సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదని.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రాజెక్టులకు జాతీయహోదా అంశం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కనీసం ప్రస్తావనకు నోచుకోలేదని.. జాతి ప్రయోజనాల జాబితాలో తెలంగాణ ప్రాజెక్టులు లేవా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా శనివారం కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. అభివృద్ధిబాటలో ఉన్న తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని ట్విటర్ వేదికగా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ దృక్కోణంలో ఎలాంటి ప్రయోజనం కల్పించని కేంద్ర బడ్జెట్ 2019–20 ప్రతిపాదనలు పూర్తిగా నిరాశపరిచాయి. వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించినా.. మా విన్నపాలను మీరు పూర్తిగా విస్మరించారు’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథను నీతి ఆయోగ్ ప్రశంసించింది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు ప్రతిష్టాత్మక పథకాలకు రూ.24 వేల కోట్లు కేటాయించాలని సిఫారసు చేసినా.. కనీసం 24 రూపాయలకు కూడా కేటాయించక పోవడం విడ్డూరం. తెలంగాణ ఆవిర్భవించి ఐదేళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలు ఊసేలేదు. బయ్యారం స్టీల్ ప్లాంటు, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ వంటి అంశాలు ప్రస్తావనకు నోచుకోలేదు. అభివృద్ధి బాటలో నడుస్తున్న కొత్త రాష్ట్రంపై ఎందుకు ఈ రకమైన వివక్ష’అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్దిలో లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్‌టైల్స్ అనేవి అత్యంత కీలకరంగాలు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు బడ్జెట్‌లో ఎలాంటి మద్దతు లేదు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటుపై కనీస ప్రస్తావన లేకపోగా, ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్ రంగానికి ఎలాంటి ప్రోత్సాహం లేదని’కేటీఆర్ అన్నారు. ‘పెట్రోల్, డీజిల్ ధర పెంపుతో దేశ ప్రజలపై నిత్యావసరాల భారం పెరుగుతుందని.. గుజరాత్ సీఎం హోదాలో ప్రస్తుత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు అంటూ గతంలో మోదీ ట్వీట్‌ను తన సందేశానికి కేటీఆర్ జత చేశారు.
కేటాయింపుల్లో శూన్యహస్తం: కవిత
‘నిర్మలా సీతారామన్‌గారు.. ఒక మహిళగా మీరు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం చూసి ఎంతో గర్వించా. ఆర్థికసర్వేలో అనేక ప్రశంసలు అందుకున్న తెలంగాణకు కేటాయింపుల్లో శూన్య హస్తాన్నే అందించారు. ఈసారి బడ్జెట్‌లో తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు దక్కక పోవడం చాలా బాధాకరం’అని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment