ముంబై: బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్‌బీఎఫ్‌సీ) సుమారు 42 శాతం సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం తమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎ) 15 శాతం పైగా వృద్ధి చెందుతుందని ఆశాభావంతో ఉన్నట్లు ఇక్రా రేటింగ్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఎన్‌బీఎఫ్‌సీలపై కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావాలను, వాటి భవిష్యత్ అంచనాలను తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ వివరించింది. పరిశ్రమ ఏయూఎంలో 60 శాతం వాటా ఉన్న 65 ఎన్‌బీఎఫ్‌సీలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపింది. చాలా మటుకు ఎన్‌బీఎఫ్‌సీలు తమ ఏయూఎం 10 శాతం దాకా వృద్ధి చెందవచ్చని అంచనా వేసుకుంటున్న నేపథ్యంలో మొత్తం పరిశ్రమ వృద్ధి 7–9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నట్లు ఇక్రా రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ మనుశ్రీ సగ్గర్ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ సెగ్మెంట్‌లో అంతర్గతంగా సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్‌ఐ), చిన్న సంస్థలకు రుణాలిచ్చేవి, అఫోర్డబుల్ హౌసింగ్ రుణాలిచ్చే సంస్థలు మిగతా వాటికన్నా మరింత అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ల సడలింపు, కొత్త కోవిడ్ కేసులు ఒక మోస్తరు స్థాయికి పరిమితం అవుతుండటం, టీకాల ప్రక్రియ పుంజుకోవడం వంటి అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మిగతా భాగంలో గత ఆర్థిక సంవత్సరం కన్నా వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని ఎన్‌బీఎఫ్‌సీలు భావిస్తున్నట్లు ఇక్రా రేటింగ్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment