కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ మార్కెట్ వర్గాల అంచనాలకనుగుణంగా లేకపోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మన దేశంలో కరోనా కేసులు ఒక్క రోజులో అత్యధికంగా పెరగడం, లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం...ప్రతికూల ప్రభావమే చూపించాయి. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉన్నా, మన మార్కెట్లో మాత్రం నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 1,069 పాయింట్లు పతనమై 30,029 వద్ద, నిఫ్టీ 314 పాయిం ట్లు నష్టపోయి 8,823 వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి.
1,280 పాయింట్ల రేంజ్‌లో...
ఆసియా మార్కెట్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం ట్రేడింగ్‌లోనే నిఫ్టీ 9,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత ఒకింత రికవరీ కనిపించినా, చివరి అరగంటలో అమ్మకాలు మరింతగా వెల్లువెత్తాయి. ఒక దశలో 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 1,130 పాయింట్లకు పడిపోయింది. మొత్తం మీద రోజంతా 1,280 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పాటు పొడిగించడంతో పొజిషన్లు తీసుకునే విషయమై ట్రేడర్లు ఆచి, తూచి వ్యవహరించారు. ఆర్థిక, వాహన, రియల్టీ, లోహ, ఆయిల్, గ్యాస్ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. రూపాయి మారకం విలువ పతనం కావడంతో ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఫార్మా సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.
మరిన్ని విశేషాలు...
► ఇండస్‌ఇండ్ బ్యాంక్ 10 శాతం నష్టంతో రూ.377 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► సెన్సెక్స్ 30 షేర్లలో రెండు షేర్లు–టీసీఎస్, ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడగా, మిగిలిన 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
► బకాయిల చెల్లింపుల్లో విఫలమైనప్పటికీ, రుణగ్రస్తులపై ఏడాది పాటు దివాలా చర్యలు తీసుకోకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంక్, ఆర్థిక రంగ, ఎన్‌బీఎఫ్‌సీ. హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 12 శాతం వరకూ నష్టపోయాయి.
► దాదాపు 140కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. పీవీఆర్, ఐనాక్స్ విండ్, ఐనాక్స్ లీజర్, షాపర్స్ స్టాప్, ప్రెస్టీజ్ ఎస్టేట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అలెంబిక్ ఫార్మా, ఇండియా సిమెంట్స్... ఈ రెండు షేర్లు మాత్రమే ఏడాది గరిష్టాలకు ఎగిశాయి.
► 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. స్పైస్‌జెట్, ఎన్‌బీసీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► వెంటిలేటర్ల తయారీకి సిద్ధమవుతోందన్న వార్తలతో జెన్ టెక్నాలజీస్ షేర్ 10% లాభంతో రూ.37 వద్ద ముగిసింది.
► బొగ్గు మైనింగ్‌లో ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించడంతో ఇప్పటివరకూ ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉన్న కోల్ ఇండియా షేర్ 6 శాతం మేర నష్టంతో రూ. వద్ద ముగిసింది.
► రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడంతో రక్షణ రంగ కంపెనీలు లాభపడ్డాయి.
రూ.3.65 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.3.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ విలువ రూ. 3,65,470 కోట్ల మేర హరించుకుపోయి రూ.119 లక్షల కోట్లకు పడిపోయింది.
నష్టాలు ఎందుకంటే...
ప్యాకేజీ.. పైన పటారం.. లోన లొటారం!
ఆర్థిక ప్యాకేజీ 2.0... పైన పటారం... లోన లొటారం చందంగా ఉందని నిపుణులంటున్నారు. భారీగా నిధుల వరద పారేలా ప్యాకేజీ ఉంటుందన్న అంచనాలన్నీ తప్పాయని వారంటున్నారు. తక్షణం డిమాండ్‌ను, వినియోగాన్ని పెంచేలా ఉద్దీపన చర్యలు లేకపోవడంతో సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషకులంటున్నారు. పేరుకే ఇది రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, వాస్తవంగా ప్రభుత్వానికి ఖర్చయ్యేది రూ.2.02 లక్షల కోట్లు మాత్రమేనని వారంటున్నారు. జీడీపీలో 10 శాతానికి సమానమైన ప్యాకేజీని... రూ.20 లక్షల కోట్ల మేర అందిస్తామని ప్రధాని ప్రకటించినా, వాస్తవిక ప్యాకేజీ ప్రకటించిన ప్యాకేజీలో 10 శాతం మేర ఉండటమే గమనించాల్సిన విషయం.
లాక్‌డౌన్ పొడిగింపు...
లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించడం ప్రతికూల ప్రభావమే చూపించింది. లాక్‌డౌన్‌ను పొడిగించడం ఇది మూడోసారి. లాక్‌డౌన్ 4.0లో కొన్ని వెసులుబాట్లు ఇచ్చినప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం మరింత జాప్యం కాగలదన్న భయాలతో అమ్మకాలు జోరుగా సాగాయి.
కరోనా ఉగ్రరూపం
భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు 96వేలకు, మరణాలు 3,000కు పైగా పెరిగాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 47 లక్షలకు పైగా, మరణాలు 3.15 లక్షలకు చేరాయి.
రూపాయి పతనం
డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు క్షీణించి 75.61కు పడిపోయింది.
60 శాతం తగ్గిన ఎగుమతులు...
గత నెలలో ఎగుమతులు 60% పతనమయ్యాయి.
భారీ లాభాల్లో అమెరికా మార్కెట్
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మానవులపై జరిపిన తొలి దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ ప్రకటించింది. మరోవైపు ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ అభయం ఇచ్చారు. ఈ రెండు అంశాల కారణంగా సోమవారం రాత్రి అమెరికా స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్ మార్కెట్లు 4–6% లాభాల్లో ముగియ గా, రాత్రి 11.30 సమయానికి అమెరికా స్టాక్ సూచీలు 2–3% లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మార్కెట్లు మళ్లీ మునక!
Published Tue, May 19 2020 3:29 AM | Last Updated on Tue, May 19 2020 6:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment