సాక్షి, న్యూఢిల్లీ: కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు మూడు విడతలుగా ఇస్తున్న రూ.6 వేల సాయం రైతులను అవమానించేదిగా ఉందని కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ బడ్జెట్ పద్దులపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ నుంచి ప్రధాన వక్తగా ఉత్తమ్ మాట్లాడారు. ‘2018–19 సంవత్సరానికి గానూ వ్యవసాయానికి బడ్జెట్‌లో రూ.75,753 కోట్లు కేటాయించి చివరకు 29 శాతం కోత విధించి రూ.53 వేల కోట్ల వ్యయం చేశారు. నేడు దేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. శాస్త్రీయమైన కనీస మద్దతు ధరలు లేకపోవడం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విషయంలో లోపభూయిష్ట విధానాలు, సరైన పంట ల బీమా సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం దుర్భరంగా మారి రోజూ 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో రోజురోజుకూ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరం. ఒక్కో ఏడాది 11 నుంచి 13 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2016 నుంచి రైతు ఆత్మహత్యలపై అధికారిక గణాంకాలు లేకపోవడం విచారకరం’ అని అన్నారు. దేశంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, కౌలు రైతులు వాణిజ్య పంటల వేసుకోవడం వల్ల వారికి పెట్టుబడి అధికమై నష్టాలు వచ్చినపుడు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. దేశంలో కోట్లాది మంది కౌలు రైతులకు ఉపయోగపడేలా ఒక చట్టం తేవాలని, గతంలో ఉమ్మడి ఏపీలో ఇలాంటి కౌలుదారు హక్కుల చట్టం తేవడం జరిగిందని, ఇలాంటి చట్టం దేశంలోనూ తెస్తే కోట్లాది మంది కౌలు రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.
రైతు ఆదాయం ఎంత పెంచారు?
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016–17లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇదే విషయాన్ని ప్రధాని పదే పదే చెప్పారని, కానీ ఈ మూడేళ్ళలో రైతుల ఆదాయం ఎంత పెరిగిందో ఎక్కడా చెప్పడం లేదని ఉత్తమ్ అన్నారు. ఈ మూడేళ్లలో వ్యవసాయ జీడీపీ కానీ, రైతుల ఆదాయం కానీ ఎక్కడ పెరిగిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక సర్వేల్లో ఎక్కడా కూడా రైతు, వ్యవసాయ ఆదాయాలు పెరగలేదని, సున్నా శాతం అభివృద్ధి ఉందని, 2022 నాటికి రైతు ఆదాయం పెరగాలంటే ఆరేళ్ల పాటు ఏటా 13 శాతం పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2014లో ఎన్నికల ముందు బీజేపీ.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని వివరించారు. పత్తి రైతులకు కనీసం రూ.6 వేల మేర కనీస మద్దతు ధర ఇవ్వాలని ఉత్తమ్ కోరారు.
పంటల బీమాతో తెలంగాణకు పైసా రాలేదు
కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్రం తెచ్చిన పథకం రైతులను అవమానపరిచేలా ఉందని ఉత్తమ్ చెప్పారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున, అది కూడా మూడు విడతల కింద ఇస్తుందని పేర్కొన్నారు. అంటే ఐదుగురు సభ్యులున్న కుటుంబంలో ఒక్కొక్కరికి రూ.3.30 వస్తుందని, ఇది రైతులకు ఎలా ఉపయోపడుతుందని ప్రశ్నించారు. కోట్లాది మంది కౌలు దారులు, ఆదివాసీ రైతులు, భూమి లేని పేద రైతులకు ఇది వర్తించడం లేదని అన్నారు. ప్రధానమంత్రి పసల్ భీమా యోజన పథకంలో 50 శాతం మంది రైతులకు పంటల భీమా అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే 25 శాతానికి మించి అందడం లేదన్నారు. తెలంగాణలో పంటలు నష్టపోయిన రైతులకు ఈ పథకం కింద ఒక్క పైసా రాలేదని అన్నారు. ఈ పథకం వల్ల రైతుల కంటే బీమా కంపెనీలకు ఎక్కువ లాభం ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని ఉత్తమ్ చెప్పారు. ఎన్నికల ముందు రాజ్‌నాథ్ సింగ్ వచ్చి నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, వెంటనే అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
‘కిసాన్ సమ్మాన్’తో రైతులకు అవమానమే
Published Wed, Jul 17 2019 7:20 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment