న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అత్యుత్తమ రేటింగ్ ఉన్న అసెట్స్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్‌టైమ్ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల మేర విలువ చేసే ఎన్‌బీఎఫ్‌సీల అసెట్స్ కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం వన్‌టైమ్ ప్రాతిపదికన పాక్షికంగా హామీనిస్తుంది.
ఒకవేళ నష్టం వాటిల్లితే 10 శాతం దాకా హామీ ఉంటుంది‘ అని మంత్రి తెలిపారు. వినియోగ డిమాండ్‌ను నిలకడగా కొనసాగించడంలోనూ, చిన్న..మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చడంలోను ఎన్ బీఎఫ్‌సీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు డిఫాల్టు అయినప్పట్నుంచీ ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీలు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంటున్నాయి. అయినప్పటికీ వాటి నియంత్రణ విషయంలో ఆర్‌బీఐకి పరిమిత స్థాయిలోనే అధికారాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ బీఎఫ్‌సీలను ఆర్‌బీఐ మరింత పటిష్టంగా నియంత్రించే విధంగా ఫైనాన్స్ బిల్లులో మరిన్ని చర్యలుంటాయని సీతారామన్ తెలిపారు.
డీఆర్‌ఆర్ తొలగింపు..
పబ్లిక్ ఇష్యూల ద్వారా ఎన్‌బీఎఫ్‌సీలు నిధుల సమీకరణకు సంబంధించి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ (డీఆర్‌ఆర్) నిబంధనను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం డెట్ పబ్లిక్ ప్లేస్‌మెంట్ ద్వారా నిధులు సమీకరించే ఎన్‌బీఎఫ్‌సీలు డీఆర్‌ఆర్ కింద కొంత మొత్తాన్ని పక్కన పెట్టడంతో పాటు ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా స్పెషల్ రిజర్వ్ కింద మరికాస్త పక్కన పెట్టాల్సి ఉంటోంది. మరోవైపు, గృహ రుణాల రంగంపై నియంత్రణాధికారాలను ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్‌బీఐకి బదలాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆమె వివరించారు. పెన్షను రంగ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ట్రస్టును విడదీయనున్నట్లు తెలిపారు.
ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట..
Published Sat, Jul 6 2019 2:35 AM | Last Updated on Sat, Jul 6 2019 2:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment