న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధుల కోసం ఇంధనంపై పన్ను పెంచడంతో ఆ ప్రభావం రవాణారంగం, వాహనదారులపై పడింది. శనివారం పెట్రోల్ ధర లీటరుపై కనిష్టంగా రూ.2.40, డీజిల్ ధర రూ.2.36 మేర పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్‌పై రూ.2.45 పెరిగి లీటరు ధర రూ.72.96కు చేరుకుంది. ఇదే ముంబైలో రూ.2.42 పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.78.57కు, కోల్‌కతాలో రూ.2.49 పెరిగి రూ.75.15కు, చెన్నైలో రూ.2.57 పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.75.76కు చేరిందని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది.
కాగా, ఢిల్లీలో డీజిల్ రూ.2.36 పెరిగి లీటరు రూ.66.69కు, ముంబైలో రూ.2.50 పెరిగి లీటర్ ధర రూ.69.90 కు చేరుకుందని పేర్కొంది. రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, వ్యాట్ ఆధారంగా ఈ ధరలు వేర్వేరుగా ఉండే అవకాశముందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ల ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్ది వ్యత్యాసం ఉంటుందని తెలిపింది.
ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌లపై రోడ్లు, మౌలికరంగాల సెస్, పన్నులు కలిపి లీటరుకు రూ.2 మేర విధించడం ద్వారా ఏడాదికి రూ.24 వేల నుంచి రూ.28 వేల కోట్ల మేర సమీకరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్‌పై మొత్తం పన్ను భారం రూ.17.98 ఉండగా, కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం ఇది లీటర్‌పై రూ.19.98కు పెరిగింది. డీజిల్ లీటర్‌పై ఉన్న మొత్తం పన్ను భారం కూడా రూ. 13.83 నుంచి రూ.15.83కు పెరిగింది. వ్యాట్ కూడా రాష్ట్రాలను బట్టి మారుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై వ్యాట్ 27 శాతం, డీజిల్‌పై 16.75 శాతం ఉంది. ముంబైలో వ్యాట్ పెట్రోల్‌పై 26 శాతానికి తోడు అదనపు ట్యాక్స్ రూ.7.12 వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై ఇక్కడ 24 శాతం సేల్స్ ట్యాక్స్ పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment