సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్ వాహనదారులకు వాత పెట్టింది. సామాన్యులకు మళ్లీ పెట్రో మంట అంటుకుంది. ఇప్పటికే రోజువారి సవరణతో పెట్రో, డీజిల్ ధరలు పైసా పైసా ఎగబాకుతూ పరుగులు తీస్తుండగా.. బడ్జెట్‌లో సుంకాలు పెంపు మరింత భారంగా మారనున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్‌పై ఎక్సైజ్ డ్యూటీ, సెస్ రూపాయి చొప్పున బడ్జెట్‌లో పెంచారు. ఫలితంగా హైదరాబాద్‌లో పెట్రోల్‌పై రూ.2.69, డీజిల్‌పై రూ.2.65 అదనపు భారం పడింది. దాంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.74.88, డీజిల్ రూ.70.06 గా ఉన్నవి కాస్తా శుక్రవారం రాత్రి నుంచి పెట్రోల్ రూ.77.57, డీజిల్ రూ.72.71కు చేరాయి. హైదరాబాద్ పరిధిలో సుమారు 60.34 లక్షల వివిధ రకాల వాహనాలున్నాయి. అందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 44.04 లక్షలు, డీజిల్ బస్సులు, మినీ బస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరాత్ర వాహనాలు కలిపి సుమారు 20.30 లక్షల వరకు ఉంటాయని అంచనా. మహానగరం పరిధిలో సుమారు 560 పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్ నిర్ణయంతో గ్రేటర్‌లోని వాహనదారుల నుంచి రోజుకు సగటున రూ.కోటిన్నరకు పైగా అదనపు భారం పడనుంది.
పన్నుల మోతనే..
పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణ చార్జీల బాదుడు కారణంగా కనిపిస్తోంది. పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్ పన్నుల విధింపు అధికంగానే ఉంది. నగరంలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. వాస్తవంగా పెట్రో ఉత్పత్తులపై రెండు రకాల పన్నుల విధిస్తుండడంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధిస్తున్నాయి.
ప్రజలపై పన్ను భారం తగదు
ఇప్పటికే పెట్రో, డీజిల్ ధరలు రోజువారి సవరణతో పెచడం భారంగా మారింది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్‌లో సుంకాలు పెంపు మరింత భారమే. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ఎక్సైజ్, అమ్మకం పన్ను వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఖాజానా నింపేందుకు ప్రజలపై పన్ను బాదుడు తగదు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులు చేర్చితే ధరలు దిగి ఉపశమనం కలుగుతుంది.
– బందగి బద్‌షా రియాజ్ ఖాద్రీ, చైర్మన్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్
హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య ఇలా
ద్విచక్ర వాహనాలు 44,04,669
కార్లు 10,35,965
సరుకు రవాణా 2,50,329
ఆటోరిక్షాలు 1,46,757
క్యాబ్‌లు 80,420
ట్రాక్టర్లు 32,595
విద్యాసంస్థల బస్సులు 12,944
మ్యాక్సి క్యాబ్‌లు 18,510
స్టేజీ క్యారియర్లు 8,391
కాంట్రాక్టు క్యారేజ్ 5,949
ఇరత వాహనాలు 37,869
స్వర్ణం మరింత ప్రియం
సాక్షి,సిటీబ్యూరో: సామాన్యులకు బంగారం మరింత ప్రియం కానుంది. సంపన్నులు మొదలు సామాన్యుల వరకు పెళ్లిళ్లు, శుభకార్యాల్లో తప్పనిసరిగా కొనుగోలు చేసే ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం పన్ను భారం మోపింది. కేంద్ర బడ్జెట్ నిర్ణయం ఫలితంగా బంగారం కొనుగోలుపై 12.5 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధిస్తారు. ప్రస్తుతం వీటిపై 10 శాతం మాత్రే వసూలు చేస్తున్నారు. అదనంగా జీఎస్టీ మోత కూడా మోగుతుంది. ఇప్పటికే రూపాయి బలహీనపడటం, చమురు ధరలు తక్కువగా ఉండటంతో బంగారం ధర భారీగా పెరిగింది. ఇప్పుడు ఈ పన్నులు కూడా తోడయితే మరింత ధర మండడం ఖాయమేనని చెప్పొచ్చు. బంగారం విక్రయాలకు హైదరాబాద్ నగరం పెట్టింది పేరు. సీజన్, బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా సిటీలో ప్రతిరోజు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాల విక్రయాలు సాగుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు తెలంగాణ జిల్లాల నలుమూలల నుంచి రాజధానికే వచ్చి బంగారం కొనుగోలు చేయడం పరిపాటి. ప్రస్తుతం నగరంలో బంగారం 10 గ్రాముల ధర (22 క్యారెట్) రూ.32,520, 24 క్యారెట్స్ అయితే రూ.34,300గా ఉంది. దీనిపై అదనంగా సుమారు రూ.110 వరకు పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment