ముంబై: బ్యాంకుల నుంచి పోటీ తీవ్రతరం అవుతుండటంతో బంగారంపై రుణాలిచ్చే బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరింత దూకుడుగా తమ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. లిక్విడిటీపరంగా సురక్షితమైన బంగారం రుణాలపై అధిక రాబడికి ఆస్కారం ఉండటంతో ప్రస్తుతం చాలా మటుకు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యంకులు గోల్డ్ లోన్ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
ఉదాహరణకు బ్యాంకుల బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో 2021 ఆరి్థక సంవత్సరంలో 89 శాతం ఎగిసి రూ. 60,700 కోట్లకు, ఆ తర్వాత 2022 ఆరి్థక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ. 70,900 కోట్లకు చేరినట్లు వివరించింది. ‘బ్యాంకుల నుంచి తీవ్ర పోటీ నెలకొనడం, పసిడి ధరల్లో భారీ పెరుగుదల అవకాశాలు (గతంలో చూసినంతగా) కనిపించకపోతుండటంతో ఎన్‌బీఎఫ్‌సీలు.. ముఖ్యంగా భారీ స్థాయిలో గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఉన్నవి.. తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు దూకుడుగా వ్యూహాలు అమలు చేయవచ్చు. కార్యకలాపాలను మరింత విస్తరించవచ్చు‘ అని ఏజెన్సీ పేర్కొంది.
మార్జిన్ల విషయంలో రాజీపడినా సరే..
గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీలు తమ కస్టమర్లను పోగొట్టుకోకుండా వీలైన ప్రయత్నాలు అన్నీ చేయ నున్నాయి. అవసరమైతే భారీ రుణాలపై మార్జిన్లను తగ్గించుకోవడంతో పాటు నిబంధనలను సరళతరం చేయడం మొదలైనవి చేసే అవకాశం ఉంది. దీని వల్ల నిర్వహణ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
కోవిడ్ కష్టాలతో వేలం..
కరోనా వైరస్ కష్టకాలం కారణంగా బంగారం రుణ గ్రహీతలకు ఆరి్థక ఇబ్బందులు నెలకొనడం, గతేడాది జూన్–సెపె్టంబర్ మధ్య కాలంలో పసిడి ధరలు 10 శాతం మేర కరెక్షన్‌కు లోనవడం తదితర అంశాల కారణంగా ఎన్‌బీఎఫ్‌సీలు ఏప్రిల్–డిసెంబర్ కాలంలో తనఖా పెట్టిన బంగారాన్ని భారీ స్థాయిలో వేలం వేయాల్సి వచ్చింది. అక్టోబర్ నుంచి పసిడి ధరలు కాస్త స్థిరపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆరి్థక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వేలం విషయంలో పరిస్థితులు కాస్త చక్కబడగలవని నివేదిక అభిప్రాయపడింది. ఎన్‌బీఎఫ్‌సీల్లో పసిడి వేలం భారీగా పెరిగినప్పటికీ.. బ్యాంకుల్లో మాత్రం దీని తీవ్రత అంతగా నమోదు కాలేదని పేర్కొంది. బంగారం విలువపై బ్యాంకులు ఇచ్చే రుణం (ఎల్‌టీవీ) నిష్పత్తి ఎన్‌బీఎఫ్‌సీలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment