న్యూఢిల్లీ: ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తుల సరసన నిలిచే బలమైన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం దేశంలో మౌలిక వసతులను ప్రపంచస్థాయికి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతులు, డిజిటల్ ఎకానమీ, ఉద్యోగ కల్పన ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేదిశగా దూసుకెళ్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గ్రామాలు–పట్టణాల మధ్య నెలకొన్న దూరాన్ని చెరిపేస్తూ.. వీటిని కలిపే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. ‘సరైన అనుసంధానతే ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. అందుకే మౌలికవసతుల కల్పనకు ఏడాదికి రూ.20లక్షలకోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ దిశగా ఆర్థిక సహకారం కోసం క్రెడిట్ గ్యారెంటీ ఎన్‌హాన్స్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తాం. ఇందుకు సంబంధించి ఆర్బీఐ నియమ నిబంధనలు రూపొందిస్తోంది’అని మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రూ.80,250కోట్ల వ్యయంతో 1.25 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.
పీఎంజీఎస్‌వైతో అనుసంధానత
గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక–ఆర్థికపరమైన సానుకూలమార్పులు తీసుకురావడంతోపాటు అన్నిరకాల వాతావరణాల్లోనూ పట్టణ ప్రాంతాలతో అనుసంధానత విషయంలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. జాతీయ రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటుచేసే యోచనలోనూ ఉన్నట్లు చెప్పారు. 2018–19లో మొత్తం 300 కిలోమీటర్ల మేర మెట్రోలైన్‌లకోసం అనుమతులు ఇచ్చామన్న మంత్రి.. దేశవ్యాప్తంగా 657 కిలోమీటర్ల మెట్రోరైల్ నెట్‌వర్క్ వినియోగంలోకి వచ్చిందన్నారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎమ్సీ) ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన చెల్లింపుల వ్యవస్థ ద్వారా 2019 నుంచి మెట్రో సేవలు, టోల్ టాక్స్‌ల వద్ద వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
రైల్వేలకు రూ.50 లక్షల కోట్లు!
2018–30 మధ్య రైల్వేల్లో మౌలిక వసతులకల్పనకు రూ.50లక్షల కోట్ల పెట్టుబడుల అవసరముందని సీతారామన్ పేర్కొన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకున్న స్థలాల్లో.. ప్రజలకు అవసరమైన వసతుల నిర్మాణాలను చేపట్టే యోచన ఉందని ఆమె తెలిపారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆర్థికసాయం విషయంలో వినూత్నంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్న మంత్రి.. పూర్తయిన ప్రాజెక్టులను విక్రయించుకోవడం (బ్రౌన్‌ఫీల్డ్ అసెట్ మానిటైజేషన్) ద్వారా ఆర్థిక సమస్యలనుంచి బయటపడే విషయంలో భారత్ సానుకూల ఫలితాలను సాధించిందని వెల్లడించారు.
విమానయానానికీ ఊతం
పౌరవిమానయాన రంగాన్ని ప్రోత్సహించడంతోపాటుగా.. రోడ్లు, జలమార్గాలు, మెట్రో, రైలు రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పీఎం గ్రామ సడక్ యోజన, పారిశ్రామిక కారిడార్లు, సరుకుల రవాణాకు ప్రత్యేక కారిడార్లు, భారత్‌మాల, సాగరమాల, జల్‌మార్గ్ వికాస్, ఉడాన్ వంటి పథకాను తీసుకొచ్చామని నిర్మల గుర్తుచేశారు. ‘సామాన్యులకు సేవలందించేందుకు భారీ మౌలికవసతుల సంస్కరణలను తీసుకొచ్చాం. ఈ సంస్కరణలు కొనసాగేందుకు నిర్మాణ, మౌలికవసతుల రంగంతోపాటు, డిజిటల్ ఎకానమీ, చిన్న–మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగ కల్పన కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది’అని మంత్రి వెల్లడించారు.
భారత్‌మాల,సాగరమాలతో..
భారత్‌మాల కార్యక్రమం ద్వారా జాతీయ రహదారుల కారిడార్లు, హైవేలను కలుపుతుండగా.. సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టుల మధ్య అనుసంధానత పెరుగడంతోపాటు.. పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ ఆధునీకరించబడుతోంది. జల్‌మార్గ్ వికాస్ ప్రాజెక్టు ద్వారా జాతీయ జలమార్గాలను నిర్మించడంతోపాటు జల రవాణాను మరింతగా ప్రోత్సహించే కార్యక్రమాలను కేంద్రం చేపట్టింది. రైలు, రోడ్డుమార్గాలకంటే అంతర్గత జలరవాణా ద్వారానే రవాణా వ్యయం తగ్గుతుంది. తద్వారా దేశీయంగా తయారైన వస్తువుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని కేంద్రం భావిస్తోంది. 2018 నవంబర్‌లో వారణాసిలో గంగానదిపై జలరవాణా టెర్మినల్ ప్రారంభం వినియోగంలోకి వచ్చింది. 2019–20ల్లోగా షాహిబ్‌గంజ్, హల్దియాల్లో టెర్మినల్స్ పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలో గంగానదిపై కార్గోల ద్వారా రవాణా నాలుగురెట్లు పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉడాన్ పథకం ద్వారా గ్రామీణ–పట్టణ తేడాలను కలిపేసే ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఉన్న భారత్.. విమాన కొనుగోలుకు ఆర్థికసాయం అందించడంతోపాటు భారత గడ్డపైనుంచి విమానసేవలను ప్రారంభించేందుకు అవసరమైన ‘లీజింగ్’కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించనున్నట్లు నిర్మల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment