న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం(నేడు) రిజర్వ్ బ్యాంక్ కేంద్ర బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక అంశాలను ఈ సందర్భంగా ఆమె ఆర్‌బీఐకి వివరించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యం ఇందులో ప్రధానంగా చర్చకు రానుంది. ఈ ఏడాది(2019–20) ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తాజా పూర్తిస్థాయి బడ్జెట్‌లో తగ్గించిన సంగతి తెలిసిందే. మధ్యంతర బడ్జెట్‌లో అంచనాలతో పోలిస్తే నికరంగా రూ.6,000 కోట్లు ఖజానాకు అదనంగా సమకూరనుండటంతో ఇది సాధ్యమైంది.
అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020–21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూడా జీడీపీలో 3 శాతానికి కట్టడి చేయడం, ప్రాథమిక లోటును పూర్తిగా తొలగించడం వంటి అంశాలతో రోడ్‌మ్యాప్‌ను సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటారు. అదేవిధంగా ద్రవ్యలోటు నుంచి కేంద్రం చెల్లించాల్సిన వడ్డీలను మినహానయిస్తే, మిగిలిన లోటును ప్రాథమిక లోటుగా వ్యవహరిస్తారు. ఇక ఆర్‌బీఐ మిగులు నిధుల విషయానికొస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.90,000 కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు అంచనా. గతేడాదితో పోలిస్తే(రూ.68,000 కోట్లు) ఇది 32 శాతం అదనం. అంతేకాదు ఇప్పటిదాకా ఆర్‌బీఐ నుంచి కేంద్రం అందుకున్న అత్యధిక డివిడెండ్‌గా కూడా ఇది నిలవనుంది.
Comments
Please login to add a commentAdd a comment