న్యూఢిల్లీ: బ్యాంకులు కాకుండా వ్యవస్థాగతంగా కీలకమైన ఇతరత్రా ఆర్థిక సేవల సంస్థల(ఎఫ్‌ఎస్‌పీ) దివాలా ప్రక్రియ, మూసివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ వీటిని నోటిఫై చేసింది. దివాలా కోడ్‌లోని సెక్షన్ 227 ప్రకారం.. వ్యవస్థాగతంగా ఏయే ఎఫ్‌ఎస్‌పీలు కీలకమైనవి, ఏవి ఆ పరిధిలోకి రావన్నది కేంద్ర ప్రభుత్వం కేటగిరీల వారీగా నిర్ణయిస్తుంది. ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు సంక్షోభంలో ఉన్న ఎఫ్‌ఎస్‌పీల దివాలా ప్రక్రియ గురించి నోటిఫై కూడా చేయొచ్చు.
దివాలా ప్రక్రియ కింద చర్యలెదుర్కొనే ఎఫ్‌ఎస్‌పీల నిర్వహణకు సంబంధించి నియంత్రణ సంస్థ ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటర్‌ను నియమిస్తుంది. అలాగే, సదరు సంస్థ నిర్వహణలో తగు సలహాలు, సూచనలు చేసేందుకు సలహాదారు కమిటీని కూడా ఏర్పాటు చేయొచ్చు. బ్యాంకులు, ఇతర ఎఫ్‌ఎస్‌పీలకు సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలను రూపొందించే దాకా ఈ తాత్కాలిక మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు, కార్పొరేట్ రుణగ్రహీతలకు పూచీకత్తు ఇచ్చిన వ్యక్తిగత గ్యారంటార్లకు సంబంధించి దివాలా చట్ట నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎన్‌బీఎఫ్‌సీల దివాలా ప్రక్రియకు మార్గదర్శకాలు
Published Sat, Nov 16 2019 5:14 AM | Last Updated on Sat, Nov 16 2019 5:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment