ప్రజాప్రయోజనాలకు పట్టం కట్టిన బడ్జెట్‌ | National Budget With Include People Interest Says Bala Shankar | Sakshi
Sakshi News home page

ప్రజాప్రయోజనాలకు పట్టం కట్టిన బడ్జెట్‌

Published Sun, Jul 7 2019 4:51 AM | Last Updated on Sun, Jul 7 2019 4:51 AM

National Budget With Include People Interest Says Bala Shankar - Sakshi

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరవ బడ్జెట్‌ ఆయన రెండో దఫా పాలనకు అభినందనలు తెలిపిన బడ్జెట్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. జవహర్‌లాల్‌ నెహ్రూ, మన్మోహన్‌ సింగ్‌ తర్వాత అయిదేళ్ల పూర్తి కాలం తర్వాత మరోసారి కేంద్రంలో ఎన్నికైన మూడో ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. నూతన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు ఢిల్లీలో వర్షం కురి సింది, సెన్సెక్స్‌ కూడా తాత్కాలికంగా కుప్పగూలింది. ఇది ఏరకంగా చూసినా విశిష్టమైన సందర్భం. అవకాశాలను విస్తరించిన సందర్భం. నరేంద్రమోదీ రెండో దఫా పాలనలో తొలి బడ్జెట్‌ సందర్భంగా శుక్రవారం ఉదయం అందరి ఆశలూ ఆకాశాన్ని అధివసించాయి. తొలి దఫా పాలనలో మోదీ ఆర్థిక వ్యవస్థను చక్కగా నిర్వహించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి భారీ సంస్కరణలతోపాటు, సులభతరమైన వాణిజ్యం, ద్రవ్యోల్బణ నియంత్రణ, ద్రవ్యలోటును తగ్గించడం, ఆర్థిక వృద్ధిరేటను 7శాతం వద్ద నిలకడగా కొనసాగించడం వంటి చర్యలు మోదీ ప్రతిష్టను మరింతగా నిలిబెట్టాయి. ఇప్పుడు  ఆయన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచడంపై దృష్టిపెట్టింది. ఇది ప్రస్తుతం ఉన్న 2.7 ట్రిలియన్‌ డాలర్లనుంచి పెనుగంతు వేయడం లాంటిదే. ఉపాధి కల్పన, వృద్ధి, ఆర్థిక వ్యవస్థపై డేటాను స్థిరీకరించడం, ఆర్థిక వ్యవస్థను మెరుగు చేయడంలో సమస్యలు, పన్నుల తగ్గింపు, ఆదాయ పెంపు, ద్రవ్య సమతుల్యతను కొనసాగించడం వంటి భారీ సవాళ్లు ప్రస్తుత కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. 

ప్రైవేట్‌ పెట్టుబడులు ఇప్పటికీ ఒడిదుడుకులతో సాగుతుండటంతో ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చి, పబ్లిక్‌ పెట్టుబడి ఆధారంగా ఉద్యోగాలను కల్పించడం పెనుసవాలుగా మారుతోంది. కేంద్రప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన భారీ పథకాలు ఉజ్వల, సౌభాగ్య.. వంట గ్యాస్, విద్యుత్‌ సరఫరాను అవసరమైన వారికి అందించి కోట్లమంది జీవితాలను సౌకర్యవంతంగా మార్చాయి. దాదాపుగా 1.95 కోట్ల గృహాలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద తగినంతమేరకు ప్రయోజనాలు లభించాయి. ఇక ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన పథకంతో రూ. 80,200 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 1.25 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించడమైంది. గత అయిదేళ్లుగా దేశం సాధించిన ప్రయోజనాలను మరింత సంఘటితం చేయడంపై తాజా బడ్జెట్‌ దృష్టి సారించింది. గావ్, గరీబ్, కిసాన్, స్వదేశీలపై మరింతగా కేంద్రీకరించనున్నారు. ఆర్థిక వృద్ధి నమూనాను ప్రతిపాదించడమే కాకుండా, ప్రతిరంగంలోనూ ప్రైవేటీకరణకు, విదేశీ పెట్టుబడులను స్వాగతించడం కోసం విస్తృతంగా తలుపులు తెరవటం జరుగుతోంది.  2018–2030 మధ్యలో ఒక్క రైల్వే మౌలిక వసతుల కల్పనకే దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల మదుపు అవసరముంది. కాలం చెల్లిన పవర్‌ ప్లాంట్లను తప్పించి మెరుగైనవాటి కల్పన కోసం అత్యున్నత స్థాయి సాధికారిక కమిటీకి సిఫార్సు చేయనున్నారు. ఉదయ్‌ ఇప్పటికే ఈ విషయంలో ఎంతో సహకరించింది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత వృద్ధి చెందనుంది.


పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ లీడర్లు, కార్పొరేట్‌ సౌవరిన్, వెంచర్‌ ఫండ్లు అనే మూడు గ్లోబల్‌ ప్లేయర్లను ఏకత్రాటికి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం వార్షిక గ్లోబల్‌ మీట్‌కు ప్లాన్‌ చేస్తోంది. గడచిన సంవత్సరాల్లో పెద్దగా విజయం సాధించని మేక్‌ ఇన్‌ ఇండియాకు ఈ బడ్జెట్‌ మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇక టూరిజం, విద్య, సంస్కృతి వంటి వెనుకబడిన రంగాలపై తాజాగా దృష్టి పెట్టనున్నారు. సరళీకరణ అనంతర దశలో అభివృద్ధి చోదకశక్తులుగా గుర్తింపు పొందిన ఐటీ, విద్య, సేవారంగాలు గత అయిదేళ్లుగా మంచి పనితీరు కనబర్చలేదు. భారత్‌మాల రోడ్‌ కనెక్టివిటీని పెంచే ప్రాజెక్టుగా ఖ్యాతి పొందనుంది. సాగరమాల అనేది ఓడరేవులు, జలమార్గాల కనెక్టివిటీలో ఇతోధికంగా తోడ్పడనుంది. వీటితో మౌలిక వసతుల కల్పనా రంగం తిరిగి గాడిన పడుతుంది. నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో వేతనజీవులు, మధ్య ఆదాయ బృందాలు, రైతులు, యువజనులు ప్రధాన లబ్ధిదారులు అవుతున్నారు. పైగా సగటు మనిషి జేబులో మరింత డబ్బును ఉంచేందుకు ఈ బడ్జెట్‌ ప్రయత్నించింది. ఇది డిమాండును మరింతగా పెంచి వృద్ధికి తోడ్పడుతుంది. మొత్తంమీద నిర్మల బడ్జెట్‌ వాణిజ్య అనుకూల బడ్జెట్‌ అనే చెప్పాలి.

డాక్టర్‌ ఆర్‌ బాలశంకర్, బీజేపీ సెంట్రల్‌ కమిటీ మెంబర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement