అర్థం ఒకటే!. కానీ ఆర్థికంగా భారత్–ఇండియా వేర్వేరు!! ‘పల్లెలు – పేదలు – రైతులు’... ఇది అత్యధికులుండే భారతమైతే... ‘పట్టణాలు– మధ్యతరగతి – ఉద్యోగులు’ అనే ధోరణి ఇండియాది!! వీటి మధ్య అంతరాన్ని తగ్గించాలనుకున్నారు నిర్మలా సీతారామన్. అందులో భాగమే శుక్రవారం నరేంద్ర మోదీ సమర్పణలో ‘మదర్ ఇండియా’కు బదులు ఆవిష్కరించిన ‘మదర్ భారత్’ బడ్జెట్. మూడేళ్లలో కరెంటు లేని గ్రామమనేదే లేకుండా చేస్తామన్నారు. నాలుగేళ్లలో మంచినీరు అందని పల్లె ఉండదన్నారు. 80వేల కోట్లతో 1,25,000 కిలోమీటర్ల రోడ్లు వేస్తామని... ఐదేళ్లలో ప్రతి ఊరికీ రోడ్డు ఉంటుందని చెప్పారు. దేశ చరిత్రలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ కనక మహిళలకు ఓవర్‌డ్రాఫ్ట్ వంటి వరాలిచ్చారు. అయితే భారత్ కోసం ఇండియాపై చెర్నాకోల ఝుళిపించారు. మధ్య తరగతికి పన్ను ఊరట లేదు సరికదా... ధనికులకు చుర్రుమనిపించారు. రూ.5 కోట్ల వార్షికాదాయం దాటినవారిపై ప్రపంచంలో ఎక్కడా లేనంతగా 42.5% పన్ను బాదేశారు.
లీటరు పెట్రోల్, డీజిల్‌పై రెండు రూపాయల మేర పెంచేశారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని సైతం అదనంగా 2.5% వడ్డించారు. ‘‘అరె! మీరు మహిళలా ఆలోచించరెందుకు? బంగారం ధర అంతలా పెరిగితే ఎలా?’’ అన్న విపక్షాల ప్రశ్నలకు... ‘నేను మహిళనే కానీ.. మంత్రిని’ అనేది ఆమె సమాధానం కావచ్చు. దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి నిర్మల భారీ సంస్కరణలకు తెరలేపారు. విదేశాల నుంచి మరిన్ని రుణాలు తేవటం.. ప్రభుత్వ సంస్థల్లో వాటాలమ్మి రూ.1.05 లక్షల కోట్లు సమీకరించడం.. మీడియా, ఏవియేషన్, యానిమేషన్, బీమా మధ్యవర్తిత్వ వ్యాపారాల్లోకి ఎఫ్‌డీఐలను పెంచటం... రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా ట్రస్టుల్లోకి విదేశీ నిధులు ఆకర్షించడం.. ఇలా ఎన్నో ఆశల్ని కళ్లెదుట పెట్టారు. కాకపోతే ఇవేవీ అంత తేలిగ్గా అయ్యేవి కావు. ‘‘ప్రభుత్వ సంస్థల్లో వాటాలమ్మినా కొనేవారుండాలిగా? అసలంత నాణ్యమైన ప్రభుత్వ సంస్థలెక్కడున్నాయి? ఎఫ్‌డీఐలు ఎందుకొస్తాయ్?’’ అనేది విపక్షాల విమర్శ. అయితే ఎంత నడకైనా ఆరంభమయ్యేది ఒక అడుగుతోనే!!. అదిగో... ఆ మొదటి అడుగు వేస్తూ భారత్‌ను పటిష్ఠ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే చర్యలకు టెంకాయ కొట్టారు నిర్మల. ఈ నడక తీరుతెన్నులను చెప్పేది తదుపరి బడ్జెట్లే!!.
2019–20 బడ్జెట్
ముఖ్యాంశాలివీ
- పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ ప్రతి లీటరుకు ఒక రూపాయి పెంపు.
- ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డునైనా వాడుకునేందుకు వెసులుబాటు.
- సంవత్సరంలో కోటి రూపాయల కంటే ఎక్కువ డబ్బును నగదు రూపంలో బ్యాంకు ఖాతాల నుంచి తీసుకుంటే 2 శాతం టీడీఎస్ (డబ్బు చేతికందక ముందే దానిపై పన్ను) విధింపు.
- బంగారం, ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.5 శాతానికి, స్టెయిన్‌లెస్ స్టీల్‌పై 5 నుంచి 7.5 శాతానికి పెంపు
- బంగారం, ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.5 శాతానికి, స్టెయిన్‌లెస్ స్టీల్‌పై 5 నుంచి 7.5 శాతానికి పెంపు
- స్వయం సహాయక బృందాల్లోని ఒక మహిళకు ముద్ర పథకం కింద రూ. లక్ష వరకు రుణం. మిగతా మహిళలకు రూ. 5వేల వరకు ఓడీ
- చిన్న దుకాణాల వద్ద డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను ఎత్తివేయనున్న ఆర్‌బీఐ, బ్యాంకులు
- అందుబాటు ధరల ఇళ్ల రుణాలపై రూ. 1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపు
- పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం
- రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్యలో ఉంటే పన్ను రేటు 3%. అదే ఆదాయం
- రూ. 5 కోట్లు దాటితే, పన్ను రేటు 7%
- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం చేసిన అప్పుపై చెల్లించే వడ్డీపై రూ. 1.5 లక్షల వరకు పన్ను తగ్గింపు
- రూ. 400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా 25% కార్పొరేట్ పన్ను పరిధిలోకి
Comments
Please login to add a commentAdd a comment