ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. అందరి మాటలు విన్నారు. కానీ ఎవ్వరి మాటను మన్నించినట్లు కనిపించలేదు. భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం నుంచి భారీ సంస్కరణలే ఉంటాయనుకున్న మార్కెట్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నిధుల కొరతతో ఎన్‌బీఎఫ్‌సీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, వినియోగం రంగంలో మందగమనం చోటు చేసుకొని వాహన ఇతర కంపెనీలన్నీ కుదేలై ఉండగా, ఆదుకునే చర్యలుంటాయని అందరూ అంచనా వేశారు.
సెన్సెక్స్ ప్రారంభం: 39,990
సెన్సెక్స్ గరిష్టం : 40,032
సెన్సెక్స్ కనిష్టం : 39,441
సెన్సెక్స్ ముగింపు : 39,513
ఈ అంచనాలకు భిన్నంగా సీతమ్మ బడ్జెట్ ఉండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఒక్క బ్యాంక్ షేర్లు మినహా, మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ఇది చెత్త బడ్జెట్ కానప్పటికీ, సంపన్నులపై అధిక పన్ను విధింపు, 20 శాతం షేర్ల బైబ్యాక్ ట్యాక్స్, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని నిపుణులంటున్నారు. మరిన్ని వివరాలు...
బడ్జెట్‌పై ఆశావహ అంచనాలతో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారీ సంస్కరణలను ఆశిస్తూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 11,950 పాయింట్లను అధిగమించాయి. బడ్జెట్‌కు ముందే సెన్సెక్స్ 124 పాయింట్ల లాభంతో 40,032 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఆరంభమైనప్పటి నుంచి నష్టాలు ఆరంభమయ్యాయి.
ప్రసంగం పూర్తయ్యేంత వరకూ పరిమిత శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్, నిఫ్టీలు ఆ తర్వాత భారీ నష్టాల దిశగా సాగాయి. మధ్యలో ఒకింత కోలుకున్నప్పటికీ, ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 149 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్395 పాయింట్లు పతనమై 39,513 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 136 పాయింట్లు క్షీణించి 11,811 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది.
సానుకూలతలున్నా క్షీణతే..
బడ్జెట్‌ప్రతిపాదనలకు ముందు 40 వేల పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్, బడ్జెట్ తర్వాత ఆ జోరును కొనసాగించలేక చతికిలపడింది. ఆప్షన్ల ట్రేడింగ్‌కు సంబంధించి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ) విషయంలో ఒకింత ఊరట లభించడం, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు రూ.70,000 కోట్ల మూలధన నిధులందడం, మౌలిక రంగానికి భారీగా నిధులు కేటాయించడం వంటి సానుకూల చర్యలున్నప్పటికీ, ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. డాలర్‌తో రూపాయి మారకం నష్టాల నుంచి రికవరీ అయినా కూడా మన మార్కెట్ నష్టపోయింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది ఫిబ్రవరి 1న సెన్సెక్స్ 3,044 పాయింట్లు, నిఫ్టీ 918 పాయింట్లు చొప్పున లాభపడటం విశేషం. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 119 పాయింట్లు, నిఫ్టీ 22 పాయింట్లు చొప్పున పెరిగాయి.
మరిన్ని విశేషాలు..
► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో 25 షేర్లు నష్టాల్లో ముగియగా, ఆరు షేర్లు– ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభపడ్డాయి.
► యస్ బ్యాంక్ షేర్ 8.3 శాతం నష్టంతో రూ.88 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరె¯Œ ్స, బజాజ్ ఫైనాన్ ్స, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
పతనానికి పంచ కారణాలు..
పబ్లిక్ హోల్డింగ్ 35 శాతానికి పెంపు...
స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన స్టాక్ మార్కెట్‌ను పడగొట్టింది. ఇప్పటికే ఓవర్‌బాట్ పొజిషన్‌లో ఉన్న మార్కెట్లో ఈ ప్రతిపాదన కారణంగా విక్రయ ఆఫర్లు వెల్లువెత్తుతాయనే భయాలతో సెన్సెక్స్,నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. 25% పబ్లిక్ హోల్డింగ్ నిబంధననే ఇప్పటిదాకా పలు ప్రభుత్వ రంగ కంపెనీలు అమలు చేయలేకపోయాయి. మరోవైపు ఈ నిబంధన కారణంగా మల్టీ నేషనల్ కంపెనీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి మొగ్గుచూపుతాయని నిపుణులంటున్నారు. మార్కెట్లో ఈ నిబంధన పెను కలకలమే సృష్టించింది.
20 శాతం బైబ్యాక్ ట్యాక్స్
డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్‌ట్యాక్స్(డీడీటీ)ను పలు కంపెనీలు ఎగవేసి షేర్ల బైబ్యాక్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో షేర్ల బైబ్యాక్‌ను నిరుత్సాహపరచడానికి 20 శాతం బైబ్యాక్ ట్యాక్స్‌ను విధించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. వాటాదారులు కొనుగోలు చేసిన ధరను కాకుండా కంపెనీ ప్రకటించే బైబ్యాక్ ధర నుంచి ఇష్యూ ధరను తీసివేసి వచ్చిన దానిపై 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు. దీంతో కంపెనీలపై భారీగా పన్ను భారం పడుతుందని, ఫలితంగా కంపెనీలు షేర్ల బైబ్యాక్‌లు ప్రకటించవని నిపుణులంటున్నారు. .
సంపన్నులపై అధిక పన్ను
రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు, రూ.5 కోట్లకు మించిన పన్ను ఆదాయం గల సంపన్నులపై సర్‌చార్జీని పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దీంతో ఈ రెండు కేటగిరీల సంపన్నుల పన్ను 3–7 శాతం రేంజ్‌లో పెరగనున్నది. సంపన్నులపై అధిక పన్ను విధించడం తప్పు కాకపోయినా, మొత్తం వారు చెల్లించాల్సిన పన్ను 42 శాతానికి పెరగడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
భారీ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ.90,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు పెంచే ప్రతిపాదన కారణంగా మార్కెట్లో లిక్విడిటీ ఇబ్బందులు తలెత్తుతాయన్న భయందోళనలు నెలకొన్నాయి.
పెట్రోల్, లోహాలపై ఎక్సైజ్ సుంకం
మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన భారీ నిధుల కోసం రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో ఒక్కో లీటర్ పెట్రోల్, డీజిల్‌లపై రూ. 1 అదనపు సుంకం విధించారు. పుత్తడి వంటి విలువైన లోహాలపై ప్రస్తుతమున్న కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం ప్రతికూల ప్రభావం చూపించాయి.
రూ.2.2 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.22 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,22,580 కోట్లు తగ్గి రూ.151,35,496 కోట్లకు పడిపోయింది.
అధికాదాయం ఆర్జించే వర్గాలపై పన్ను విధించడం, భారీగా నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కారణంగా సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తగ్గనుండటం, ఇక కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, తదితర ప్రతిపాదనల వల్ల స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది...
– అమర్ అంబానీ, యస్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment