ఇన్వర్టర్ల కొనుగోలుకు రుణం | Su-Kam to set up NBFC to create market for sub-Rs 7,000 price inverters | Sakshi
Sakshi News home page

ఇన్వర్టర్ల కొనుగోలుకు రుణం

Published Fri, Jan 23 2015 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

ఇన్వర్టర్ల కొనుగోలుకు రుణం

ఇన్వర్టర్ల కొనుగోలుకు రుణం

* ఇందుకోసం ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు
* రూఫ్ టాప్ సోలార్ విభాగంపై దృష్టి
* సుకామ్ ఫౌండర్ కున్వర్ సచ్‌దేవ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వర్టర్ల విక్రయాల్లో ఉన్న సుకామ్ పవర్ సిస్టమ్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని మార్చికల్లా (ఎన్‌బీఎఫ్‌సీ) ఏర్పాటు చేస్తోంది. ఈ కంపెనీ ద్వారా కస్టమర్లకు రుణ సహాయం అందిస్తారు. తక్కువ ఆదాయం గల ఉద్యోగులు, చిన్న వర్తకులకు రుణం ఇవ్వడం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలన్నది కంపెనీ లక్ష్యం.

తొలుత రూ.20 కోట్లతో ఎన్‌బీఎఫ్‌సీ ప్రారంభిస్తామని సుకామ్ ఫౌండర్, ఎండీ కున్వర్ సచ్‌దేవ్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ మొత్తాన్ని పెంచుతూ పోతామన్నారు. రూ.7 వేలలోపు ఉత్పత్తులకే వాయిదా చెల్లింపు (ఈఎంఐ) సౌకర్యం ఉంటుందని చెప్పారు. 150 వీఏ సామర్థ్యం గల ఇన్వర్టర్‌ను బ్యాటరీతో సహా కంపెనీ రూ.6 వేలకే విక్రయిస్తోంది. 500 కేవీఏ సామర్థ్యం గల ఇన్వర్టర్‌ను అభివృద్ధి చేస్తోంది.
 
భారత ఇన్వర్టర్లదే..
అభివృద్ధి చెందిన దేశాల్లో భారతీయ కంపెనీల ఇన్వర్టర్ల హవా నడుస్తోంది. సుకామ్, లూమినస్, మైక్రోటెక్ వంటి కంపెనీలు ఎగుమతుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. సుమారు రూ.400 కోట్ల విలువైన ఇన్వర్టర్లు ఎగుమతి అవుతున్నట్టు సమాచారం. సుకామ్ 70 దేశాలకు ఇన్వర్టర్లను సరఫరా చేస్తోంది. ఇన్వర్టర్లు, బ్యాటరీలతో కలిపి 2014-15లో రూ.150 కోట్లు ఎగుమతుల ద్వారా వస్తుందని ఆశిస్తోంది. కాగా, భారత్‌లో ఇన్వర్టర్ల విపణి రూ.4,000 కోట్లు, బ్యాటరీల మార్కెట్ రూ.10,000 కోట్లకుపైగా ఉంది.
 
సౌర విద్యుత్‌పై..
భవిష్యత్ సౌర విద్యుత్‌దేనని కున్వర్ సచ్‌దేవ్ తెలిపారు. రూఫ్‌టాప్ సోలార్ విభాగంపై పెద్ద ఎత్తున దృష్టిసారించినట్టు చెప్పారు. ‘గుర్గావ్‌లో మెట్రో స్టేషన్లతో పాటు డీఎల్‌ఎఫ్ భవనంపైన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.7కు విక్రయిస్తున్నాం. ఈ ధర వస్తే ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి ప్రాజెక్టులు చేపడతాం’ అని తెలిపారు. నెట్ మీటరింగ్ అమలైతేనే భారత్‌లో సౌర విద్యుత్ విజయవంతం అవుతుందని అన్నారు.

2014-15లో సోలార్ ద్వారా రూ.300 కోట్లు ఆశిస్తున్నట్టు చెప్పారు. టర్నోవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ.1,200 కోట్లను కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. సోలార్ ప్యానెళ్ల తయారీ ప్లాంటును హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డి వద్ద ఏప్రిల్‌కల్లా నెలకొల్పుతోంది. తమిళనాడులో ఇన్వర్టర్లు, బ్యాటరీ తయారీ ప్లాంటును పెట్టే యోచనలో ఉంది. సుకామ్‌కు ఇప్పటికే నాలుగు ప్లాంట్లున్నాయి. వీటి వార్షిక సామర్థ్యం 15 లక్షల యూనిట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement