fuel Price hikes
-
ఇండిగో టికెట్ ధర తగ్గింపు.. కారణం ఇదే..
విమాన టికెట్లపై సంస్థలు ప్రత్యేకంగా ఫ్యూయెల్ ఛార్జీను వసూలు చేస్తూంటాయి. అయితే గత మూడునెలలుగా విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధరను కేంద్రం తగ్గిస్తోంది. అందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన వినియోగదారుల కోసం టికెట్లపై విధించే ఫ్యూయెల్ ఛార్జీలను తొలగించినట్లు ప్రకటించింది. గురువారం నుంచే తొలగింపు నిర్ణయం అమల్లోకి వచ్చిందని సంస్థ తెలిపింది. కేంద్ర తీసుకుంటున్న నిర్ణయంతో తన వినియోగదారులకు సైతం మేలు జరగాలని ప్రత్యేక ఛార్జీని తొలగించినట్లు ఇండిగో తెలిపింది. అయితే, ఏటీఎఫ్ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. కాబట్టి టికెట్ల ధరలనూ అందుకు అనువుగా సవరిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు జనవరిలో 4 శాతం తగ్గించాయి. ఇప్పటి వరకు దిల్లీలో కిలోలీటరు ధర రూ.1,06,155.67 కాగా, రూ.4162.50 తగ్గించడంతో రూ.1,01,993.17కు చేరింది. -
వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే..
విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 4 శాతం తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. వరుసగా మూడో నెలలోనూ దీని ధర తగ్గింది. వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) రేటు స్వల్పంగా కుదించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 19 కిలోల సిలిండర్ ధరను రూ.1.50 కట్ చేశారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రేటు ప్రస్తుతం దేశ రాజధానిలో రూ.1,755.50, ముంబైలో రూ.1,708.50 ఉంది. అయితే, గృహాల్లో వినియోగించే ఎల్పీజీ ధర మాత్రం మారలేదు. 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ.903 ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 3.9 శాతం తగ్గింపుతో రూ.4,162.5కు చేరింది. జెట్ ఇంధన ధరల్లో నెలవారీ తగ్గింపు ఇది వరుసగా మూడోది. ఏటీఎఫ్ ధర నవంబర్‌లో దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ.6,854.25) డిసెంబర్లో రూ.5,189.25 లేదా 4.6 శాతం తగ్గింది. ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు.. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతం ఇంధనానికే ఖర్చవుతోంది. ఫ్యూయెల్ ధర తగ్గింపుతో ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలపై కొంత భారం తగ్గనుంది. -
Russia-Ukraine war: యూరప్ ఆర్థికం.. అస్తవ్యస్తం
బ్రసెల్స్: ఉక్రెయిన్–రష్యాల మధ్య ఉద్రిక్తతలతో యూరప్ దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. యుద్ధ ప్రభావాలతో ఇంధనాల రేట్లు ఎగిసిన నేపథ్యంలో.. ఉమ్మడి కరెన్సీగా యూరోను ఉపయోగించే 19 దేశాల్లో ధరల పెరుగుదల ఏప్రిల్‌లో మరో రికార్డు స్థాయికి చేరింది. మార్చిలో ద్రవ్యోల్బణం 7.4 శాతంగా ఉండగా.. తాజాగా ఏప్రిల్‌లో ఇది 7.5 శాతానికి చేరింది. దీంతో యూరోజోన్‌లో వరుసగా ఆరో నెలా కొత్త రికార్డు స్థాయి నమోదైనట్లయింది. ఫలితంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి బైటపడే అవకాశాలపై తీవ్ర ప్రభావాలు పడతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. యూరోజోన్ దేశాల్లో 34.3 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని రికార్డు స్థాయికి ఎగదోసిన అంశాలే ప్రస్తుతం యూరోజోన్‌లో ధరల పెరుగుదలకు కారణమని పరిశీలకులు తెలిపారు. ఇంధన ధరలు 38 శాతం అప్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఇంధన ధరలు 38 శాతం పెరిగాయని యూరోస్టాట్ వెల్లడించింది. యుద్ధ ప్రభావంతో ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతి దేశాల్లో ఒకటైన రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు ఏర్పడతాయన్న ఆందోళనల కారణంగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ఎగుమతి దేశాలు, రష్యా సహా వాటి అనుబంధ దేశాలు.. ఉత్పత్తిని పెంచే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటంతో సమస్య మరింత జటిలం అవుతోంది. ఇక ముడి సరుకులు, విడిభాగాల సరఫరాలో అవరోధాలు దీన్ని ఇంకా తీవ్రం చేస్తున్నాయి. ప్రజలు, ప్రభుత్వాలకు ద్రవ్యోల్బణం సెగ గట్టిగానే తగులుతోంది. భవిష్యత్తుపై దీనిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఇంధన అవసరాల కోసం రష్యా మీద ఆధారపడిన యూరప్ దేశాల పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ఉక్రెయిన్ మీద దాడికి దిగిన రష్యా మీద రాజకీయ అవసరాల రీత్యా పోటాపోటీగా ఆంక్షలు ప్రకటించక తప్పడం లేదు. కానీ వాటిని పాటించే పరిస్థి తి లేదు. తమ తమ దేశాల్లో హీటింగ్, విద్యు త్, ఇంధన అవసరాల రీత్యా రష్యా నుంచి ఇంధన దిగుమతులను రద్దు చేసుకునే పరిస్థితుల్లో అవి లేవు. ఇలా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొత్తం మీద యూరోజోన్ ఆర్థిక రికవరీకి తీవ్ర విఘాతం కలిగించేదిగా మారిందని ఫిచ్ రేటింగ్స్ ఎకనమిక్స్ టీమ్ డైరెక్టర్ తేజ్ పారిఖ్ అభిప్రాయపడ్డారు. అటు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచాలని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కానీ ధరలను అదుపు చేసేందుకు రేట్లు పెంచితే .. కోవిడ్, ఇంధన కొరత, యుద్ధం వంటి దెబ్బల నుంచి ఎకానమీలు కోలుకోవడానికి విఘాతం కలుగుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు విధించిన ఆంక్షలతో 2021 తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 0.3% నుంచి 0.2%కి మందగించడం వీటికి మరింత ఊతమిస్తున్నాయి. తొలి త్రైమాసికం మధ్యలో మొదలైన యుద్ధ (ఫిబ్రవరి 24) ప్రభావాలు రానున్న నెలల్లో కూడా కనిపిస్తాయని విశ్లేషకులు తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధ ఫలితాలతో రెండో త్రైమాసికంలో యూరోజోన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మంద గించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఎగియడాన్ని చూస్తే జూలైలో ఈసీబీ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు. -
దేశీ విమానయానం 59% అప్..
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 59 శాతం పెరిగి 8.4 కోట్లకు చేరి ఉంటుందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. తాము ముందుగా అంచనా వేసిన 8–8.2 కోట్లతో పోలిస్తే ఇది కొంత ఎక్కువే అయినా.. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువని సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. భౌగోళిక–రాజకీయ సమస్యలతో ఆకాశాన్నంటుతున్న విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు సమీప కాలంలోనూ ఏవియేషన్ పరిశ్రమకు సవాలుగా కొనసాగే అవకాశం ఉందన్నారు. పరిశ్రమ లాభదాయకతను నిర్దేశించే అంశాల్లో ఇవి కీలకంగా ఉంటాయని బెనర్జీ పేర్కొన్నారు. ఇక్రా నివేదిక ప్రకారం.. మహమ్మారి ప్రభావాలు తగ్గుముఖం పడుతూ.. విమానయానం పుంజుకుంటున్న నేపథ్యంలో సీక్వెన్షియల్ ప్రాతిపదికన మార్చిలో ప్రయాణికుల సంఖ్య 37 శాతం పెరిగి 1.06 కోట్లుగా నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 77 లక్షలుగా ఉంది. గతేడాది మార్చితో (78 లక్షలు) పోలిస్తే 35 శాతం వృద్ధి చెందింది. ఫ్లయిట్లు 12 శాతం వృద్ధి.. గతేడాది మార్చితో పోలిస్తే ఫ్లయిట్ల సంఖ్య 12 శాతం పెరిగి 71,548 నుంచి 80,217కి చేరిందని ఇక్రా తెలిపింది. ఫిబ్రవరితో పోలిస్తే సర్వీసులు 42 శాతం పెరిగాయి. కోవిడ్–19 థర్డ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టడం, టీకాల ప్రక్రియ వేగం పుంజుకోవడం, ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు ఇక్రా వివరించింది. ఒక్కో ఫ్లయిట్లో ప్రయాణికుల సంఖ్య ఫిబ్రవరిలో సగటున 135గా ఉండగా మార్చిలో 132గా నమోదైంది. దాదాపు రెండేళ్ల అంతరాయం తర్వాత మార్చి 27 నుండి అంతర్జాతీయ విమానయాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్ రంగానికి సానుకూలాంశమని ఇక్రా పేర్కొంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన భౌగోళిక–రాజకీయ సమస్యలు, క్రూడాయిల్ రేట్ల పెరుగుదల వంటి అంశాలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏటీఎఫ్ ధరలు 93 శాతం ఎగిసినట్లు వివరించింది. ఏవియేషన్ రంగానికి ఏటీఎఫ్ ధరలపరమైన సవాళ్లు కొనసాగుతాయని, 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయాలపై ఇవి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఇక్రా తెలిపింది. -
మహా పతనం.. ఒక కప్పు చాయ్ రూ.100, లీటర్ పెట్రోల్ 280, కిలో చికెన్ 1000
రావణుడి పాలనలో శ్రీలంక భోగభాగ్యాలతో తులతూగేదని చదివాం! కానీ ప్రస్తుత లంక పరిస్థితి మాత్రం ఆంజనేయుడు దహనం చేసిన తర్వాత లంక లాగా ఉంది. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి క్షీణించడంతో లంక ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. కరోనాతో ప్రారంభమైన ఆర్థిక కష్టాలు ఉక్రెయిన్ యుద్ధంతో చెప్పలేనంతగా పెరిగాయి. వీటిని దాటుకొని శ్రీలంక నిలబడుతుందా? లేక దివాలా తీస్తుందా? అని ఆర్థికవేత్తలు అనుమానపడుతున్నారు. స్వాతంత్య్రానంతరం ఎన్నడూ చూడని మహా ఆర్థిక సంక్షోభం శ్రీలంకను చుట్టుముట్టింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు విదేశీ నిల్వలు అడుగంటి అల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. విద్యార్థుల పరీక్షలు నిర్వహించేందుకు తగిన పేపర్లు లేవని ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేయడం, పెట్రోలు కోసం క్యూలో నిలబడి ఇద్దరు సామాన్య పౌరులు చనిపోవడం లంకలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ దుస్థితికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని సామాన్యుల నుంచి ప్రతిపక్షం దాకా ఆరోపిస్తున్నాయి. లంక విదేశీ మారక నిల్వల్లో క్షీణత 2020 ఆగస్టు నుంచే ఆరంభమైంది. 2021 నవంబర్‌లో ఈ నిల్వలు ప్రమాదకర హెచ్చరిక స్థాయి దిగువకు చేరాయి. జనవరి 2022లో శ్రీలంక విదేశీ నిల్వలు మరింత దిగజారి 230 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. నిల్వల తరుగుదలతో ప్రభుత్వం నిత్యావసరాల దిగుమతులు చేసుకోవడానికి, అప్పులు చెల్లించడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో త్వరలో లంక డిఫాల్ట్ (ఎగవేత) దేశంగా మారే ప్రమాదం ఉందన్న భయాలు పెరిగాయి. స్వతంత్రం వచ్చినప్పటినుంచి లంక విత్తలోటుతో సతమతమవుతూనే ఉంది. 2019లో ఈస్టర్ దాడుల ప్రభావం లంక టూరిజంపై పడి విదేశీ నిధుల రాక తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం కోవిడ్ లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. 2020 ఏప్రిల్, జూన్ కాలంలో కేంద్రబ్యాంకు విదేశీ నిధులను ఉపయోగించి 10 వేల కోట్ల డాలర్ల ప్రభుత్వ విదేశీ రుణాలను తీర్చింది. ఇలా ఉన్న నిధులు అప్పుల కింద చెల్లించాల్సిరావడం లంక పరిస్థితిని ఇక్కట్ల పాలు చేసింది. అన్నిటికీ కొరతే విదేశీ నిల్వల తరుగుదలకు ఇంధన ధరల పెరుగుదల తోడవడంతో దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఎక్కడ చూసినా నిత్యావసరాల కొరత కనిపిస్తోంది. వీటికి విద్యుత్ కోతలు, నీటి సరఫరా కోతలు తోడవుతున్నాయి. కిరాణా కొట్లు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపుల ముందు భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు. దేశంలో విదేశీ మారకం కొరత కారణంగా దిగుమతి దారులు బ్యాంకుల నుంచి ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పొందటం కష్టంగా మారింది. దీనివల్ల నౌకాశ్రయాల్లో కంటైనర్లు పేరుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన లేమితో పలు విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల వ్యవసాయానికి ఉంచిన నీటిని వాడి విద్యుదుత్పాదన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని వల్ల తీవ్రమైన ఆహారకొరత ఎదురుకానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మా రంగంలో ఔషధాల కొరత తీవ్రతరమైందని లంక ఫార్మా ఓనర్ల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంక్షోభ కారణంగా లంక రేటింగ్‌ను ఏజెన్సీలు మరింత డౌన్‌గ్రేడ్ చేసే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే ఇప్పట్లో దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్లు రావడం జరగకపోవచ్చని భయాలున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతర్గతంగా పలు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. విత్తలోటుకు కారణమయ్యే లగ్జరీ వాహనాలు, రసాయన ఎరువులు, పసుపులాంటి ఆహార వస్తువుల దిగుమతిని నిషేధించింది.దేశీయ బ్యాంకులు కుదుర్చుకునే ఫార్వార్డ్ కాంట్రాక్టులపై కేంద్ర బ్యాంకు పరిమితులు విధించింది. విదేశీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ఆకర్షణకు, చెల్లింపుల ప్రవాహం (రెమిటెన్స్ ఫ్లో– దేశంలోకి వచ్చే విదేశీ నిధులు) పెరుగుదలకు కీలక పాలసీలు ప్రకటించింది. విదేశీ సాయం లంకకు సాయం చేయడం కోసం బంగ్లా, చైనాలు కరెన్సీ స్వాపింగ్(అసలును ఒక కరెన్సీలో, వడ్డీని మరో కరెన్సీలో చెల్లించే వెసులుబాటు) సదుపాయాన్ని పొడిగించాయి. దీంతో పాటు చైనా 70 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేసింది. ఇండియా సైతం 240 కోట్ల డాలర్ల విలువైన పలు రకాల సహాయాలు ప్రకటించింది. పాకిస్తాన్ సిమెంట్, బాస్మతీ రైస్, ఔషధాల సరఫరాకు ముందుకు వచ్చింది. ఖతార్ తదితర దేశాలు కూడా తగిన సహాయం ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ సాయాన్ని అంగీకరించాలంటే పలు కఠిన షరతులను లంక అంగీకరించాల్సి వస్తుంది. బెయిల్ అవుట్ లేకుండానే తాము గట్టెక్కుతామని, పరిస్థితి త్వరలో చక్కబడుతుందని లంక ప్రభుత్వం, లంక కేంద్ర బ్యాంకు (సీబీఎస్‌ఎల్) ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై అటు ఆర్థికవేత్తలు, ఇటు ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. చైనా సాయం పేరిట దేశాన్ని కబళిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఐఎంఎఫ్‌ను సంప్రదిస్తామని ప్రకటించింది. కప్పు టీ రూ.100 ► దేశంలో టోకు ద్రవ్యోల్బణం 15.1 శాతాన్ని, ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతాన్ని తాకాయి. ఇవి ఆసియాలోనే గరిష్టం. ► వంటగ్యాస్ సిలిండర్ ధర గత అక్టోబర్‌లో 1500 రూపాయలుండగా, ప్రస్తుతం 3వేల రూపాయలకు దగ్గరలో ఉంది. ► పాల పౌడర్ ధరలు పెరగడంతో ప్రస్తుతం కప్పు టీ ధర రూ. 100కు చేరింది. ► ఒక గుడ్డు ధర రూ.35కు చేరగా, కిలో చికెన్ రూ.1,000ని తాకింది. ► లీటర్ పెట్రోల్ ధర రూ. 280ని దాటేసింది. ► లంక రూపాయి 30 శాతం క్షీణించి అమెరికా డాలర్‌తో మారకం 275కు చేరింది. ఇదీ పరిస్థితి ► గత నవంబర్‌నాటికి శ్రీలంక మొత్తం విదేశీ రుణాలు 3200 కోట్ల డాలర్లున్నాయి. ► శ్రీలంక 2021– 26 కాలంలో 2,900 కోట్ల డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. ► కరోనాకు ముందు లంక టూరిజం ఆదాయం 360 కోట్ల డాలర్లుండగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. ► లంకకు వచ్చే టూరిస్టుల్లో రష్యన్లు, ఉక్రేనియన్ల వాటా దాదాపు 25 శాతం. యుద్ధం కారణంగా వీరి రాక ఆగిపోయింది. ► లంక ఎగుమతుల్లో కీలకమైన తేయాకును దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా, ఉక్రేనియన్ కీలకం. ► కరోనాకు ముందు చైనా నుంచి లంకకు లక్షల్లో టూరిస్టులు వచ్చేవారు. కరోనా దెబ్బకు వీరంతా తగ్గిపోయారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
దేశంలో పెట్రో ధరలు, వాహనదారులకు ఊరట
కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తిన వేళ దేశంలో చమురు వాహనదారులకు ఊరట కలిగిస్తున్నాయి. గత ఆదివారం నుంచి ఈ రోజు(ఆదివారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ ధరలు 39 సార్లు పెరగ్గా అదే సమయంలో డీజిల్ రేట్లు 36 సార్లు పెరిగాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇక ఆదివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
ప్రజలకు కష్టాలు.. ప్రభుత్వానికి లాభాలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచి కష్టాల్లో ఉన్న ప్రజల నుంచి లాభాలు దండుకుంటోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మండిపడ్డారు. రాజధర్మాన్ని పాటించి తాత్కాలికంగా ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని వెనక్కి తీసుకోవడం ద్వారా ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘పెరుగుతున్న ఇంధన, గ్యాస్ ధరలతో ప్రతి పౌరుడు పడుతున్న ఇబ్బందులను మీకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నాను. దేశంలో ఒక వైపు ఉద్యోగాలు, వేతనాలు, గృహ ఆదాయాలు క్రమక్రమంగా కోల్పోతున్న పరిస్థితి ఉంది. మధ్యతరగతి ప్రజలు, పేద వర్గాల జీవనం కష్టతరంగా మారింది. వీటికి తోడు నిత్యావసరాలు సహా అన్ని వస్తువుల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు పెరుగుతూ పోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న కష్టాల నుంచి ప్రభుత్వం లాభాలు గుంజుతోంది’అని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100కు చేరుకుందనీ, డీజిల్ ధరలు కూడా అదే స్థాయిలో పైకి పాకుతుండటంతో కోట్లాది మంది రైతుల కష్టాలు రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంధన ధరల పెరుగుదలకు గత ప్రభుత్వాలదే బాధ్యతంటూ మాట్లాడటం శోచనీయమన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎన్నికైన ప్రభుత్వాలు, అందుకు విరుద్ధంగా పనిచేయడం తగదన్నారు. -
మండిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కోసం ఇంధనంపై పన్ను పెంచడంతో ఆ ప్రభావం రవాణారంగం, వాహనదారులపై పడింది. శనివారం పెట్రోల్ ధర లీటరుపై కనిష్టంగా రూ.2.40, డీజిల్ ధర రూ.2.36 మేర పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్‌పై రూ.2.45 పెరిగి లీటరు ధర రూ.72.96కు చేరుకుంది. ఇదే ముంబైలో రూ.2.42 పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.78.57కు, కోల్‌కతాలో రూ.2.49 పెరిగి రూ.75.15కు, చెన్నైలో రూ.2.57 పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.75.76కు చేరిందని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. కాగా, ఢిల్లీలో డీజిల్ రూ.2.36 పెరిగి లీటరు రూ.66.69కు, ముంబైలో రూ.2.50 పెరిగి లీటర్ ధర రూ.69.90 కు చేరుకుందని పేర్కొంది. రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, వ్యాట్ ఆధారంగా ఈ ధరలు వేర్వేరుగా ఉండే అవకాశముందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ల ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్ది వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో పెట్రోల్, డీజిల్‌లపై రోడ్లు, మౌలికరంగాల సెస్, పన్నులు కలిపి లీటరుకు రూ.2 మేర విధించడం ద్వారా ఏడాదికి రూ.24 వేల నుంచి రూ.28 వేల కోట్ల మేర సమీకరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్‌పై మొత్తం పన్ను భారం రూ.17.98 ఉండగా, కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం ఇది లీటర్‌పై రూ.19.98కు పెరిగింది. డీజిల్ లీటర్‌పై ఉన్న మొత్తం పన్ను భారం కూడా రూ. 13.83 నుంచి రూ.15.83కు పెరిగింది. వ్యాట్ కూడా రాష్ట్రాలను బట్టి మారుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై వ్యాట్ 27 శాతం, డీజిల్‌పై 16.75 శాతం ఉంది. ముంబైలో వ్యాట్ పెట్రోల్‌పై 26 శాతానికి తోడు అదనపు ట్యాక్స్ రూ.7.12 వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై ఇక్కడ 24 శాతం సేల్స్ ట్యాక్స్ పడుతోంది. -
భగ్గుమన్న పెట్రోల్ : భారీగా వడ్డన
జైపూర్: కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనలతో పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ పెంపును ప్రకటించారు. కొత్త రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంధనంపై సెస్‌పెంపుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ .5 వరకు పెరిగాయి. పెట్రోల్‌పై వ్యాట్ రేటును 26 శాతం నుంచి 30 శాతానికి, డీజిల్‌పై 18 శాతం నుంచి 22 శాతానికి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఆ మేరకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పెట్రోల్ ధర రూ .4.62 మేర పెరిగిందని రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీత్ బాగై వెల్లడించారు. దీంతో జైపూర్‌లో పెట్రల్ ధర లీటరుకు 75.77 రూపాయలకు చేరింది. ఇంతకుముందు 71.15 రూపాయలుగా ఉంది. అలాగే డీజిల్ ధర లీటరుకు 4.59 రూపాయలు పెరిగి 66.65 రూపాయలు నుంచి రూ.71.24 కు చేరింది. మధ్యప్రదేశ్‌లో కూడా లీటరు పెట్రోల్ ధర రూ. 4.5 చొప్పున పెరిగింది. తాజా పెంపుతో లీటరు పెట్రోలు ధర రూ. 78.19 గానూ, డీజిల్ ధర రూ. 70.02గా ఉంది. సార్వత్రిక బడ్జెట్లో కేంద్రం నిర్ణయంతో అదనపు పన్నుభారం విధించక తప్పలేదని రాష్ట్రమంత్రి జితు పట్వారి తెలిపారు. వివిధ నగరాల్లో పెరిగిన ఇంధన ధరలు ఇలా ఉన్నాయి: హైదరాబాద్: పెట్రోలు ధర లీటరుకు రూ. 77.48 డీజిల్ ధర లీటరుకు రూ. 72.62 అమరావతి: పెట్రోలు ధర లీటరుకు రూ. 77.17 డీజిల్ ధర లీటరుకు రూ. 71.96 చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 75.76 డీజిల్ ధర లీటరుకు రూ. 70.48 ముంబై : పెట్రోలు ధర లీటరుకు రూ. 78.57 డీజిల్ ధర లీటరుకు రూ. 69.90 -
ఫ్రాన్స్‌లో ఇంధన ధరల పెంపుపై భగ్గు
పారిస్: ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్‌లో కొద్దిరోజులుగా జరుగుతున్న నిరసనల్లో 400 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు. గాయపడినవారిలో 28 మంది పోలీసులు ఉన్నారు. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు 2 వేల ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో 3 లక్షల మంది పాల్గొన్నట్లు మీడియా తెలిపింది. ఆదివారం నిరసనల్ని మరింత ఉధృతం చేయాలని కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: చమురు సంస్థలు పెట్రోల్‌పై లీటరుకు 14 పైసలు, డీజిల్‌పై లీటరుకు 10 పైసల ధరలను పెంచాయి. డీలర్ల కమీషన్‌ను పెంచడమే ఇందుకు కారణం. పెరిగిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పక్ష సమీక్షలో భాగంగా అక్టోబరు 1నే పెట్రోల్‌పై 37 పైసలు పెంచి, డీజిల్‌పై 8 పైసలు తగ్గించడం విదితమే. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.64.72, డీజిల్ ధర రూ.52.61కు చేరాయి.