సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం తన లక్ష్యమని రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద్ర మోదీ గట్టిగా చెప్పారు. అదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 2024–2015 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ లక్ష్యాన్ని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అదెలా సాధ్యమని నేడు ఆర్థిక నిపుణులందరి ప్రశ్న.
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 2.8 ట్రిలియన్ (ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) డాలర్లు ఉంది. దాన్ని ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమంటే దాదాపు రెండింతలు చేయడం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పటి ఉంచి జీడీపీ (దేశ జాతీయ స్థూల ఉత్పత్తి) రేటు ఐదేళ్లపాటు వరుసగా 8 శాతం నికరంగా ఉండాలని ఆర్థిక నిపుణులు ఇది వరకే తేల్చి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద లెక్కల ప్రకారమే 2018–19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ రేటు 6.8 శాతం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ కాలం నాటి లెక్కల ప్రకారం అది 5.7 శాతమే. పాత వివాదాన్ని పక్కన పెట్టి కొత్త లెక్కలే ప్రమాణంగా తీసుకున్నా 2019–20 సంవత్సరానికి జీడీపీ రేటు 7 శాతానికి చేరుకుంటుందని, ఆ తర్వాత మిగతా కాలానికి సరాసరి 7.6 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు అంచనా వేశారు. ఎనిమిది శాతం జీడీపీ సాధించకుండా దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం ఎలా సాధ్యం?
గత నరేంద్ర మోదీ ప్రభుత్వంగానీ, అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంగానీ లక్ష్యంగా పెట్టుకున్న జీడీపీ రేటును సాధించిన దాఖలాలు లేవు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే రెండంకెల జీడీపీ రేటును సాధించి తీరుతామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. ఈ రెండో పర్యాయమైన ఆయన రెండంకెల జీడీపీని సాధిస్తే ఐదు ట్రిలియన్లే కాదు, ఆరు ట్రిలియన్ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్ల వచ్చు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కీర్తి, ప్రతిష్టలను సాధించవచ్చు.
ఆశించిన ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలంటే అన్ని రంగాల్లో ఆర్థిక పెట్టుబడులను ప్రోత్సహించడమే ప్రధాన ఆయుధమని ఆర్థిక సర్వే సూచనలను శిరసా వహించనున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. చిన్న, మధ్య పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని సాధించడంతోపాటు యువత ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచవచ్చని నిర్మలా సీతారామన్ చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వాటిని ప్రోత్సహిస్తుందో ఆమె వివరించలేదు. ప్రైవేటు పెట్టుబడిదారులకు పన్ను రాయతీలు కల్పించడంతోపాటు విమాన సర్వీసుల్లో వారికి ప్రాధాన్యత కల్పించాలంటూ ఆర్థిక సర్వే చేసిన సూచనలను ఆమె పరిగణలోకి తీసుకుంటారేమో! ‘మేకిన్ ఇన్ ఇండియా’ కింద ప్రైవేటు పెట్టుబడులతో వెలసిన పలు స్టార్టప్ కంపెనీలు మూత పడుతున్న తరుణంలో పారిశ్రామిక పెట్టుబడులు వచ్చి పడడం కష్టమే. (చదవండి: వాహనదారులకు పెట్రో షాక్)
Comments
Please login to add a commentAdd a comment