
ముంబై: దాదాపు 31 నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. వీటిలో 27 సంస్థలు బెంగాల్‌కి చెందినవే కావడం గమనార్హం. ఆర్‌బీఐ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
రిజిస్ట్రేషన్ రద్దయిన వాటిల్లో నాలుగు సంస్థలు ఉత్తరప్రదేశ్‌కి చెందినవి ఉన్నాయి. మరోవైపు, ఆయా సంస్థల అభ్యర్ధన మేరకు 17 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. రిజిస్ట్రేషన్ రద్దయిన వాటిల్లో ప్రాపికాన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మొదలైనవి ఉన్నాయి.