కేంద్ర బడ్జెట్ నగరవాసికి నిరాశేమిగిల్చింది. నిత్యావసరాలైన పెట్రోల్, డీజిల్‌పై అదనపు సర్‌చార్జ్ విధింపు ఫలితంగా నగరవాసిపై రోజూకోటిన్నర రూపాయల అదనపు భారం పడనుంది. ఆదాయ పన్ను స్లాబ్‌లో ఎలాంటి మార్పులు సైతంలేకపోవటంతో వేతన జీవులనుఆకట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో అట్టడుగు, మధ్య తరగతి వర్గాలు సొంతింటి కలను నెరవేర్చుకునే దిశగా రూ.45 లక్షల లోపు ఇళ్ల కొనుగోలుపై రూ.3.5 లక్షల వడ్డీ రాయితీ ప్రకటన సంతోషం నింపగా, నగరంలో రియల్టీకు మరింత ఊపు తెచ్చింది. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కోటి రూపాయలవరకు షరతుల్లేని రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించటంతో ఇప్పటికేఐదువేల వరకు ఉన్న మధ్య తరహా పరిశ్రమల యూనిట్ల విస్తరణ, కొత్తవి ఏర్పాటు అయ్యేఅవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇక స్టార్టప్ కంపెనీల్లోపెట్టుబడులపై ఐటీ శాఖ మినహాయింపు ఇవ్వటంతో నగరంలో ఐటీ స్టార్టప్‌ల వెల్లువెత్తునున్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. డీజిల్ ధరల పెంపుతో గ్రేటర్ ఆర్టీసీ మరింత చతికిలబడే అవకాశం ఉంది. ఇప్పటికే నష్టాల బాటలోకూరుకుపోయిన ఆర్టీసీకి ప్రతి నెలా మరో కోటిన్నర అదనపు భారం పడనుంది. ఇక దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి కూడా ఈ బడ్జెట్‌లో పెద్దగా భారీప్రాజెక్టులేవీ ఉండే అవకాశం లేదని సమాచారం.గత బడ్జెట్‌లోనే ప్రతిపాదించిన పనులు పట్టాలెక్కని పరిస్థితి ఉండగా, తాజా బడ్జెట్ సైతం పాత ప్రతిపాదనలకు కొనసాగింపుగానే ఉండే ఛాన్స్ ఉన్నట్లు రైల్వే కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర బడ్జెట్ అంత ఆశాజనకంగా ఏమీ లేదని సెంటర్ ఫర్ సొషల్ స్టడీస్ డైరెక్టర్ రామచంద్రయ్యఅభిప్రాయపడ్డారు.
సాక్షి,సిటీబ్యూరో: రూ.45 లక్షలలోపు గృహాలపై రూ.3.5 లక్షల వడ్డీరాయితీ ప్రకటించడంతో గ్రేటర్ పరిధిలో వేతనజీవులు, మధ్యతరగతి వర్గానికి కలిసొచ్చే అశం. దీంతో శివార్లలో అపార్ట్‌మెంట్లు, సొంత గృహాల నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. మహానగరం ప్రస్తుతం ఓఆర్‌ఆర్ పరిధి వరకు విస్తరించడంతో ఆయా ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు భారీగా పెరిగే అవకాశాలున్నట్లు రియల్టీ వర్గాలు చెబుతున్నాయి.
చిన్న పరిశ్రమలకు పెద్ద ఊరట
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు షరతులు లేని రుణాలు మంజూరు చేస్తామని ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడంతో ఆయా రంగాలు సంతోషంలో మునిగాయి. గ్రేటర్ పరిధిలో సుమారు ఐదువేలకు పైగా ఈ తరహా పరిశ్రమలుంటాయి. రుణం మంజూరైతే మూలధన కొరత ఉండదని, పరిశ్రమల విస్తరణ, ఉత్పత్తులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
స్టార్టప్, ఐటీ రంగాలకు ఊపు
సాంకేతిక, సేవల రంగంలో నూతన ఒరవడిని సృష్టించే నవకల్పనలకు తాజా బడ్జెట్ పెద్దపీట వేసింది. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఐటీశాఖ స్కూృటినీ పరిధి నుంచి మినహాయించడం.. దూరదర్శన్‌లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా చానల్ ఏర్పాటు వంటివి ఈ రంగానికి కలిసొస్తుంది. ప్రధానంగా ఐటీ రంగానికి కొంగుబంగారంగా ఉన్న గ్రేటర్ సిటీలో తాజా బడ్జెట్‌తో నూతన సాఫ్ట్‌వేర్ కంపెనీలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు మరింత వెసులుబాటు ఉంటుందని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్(హైసియా) వర్గాలు చెబుతున్నాయి. తద్వారా ఉద్యోగ అవకాశాలు సైతం భారీగా కల్పించవచ్చంటున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలకు మహర్దశ
సాక్షి,సిటీబ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపుతో నగరంలో ఆ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ వాహనాలపై జీవితకాల పన్ను మినహాయింపు మాత్రమే లభిస్తుండగా.. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు పలు నిర్ణయాలు తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు, తదితర వాహనాలపై జీఎస్‌టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు జీఎస్‌టీ మండలి ముందు ఈ ప్రతిపాదనను ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. గ్రేటర్‌లో ఇప్పటి దాకా ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం 3926 మాత్రమే తిరుగుతున్నాయి. వీటిలో బైక్‌లే ఎక్కువ. కార్లు, ఇతర వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. విద్యుత్ చార్జింగ్ పాయింట్‌లు తగినంత అందుబాటులో లేకపోవడంతో పాటు వాహనాలపైన పెద్దగా ప్రోత్సాహకాలు కూడా లేకపోవడంతో కొనుగోళ్లు అంతగా లేవు. తాజా ప్రతిపాదనలతో ఈ వాహనాల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బైక్‌లపై రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు, కార్లపై రూ.25 వేలకు పైగా తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రజా రవాణా రంగంలో బ్యాటరీ బస్సులను ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ నగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. మరో 600 బస్సుల కోసం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. వీటిలో 300 బస్సులను గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంలో భాగంగా ఆర్టీసీ ఆశించిన విధంగా బ్యాటరీ బస్సులు లభిస్తే పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేసినట్లవుతుంది.
చార్జింగ్ పాయింట్లు ఎక్కడ?
ఎలక్ట్రిక్ వాహనాలపై పన్న తగ్గింపు ప్రోత్సాహకమే అయినప్పటికీ అదే స్థాయిలో చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సాధారణ ప్రజలకు అలాంటి సదుపాయం లేదు. ఆర్టీసీ, రైల్వే వంటి సంస్థలే సొంతంగా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. భవిష్యత్‌లో పెట్రోల్ బంకుల స్థాయిలో విద్యుత్ చార్జింగ్ కేంద్రాలు పెరిగితే తప్ప ఈ తరహా వాహనాల వినియోగం పెరిగే అవకాశం లేదు.
అరకోటి దాటిన వాహనాలు
హైదరాబాద్‌లో ఇంధన వాహనాల సంఖ్య ప్రస్తుతం అరకోటి దాటింది. సుమారు 30 లక్షల బైక్‌లు, మరో 15 లక్షల కార్లు, 5 లక్షలకు పైగా ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సులు, క్యాబ్‌లు ఉన్నాయి. ఈ వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో నగరటంలో ప్రజారోగ్యానికి పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో కాలుష్య రహిత, పర్యావరణ హితమైన వాహనాల అవసరం ఎంతో ఉంది. కానీ ఇప్పటి వరకు వీటిపైన ఒక నిర్ధిష్టమైన విధానం లేకపోవడంతో వాహనదారులు కొనేందుకు ముందుకు రావడం లేదు. కేంద్రం పేర్కొన్నట్లుగా జీఎస్‌టీ తగ్గింపుతో వాహనాల ధరలు తగ్గితే పర్యావరణ పరిరక్షణకు మేలు జరగుతుంది.
మహిళకు మరింత ఆసరా
సాక్షి,సిటీబ్యూరో: సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ మహిళలకు ‘ముద్ర యోజన’ కింద గ్రూప్‌లో ఒకొక్కరికి రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడంతో నగరంలోని 10,690 గ్రూపుల్లోని మహిళలకు ఆర్థిక ఆసరా లభించనుంది. సక్రమంగా నిర్వహిస్తున్న గ్రూపులకు ఇప్పటికే రూ.10 లక్షల చొప్పున వరకు బ్యాంకు రుణం లభిస్తుండగా, బడ్జెట్‌లో ముద్ర రుణం కింద ప్రకటించడం అదనపు ఆసరా కానుందని భావిస్తున్నారు. ఇదే కాక జన్‌ధన్ ఖాతా గల మహిళలకు రూ.5 వేలు ఓవర్ డ్రాప్ట్ సదుపాయం కూడా వారికి ఉపకరించేదేనని చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీలో గత ఆర్థిక సంవత్సరం 8,337 సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు రూ.323 కోట్లకు పైగా రుణాలు అందజేయగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి దాకా 700 గ్రూపులకు రూ.31.45 కోట్ల రుణసాయం అందించారు.
పరిశ్రమలకుఇంకా ఇవ్వాల్సింది
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని రాయితీలు ప్రకటిస్తే బాగుండేంది. ఎంఎఎస్‌ఎంఈ పరిశ్రమలకు సులభతర రుణాలు జారీ చేస్తామనడం సంతోషం. కానీ బ్యాంకర్లు సవాలక్ష షరతులు విధించి రుణం ఆశలు ఆవిరయ్యేలా చేయకుండా చూడాలి.– అనిల్‌రెడ్డి, ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చర్స్‌అసోసియేషన్ సౌతిండియా ఉపాధ్యక్షుడు
ఆహ్వానించదగ్గపరిణామం
ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపు ఆహ్వానిందగిన పరిణామం. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఓలా క్యాబ్‌లలో ఈ వాహనాలనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం. త్వరలో హైదరాబాద్‌లోనూ ఓలా ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తేనున్నాం. ప్రభుత్వం బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు స్టార్టప్‌లకు సైతం ఎంతో ప్రోత్సాహకంగా ఉన్నాయి.– భవీష్ అగర్వాల్, ఓలా కో– ఫౌండర్
నిరుత్సాహపరిచింది
బడ్జెట్ అందరికీ ఊరటనిస్తుందనుకున్నాం. కానీ పూర్తి విరుద్ధంగా ఉంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపింది. విభజన అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. బంగారంపై భారం మోపడం సామాన్యులకు ఇబ్బందే. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు రాయితీలు ఇస్తే బాగుండేది.– ఎంకే బద్రుద్దీన్, టీఆర్‌ఎస్ మైనార్టీ నేత
ఆర్టీసీపై డీజిల్ ధర పిడుగు: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం పీకల్లోతు నష్టాల్లో గ్రేటర్ ఆర్టీసీ ప్రతినెలా రూ.1.5 కోట్లమేర భారం
ఆర్టీసీపై మరోసారి ఇంధనభారం పడనుంది. ఇప్పటికే సుమారు రూ.550 కోట్ల భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీకి.. కేంద్ర బడ్జెట్ పిడుగుపాటుగా మారింది. డీజిల్‌పై పెరిగిన ధరలతో ప్రతినెలా మరో రూ.1.5 కోట్ల మేర అదనపు భారం పడనుంది. క్రమం తప్పకుండా పెరుగుతున్న డీజిల్ ధరలు ఏటా ఆర్టీసీకి శరాఘాతంగా మారుతున్నాయి. ప్రతిరోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందిస్తున్న అతి పెద్ద ప్రజారవాణా సంస్థ ఆర్టీసీ. కానీ బస్సుల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వస్తున్న ఆదాయం కంటే ఖర్చులు రెట్టింపు ఉండడంతో ఎటేటా సంస్థ అప్పుల్లో కూరుకుపోతోంది. ఇప్పుడు మరోసారి డీజిల్ ధర పెంపు మరింత భారంగా మారే అవకాశం ఉంది. గ్రేటర్ ఆర్టీసీలోని 29 డిపోల్లో మొత్తం 3,850 బస్సులు ఉన్నాయి. వీటిలో డిపో స్పేర్ బస్సులు మినహాయించి ప్రతిరోజు 3,500 బస్సులు ప్రయాణికుల సేవల్లో ఉంటున్నాయి. ఈ బస్సులు రోజుకు 9.7 లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. ఆర్టీసీలో బస్సులు సగటున 4 కిలోమీటర్లకు లీటర్ డీజిల్ ఖర్చవుతున్నట్టు అంచనా. సిటీ బస్సుల కోసం ప్రతిరోజు 2.19 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. తాజాగా పెరుగనున్న డీజిల్ ధరల వల్ల ప్రతినెలా రూ.1.5 కోట్ల భారం తప్పదని సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment