న్యూఢిల్లీ: రైల్వేల సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించారు. రైల్వేలో మౌలిక వసతుల కల్పన కోసం 2018 నుంచి 2030 సంవత్సరాల మధ్య రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని ఆమె తెలిపారు. ఈ బడ్జెట్‌లో రైల్వే కోసం రూ. 65,837 కోట్ల నిధులను కేటాయించారు. అలాగే మూలధన వ్యయం కింద గతంలో ఎన్నడూ లేనంతగా, అత్యధికంగా రూ. 1.6 లక్షల కోట్లను ఇచ్చారు. కొత్త రైల్వే మార్గాల నిర్మాణానికి రూ. 7,255 కోట్లు, గేజ్ మార్పిడికి రూ. 2,200 కోట్లు, డబ్లింగ్‌కి రూ. 700 కోట్లు, సిగ్నలింగ్, టెలికాం విభాగానికి రూ. 1,750 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.
రోలింగ్ స్టాక్ అవసరాల కోసం మరో రూ. 6,114.82 కోట్లు ఇచ్చారు. విభాగాల వారీగా చూస్తే చాలా వరకు విభాగాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చేసిన కేటాయింపులనే ఇప్పుడూ కొనసాగించారు. వాటిలో ఏ మాత్రం మార్పులు చేయలేదు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మల మాట్లాడుతూ ‘ప్రత్యేక ప్రయో జక వాహకాల (ఎస్పీవీ) ద్వారా సబర్బన్ రైల్వేల్లో పెట్టుబడులు పెట్టేందుకు, పీపీపీ పద్ధతిలో మెట్రో రైల్ నెట్‌వర్క్‌లో భాగం అయ్యేందుకు రైల్వే శాఖను ప్రోత్సహిస్తాం’ అని చెప్పారు. సరకు రవాణా కోసం నదీ మార్గాలను కూడా ఉపయోగించుకోవడం ద్వారా రోడ్డు, రైల్వేలపై భారం తగ్గించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోందని ఆమె తెలిపారు.
ప్రయాణికుల సదుపాయాలకు 3 వేల కోట్లు
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చెప్పుకోదగ్గ మొత్తంలోనే నిధులను బడ్జెట్‌లో కేటాయించారు. సౌకర్యాల మెరుగుదలకు రూ. 3,422.57 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం బడ్జెట్‌లో తెలిపింది. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల సౌకర్యాలకు 200శాతం నిధులు కేటాయించారు. అయితే రైల్వేకు రెవెన్యూ వ్యయాలు తలనొప్పిగా మారాయి. ఉద్యోగుల జీతాల కోసం దాదాపుగా రూ. 86,554.31 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. గతేడాది కంటే ఇది రూ. 14 వేల కోట్లు ఎక్కువ. నిర్భయ నిధి కోసం రూ. 267.64 కోట్లు, వీడియో నిఘాకు ఉపయోగించే వ్యవస్థకు రూ. 250 కోట్లు, కొంకణ్ రైల్వే కార్పొరేషన్‌కు రూ. 17.64 కోట్లు కేటాయించారు. మొత్తంగా రైల్వేకు 2019–20లో రూ. 2,16,675 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనా వేసింది. కాగా, 2018 ఏడాదిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేకు మూలధన వ్యయం కింద రూ. 1.48 లక్షల కోట్లు ఇవ్వడంతోపాటు బడ్జెట్‌లో రూ. 55,088 కోట్ల నిధులు కేటాయించారు.
ఆస్తులను అమ్మం,ఉద్యోగ భద్రత ఉంటుంది
రైల్వే మంత్రి పియూష్ గోయల్
రైల్వే ఉత్పత్తి యూనిట్లను, ఇతర ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేయను న్నారనే భయాలపై ఆ శాఖ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను అమ్మే ఆలోచన రైల్వేకి లేదనీ, ప్రైవేటీకరణ ద్వారా ఉద్యోగాలు పోతాయనడం అవాస్తవమని తెలిపారు. ట్రైన్–18ని తయారు చేసిన, ట్రైన్–20ని తయారు చేస్తున్న మన ఫ్యాక్టర్లీలోనే మెట్రో రైల్ బోగీలను కూడా తయారు చేసేందుకు తాము పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment