‌లోనే ఉంది. స్థూల మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా 1.29% నుంచి స్వల్పంగా 1.33%కి పెరిగాయని వివరించింది. కేటాయింపులు గత క్యూ2లో రూ.890 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.754 కోట్లకు తగ్గాయని తెలిపింది. స్టాండ్అలోన్ లాభం...61 శాతం అప్.... స్టాండ్అలోన్ పరంగా నికర లాభం రూ.2,467 కోట్ల నుంచి 61 శాతం వృద్ధితో రూ.3,962 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.11,257 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.13,494 కోట్లకు పెరిగింది. గృహ్ ఫైనాన్స్ కంపెనీని బంధన్ బ్యాంక్‌కు విక్రయించడం వల్ల రూ.1,627 కోట్ల పన్నుకు ముందు లాభాలు వచ్చాయని తెలిపింది. బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేర్ 2.4 శాతం లాభంతో రూ.2,181 వద్ద ముగిసింది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టకాలం..
న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు చాలా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. ఇటు రుణాలకు డిమాండ్ తగ్గి అటు నిధుల సమీకరణ కష్టతరంగా మారడంతో జూన్ త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీల రుణ మంజూరు వృద్ధి రేటు గణనీయంగా క్షీణించి ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆటో మొబైల్, రియల్ ఎస్టేట్, నాన్–రిటైల్ రంగాల్లో డిమాండ్ మందగించడం కొన్ని ఎన్బీఎఫ్సీలపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం చూపించిందన్న అంచనాలు ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం మీద పరిశ్రమ రుణ వృద్ధి 15 శాతమే ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. 2017 మార్చి తర్వాత ఇది కనిష్ట స్థాయి. ‘అంతటా మందగమనం కనిపిస్తోంది. నిధులపరమైన కొరతే కాకుండా రుణాలు తీసుకునే విభాగాల్లో కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్, రియల్టీ రంగాల్లో మందగమనం ఎన్బీఎఫ్సీ రుణ వృద్ధిపై ప్రతికూలంగా ఉండొచ్చు‘ అని మోతీలాల్ ఓస్వాల్ సంస్థలో ఎన్బీఎఫ్సీ విశ్లేషకుడు అల్పేష్ మెహతా చెప్పారు. గతేడాది సెప్టెంబర్ నుంచి వాహన దిగ్గజాల అమ్మకాలు మందగించాయి. ఈ ఏడాది మేలో మారుతీ సుజుకీ ఉత్పత్తిని సుమారు 18% తగ్గించుకుంది. డిమాండ్ బలహీనంగా ఉండటంతో ఉత్పత్తిలో కోత విధించుకోవడం వరుసగా ఇది 4వ నెల. కొన్నే మెరుగ్గా.. అయితే హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ వంటి బలమైన మాతృసంస్థలున్న ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గానే ఉండొచ్చని అంచనా. మిగతా ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే వీటికి బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటి నుంచి పుష్కలంగా నిధుల లభ్యత ఉండటమే ఇందుకు కారణమని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఎంఏఎస్ ఫైనాన్షియల్, పీఎన్బీ హౌసింగ్ సంస్థల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని, మరోవైపు ఎల్అండ్టీ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. తొలి త్రైమాసికం అంతంత మాత్రమే.. సాధారణంగా తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ ఫైనాన్స్ సంస్థల పనితీరు అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక ఎన్నికలు ఆపై మందగమనం తదితర కారణాల వల్ల ఆ సంస్థల రుణాల పోర్ట్‌ఫోలియోల విశేషాలను త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ‘ఆటో, హౌసింగ్ లోన్స్ సంస్థలకు తొలి త్రైమాసికం కాస్త బలహీనంగా ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికల ప్రభావం తోడైంది. రిటైల్ రుణాల్లో మందగమనం, డెవలపర్లు సమస్యల్లో ఉండటం వంటి అంశాలు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు‘ అని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. ఇక, సాధారణంగా గృహ రుణాల మెచ్యూరిటీ గడువు అనేక సంవత్సరాల పాటు, కొన్ని సార్లు కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు ఆస్తులు, అప్పుల మధ్య సమన్వయం పాటించడం కష్టతరంగా మారుతోంది. ఈ సంస్థలు స్వల్పకాలిక రుణాలు తీసుకొచ్చుకుని.. దీర్ఘకాలిక ప్రాతిపదికన రిటైల్ రుణాలు ఇస్తున్నాయి. అయితే, ఇన్ఫ్రా రుణాల దిగ్గజం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గతేడాది సెప్టెంబర్‌లో డిఫాల్ట్ అయినప్పట్నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులు దొరకడమే గగనంగా మారింది. డీహెచ్ఎఫ్ఎల్ విషయమే తీసుకుంటే భారీ ప్రొవిజనింగ్ చేయాల్సి రావడం, రుణ వితరణ తగ్గడంతో మార్చి త్రైమాసికంలో రూ. 2,223 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. ఎన్‌బీఎఫ్‌సీలకు మరిన్ని రుణాలతో బ్యాంకులకు సమస్యలు ఆర్బీఐ ప్రతిపాదనలపై ఫిచ్ హెచ్చరిక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), రిటైల్ రుణ గ్రహీతలకు బ్యాంకులు మరిన్ని రుణాలు పంపిణీ చేసే దిశగా ఆర్బీఐ ఇటీవల తీసుకున్న పలు చర్యలు అంతిమంగా బ్యాంకింగ్ రంగానికి సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం బారిన పడిన తర్వాత నుంచి ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో... ఈ రంగానికి ఉపశమనం కల్పించే పలు నిర్ణయాలను ఆర్బీఐ ఎంపీసీ ఈ నెల మొదటి వారంలో ప్రకటించింది. ఇందులో బ్యాంకుల టైర్1 మూలధనంలో 15 శాతం వరకు ఒక ఎన్బీఎఫ్సీ సంస్థకు నిధులు సమకూర్చవచ్చన్న పరిమితిని 20 శాతానికి పెంచింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు ఎన్బీఎఫ్సీ ఇచ్చే రుణాలను ప్రాధాన్యం రంగ రుణాలుగా పరిగణించడం, కన్జ్యూమర్ రుణాల రిస్క్ వెయిటేజీని 125 శాతం నుంచి 100 శాతానికి తగ్గించడం జరిగింది. మందగమన సంకేతాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి రుణ వితరణ పెరిగేలా చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఫిచ్ అభివర్ణించింది. అయితే, ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్ రిస్కును అంగీకరించాల్సి వస్తుందని ఫిచ్ తెలిపింది. అంతర్జాతీయంగా ఎన్‌బీఎఫ్‌సీలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానతకు చెక్ పెట్టాలన్న ప్రయత్నాలకు, భారత్‌లో తాజా చర్యలు వైరుధ్యంగా ఉన్నట్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలు బ్యాంకులకు కూడా పాకుతాయని హెచ్చరించింది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట..
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అత్యుత్తమ రేటింగ్ ఉన్న అసెట్స్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్‌టైమ్ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల మేర విలువ చేసే ఎన్‌బీఎఫ్‌సీల అసెట్స్ కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం వన్‌టైమ్ ప్రాతిపదికన పాక్షికంగా హామీనిస్తుంది. ఒకవేళ నష్టం వాటిల్లితే 10 శాతం దాకా హామీ ఉంటుంది‘ అని మంత్రి తెలిపారు. వినియోగ డిమాండ్‌ను నిలకడగా కొనసాగించడంలోనూ, చిన్న..మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చడంలోను ఎన్ బీఎఫ్సీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు డిఫాల్టు అయినప్పట్నుంచీ ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంటున్నాయి. అయినప్పటికీ వాటి నియంత్రణ విషయంలో ఆర్బీఐకి పరిమిత స్థాయిలోనే అధికారాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ బీఎఫ్సీలను ఆర్బీఐ మరింత పటిష్టంగా నియంత్రించే విధంగా ఫైనాన్స్ బిల్లులో మరిన్ని చర్యలుంటాయని సీతారామన్ తెలిపారు. డీఆర్ఆర్ తొలగింపు.. పబ్లిక్ ఇష్యూల ద్వారా ఎన్బీఎఫ్సీలు నిధుల సమీకరణకు సంబంధించి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ (డీఆర్ఆర్) నిబంధనను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం డెట్ పబ్లిక్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించే ఎన్బీఎఫ్సీలు డీఆర్ఆర్ కింద కొంత మొత్తాన్ని పక్కన పెట్టడంతో పాటు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా స్పెషల్ రిజర్వ్ కింద మరికాస్త పక్కన పెట్టాల్సి ఉంటోంది. మరోవైపు, గృహ రుణాల రంగంపై నియంత్రణాధికారాలను ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్బీఐకి బదలాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆమె వివరించారు. పెన్షను రంగ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ట్రస్టును విడదీయనున్నట్లు తెలిపారు. -
కొత్త సర్కారుకు.. సవాళ్ల స్వాగతం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి పలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. మందగమనానికి అడ్డుకట్ట వేయడం, ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవడం, మొండిబాకీల సమస్యల నుంచి బ్యాంకులను గట్టెక్కించడం మొదలైన వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని వివరించారు. అలాగే కంపెనీల కోసం స్థల సమీకరణ నిబంధనలను సరళతరం చేయడం, కార్మిక సంస్కరణలు చేపట్టడంతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం ఎదుర్కొంటున్న నిధుల సమస్యలను తీర్చడమూ కీలకమని పేర్కొన్నారు. అటు కరెంటు అకౌంటు లోటు (సీఏడీ)ని కట్టడి చేయడంతో పాటు ఉద్యోగార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా దృష్టి సారించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అమలు చేస్తున్న వస్తు, సేవల పన్నులు, దివాలా చట్టం వంటి సంస్కరణల నుంచి ప్రజలకు తక్షణ ప్రయోజనాలు అందించేందుకు కేంద్రం ప్రయత్నించాల్సి ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ విభాగం చీఫ్ ఎకానమిస్ట్ షాన్ రోష్ చెప్పారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అసెట్ క్వాలిటీ సమస్యలను పరిష్కరించడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో నెలకొన్న ఒత్తిళ్లను తొలగించడంపైనా కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ‘ప్రైవేట్ రంగానికి నిధులను అందుబాటులోకి తెచ్చేందుకు, వృద్ధికి ఊతమిచ్చేలా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటివి దోహదపడతాయి‘ అని రోష్ తెలిపారు. వృద్ధి రేటు మందగించడానికి అడ్డుకట్ట వేయాలని, ద్రవ్యోల్బణాన్ని ఎగదోయకుండా దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలు రూపొందించాలని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ దేవేంద్ర పంత్ తెలిపారు. ఆర్థిక స్థిరత్వా న్ని దెబ్బ తీయకుండా ప్రభుత్వ పెట్టుబడుల వ్యూ హాలు ఉండాలని, వ్యవసాయ రంగంలో ఒత్తిడిని తొలగించేందుకు, ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. క్యాడ్ కట్టడి కీలకం.. వాణిజ్య యుద్ధభయాలు, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటం, ఎగుమతులు మందగిస్తుండటం వంటి అంశాల కారణంగా కరెంటు ఖాతా లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం పడుతోందని పీడబ్ల్యూసీ ఇండియా లీడర్ (పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ విభాగం) రాణెన్ బెనర్జీ చెప్పారు. దీన్ని కట్టడి చేయడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా ఉంటుందని వివరించారు. దేశంలోకి విదేశీ మారకం రాక, పోక మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తారు. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 2.5 శాతానికి (దాదాపు 16.9 బిలియన్ డాలర్లు) పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఇది జీడీపీలో 2.1 శాతంగా (13.7 బిలియన్ డాలర్లు)గా ఉంది. వాణిజ్య యుద్ధాల నుంచి ప్రయోజనం పొందాలి... అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న పరిస్థితులను భారత్ తనకు అనుకూలంగా మల్చుకోవడంపై దృష్టి పెట్టాలని రోష్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఇతర దేశాలతో దీటుగా పోటీపడేం దుకు పటిష్టమైన సంస్కరణల ఎజెండా అమలు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇక ప్రభుత్వ వ్యయాల్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుందని బెనర్జీ చెప్పారు. ఆదాయాలు అంచనాలను అందుకోకపోవడం, కొత్తగా ప్రకటించిన మరిన్ని సంక్షేమ పథకాలు మొదలైన వాటి కారణంగా ద్రవ్య లోటుపరమైన ఒత్తిళ్లు పెరగవచ్చని తెలిపారు. మరోవైపు ఎకానమీలో డిమాండ్‌కు ఊతమివ్వడం, పెట్టుబడుల సెంటిమెంట్‌ను మెరుగుపర్చడమనేవి కొత్త ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యాలని ఈవై ఇండియా చీఫ్ పాలసీ సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. స్వల్పకాలికంగా చూస్తే ఇటు వినియోగం, అటు పెట్టుబడుల డిమాండ్ .. రెండింటికీ ఊతమిచ్చే చర్యలు అవసరమని చెప్పారు. రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం, ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన నిధులను ముందస్తుగా సమీకరించుకోవడం, పూర్తి ఏడాది బడ్జెట్ తేదీలను ముందుకు జరపడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంటుందని శ్రీవాస్తవ తెలిపారు. -
ద్రవ్య లభ్యతపై ఆర్బీఐ ప్రత్యేక దృష్టి!
చెన్నై: బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) సహా ఫైనాన్షియల్ సంస్థలకు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి, తగిన సూచనలు చేయడానికి ఆర్బీఐలోనే అంతర్గతంగా ప్రత్యేక విభాగాన్ని (కేడర్) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం నేపథ్యంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తీవ్ర నగదు లభ్యత సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ 576వ సెంట్రల్‌బోర్డ్ సమవేశంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తీవ్ర ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గత నెల్లో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఐ. శ్రీనివాస్ వ్యాఖ్యానించడమూ ఈ నిర్ణయానికి నేపథ్యం. ఆర్థిక పరిస్థితిపై చర్చ.. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, సవాళ్లతోపాటు వివిధ అంశాలకు సంబంధించి ఆర్బీఐ కార్యకలాపాలపైనా బోర్డ్ సమావేశంలో చర్చ జరిగింది. నగదు నిర్వహణ, ప్రభుత్వంతో ఆర్బీఐ మధ్య సంబంధాలు వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి. డిప్యూటీ గవర్నర్లు ఎన్ఎస్ విశ్వనాథన్, విరాల్ వీ ఆచార్య, బీపీ కనూంగూ, మహేశ్ కుమార్ జైన్‌లతో పాటు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్లు భరత్ జోషి, సుధీర్ మాన్‌కంద్, మనీష్ సబర్వాల్, సతీష్ మరాథే, స్వామినాథన్ గురుమూర్తి, రేవతీ అయ్యర్, సచిన్ చతుర్వేదిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం తరఫున డైరెక్టర్లు, ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్, ఫైనాన్షియల్ సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు కూడా సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. -
31 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ రద్దు
ముంబై: దాదాపు 31 నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. వీటిలో 27 సంస్థలు బెంగాల్‌కి చెందినవే కావడం గమనార్హం. ఆర్బీఐ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఎన్బీఎఫ్సీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రిజిస్ట్రేషన్ రద్దయిన వాటిల్లో నాలుగు సంస్థలు ఉత్తరప్రదేశ్‌కి చెందినవి ఉన్నాయి. మరోవైపు, ఆయా సంస్థల అభ్యర్ధన మేరకు 17 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. రిజిస్ట్రేషన్ రద్దయిన వాటిల్లో ప్రాపికాన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొదలైనవి ఉన్నాయి. -
ఇన్వర్టర్ల కొనుగోలుకు రుణం
* ఇందుకోసం ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు * రూఫ్ టాప్ సోలార్ విభాగంపై దృష్టి * సుకామ్ ఫౌండర్ కున్వర్ సచ్దేవ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వర్టర్ల విక్రయాల్లో ఉన్న సుకామ్ పవర్ సిస్టమ్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని మార్చికల్లా (ఎన్బీఎఫ్సీ) ఏర్పాటు చేస్తోంది. ఈ కంపెనీ ద్వారా కస్టమర్లకు రుణ సహాయం అందిస్తారు. తక్కువ ఆదాయం గల ఉద్యోగులు, చిన్న వర్తకులకు రుణం ఇవ్వడం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. తొలుత రూ.20 కోట్లతో ఎన్బీఎఫ్సీ ప్రారంభిస్తామని సుకామ్ ఫౌండర్, ఎండీ కున్వర్ సచ్దేవ్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ మొత్తాన్ని పెంచుతూ పోతామన్నారు. రూ.7 వేలలోపు ఉత్పత్తులకే వాయిదా చెల్లింపు (ఈఎంఐ) సౌకర్యం ఉంటుందని చెప్పారు. 150 వీఏ సామర్థ్యం గల ఇన్వర్టర్ను బ్యాటరీతో సహా కంపెనీ రూ.6 వేలకే విక్రయిస్తోంది. 500 కేవీఏ సామర్థ్యం గల ఇన్వర్టర్ను అభివృద్ధి చేస్తోంది. భారత ఇన్వర్టర్లదే.. అభివృద్ధి చెందిన దేశాల్లో భారతీయ కంపెనీల ఇన్వర్టర్ల హవా నడుస్తోంది. సుకామ్, లూమినస్, మైక్రోటెక్ వంటి కంపెనీలు ఎగుమతుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. సుమారు రూ.400 కోట్ల విలువైన ఇన్వర్టర్లు ఎగుమతి అవుతున్నట్టు సమాచారం. సుకామ్ 70 దేశాలకు ఇన్వర్టర్లను సరఫరా చేస్తోంది. ఇన్వర్టర్లు, బ్యాటరీలతో కలిపి 2014-15లో రూ.150 కోట్లు ఎగుమతుల ద్వారా వస్తుందని ఆశిస్తోంది. కాగా, భారత్‌లో ఇన్వర్టర్ల విపణి రూ.4,000 కోట్లు, బ్యాటరీల మార్కెట్ రూ.10,000 కోట్లకుపైగా ఉంది. సౌర విద్యుత్‌పై.. భవిష్యత్ సౌర విద్యుత్‌దేనని కున్వర్ సచ్దేవ్ తెలిపారు. రూఫ్‌టాప్ సోలార్ విభాగంపై పెద్ద ఎత్తున దృష్టిసారించినట్టు చెప్పారు. ‘గుర్గావ్లో మెట్రో స్టేషన్లతో పాటు డీఎల్ఎఫ్ భవనంపైన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.7కు విక్రయిస్తున్నాం. ఈ ధర వస్తే ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి ప్రాజెక్టులు చేపడతాం’ అని తెలిపారు. నెట్ మీటరింగ్ అమలైతేనే భారత్‌లో సౌర విద్యుత్ విజయవంతం అవుతుందని అన్నారు. 2014-15లో సోలార్ ద్వారా రూ.300 కోట్లు ఆశిస్తున్నట్టు చెప్పారు. టర్నోవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ.1,200 కోట్లను కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. సోలార్ ప్యానెళ్ల తయారీ ప్లాంటును హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డి వద్ద ఏప్రిల్‌కల్లా నెలకొల్పుతోంది. తమిళనాడులో ఇన్వర్టర్లు, బ్యాటరీ తయారీ ప్లాంటును పెట్టే యోచనలో ఉంది. సుకామ్‌కు ఇప్పటికే నాలుగు ప్లాంట్లున్నాయి. వీటి వార్షిక సామర్థ్యం 15 లక్షల యూనిట్లు.