Union Budget 2019
-
అకౌంట్లతో పనిలేదు..
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ జూలై 5వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2019–20 వార్షిక బడ్జెట్లో ఒక లొసుగును సవరించారు. తన బడ్జెట్ ప్రతిపాదనకు ఒక కీలక సవరణను గురువారం తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే... ఒక సంవత్సరంలో ‘ఒక అకౌంట్’ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్‌డ్రాయెల్స్ జరిపితే 2 శాతం మూలం వద్ద పన్ను (టీడీఎస్) విధించాలని జూలై 5 బడ్జెట్ ప్రతిపాదించింది. అయితే ‘రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్ల నుంచి కోటి పైబడిన విత్‌డ్రాయెల్స్ చేస్తే 2 శాతం టీడీఎస్ ఉండదా’ అనే సంశయం పలు వర్గాల నుంచి వ్యక్తమయ్యింది. బడ్జెట్లో ఈ లొసుగును సవరిస్తూ ఆర్థిక మంత్రి 2019 ఫైనాన్స్ బిల్లుకు ఒక సవరణను తీసుకువచ్చారు. దీని ప్రకారం .. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. భారీ నగదు లావాదేవీల నిరోధం లక్ష్యంగా బడ్జెట్లో ఆర్థిక మంతి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. 28 ఇతర సవరణలతోపాటు ఈ ప్రతిపాదనకూ లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మొత్తం పన్ను బకాయిల్లో ఈ టీడీఎస్ కూడా భర్తీ అయ్యే అవకాశాన్నీ తాజా బడ్జెట్ ప్రతిపాదన కల్పిస్తోంది. -
‘కిసాన్ సమ్మాన్’తో రైతులకు అవమానమే
సాక్షి, న్యూఢిల్లీ: కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు మూడు విడతలుగా ఇస్తున్న రూ.6 వేల సాయం రైతులను అవమానించేదిగా ఉందని కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ బడ్జెట్ పద్దులపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ నుంచి ప్రధాన వక్తగా ఉత్తమ్ మాట్లాడారు. ‘2018–19 సంవత్సరానికి గానూ వ్యవసాయానికి బడ్జెట్లో రూ.75,753 కోట్లు కేటాయించి చివరకు 29 శాతం కోత విధించి రూ.53 వేల కోట్ల వ్యయం చేశారు. నేడు దేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. శాస్త్రీయమైన కనీస మద్దతు ధరలు లేకపోవడం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విషయంలో లోపభూయిష్ట విధానాలు, సరైన పంట ల బీమా సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం దుర్భరంగా మారి రోజూ 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో రోజురోజుకూ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరం. ఒక్కో ఏడాది 11 నుంచి 13 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2016 నుంచి రైతు ఆత్మహత్యలపై అధికారిక గణాంకాలు లేకపోవడం విచారకరం’ అని అన్నారు. దేశంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, కౌలు రైతులు వాణిజ్య పంటల వేసుకోవడం వల్ల వారికి పెట్టుబడి అధికమై నష్టాలు వచ్చినపుడు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. దేశంలో కోట్లాది మంది కౌలు రైతులకు ఉపయోగపడేలా ఒక చట్టం తేవాలని, గతంలో ఉమ్మడి ఏపీలో ఇలాంటి కౌలుదారు హక్కుల చట్టం తేవడం జరిగిందని, ఇలాంటి చట్టం దేశంలోనూ తెస్తే కోట్లాది మంది కౌలు రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రైతు ఆదాయం ఎంత పెంచారు? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016–17లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇదే విషయాన్ని ప్రధాని పదే పదే చెప్పారని, కానీ ఈ మూడేళ్ళలో రైతుల ఆదాయం ఎంత పెరిగిందో ఎక్కడా చెప్పడం లేదని ఉత్తమ్ అన్నారు. ఈ మూడేళ్లలో వ్యవసాయ జీడీపీ కానీ, రైతుల ఆదాయం కానీ ఎక్కడ పెరిగిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక సర్వేల్లో ఎక్కడా కూడా రైతు, వ్యవసాయ ఆదాయాలు పెరగలేదని, సున్నా శాతం అభివృద్ధి ఉందని, 2022 నాటికి రైతు ఆదాయం పెరగాలంటే ఆరేళ్ల పాటు ఏటా 13 శాతం పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2014లో ఎన్నికల ముందు బీజేపీ.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని వివరించారు. పత్తి రైతులకు కనీసం రూ.6 వేల మేర కనీస మద్దతు ధర ఇవ్వాలని ఉత్తమ్ కోరారు. పంటల బీమాతో తెలంగాణకు పైసా రాలేదు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్రం తెచ్చిన పథకం రైతులను అవమానపరిచేలా ఉందని ఉత్తమ్ చెప్పారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున, అది కూడా మూడు విడతల కింద ఇస్తుందని పేర్కొన్నారు. అంటే ఐదుగురు సభ్యులున్న కుటుంబంలో ఒక్కొక్కరికి రూ.3.30 వస్తుందని, ఇది రైతులకు ఎలా ఉపయోపడుతుందని ప్రశ్నించారు. కోట్లాది మంది కౌలు దారులు, ఆదివాసీ రైతులు, భూమి లేని పేద రైతులకు ఇది వర్తించడం లేదని అన్నారు. ప్రధానమంత్రి పసల్ భీమా యోజన పథకంలో 50 శాతం మంది రైతులకు పంటల భీమా అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే 25 శాతానికి మించి అందడం లేదన్నారు. తెలంగాణలో పంటలు నష్టపోయిన రైతులకు ఈ పథకం కింద ఒక్క పైసా రాలేదని అన్నారు. ఈ పథకం వల్ల రైతుల కంటే బీమా కంపెనీలకు ఎక్కువ లాభం ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని ఉత్తమ్ చెప్పారు. ఎన్నికల ముందు రాజ్‌నాథ్ సింగ్ వచ్చి నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, వెంటనే అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
జనరంజకం నిర్మల బడ్జెట్
భారత్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభు త్వం బడ్జెట్ ను రూపొందించింది. ఆ మేరకు విధానపరమైన చర్యలను కూడా తీసుకుంది. ఇదంతా కార్పొరేట్లకు సంబంధించిన వ్యవహారం అని, తమకేమీ సంబంధం లేదని చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు అనుకుంటుంటారు. కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం ఆర్థికాభివృద్ధి అంటే కేవలం కార్పొరేట్, పారిశ్రామిక అభివృద్ధి అన్నంతవరకే పరిమితం కాలేదు. దానికి నిదర్శనమే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్. అందులో పేర్కొన్నట్లుగా.. మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగానికి చేరుకుంది. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి ఇచ్చిన చేయూత. ఆరు వేల పెట్టుబడి మద్దతును రైతులందరికీ అందిస్తామని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సంప్రదాయ, కుటీర పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది దుకాణదారులు, వాటిలో పనిచేసే వారికి మేలు చేకూర్చేలా పెన్షన్ పథకాన్ని వర్తింపచేయాలని బడ్జెట్లో ప్రకటించటం అందరూ స్వాగతించాలి. ఆదాయపు పన్ను, జీఎస్టీ పన్ను వసూళ్లను కేంద్ర ప్రభుత్వం అధికంగా అంచనా వేసి చూపించిందని, అంత సాధ్యం కాదని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చెప్పుకొచ్చారు. ఆదాయపు పన్ను 23.25 శాతం, జీఎస్టీ 44.98 శాతం చొప్పున పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని ఆయన లెక్కలు వేశారు. కానీ, ఈ లెక్కలకు ఆధారం ఏం టి? ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు వేశారు? అని నిర్మల రాజ్యసభలో ప్రశ్నిస్తే.. సరిగ్గా ఆమె మాట్లాడే రోజు చిదంబరం సభకు హాజరు కాలేదు. వాస్తవానికి ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, ఇతర పన్నులన్నీ కలిపితే ఆదాయపు పన్నుగా లెక్కిస్తారు. బహుశా చిదంబరం కార్పొరేట్, ఇతర పన్ను ల్ని తీసేసి ఆదాయపు పన్ను ఒక్కదానినే లెక్కించి అంత రాబడి అసాధ్యం అని చెప్పి ఉండొచ్చు అని నిర్మలా సీతారామన్ బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చారు. అదేవిధంగా జీఎస్టీ విషయంలోనూ చిదంబరం వేసినవి కాకిలెక్కలేనని పార్లమెంటులోనే నిర్మలా సీతారామన్ తూర్పారబట్టారు. నరేం ద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి బ్యాంకుల నెత్తిన పెట్టిన మొండి బాకీల స్థాయి ఎక్కడికి చేరిందంటే.. ప్రభుత్వ రంగ, జాతీయస్థాయి బ్యాంకులు అసలు కొనసాగుతాయా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యా యి. రిజర్వ్ బ్యాంకు ఈ మొండి బాకీలపై ఒక నివే దిక వెలువరించింది. మొండి బాకీలకు కారణం ప్రభుత్వ, బ్యాంకు విధానాల్లోని లోపాలు కూడా కారణమని తెలిపింది. అలాంటి విధాన లోపాలను గత ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం సవరించింది. బడ్జెట్ అంటే ఒకప్పుడు పైపై మెరుగులు, ఆయా వర్గాల ప్రజల్ని సంతృప్తి పరిచేందుకు కేటాయింపులు ప్రకటించి శభాష్ అనిపించుకోవడాలు మాత్రమే అన్నట్లుగా ఒక తంతుగా జరిగేది.అలాం టి కాస్మొటిక్ వ్యవహారాలకు మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. కాగా, రాష్ట్రానికి కేటాయింపులు ఏమీ లేవని, పోలవరం లాంటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని ప్రతిపక్షాలు, ఎంపీలు అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. ఇంతకు ముందే చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గతంలో ఎన్నడూ లేనన్ని ఎక్కువ నిధులు ఇస్తోంది. పోలవరం సహా ఆయా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు. వీటికి ఆయా శాఖల ద్వారా కేటాయింపులు జరుగుతాయి. ప్రత్యేకంగా బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావన లేదన్నది నిజమే. కానీ, అలా ప్రత్యేకంగా ఏ ఒక్క ప్రాజెక్టు, రాష్ట్రం గురించి కూడా మంత్రి ప్రసంగంలో చోటివ్వలేదన్నది కూడా నిజం. ఎందుకంటే ఇది దేశాభివృద్ధికి రూపొందించిన బడ్జెట్ కాబట్టి. పైగా, ఇది ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కొనసాగింపుగా పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్. దానికి తోడు ప్రస్తుత ఆర్థిక సంఘం గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. కొత్త ఆర్థిక సంఘం నివేదిక ఈ ఏడాది నవంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. అంటే.. అందులో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో నిధుల వస్తాయని పేర్కొన్నది. ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే నిధుల కేటాయించడం, రాష్ట్రం లోని గుళ్లకు చరిత్రలో తొలిసారి బడ్జెట్ కేటాయింపులు చేయడం స్వాగతించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడులాగా కేటాయింపులు చేసి వదిలేయటం కాకుండా వాస్తవంగా ఆ కేటాయింపుల మేరకు నిధులు విడుదల చేసి జగన్ మడమతిప్పని ముఖ్యమంత్రి అనిపించుకోవాలి. పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త -
ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లో రైలు ఎక్కి హైదరాబాద్‌లో దిగాలనే ఇక్కడ ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరడానికి మరి కొన్నేళ్లు పట్టొచ్చు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ మొదటి దశ పనులు వేగంగానే సాగుతున్నాయి. మనోహరాబాద్ నుంచి తూప్రాన్ మీదుగా గజ్వేల్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. సిద్దిపేట వరకు భూసేకరణ పూర్తి కాగా, సిరిసిల్ల వరకు భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వేబడ్జెట్‌లో ఏటా కేటాయింపులు చేస్తున్న నేపథ్యంలో సిద్దిపేట వరకు రైల్వేలైన్ పూర్తవ్వడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ రైల్వే బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కేవలం కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్‌కు రూ.200 కోట్లు కేటాయించడం చూస్తుంటే కొత్త రైల్వేలైన్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. 13 రైల్వేస్టేషన్లు ... 160 బ్రిడ్జిలు కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం ఇప్పటికే తూప్రాన్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రైల్వేలైన్‌తోపాటు 13 రైల్వేస్టేషన్ల నిర్మాణం, అవసరమైన వంతెనల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. ఈ లైన్లో 160 బ్రిడ్జిలు, 7 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, 49 రోడ్డు అండర్ బ్రిడ్జిల నిర్మాణం జరపాల్సి ఉంటుంది. → నాలుగు దశలు... 151.40 కిలోమీటర్లు.. → మొదటి దశ: మనోహరాబాద్ – గజ్వేల్ (32 కి.మీ), → రెండో దశ: గజ్వేల్– దుద్దెడ (32.15 కి.మీ) → మూడో దశ: దుద్దెడ –సిరిసిల్ల ( 48.65 కి.మీ), → నాలుగో దశ: సిరిసిల్ల – కొత్తపల్లి (38.60 కి.మీ) కేసీఆర్ కలల ప్రాజెక్టుగా... సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని హరీష్‌రావుకు వదిలేసి 2004లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించిన కేసీఆర్.. యూపీఏ–1 ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన విషయం విదితమే. అప్పుడు ఆయన మదిలో మెదిలో ఆలోచనే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎంపీలతో కలిసి అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, రైల్వే శాఖ మంత్రి లాలూప్రసాద్ యాదవ్‌లను ఒప్పించి రైల్వేలైన్‌ను సాధించారు. కొత్తపల్లి నుంచి వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, తూప్రాన్ మీదుగా మనోహరాబాద్ స్టేషన్‌కు అనుసంధానం చేసే విధంగా ఈ లైన్‌ను నిర్ధారిస్తూ 2006లోనే సర్వే చేశారు. రూ.800 కోట్ల అంచనాతో కొత్త రైల్వేలైన్ ప్రారంభించబోతున్నట్లు యూపీఏ ప్రభుత్వం రైల్వే బడ్జెట్లో స్పష్టం చేశారు. 2006లో కేంద్ర మంత్రివర్గం నుంచి కేసీఆర్ బయటికి రావడం, ఎంపీ స్థానానికి రాజీనామా, తిరిగి ఎన్నిక, తదితర ఉద్యమ, రాజకీయ పరిణామాల్లో రైల్వేలైన్‌పై ప్రగతి కనిపించలేదు. 2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా విజయం సాధించి, కొత్తపల్లి రైల్వేలైన్ ప్రగతి కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. వివిధ కారణాల వల్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వేలైన్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. 2014 తరువాతే బడ్జెట్ కేటాయింపులు 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బోయినపల్లి వినోద్‌కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఢిల్లీలో మంత్రాంగం జరిపి కొత్తపల్లి రైల్వేలైన్ ముందుకు కదిలేలా తనవంతు ప్రయత్నం చేశారు. 151.40 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు అంచనా వ్యయం రూ.1160 కోట్లుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్రం ఈ లైన్‌కు సంబంధించి పలు ఆంక్షలు విధించింది. రైల్వేలైన్ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, రైలు నడవడం ప్రారంభమయిన తరువాత మొదటి ఐదేళ్లు నష్టాలను భరించాలనే ఒప్పందం మేరకు కేంద్రం బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిపింది. నాలుగు దశల్లో జరిగే రైల్వేలైన్ నిర్మాణం పనులకు సంబంధించి 2017–18 బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించగా, 2018–19లో మరో రూ.125 కోట్లు కేటాయించారు. ఈసారి మరో రూ.200 కోట్లు కేటాయించడంతో తొలిదశ పనులు పూర్తయినట్లేనని చెప్పవచ్చు. సిద్దిపేట వరకు దాదాపు భూసేకరణ పూర్తి – సిరిసిల్లలో నోటీసులు రైల్వేలైన్‌కు సంబంధించి ఒకవైపు మొదటి దశ పనులు జరుగుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. గజ్వేల్ వరకు రైల్వేలైన్ వేసే పనులు సాగుతుండగా, సిద్దిపేట వరకు భూసేకరణ దాదాపుగా పూర్తయింది. సిరిసిల్ల జిల్లాలో రైల్వేలైన్ సందర్భంగా భూములు కోల్పోతున్న వారికి భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు. సిరిసిల్లలో మిడ్‌మానేర్ బ్యాక్ వాటర్ మీదుగా కిలోమీటరు పొడవునా బ్రిడ్జి నిర్మాణం జరపాల్సి ఉంటుంది. సిరిసిల్ల వరకు భూసేకరణ పూర్తయితే మూడు దశల నిర్మాణం పనులకు ఆటంకాలు తొలగినట్టే. రైల్వే లైన్ హైలైట్స్ ► 2004లో కరీంనగర్ ఎంపీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదన ► 2006 : యూపీఏ–1 ప్రభుత్వం సర్వే చేసి, రూ.800 కోట్ల అంచనాతో బడ్జెట్ నివేదిక ► 2014: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత పనుల్లో కదలిక ► 2015: తాజా సర్వేలో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ అంచనా వ్యయం రూ.1160 కోట్లు ► 2016: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన ► 2017–18 : రైల్వే బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయింపు ► 2018–19 : రైల్వే బడ్జెట్లో మరో రూ.125 కోట్లు కేటాయింపు ► 2019–20 : ఈసారి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించిన కేంద్రం -
మార్కెట్లో ‘వాటా’ ముసలం!
స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ తాజా ప్రతిపాదన స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది. బడ్జెట్ రోజు, ఆ తర్వాతి రోజు కొనసాగిన నష్టాలకు ప్రధాన కారణాల్లో ఈ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్రతిపాదన కూడా ఒకటి. ఈ ప్రతిపాదన కారణంగా టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు, డిమార్ట్ రిటైల్ స్టోర్స్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ వంటి దిగ్గజ కంపెనీలు కనీసం 10–20 శాతం మేర వాటాను విక్రయించాల్సి వస్తుంది. బీఎస్ఈలో దాదాపు 4,000కు పైగా కంపెనీలు లిస్ట్‌కాగా, వీటిల్లో 1,100 మేర కంపెనీలు వాటా విక్రయం జరపాల్సి వస్తుంది. ఇదంతా ఒకెత్తు. బహుళజాతి కంపెనీలు(ఎమ్ఎన్సీ) బాధ ఇంకొక ఎత్తు. చాలా ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతం రేంజ్లో ఉంది. ఇవి 10 శాతం మేర వాటా విక్రయించాల్సి రావచ్చు. అయితే వాటా విక్రయానికి బదులుగా అసలు స్టాక్ మార్కెట్ నుంచే డీలిస్ట్ అయ్యే దిశగా ఈ ఎమ్ఎన్సీలు యోచిస్తున్నాయని సమాచారం. ఈ విషయమై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ.... లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ హోల్డింగ్‌ను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఒక లేఖ రాశామని ఆమె పేర్కొన్నారు. పబ్లిక్ హోల్డింగ్ పెంపు ప్రతిపాదనకు సెబీ త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తుందని, రెండేళ్ల గడువుని ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన స్టాక్ మార్కెట్ నుంచి లిక్విడిటీని లాగేయడమే కాకుండా, ప్రమోటర్ వాటా అధికంగా ఉన్న బహుళ జాతి కంపెనీలు మన స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి దోహదపడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 65 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఇలాంటి కంపెనీలకు పెద్దగా ఇబ్బంది లేదు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఈ కంపెనీలు డీలిస్టింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక బిజినెస్ టు బిజినెస్(బీ2బీ)రంగంలో ఉన్న కంపెనీలు పూర్తిగా డీలిస్టింగ్కే మొగ్గుచూపుతున్నాయి. ఇలాంటి కంపెనీల వ్యాపారాలకు బ్రాండ్లతో పని లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే తాజా ప్రతిపాదనలపై ఎమ్ఎన్సీలు ఇప్పటివరకైతే, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అప్పడూ ఇదే పరిస్థితి... మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ 2010–13లో 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనను తెచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. పలు ఎమ్ఎన్సీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేశాయి. ఈ తాజా ప్రతిపాదన ప్రకారం ప్రజలకు 35 శాతం వాటాను కేటాయించాల్సి వస్తే, ఎమ్ఎన్సీలు రూ.50,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించాల్సి రావచ్చు. ఎమ్ఎన్సీలు, ఇతర భారత కంపెనీలు కలసి మొత్తం మీద రూ. 4 లక్షల కోట్ల మేర షేర్లను విక్రయించే అవకాశాలున్నాయి. ఎమ్ఎన్సీలు...మంచి పనితీరు... మార్కెట్, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నా, చాలా ఎమ్ఎన్సీలు మంచి పనితీరునే కనబరుస్తూ వచ్చాయి. మొత్తం గత 16 ఏళ్లకు గాను 11 ఏళ్లలో ఎమ్ఎన్సీ షేర్లు నిఫ్టీని మించిన రాబడులనిచ్చాయి. 2006 నుంచి చూస్తే, వరుసగా 13 ఏళ్ల పాటు నిఫ్టీని మించిన పనితీరును ఎమ్ఎన్సీలు చూపించాయి. తాజా ప్రతిపాదన తక్షణం అమలయ్యే అవకాశాల్లేవు. దశలవారీగానే ఈ ప్రతిపాదన అమల్లోకి రావచ్చు. కనీసం 3–4 ఏళ్లు పడుతుందని అంచనా. అయినప్పటికీ, ఇది ఆయా షేర్ల పనితీరుపై తీవ్రంగానే ప్రభావం చూపించవచ్చు. ప్రమోటర్ వాటా 75 శాతానికి పైగా ఉన్న సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ వంటి కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్) విధానంలో తమ వాటాను విక్రయించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఇది ఆయా షేర్ల పనితీరుపై సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. అయితే సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ కంపెనీల ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని, ఈ షేర్లు తగ్గితే అది కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించాలని ఆంటిక్ స్టాక్ బ్రోకింగ్ పేర్కొంది. ఓఎఫ్ఎస్ల వెల్లువ... ఈ ప్రతిపాదన కారణంగా ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్)లు వెల్లువెత్తుతాయని నిపుణులంటున్నారు. వాటా విక్రయానికి చౌకైన, వేగవంతమైన ప్రక్రియ ఇదేనని, దీంతో స్టాక్ మార్కెట్లో ఓఎఫ్ఎస్లు వెల్లువెత్తుతాయని, దీంతో సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్య తలెత్తుతుందని వారంటున్నారు. ఈ ప్రతిపాదన కారణంగా కొన్ని ఉత్తమ ఫలితాలూ ఉంటాయని విశ్లేషకులంటున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్ల యాజమాన్యం మరింతగా విస్తరిస్తుందని, స్టాక్ మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని, షేర్లకు సరైన విలువ లభిస్తుందని, కార్పొరేట్ గవర్నెన్స్ మరింతగా మెరుగుపడగలదని వారంటున్నారు. అంతే కాకుండా నాణ్యత గల షేర్లు సమంజసమైన ధరకు లభించే అవకాశాలూ ఉన్నాయి. -
పరుగులు తీస్తున్న పుత్తడి!
సాక్షి, కామారెడ్డి: కేంద్ర బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. బడ్జెట్‌కు ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.33,700 వరకు ఉండగా, కస్టమ్స్ సుంకం పెరగడంతో ధర రూ.34,700 లకు చేరింది. అంటే ఒక్కసారిగా రూ. వెయ్యి వరకు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండడంతో కొనుగోళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కాకపోవడంతో బంగారం క్రయవిక్రయాలు తక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో బంగారంపై సుంకం పెంచడంతో ధరలు మాత్రం పెరుగుతున్నాయి. దీంతో కొనుగోళ్లు చాలావరకు పడి పోయినట్టు బంగారం వర్తకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో అరవైకి పైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ భారీ ఎత్తున బంగారం అమ్మకాలు సాగుతుంటాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ కాకపోవడం, ధరలు పెరగడంతో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నా యి. పెరుగుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధర లు పెరగడంతో బంగారం కొనేదెలా అం టూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం విక్రయదారులు కూడా అమ్మకాలు తగ్గిపోవడంతో ఇబ్బంది పడతున్నారు. సుమారు మూడు నెలల వరకు శుభ ముహూర్తాలు కూడా లేవు. అటు సీజన్ లేకపోవడం, ఇటు ధర పెరగడంతో బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు పని లేక ఆందోళన చెందుతున్నారు. -
కొత్తపల్లి–మనోహరాబాద్‌కు లైన్‌క్లియర్
సాక్షి, కరీంనగర్ : కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించింది. కరీంనగర్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు వీలుగా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్‌ను 2006–07 సంవత్సరంలో రూ.1160 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం రైల్వేబడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2014 సంవత్సరం నుంచి రైల్వేపనుల్లో వేగం పెరిగింది. మొత్తం 150 కిలోమీటర్ల దూరం ఉన్న కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్‌లో ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 32 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయి. 2020 సంవత్సరంనాటికి కరీంనగర్‌కు రైలు తీసుకొస్తామన్న ప్రజాప్రతినిధుల మాటలు ఆచరణలో మాత్రం సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడంలేదు. ఈ రైల్వే నిర్మాణ పనులు కరీంనగర్ జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్ హయాంలోనైనా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణం పూర్తవుతుందనే ఆశాభావంతో జిల్లాప్రజలున్నారు. బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఇలా ► 2015–16–రూ.20కోట్లు ► 2016–17–రూ.30కోట్లు ► 2017–18–రూ.350కోట్లు ► 2018–19–రూ.125కోట్లు ► 2019–20–రూ.200కోట్లు -
బడ్జెట్లో ఏపీకి ఏమి దక్కలేదు
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్లో ఏపీకి ఏమి దక్కలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోలియం ఉత్పత్తులపై అదనంగా ఒక రూపాయి ఎక్సైజ్ డ్యూటీ విధించడం సామాన్యుడిపై తీవ్ర భారంగా మారుతుందన్నారు. రైల్వేల ఆపరేటింగ్ నిష్పత్తి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యాన్ని చేరుకోవడం శుభపరిణామంగా చెప్పుకొచ్చారు. ఎలక్ట్రిక్ వెహికల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు విజయసాయి రెడ్డి. పొలవరానికి నిరంతరంగా నిధులు: వేమిరెడ్డి బడ్జెట్లో ఏపీకి చాలా ఇస్తారని ఆశించాం.. కానీ నిరాశే మిగిలిందన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేయలేదని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, రాజధానికి నిధులు ఇవ్వలేదన్నారు. ఏపీ రెవెన్యూ లోటు ఎంతో లెక్క తేల్చడం లేదని ఆయన విమర్శించారు. ఏపీ ఏజీ రూ. 16 వేల కోట్ల రెవెన్యూ లోటుగా తేల్చిందన్నారు. రెవెన్యూ లోటుకు సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిరంతరంగా నిధులు విడుదల చేయాలని వేమిరెడ్డి డిమాండ్ చేశారు. బడ్జెట్లో కడప స్టీల్ ప్లాంట్, వెనకబడిన జిల్లాలకు నిధుల ఊసే లేదన్నారు. ఐఐటీ, ఐఐఎంల నిర్మాణానికి నిధులు లేక ఆ ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. భారత్‌మాల, సాగర్ మాల ప్రాజెక్ట్‌లను స్వాగతిస్తున్నాం అన్నారు. -
రెడ్ సిగ్నల్ హైదరాబాద్‌లో ఆగని రైలు
జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్‌కు సరిపడా రైళ్లు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణం కోసం మూడు నెలల ముందు నుంచే ప్రణాళికలను రూపొందించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా షిరిడీ, శబరి, బెంగళూరు, విశాఖ, తిరుపతి, ముంబై, పాట్నాలకు డిమాండ్ అధికంగా ఉంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను ఏర్పాటు చేయాలని చాలాకాలంగా నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల సంక్షేమ సంఘాలు సైతం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్ నగరానికి మొండి చెయ్యి చూపించింది. రైల్వే ప్రాజెక్టులపై ఊరించి ఉసూరుమనిపించింది. ఒక్క యాదాద్రి ఎంఎంటీఎస్ రెండో దశకు విదిలించిన రూ.20 కోట్లు మినహా ఎక్కడా సిటీ ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. పైగా యాదాద్రికి కేటాయించిన ఈ నిధులు సైతంగత మధ్యంతర బడ్జెట్లోప్రకటించినవే. ఇప్పుడు పింక్‌బుక్‌లో చేర్చారు. నాలుగు రోజుల ఉత్కంఠ తరువాత కేంద్ర బడ్జెట్లో రైల్వేలకు అందిన కేటాయింపులను బుధవారం విడుదల చేశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ విస్తరణ, వట్టినాగులపల్లి టర్మినల్ నిర్మాణం వంటి కీలకమైన ప్రాజెక్టులు ఈ బడ్జెట్లో కనీసం ప్రస్తావనకు కూడా రాకపోవడం గమనార్హం. మరోవైపు ఐదేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ సాగుతూనే ఉంది. అది ఎప్పటికి పూర్తవుతుంది, రెండో దశ రైళ్లు ఎప్పటి వరకు పట్టాలెక్కుతాయనే అంశాన్ని పూర్తిగా విస్మరించారు. నిధుల కొరత కారణంగా నిలిచిపోతున్న రెండో దశకు ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి, ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాలు, అదనపు టిక్కెట్ బుకింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి వాటికి స్థానం లేకుండా పోయింది. మొత్తంగా ఈ ఏడాది రైలు నగరంలో ఆగకుండానే పరుగులు తీసింది. చర్లపల్లి టర్మినల్‌కు కేటాయింపులేవీ.. నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రద్దీ, రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి స్టేషన్‌ను 4వ టర్మినల్‌గా విస్తరించేందుకు మూడేళ్ల క్రితం బడ్జెట్లోనే ప్రతిపాదించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.8 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి మరో వందకు పైగా రైళ్లు, లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మూడింటిపైన పెరిగిన ఒత్తిడి, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లిని అభివృద్ధి చేయాలని భావించారు. సుమారు రూ.200 కోట్ల అంచనాలతో ప్రణాళికలను రూపొందించారు. 50 ఎకరాల భూమి అదనంగా అవరమని గుర్తించారు. ఈ టర్మినల్ నిర్మిస్తే సుమారు 10 ప్లాట్‌ఫామ్‌లతో ప్రతి రోజు కనీసం 200 రైళ్ల రాకపోకలకు అవకాశం లభిస్తుందని అప్పట్లో ప్రతిపాదించారు. విజయవాడ నుంచి, కాజిపేట్ వైపు నుంచి వచ్చే రైళ్లన్నింటినీ చర్లపల్లి ద్వారా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండడం వల్ల ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి.కానీ ఈ ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా దక్కలేదు. వట్టినాగుల పల్లి టర్మినల్ ప్రస్తావన కూడా లేకపోవడం గమనార్హం. యాదాద్రికి రూ.20 కోట్లు.... ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించి యాదాద్రికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని 2016–17 బడ్జెట్లో ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్‌కు రూ, 20 కోట్లు కేటాయించారు. ఇది కూడా గత మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిందే. ఈ సారి పింక్ బుక్‌లో చేర్చారు అంతే. ఇది మినహాయించి ఈ బడ్జెట్ వల్ల నగరానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదు. యాదాది మార్గం అందుబాటులోకి వస్తే ప్రతి రోజు హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభిస్తుంది. అప్పట్లో రాష్ట్రప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.సుమారు రూ. 412 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం 59 శాతం వాటా చొప్పున, రైల్వే 41 శాతం భరించవలసి ఉంది. కానీ దీనికి ఇప్పటి వరకు టెండర్లను పిలవకపోవడం గమనార్హం. -
గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ
సాక్షి, విజయవాడ : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జూలై 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్, ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై సీఎం జగన్ గవర్నర్‌తో చర్చించనున్నారు. ఇక మంగళవారం ముందుగానే గేట్‌వే హోటల్‌కు చేరుకున్న గవర్నర్ నరసింహన్‌కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సాదర స్వాగతం పలికారు. -
బడ్జెట్.. ముంచెన్!
విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను పోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనతో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 38,800 పాయింట్ల దిగువకు, నిఫ్టీ, 11,600 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 907 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 793 పాయింట్ల నష్టంతో 38,721 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 288 పాయింట్ల మేర క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 11,559 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది బాగా నష్టపోయింది ఈ రోజే. సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, 2016, ఏప్రిల్ తర్వాత ఈ సూచీలు అత్యధికంగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఆర్థిక, వాహన, చమురు షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అంచనాలు తల్లకిందులు... మందగమనంలో ఉన్న వినియోగ రంగానికి జోష్‌నివ్వడానికి కేంద్రం బడ్జెట్లో తాయిలాలు ఇవ్వగలదని అందరూ అంచనా వేశారని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. ఈ అంచనాలన్నీ తల్లకిందులు కావడం, మరోవైపు రానున్న ఆర్థిక ఫలితాలు మరింత అధ్వానంగా ఉండబోతున్నాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని వివరించారు. సెన్సెక్స్ భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ ఎలాంటి ఊరటలేకపోగా, ఈ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. మరిన్ని విశేషాలు.. ► ఇటీవల ప్రతిరోజూ ఆల్‌టైమ్ హైలను తాకుతున్న బజాజ్ ఫైనాన్స్ షేర్ 8 శాతం నష్టంతో రూ.3,415 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► అమ్మకాలు తగ్గుతుండటంతో వాహన కంపెనీలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయన్న వార్తలు వాహన షేర్లను పడగొట్టాయి. హీరో మోటోకార్ప్ 5.3 శాతం, మారుతీ సుజుకీ 5.2 శాతం, టాటా మోటార్స్ 3.4 శాతం, బజాజ్ ఆటోలు 2 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఓఎన్జీసీ 5.4 శాతం, ఎల్ అండ్ టీ 4.3 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.85 శాతం చొప్పున కుదేలయ్యాయి. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ భారీగా పతనమైంది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించిన ఖాతాలో రూ.3,800 కోట్ల మోసం జరిగిందన్న విషయం వెలుగులోకి రావడంతో బీఎస్ఈలో పీఎన్బీ షేర్ 11 శాతం నష్టంతో రూ.72.80 వద్ద ముగిసింది. ► ఎల్ అండ్ టీ కంపెనీ ఇటీవలనే బలవంతంగా చేజిక్కించుకున్న మైండ్‌ట్రీ షేర్ 10 శాతం నష్టంతో రూ.774 వద్ద ముగిసింది. మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు కృష్ణకుమార్ నటరాజన్, ఎన్ఎస్. పార్థసార«థి, రోస్టో రావణన్‌లు తమ తమ డైరెక్టర్ల పదవులకు, కంపెనీ పదవులకు రాజీనామా చేయడం దీనికి కారణం. ► దాదాపు 300కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్; హీరో మోటోకార్ప్, ఈరోస్ మీడియా, ఎస్కార్ట్స్, సన్ టీవీ, కాక్స్ అండ్ కింగ్స్, గోవా కార్బన్, గ్రాఫైట్ ఇండియా తదితర షేర్లు ఈ పతన జాబితాలో ఉన్నాయి. ► ఎల్ అండ్ టీ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, బ్యాంక్ ఆఫ్ అమెరికా డౌన్‌గ్రేడ్ చేయడంతో ఎల్ అండ్ టీ షేర్ 4% నష్టంతో రూ.1,490 వద్ద ముగిసింది. ఎందుకు పడిందంటే... ఎఫ్‌పీఐలపై పన్ను సంపన్న వర్గాలపై మరింత పన్ను విధించాలన్న ప్రతిపాదన.. భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న 2,000కు పైగా విదేశీ ఫండ్స్‌పై తీవ్రంగానే ప్రభావం చూపగలదని నిపుణులంటున్నారు. ట్రస్ట్‌ల మార్గంలో భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న ఎఫ్‌పీఐలపై తాజా సర్‌చార్జీ భారం మరింతగా పెరుగుతుందని, ఫలితంగా పన్ను పరంగా భారత్‌కు ఉన్న ఆకర్షణ తొలగుతుందని, విదేశీ పెట్టుబడులు నీరసిస్తాయని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదన కారణంగా విదేశీ ఇన్వెస్టర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) భారం మరింతగా పెరుగుతుంది. ఈ పన్ను విషయమై త్వరలోనే వివరణ ఇస్తామని సీబీడీటీ చైర్మన్ పేర్కొనగా, ఇక ఎలాంటి వివరణ అవసరం లేదని, అంతా స్పష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెగేసి చెప్పారు. దీంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలు... లిస్టెడ్ కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో షేర్ల సప్లై పెరిగి లిక్విడిటీ ఆవిరైపోతుంది. ఐటీ, పీఎస్‌యూ షేర్లపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక ఎమ్ఎన్సీలు మన మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేస్తాయి. ఇక సంపన్నులపై అధిక పన్నులు విధించడం, షేర్ల బైబ్యాక్‌పై 20 శాతం పన్ను తదితర ప్రతిపాదనలు కూడా మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతకు సిద్ధమవుతోంది. అయితే గత శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించాయి. ఆర్థిక వ్యవస్థ బానే ఉందన్న సంకేతాలు ఈ గణాంకాలు ఇవ్వడంతో ఫెడరల్ రిజర్వ్ రేట్లకోత విషయంలో పునరాలోచించే అవకాశాలున్నాయన్న అంచనాలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మోర్గాన్ స్టాన్లీ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లను డౌన్‌గ్రేడ్ చేయడమే కాకుండా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తన పెట్టుబడులను తగ్గించుకోవాలని(ఇది దాదాపు ఐదేళ్ల కనిష్ట స్థాయి) నిర్ణయించుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ 2.5 శాతం, హాంగ్‌సెంగ్ సూచీ 1.5 శాతం, జపాన్ నికాయ్ సూచీ 1 శాతం, దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక యూరప్సూచీలు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. జూన్ క్వార్టర్ ఫలితాలు.. ఎలా ఉంటాయో ? వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్న నేపథ్యంలో నేటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. బ్యాంక్‌లు మినహా ఇతర రంగాల కంపెనీల ఆర్థిక ఫలితాల్లో పెద్దగా మెరుపులు ఉండకపోవచ్చని, అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న ఆందోళన నెలకొన్నది. 2 రోజులు..రూ. 5 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా సోమవారం ఇన్వెస్టర్ల సంపద రూ.3.39 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.3,39,193 కోట్లు ఆవిరై రూ.1,47,96,303 కోట్లకు పడిపోయింది. బడ్జెట్ రోజు సంపద నష్టాన్ని కూడా కలుపుకుంటే మొత్తం రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5,61,773 కోట్లు హరించుకుపోయింది. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని షేర్లు క్షీణించినా, యస్ బ్యాంక్ మాత్రం ఎదురీదింది. ఆరంభంలోనే ఐదేళ్ల కనిష్ట స్థాయి, రూ.85.70కు పడిపోయిన ఈ షేర్ తర్వాత పుంజుకొని 5.5 శాతం లాభంతో రూ.93 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు భేషుగ్గా ఉన్నాయని యాజమాన్యం స్పష్టతనివ్వడంతో పాటు ఉన్నత స్థాయిల్లోని నిర్వహణ పదవులను భర్తీ చేయడం కూడా కలిసి వచ్చింది. సెన్సెక్స్‌లో ఈ షేర్‌తో పాటు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. మొత్తం మీద 31 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లు నష్టపోయాయి. -
నిరాశాజనకం.. నిరుత్సాహకరం
దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించే స్ఫూర్తి కూడా కేంద్ర బడ్జెట్లో కొరవడటం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రభుత్వ మొత్తం వ్యయం, ప్రజలను ప్రభావితం చేస్తున్న రంగాల్లో పెట్టే వ్యయంలో కూడా పెరుగుదల కనిపించడం లేదు. తీవ్రమైన నిరుద్యోగిత అలుముకున్న తరుణంలో పనికి ఆహార పథకం తిరోగమించడం ప్రమాదకరం. ప్రభుత్వం స్వయంగా ఖర్చుపెట్టడం, సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించడానికి బదులుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింతగా తలుపులు బార్లా తెరవడం అంటే.. ప్రజలపై ప్రభుత్వం నేరుగా ఆయుధం గురిపెడుతున్నట్లే లెక్క. విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడటం కేంద్రప్రభుత్వాన్ని మరింత విదేశీ ఒత్తిళ్లకు లోబడేలా చేస్తుంది. అంతకు మించి రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయి కేంద్రంపై ఆధారపడటం.. భారత సమాఖ్యతత్వానికి, ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలిపెట్టు అవుతుంది. ఆర్థిక శాస్త్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నడూ బలమైన అంశంగా భావించలేదు. తొలి దఫా పాలనలో అది తీసుకొచ్చిన కీలకమైన సంస్కరణలు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ఎంత వినాశకరంగా పరిణమించాయో అందరికీ తెలిసిందే. కాబట్టే 2019–20 కేంద్ర బడ్జెట్ మనకు ఏదో తెచ్చిపెడుతుందని భావిం చడం అర్థరహితం. ఇలాంటి సందర్భంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే స్ఫూర్తి కూడా కేంద్ర బడ్జెట్లో కొరవడటం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆర్థిక కార్యాచరణ నెమ్మదించడం, వ్యవసాయరంగ సంక్షోభం. భారీస్థాయి నిరుద్యోగిత, విదేశీ చెల్లింపుల భారం వంటి సీరియస్ సమస్యలపై కూడా బడ్జెట్ పెద్దగా దృష్టి కేంద్రీకరించినట్లు లేదు. ముఖ్యంగా రాబడి వృద్ధి రేటు మందగించిపోతోంది. ఆర్థిక కార్యాచరణ మందగించడం ఒక కారణం కాగా, పేలవమైన జీఎస్టీ వసూళ్లు ప్రధాన కారణం. 2018–19కి గాను సవరించిన వసూళ్ల అంచనాను ప్రస్తుత ఆర్థిక మంత్రి ఉల్లేఖించారు. ఇవి గత సంవత్సరం బడ్జెట్ అంచనాలకు సమీపంగా ఉన్నాయి. కానీ తాజాగా కాగ్ ప్రకటించిన గణాంకాలకంటే ఇవి కాస్త అధికంగా ఉండటం గమనార్హం. కాగ్ నివేదిక ప్రకారం 2018–19 సంవత్సరంలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ అంచనాతో పోలిస్తే జీఎస్టీ రాబడిలో రూ. 1.6 లక్షల కోట్లు తక్కువగా నమోదైంది. ఇక 2019–20 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసినా వాస్తవానికి అలా కనిపించడం లేదు. బడ్జెట్ ప్రకారం చేసిన వ్యయంలో కూడా పెరుగుదల కనిపించడం లేదు. మొత్తం వ్యయం, ప్రజలపై ప్రభావితం చేస్తున్న రంగాల్లో పెట్టిన వ్యయం విషయంలో కూడా పెరుగుదల కనిపించడం లేదు. చాలావరకు పెరిగిన వ్యయాలు సాధారణ జీడీపీలో అంచనా వేసిన రేటు ప్రకారంగానే జరుగుతూ వచ్చాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహాత్మాగాంధీ జాతీయ పనికి ఆహార పథకం విషయంలో 2018–19కి గాను సవరించిన అంచనాలతో సరిపోల్చితే తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరుద్యోగిత అలుముకున్న తరుణంలో పనికి ఆహార పథకం తిరోగమించడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. చేసిన ఈ వ్యయాలకు సంబంధించిన గణాంకాలు కూడా 2018–19కి గాను సవరించిన అంచనాల ప్రాతిపదికపైనే పొందుపర్చడమైనది. సవరించిన అంచనాల కంటే వాస్తవ అంచనా తగ్గుముఖం పట్టినందువల్ల 2019–20లో కూడా ఈ పతనం కొనసాగుతుందని స్పష్టమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యవ్యవస్థ ఒత్తిళ్లను సంతృప్తిపర్చాల్సి ఉందని ఎన్డీఏ భావిస్తున్నందున అంచనా వేసిన ఈ వ్యయాలనైనా కేంద్రప్రభుత్వం ఖర్చుపెట్టగలదా అనేది సందేహమే. ముంచుకొస్తున్న మాంద్య పరిస్థితుల్లో వ్యయానికి సంబంధించి పెట్టుకున్న లక్ష్యాలను కూడా కొనసాగించడం కష్టమే కావచ్చు. ఈ పరిస్థితుల్లో దేశానికి అవసరమైంది రాబడి, ఖర్చుల గణాంకాలను వల్లించే బడ్జెట్‌పై కేవలం చర్చ కాదు. ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసే అదనపు రాబడి వనరులపై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. కానీ ఈ కోణంలో ఎలాంటి సృజనాత్మక ఆలోచనలను చేపట్టడానికీ ఎన్డీఏ ప్రభుత్వం తిరస్కరించడం గమనార్హం. ప్రస్తుతం కేంద్రానికి వస్తున్న రాబడుల ట్రెండ్స్‌ని భవిష్యత్తుకు కూడా సూచికలుగా అలా ప్రస్తావించడం మినహా తాజా బడ్జెట్ పెద్దగా ఊడబొడిచిందేమీ లేదు. ఈ దఫా బడ్జెట్లో గణనీయంగా పేర్కొనాల్సిన విషయం ఏమిటంటే సంపద పన్ను పెంచడం. దేశంలోని బిలియనీర్ల మొత్తం ఆదాయం రూ. 560 లక్షల కోట్లుగా అంచనా. వీరిపై కనీసం ఒక్క శాతం సంపద పన్ను పెంచినా సరే కేంద్రప్రభుత్వానికి రూ. 5.6 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. ఇక వారి వారసత్వ ఆస్తులపై కూడా పన్ను పెంచినట్లయితే అదనంగా రూ.9.3 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రకాల పన్నులను దేశీయ బిలియనీర్లపై విధించినట్లయితే రూ.15 లక్షల కోట్ల రాబడి కేంద్ర ఖజానాకు సమకూరుతుంది. దేశంలో కునారిల్లుతున్న సంక్షేమ పథకాలకు ఈ భారీ మొత్తం కాస్త ఊపిరి పోసే అవకాశం ఉంది. ఇంత రాబడి వచ్చినట్లయితే, ప్రతి భారతీయుడికీ అయిదు ప్రాథమిక హక్కులకు హామీ ఇవ్వవచ్చు. అవేమిటంటే, ఆహార హక్కు, ఉపాధి హక్కు, సెకండరీ స్థాయివరకు నాణ్యమైన విద్యను పొందే హక్కు, ప్రభుత్వం నిర్వహించే జాతీయ ఆరోగ్య సేవ ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ హక్కు, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,000ల వృద్ధాప్య పింఛను (ఇప్పుడు నెలకు రూ. 200 మాత్రమే ఇస్తున్నారు). హక్కుతోపాటు దివ్యాంగులకు ప్రయోజనాలు కూడా కల్పించవచ్చు. నిజానికి, బడ్జెట్ సమర్పించడానికి ముందు, సంపన్నులపై వారసత్వ పన్ను విధిస్తారని భావించారు. ఆశ్చర్యకరంగా ప్రస్తుత బడ్జెట్ దాని ప్రస్తావన అయినా తేలేదు. మరోవైపున, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి ఊదరగొడుతున్నారు. తాజా బడ్జెట్లో ఏదైనా వ్యూహా త్మకపరమైన అంశం ఏదైనా ఉందంటే, దేశంలోనికి ఎఫ్‌డీఐలను ఆకర్షించడం మాత్రమే. ఇది కూడా కార్మికుల హక్కులను అణిచివేయడం, భూమిని మరింత సులభంగా స్వాధీనపర్చుకోవడం ద్వారా అమలు కానుంది. ఈ రకమైన అభివృద్ధిని కొనసాగించడం అంటే నిరుద్యోగి తను మరింతగా పెంచడానికే దారితీస్తుంది. ప్రభుత్వం స్వయంగా ఖర్చుపెట్టడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించడం అనే అంశాలను దేశ ఆర్థిక వ్యవస్థ చోదకశక్తిగా మార్చడానికి బదులుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింతగా తలుపులు బార్లా తెరవడం అనేది ప్రజలపై ప్రభుత్వ ఆయుధంగా మారనుంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగమనంలోకి జారిపోతున్న తరుణంలో, బహుళ జాతీయ సంస్థలు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కోల్పోతున్న తరుణంలో ప్రభుత్వమే ఖర్చుపెట్టడం ద్వారా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడం ప్రజా ప్రయోజనాలకు పట్టం కట్టినట్లవుతుంది. నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదం లక్ష్యమే ఇది. కానీ ఆ మార్గంలో గత ఐదేళ్లలో కేంద్రం ఎంతమేరకు నడిచింది? కేంద్ర ప్రభుత్వం కొన్ని తీపి మాటలు చెబుతూ కొద్దిమేరకు పెట్టుబడులను తీసుకురాగలిగినట్లు చెప్పుకోవడం నిజమని భావించినప్పటికీ, అది గత అయిదేళ్లలో ఎన్ని ఉద్యోగాలను సృష్టించగలిగింది అనేది ప్రశ్న. ఒకవైపు బహుళ జాతి సంస్థలు, మరోవైపు దేశీయ బడా వాణిజ్యవేత్తలు సాధించిన వృద్ధి రేటు అధికంగా ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, పెంచి చెబుతున్న ఇంత భారీ జీడీపీ రేట్లు కూడా దేశ శ్రామిక వర్గానికి అవసరమైన సహజ ఉపాధిని పెంచలేకపోవడం గమనార్హం. ఇలాంటి తరహా వృద్ధి ధోరణులతో దేశీయ నిరుద్యోగితను తొలగిస్తామని చెప్పడం పూర్తిగా అవాస్తవికమే అవుతుంది. ఇదంతా అందరికీ అనుభవైకవేద్యమైన విషయమే కానీ మోదీ ప్రభుత్వం కూడా మధ్యయుగాల ఫ్రాన్స్ బర్బన్ రాజుల్లాగా, ‘నేర్చుకున్నదీ లేదు.. మర్చిపోయిందీ లేదు’ అనే దోరణిలో కూరుకుపోవడం విశేషం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో పొందుపర్చిన రెండు అంశాలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీయనున్నాయి. ఒకటి. ప్రభుత్వ రుణాల కోసం అంతర్జాతీయ ద్రవ్యమార్కెట్లను సంప్రదించడం. దీనివెనుక ఎలాంటి విలువైన కారణం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ రుణాలపై పరిమితి అనేది ద్రవ్యలోటుపై స్వయంగా విధించుకున్న సీలింగ్‌పై ఆధారపడి ఉంటుందే తప్ప దేశీయ మార్కెట్లో రుణాలు సాధించలేని ప్రభుత్వ అసమర్థతపై ఆధారపడి ఉండదు. ప్రభుత్వం విదేశాల నుంచి రుణాలకు ప్రయత్నించడం పెరగటం అంటే, భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ ద్రవ్యసంస్థల పట్టును మరింతగా పెంచడమే అవుతుందని మర్చిపోరాదు. ఇలాంటి నేపథ్యంలో రుణాలను తేవడంలో వాటిని తీర్చడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా దేశంపై నిరంకుశంగా మితవ్యయాన్ని రుద్దడానికి ఆస్కారం ఉంటుంది. పైగా బడ్జెట్ విదేశీ మారక మార్కెట్టును ద్రవ్యమార్కెట్తో ముడిపెట్టింది. దీనివల్ల రూపాయి పతనం మరింత పెరిగి ప్రభుత్వంపై రుణభారం ఆకాశాన్ని అంటుతుంది. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ ఒత్తిళ్లకు పూర్తిగా లోబడాల్సిన పరిస్థితి ఏర్పడక మానదు. ఇక రెండో అంశం సమాఖ్యతత్వానికి చెందినది. జీఎస్టీని తనకు తానుగా భారత రాజ్యాంగంలోని సమాఖ్య చట్రంపై చేసిన భారీ దాడిగా చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి వివేచన లేకుండా ఈ ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని గుడ్డిగా ఆమోదించేశాయి. కానీ ఆశించిన రాబడిలో జీఎస్టీ విఫలం కావడం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై దారుణ ప్రభావం వేసింది. దీనికంటే మిన్నగా ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో, కేంద్రప్రభుత్వం తన రాబడిని పెంచుకోవడానికి సెస్సులు, సర్‌చార్జీలను పునరుద్ధరిం చింది. అంటే ఇలా ఆర్జించే రాబడిలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం వాటా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం గుప్పిటలో ఉంచుకోవడానికి ఇది ఇతోధికంగా ఉపయోగపడుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఎందుకంటే రాష్ట్రాలు ఒక మూలకు నెట్టబడి కేంద్రం సహాయానికి దేబిరించాల్సి వస్తుంది. కేంద్రం కూడా తనకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, వ్యతిరేకంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలను ఉపేక్షించడం అలవాటు చేసుకునే స్థితి ఏర్పడుతుంది. భారత సమాఖ్యతత్వానికి, ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు అవుతుంది. వ్యాసకర్త విశ్రాంత ఆర్థిక ఆచార్యులు, జేఎన్‌యూ, ఢిల్లీ ప్రభాత్ పట్నాయక్ -
2 రోజుల్లో రూ. 5.61లక్షల కోట్లు ఆవిరి
సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్ల ఉత్థాన పతనాలను ఒడిసిపట్టుకోవడం అంత ఆషామాషీ వ్యవహారేమీ కాదు. దేశీయంగా తాజా ఆర్థిక,రాజకీయ పరిణామాల విశ్లేషణ, గ్లోబల్ మార్కెట్ల ఆటుపోట్లు తదితర అంశాల పట్ల చురుకుగా ఉండాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ముఖ్యంగా కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలకు చేరి ఇన్వెస్టర్లను బాగా ఊరించాయి. కానీ ఈ ఉత్సాహాన్ని తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సార్వత్రిక బడ్జెట్ భారీగా దెబ్బతీసింది. 40 వేలస్థాయికి చేరుకున్న సెన్సెక్స్ కుప్పకూలి ఇన్వెస్టర్లను వణికించింది. రెండు సెషనల్లోనే ఏకంగా రూ. 5.61 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరై పోయింది. బడ్జెట్ డే రోజు 394 కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం మరింత దిగజారి 793 పాయింట్ల మేర పతనమైంది. సోమవారం ఒక్కరోజే 3.39 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్ల బలహీనత కూడా మార్కెట్లను దెబ్బతీసినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా హెవీ వెయిట్ స్టాక్స్ కూడా పేకమేడల్లా కూలిపోవడంతో ఇన్వెస్టర్లు షాక్‌లో ఉండిపోయారు. ఒక్క ఐటీ మినహా అన్ని రంగాలు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ, మీడియా, ఆటో, మెటల్, ఫార్మా రంగ సూచీల్లో నష్టం అత్యధికంగా ఉంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా రెండున్నర శాతం వరకూ కోల్పోయాయి. గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజున ఈ స్థాయిలో పతనాన్ని నమోదు చేసిందన మార్కెట్ నిపుణులు తెలిపారు. ఎఫ్‌సీఐల్లో ఉన్న 40-45 శాతం మంది ఈ కొత్త పన్నుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉండడంతో ఎఫ్‌పీఐ అమ్మకాల జోరందుకుందన్నారు. తాజా గణాంకాల ప్రకారం స్టాక్మార్కెట్లోని బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 4న (బడ్జెట్‌కు ముందు రోజు) రూ.153.58 లక్షల కోట్లుగా ఉంది. జూలై 5 (బడ్జెట్ డే) నాటికి రూ.151.35 లక్షల కోట్లుగా ఉంది. జూలై 8న సోమవారం రూ.147.96 లక్షల కోట్లకు పతనమైంది. అంటే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.5.61 లక్షల కోట్లకుపైగా క్షీణించిందన్నమాట. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా బలహీనంగా ముగిసింది. -
కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు స్టాక్ మార్కెట్..
-
స్టాక్ మార్కెట్‌కు బడ్జెట్ షాక్
ముంబై : స్టాక్ మార్కెట్‌పై కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ మార్కెట్‌ను మెప్పించడంలో విఫలమవడంతో మదుపుదారులు అమ్మకాలకు తెగబడ్డారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సోమవారం కీలక సూచీలు భారీగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లకు దీర్ఘకాల మూలధన రాబడిపై పన్నును పెంచడం ఎఫ్‌పీఐలను తీవ్ర నిరాశకు లోనుచేసిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో 38,816 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 11,595 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత రెండు సెషన్లలో స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో మదుపుదారుల సంపద రూ 5 లక్షల కోట్ల మేర ఆవిరైంది. -
మార్కెట్‌పై ‘బడ్జెట్’ ప్రభావం
న్యూఢిల్లీ: గత శుక్రవారం బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కీలక నిర్ణయాలు, ప్రతిపాదనల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని, అలాగే ఐఐపీ(పారిశ్రామికోత్పత్తి), ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక గణాంకాలపైనా ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక జూన్ త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యే కంపెనీల ఫలితాలు కూడా మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయించొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 9న టీసీఎస్, 12న ఇన్ఫోసిస్ ఫలితాలు విడుదల కానున్నాయి. అలాగే, బడ్జెట్ నిర్ణయాల నేపథ్యంలో డాలర్‌తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ అంశాల ప్రభావం సైతం ఉంటుందని భావిస్తున్నారు. గత శుక్రవారం బడ్జెట్ నిర్ణయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సూచీలు నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లిస్టెడ్ కంపెనీల్లో కనీస ప్రజల వాటాను ప్రస్తుత 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, బైబ్యాక్‌పై 20 శాతం పన్ను వంటి అంశాలు మార్కెట్లకు రుచించలేదు. ‘‘ఎంతగానో వేచి చూసిన బడ్జెట్ కార్యక్రమం ముగిసింది. అయితే, దీని తాలూకూ ప్రభావం ఈ వారం కూడా మార్కెట్‌పై కొనసాగుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోదీ తెలిపారు. ‘‘బడ్జెట్ ప్రభావం సోమవారం నాటి మార్కెట్‌పైనా ఉంటుంది. సూచీల్లో భారీ క్షీణత మరింత నష్టాలు ఉంటాయన్న సంకేతాన్నిస్తోంది. 11,800ను నిఫ్టీ కోల్పోతే మరింత క్షీణతకు దారితీస్తుంది’’అని రెలిగేర్ బ్రోకింగ్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ తెలిపారు. ఇక, పారిశ్రామిక ఉత్పత్తి, జూన్ నెల ద్రవ్యోల్బణం గణాంకాలు, చమురు ధరల కదలిక, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి సైతం ఈ వారం మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటాను పెంచే ప్రతిపాదన అవసరమైనదే కానీ, లార్జ్‌క్యాప్ కంపెనీల విషయంలో దీని అమలు సమస్యలతో కూడుకున్నదేనని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అన్నారు. మార్కెట్లకు నిరుత్సాహం... ‘‘ప్రభుత్వం నుంచి మద్దతు చర్యలను మార్కెట్ ఆశించింది. కానీ, అది జరగలేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులే ఇందుకు కారణం’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ వినోద్‌నాయర్ పేర్కొన్నారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై ప్రోత్సాహకాల్లేమి మార్కెట్లను సమీప కాలంలో నిరుత్సాహంగా మార్చొచ్చన్నారు. ఈ స్థాయి నుంచి మార్కెట్ పనితీరు అన్నది 2020 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక పనితీరుపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు. ఈ వారంలో వచ్చే ఫలితాలు 8వ తేదీన డెల్టాకార్ప్, గోవా కార్బన్ , 9న టీసీఎస్, 10న సీసీఎల్, 12న ఇండస్ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, కర్ణాటక బ్యాంకు, 13న డీహెచ్ఎఫ్ఎల్, డీమార్ట్ ఈ వారంలో ఫలితాలు విడుదల చేయనున్న ప్రముఖ కంపెనీల్లో కొన్ని. ‘‘బడ్జెట్లో అదనపు సాయం కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు కొనసాగుతాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. 2019–20 ఫలితాల విషయంలో ఎన్ఎస్ఈ 500 కంపెనీల పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఎడెల్వీజ్ ఇన్వెస్టర్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్కపూర్ తెలిపారు. తొలి వారంలో విదేశీ పెట్టుబడులు వెనక్కి న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై అనిశ్చితి అంచనాల నేపథ్యంలో జూలై తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 475 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు దాదాపు అయిదు నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతూ వస్తున్నారు. ఈక్విటీ, డెట్ మార్కెట్లకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) నికరంగా ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 16,093 కోట్లు, మే లో రూ. 9,031.15 కోట్లు, జూ¯Œ లో రూ. 10,385 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. -
నేడు ఆర్బీఐ బోర్డు సభ్యులతో సీతారామన్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం(నేడు) రిజర్వ్ బ్యాంక్ కేంద్ర బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక అంశాలను ఈ సందర్భంగా ఆమె ఆర్బీఐకి వివరించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యం ఇందులో ప్రధానంగా చర్చకు రానుంది. ఈ ఏడాది(2019–20) ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తాజా పూర్తిస్థాయి బడ్జెట్లో తగ్గించిన సంగతి తెలిసిందే. మధ్యంతర బడ్జెట్లో అంచనాలతో పోలిస్తే నికరంగా రూ.6,000 కోట్లు ఖజానాకు అదనంగా సమకూరనుండటంతో ఇది సాధ్యమైంది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020–21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూడా జీడీపీలో 3 శాతానికి కట్టడి చేయడం, ప్రాథమిక లోటును పూర్తిగా తొలగించడం వంటి అంశాలతో రోడ్‌మ్యాప్‌ను సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటారు. అదేవిధంగా ద్రవ్యలోటు నుంచి కేంద్రం చెల్లించాల్సిన వడ్డీలను మినహానయిస్తే, మిగిలిన లోటును ప్రాథమిక లోటుగా వ్యవహరిస్తారు. ఇక ఆర్బీఐ మిగులు నిధుల విషయానికొస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.90,000 కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు అంచనా. గతేడాదితో పోలిస్తే(రూ.68,000 కోట్లు) ఇది 32 శాతం అదనం. అంతేకాదు ఇప్పటిదాకా ఆర్బీఐ నుంచి కేంద్రం అందుకున్న అత్యధిక డివిడెండ్‌గా కూడా ఇది నిలవనుంది. -
ప్రజాప్రయోజనాలకు పట్టం కట్టిన బడ్జెట్
ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరవ బడ్జెట్ ఆయన రెండో దఫా పాలనకు అభినందనలు తెలిపిన బడ్జెట్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. జవహర్లాల్ నెహ్రూ, మన్మోహన్ సింగ్ తర్వాత అయిదేళ్ల పూర్తి కాలం తర్వాత మరోసారి కేంద్రంలో ఎన్నికైన మూడో ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. నూతన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు ఢిల్లీలో వర్షం కురి సింది, సెన్సెక్స్ కూడా తాత్కాలికంగా కుప్పగూలింది. ఇది ఏరకంగా చూసినా విశిష్టమైన సందర్భం. అవకాశాలను విస్తరించిన సందర్భం. నరేంద్రమోదీ రెండో దఫా పాలనలో తొలి బడ్జెట్ సందర్భంగా శుక్రవారం ఉదయం అందరి ఆశలూ ఆకాశాన్ని అధివసించాయి. తొలి దఫా పాలనలో మోదీ ఆర్థిక వ్యవస్థను చక్కగా నిర్వహించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి భారీ సంస్కరణలతోపాటు, సులభతరమైన వాణిజ్యం, ద్రవ్యోల్బణ నియంత్రణ, ద్రవ్యలోటును తగ్గించడం, ఆర్థిక వృద్ధిరేటను 7శాతం వద్ద నిలకడగా కొనసాగించడం వంటి చర్యలు మోదీ ప్రతిష్టను మరింతగా నిలిబెట్టాయి. ఇప్పుడు ఆయన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు పెంచడంపై దృష్టిపెట్టింది. ఇది ప్రస్తుతం ఉన్న 2.7 ట్రిలియన్ డాలర్లనుంచి పెనుగంతు వేయడం లాంటిదే. ఉపాధి కల్పన, వృద్ధి, ఆర్థిక వ్యవస్థపై డేటాను స్థిరీకరించడం, ఆర్థిక వ్యవస్థను మెరుగు చేయడంలో సమస్యలు, పన్నుల తగ్గింపు, ఆదాయ పెంపు, ద్రవ్య సమతుల్యతను కొనసాగించడం వంటి భారీ సవాళ్లు ప్రస్తుత కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పటికీ ఒడిదుడుకులతో సాగుతుండటంతో ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చి, పబ్లిక్ పెట్టుబడి ఆధారంగా ఉద్యోగాలను కల్పించడం పెనుసవాలుగా మారుతోంది. కేంద్రప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన భారీ పథకాలు ఉజ్వల, సౌభాగ్య.. వంట గ్యాస్, విద్యుత్ సరఫరాను అవసరమైన వారికి అందించి కోట్లమంది జీవితాలను సౌకర్యవంతంగా మార్చాయి. దాదాపుగా 1.95 కోట్ల గృహాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తగినంతమేరకు ప్రయోజనాలు లభించాయి. ఇక ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకంతో రూ. 80,200 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 1.25 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించడమైంది. గత అయిదేళ్లుగా దేశం సాధించిన ప్రయోజనాలను మరింత సంఘటితం చేయడంపై తాజా బడ్జెట్ దృష్టి సారించింది. గావ్, గరీబ్, కిసాన్, స్వదేశీలపై మరింతగా కేంద్రీకరించనున్నారు. ఆర్థిక వృద్ధి నమూనాను ప్రతిపాదించడమే కాకుండా, ప్రతిరంగంలోనూ ప్రైవేటీకరణకు, విదేశీ పెట్టుబడులను స్వాగతించడం కోసం విస్తృతంగా తలుపులు తెరవటం జరుగుతోంది. 2018–2030 మధ్యలో ఒక్క రైల్వే మౌలిక వసతుల కల్పనకే దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల మదుపు అవసరముంది. కాలం చెల్లిన పవర్ ప్లాంట్లను తప్పించి మెరుగైనవాటి కల్పన కోసం అత్యున్నత స్థాయి సాధికారిక కమిటీకి సిఫార్సు చేయనున్నారు. ఉదయ్ ఇప్పటికే ఈ విషయంలో ఎంతో సహకరించింది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత వృద్ధి చెందనుంది. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు, కార్పొరేట్ సౌవరిన్, వెంచర్ ఫండ్లు అనే మూడు గ్లోబల్ ప్లేయర్లను ఏకత్రాటికి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం వార్షిక గ్లోబల్ మీట్‌కు ప్లాన్ చేస్తోంది. గడచిన సంవత్సరాల్లో పెద్దగా విజయం సాధించని మేక్ ఇన్ ఇండియాకు ఈ బడ్జెట్ మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇక టూరిజం, విద్య, సంస్కృతి వంటి వెనుకబడిన రంగాలపై తాజాగా దృష్టి పెట్టనున్నారు. సరళీకరణ అనంతర దశలో అభివృద్ధి చోదకశక్తులుగా గుర్తింపు పొందిన ఐటీ, విద్య, సేవారంగాలు గత అయిదేళ్లుగా మంచి పనితీరు కనబర్చలేదు. భారత్‌మాల రోడ్ కనెక్టివిటీని పెంచే ప్రాజెక్టుగా ఖ్యాతి పొందనుంది. సాగరమాల అనేది ఓడరేవులు, జలమార్గాల కనెక్టివిటీలో ఇతోధికంగా తోడ్పడనుంది. వీటితో మౌలిక వసతుల కల్పనా రంగం తిరిగి గాడిన పడుతుంది. నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో వేతనజీవులు, మధ్య ఆదాయ బృందాలు, రైతులు, యువజనులు ప్రధాన లబ్ధిదారులు అవుతున్నారు. పైగా సగటు మనిషి జేబులో మరింత డబ్బును ఉంచేందుకు ఈ బడ్జెట్ ప్రయత్నించింది. ఇది డిమాండును మరింతగా పెంచి వృద్ధికి తోడ్పడుతుంది. మొత్తంమీద నిర్మల బడ్జెట్ వాణిజ్య అనుకూల బడ్జెట్ అనే చెప్పాలి. డాక్టర్ ఆర్ బాలశంకర్, బీజేపీ సెంట్రల్ కమిటీ మెంబర్ -
మండిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కోసం ఇంధనంపై పన్ను పెంచడంతో ఆ ప్రభావం రవాణారంగం, వాహనదారులపై పడింది. శనివారం పెట్రోల్ ధర లీటరుపై కనిష్టంగా రూ.2.40, డీజిల్ ధర రూ.2.36 మేర పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్‌పై రూ.2.45 పెరిగి లీటరు ధర రూ.72.96కు చేరుకుంది. ఇదే ముంబైలో రూ.2.42 పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.78.57కు, కోల్‌కతాలో రూ.2.49 పెరిగి రూ.75.15కు, చెన్నైలో రూ.2.57 పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.75.76కు చేరిందని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. కాగా, ఢిల్లీలో డీజిల్ రూ.2.36 పెరిగి లీటరు రూ.66.69కు, ముంబైలో రూ.2.50 పెరిగి లీటర్ ధర రూ.69.90 కు చేరుకుందని పేర్కొంది. రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, వ్యాట్ ఆధారంగా ఈ ధరలు వేర్వేరుగా ఉండే అవకాశముందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ల ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్ది వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో పెట్రోల్, డీజిల్‌లపై రోడ్లు, మౌలికరంగాల సెస్, పన్నులు కలిపి లీటరుకు రూ.2 మేర విధించడం ద్వారా ఏడాదికి రూ.24 వేల నుంచి రూ.28 వేల కోట్ల మేర సమీకరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్‌పై మొత్తం పన్ను భారం రూ.17.98 ఉండగా, కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం ఇది లీటర్‌పై రూ.19.98కు పెరిగింది. డీజిల్ లీటర్‌పై ఉన్న మొత్తం పన్ను భారం కూడా రూ. 13.83 నుంచి రూ.15.83కు పెరిగింది. వ్యాట్ కూడా రాష్ట్రాలను బట్టి మారుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై వ్యాట్ 27 శాతం, డీజిల్‌పై 16.75 శాతం ఉంది. ముంబైలో వ్యాట్ పెట్రోల్‌పై 26 శాతానికి తోడు అదనపు ట్యాక్స్ రూ.7.12 వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై ఇక్కడ 24 శాతం సేల్స్ ట్యాక్స్ పడుతోంది. -
రాష్ట్రాల ప్రయోజనాలు పట్టని బడ్జెట్
కడప కార్పొరేషన్: 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుపయోగంగా మారిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. శనివారం కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల ప్రయోజనాలను మోదీ దృష్టిలో పెట్టుకోలేదన్నారు. ఆదాయ పెంపే లక్ష్యంగా ఎడా పెడా పన్నులు వేయడం దారుణమన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోవడం విచారకరమన్నారు. విభజన చట్టంలోని గిరిజన, సెంట్రల్, పెట్రోలియం యూనివర్సిటీలకు నామమాత్రంగా నిధులు కేటాయించారన్నారు. పోలవరానికి రూ.52వేల కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, రాజధానికి నిదుల కేటాయింపు జరగలేదన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధునికీకరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విధాన పరమైన చర్యలు చేపట్టకపోగా, పెట్రోల్, డీజిల్‌పై సుంకం విధించి సామాన్యుని జీవితం దుర్భరం చేశారని మండిపడ్డారు. రైతాంగానికి అదనంగా చేసిందేమీ లేదని పెదవి విరిచారు. దేశంలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగ యువతకు ఏ విధంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తారో చెప్పలేదన్నారు. సామాన్య మానవుని జీవన ప్రమాణాలు పెంచే వ్యవస్థను తీసుకురాకుండా ఆదాయం ఎలా పెంచుతారని ప్రశ్నించారు. బాబుకు ప్రతిపక్షనేతగా ఉండే అర్హత లేదు తాను ఎందుకు ఓటమిపాలయ్యాడో తెలుసుకోలేని చంద్రబాబుకు ప్రతిపక్షనేతగా ఉండే అర్హత లేదని సీఆర్సీ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుంటే, చంద్రబాబు అప్పుడే విమర్శలు చేస్తూ తన నైజాన్ని చాటుకున్నారన్నారు. మీడియాను ఎదుర్కొనే సత్తా లేక లోకేష్ ట్వీట్లపైన బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్ పాల్గొన్నారు. -
‘ప్రింట్’పై సుంకం కొరడా!
(సాక్షి, బిజినెస్ ప్రతినిధి): ఒకవైపు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్న డాలర్–రూపాయి విలువతో ఆందోళన చెందుతున్న ప్రింట్ మీడియాపై... శుక్రవారం నాటి బడ్జెట్ మరో బండను పడేసింది. దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్‌పై 10 శాతం సుంకం విధించడం ఈ రంగంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపించనుంది. ఎందుకంటే ఒకవైపు డిజిటల్ మీడియా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో ప్రింట్ మీడియాకు ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా విదేశాల్లో సైతం న్యూస్‌ప్రింట్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతేడాది ఒకదశలో టన్ను న్యూస్‌ప్రింట్ ధర 820 డాలర్లకు కూడా చేరింది. ఆ దెబ్బకు కొన్ని చిన్న పత్రికలు మూతపడ్డాయి కూడా. అక్టోబర్ తరువాత కొంత దిగిరావటం మొదలై.... రెండు నెలల కిందట ధరలు కాస్త స్థిరపడి.. ప్రస్తుతం టన్ను న్యూస్‌ప్రింట్ ధర 700 డాలర్లకు అటూఇటుగా ఉంది. నిజానికి చాలా వరకూ పత్రికలు తక్షణ ఇబ్బందులు రాకుండా ఐదారు నెలలకు సరిపడా నిల్వల్ని ముందే తెచ్చుకుని పెట్టుకుంటాయి. కాబట్టి తగ్గిన ధరల తాలూకు ఫలితం వాటికింకా అందలేదనే చెప్పాలి. పోనీ ఇప్పుడైనా ఉపశమనం దొరుకుతుందని భావించిన ప్రింట్ మీడియాపై శుక్రవారం నాటి బడ్జెట్ ఏకంగా బాంబునే వేసింది. ఇప్పటిదాకా వీటిపై దిగుమతి సుంకం లేకపోగా... ఒకేసారి 10 శాతం విధించటం గమనార్హం. ఈ చర్యతో మరిన్ని చిన్న, భాషా పత్రికలు మూతపడవచ్చనే ఆందోళన నెలకొంది. ‘‘ప్రకటనల ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఆశించిన సాయం అందించకపోగా ప్రభుత్వం ఇలా సుంకాలు మోపి దెబ్బతీయడం దురదృష్టకరం’’అని భారతీయ భాషా పత్రికల సంఘం (ఐఎల్ఎన్ఏ) అధ్యక్షుడు పరేష్‌నాథ్ తప్పుబట్టారు. ఆంగ్ల పత్రికలకు ప్రయివేట్ ప్రకటనలు, టెండర్ నోటిఫికేషన్ల రూపంలో ఆదాయం బాగానే వస్తుందని, దేశవ్యాప్తంగా విస్తరించిన చిన్న, మధ్య స్థాయి భాషా పత్రికలు ఈ భారాన్ని మోయలేవని ఆయన చెప్పారు. తక్కువ నాణ్యతతో, ఎక్కువ లాభాలు ఆర్జించాలని దేశీ న్యూస్‌ప్రింట్ తయారీదారులు ఆలోచిస్తున్నారని, వారి ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం దిగుమతి సుంకం విధించిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఈ సుంకాన్ని తక్షణం తొలగించాలని, తన చర్యను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
రాజకీయకోణంలోనే కేంద్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ కోణంలోనే కేంద్ర ప్రభుత్వం 2019–20 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని, ప్రధాని మోదీ తెలంగాణ పట్ల అనుసరిస్తు న్న కక్షపూరిత వైఖరికి కేంద్ర బడ్జెట్ అద్దం పడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శాసనసభ ఆవరణలోని టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలనే ధృక్పథం బడ్జెట్లో లోపించిందని, బడ్జెట్ ప్రతిపాదనల్లో సమాఖ్య స్ఫూర్తి కొరవడిందని విమర్శించారు. తెలంగాణలో 4 లోక్‌సభ స్థానాలను గెలుచు కున్న బీజేపీ..బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి చేసిం ది శూన్యమన్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించిన మరుసటి రోజే బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ తరఫున అమిత్‌షా ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా బడ్జెట్లో నయాపైసా కేటాయించలేదని కర్నె మండిపడ్డారు. అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడంపై అమిత్‌షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి బీజేపీ పక్షాన గెలిచిన ఎంపీలు.. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడాలన్నారు. బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రస్తావనే ఏదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ టీఆర్ఎస్ అడగలేదంటూ బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని.. గతంలో ప్రధాని మోదీని కలిసిన ప్రతీ సందర్భంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశంపై వినతి పత్రాలు సమర్పించారన్నారు. -
తెలంగాణలో బీజేపీ బలపడలేదు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలన ఉన్నంతకాలం తెలంగాణలో పాగా వేయటం బీజేపీకి అసాధ్యమని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీ అధినేతను ఢీకొనలేరని తేల్చి చెప్పారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్నేహభావంతో మెలిగే తత్వం ఉన్న తెలంగాణ ప్రజలు, విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను ఆదరించరని, సంఘ్‌పరివార్ ఆలోచనలను తిప్పిగొడతారన్నారు. గత ఐదేళ్లుగా ముస్లింలు, బడుగు బలహీనవర్గాలు, గిరిజనుల విద్యకోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలతో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్‌కు ప్రజలు అండగా ఉంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం బీజేపీ అధినేత అమిత్‌షా తెలంగాణకు రావటం ఆ పార్టీ అంతర్గత విషయమని, దాన్ని పట్టించుకోనన్నారు. కానీ, తెలంగాణలో పాగా వేసే చర్యల్లో భాగంగానే అమిత్‌షా ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణకు వచ్చినట్టయితే వారికి ఆశాభంగం తప్పదని ఆయన పేర్కొన్నారు. అత్యంత బలీయమైన శక్తిగా ప్రాంతీయ పార్టీలున్న ఒడిషా, తమిళనాడు, తెలంగాణలాంటి ప్రాంతాల్లో బీజేపీ ఎన్నటికీ విజయం సాధించలేదని, ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ కనుమరుగై ప్రాంతీయ పార్టీల హవా సాగుతోందన్నారు. గత ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ గెలవటం ఆ పార్టీ బలంగా ఉండటం వల్ల కాదని, మూడు చోట్ల అతి విశ్వాసం, ఒక స్థానంలో సరైన అభ్యర్థి లేకపోవటం టీఆర్ఎస్ ఓటమికి కారణమని అసదుద్దీన్ పరోక్షంగా పేర్కొన్నారు. ఇక భారీ విజయంతో వచ్చిన అహంకారం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోందని, ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఎమ్మెల్యే దాడికి పాల్పడటం, ఆయన మనుషులు తుపాకీతో రెచ్చిపోవటం ఇందులో భాగమేనన్నారు. అది మంచి పద్ధతి కాదంటూ ప్రధాని నరేంద్రమోదీ ఖండించిన వెంటనే ఆగ్రా వెళ్లే దారిలో ఓ ఎంపీ అనుచరులు టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడటం ఆ పార్టీ నాయకుల వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు. ఎన్నికల్లో సులభంగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టే నేతలు, టోల్ వద్ద రూ.50 చెల్లించేందుకు మనసు ఒప్పదా అని ప్రశ్నించారు. సోమవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరోసారి ప్రధాని ‘ఈ తీరు నచ్చదు’అని అంటారంటూ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌తో సామాన్యుని నడ్డి విరిచింది ఇక కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని, పేద ప్రజలపై ప్రేమ ఒలకబోసే మాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో వారిపై భారం మోపిందన్నారు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల పేదలకు అశనిపాతమే అవుతుందన్నారు. ఆదాయపన్నుపై సర్‌ఛార్జి కూడా భారంగా మారుతుందన్నారు. మోదీ తరచూ చెప్పే నారీ శక్తి మాటలకు, బడ్జెట్లో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చూస్తే ఎక్కడా పొంతన కనిపించదని విమర్శించారు. న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్ డ్యూటీ పెంపు, పుస్తకాల ధరలకు రెక్కలొచ్చే నిర్ణయాలు సరికాదని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కోటి మంది ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్స్ అంటూ ఘనంగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం, వారికి అందించే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్‌లో కోత పెట్టిందని విమర్శించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావనే లేదన్నారు. -
నిర్మలాజీ.. నిరాశపరిచారు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదని.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రాజెక్టులకు జాతీయహోదా అంశం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కనీసం ప్రస్తావనకు నోచుకోలేదని.. జాతి ప్రయోజనాల జాబితాలో తెలంగాణ ప్రాజెక్టులు లేవా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా శనివారం కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. అభివృద్ధిబాటలో ఉన్న తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని ట్విటర్ వేదికగా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ దృక్కోణంలో ఎలాంటి ప్రయోజనం కల్పించని కేంద్ర బడ్జెట్ 2019–20 ప్రతిపాదనలు పూర్తిగా నిరాశపరిచాయి. వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించినా.. మా విన్నపాలను మీరు పూర్తిగా విస్మరించారు’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథను నీతి ఆయోగ్ ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు ప్రతిష్టాత్మక పథకాలకు రూ.24 వేల కోట్లు కేటాయించాలని సిఫారసు చేసినా.. కనీసం 24 రూపాయలకు కూడా కేటాయించక పోవడం విడ్డూరం. తెలంగాణ ఆవిర్భవించి ఐదేళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలు ఊసేలేదు. బయ్యారం స్టీల్ ప్లాంటు, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ వంటి అంశాలు ప్రస్తావనకు నోచుకోలేదు. అభివృద్ధి బాటలో నడుస్తున్న కొత్త రాష్ట్రంపై ఎందుకు ఈ రకమైన వివక్ష’అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్దిలో లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్స్ అనేవి అత్యంత కీలకరంగాలు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు బడ్జెట్లో ఎలాంటి మద్దతు లేదు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటుపై కనీస ప్రస్తావన లేకపోగా, ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్ రంగానికి ఎలాంటి ప్రోత్సాహం లేదని’కేటీఆర్ అన్నారు. ‘పెట్రోల్, డీజిల్ ధర పెంపుతో దేశ ప్రజలపై నిత్యావసరాల భారం పెరుగుతుందని.. గుజరాత్ సీఎం హోదాలో ప్రస్తుత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు అంటూ గతంలో మోదీ ట్వీట్‌ను తన సందేశానికి కేటీఆర్ జత చేశారు. కేటాయింపుల్లో శూన్యహస్తం: కవిత ‘నిర్మలా సీతారామన్‌గారు.. ఒక మహిళగా మీరు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం చూసి ఎంతో గర్వించా. ఆర్థికసర్వేలో అనేక ప్రశంసలు అందుకున్న తెలంగాణకు కేటాయింపుల్లో శూన్య హస్తాన్నే అందించారు. ఈసారి బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు దక్కక పోవడం చాలా బాధాకరం’అని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్లో వ్యాఖ్యానించారు. -
కేంద్రబడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగింది