బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఉన్న పరిస్థతి
బంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.
ప్రతిపాదిత విధానం
బంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!
అంతరాలు గుర్తించిన ఆర్‌బీఐ
తనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్‌బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment