Sri Lanka Economic Crisis: Sri Lanka Forced Into IMF U-turn After Financial Crisis Sparks Protests - Sakshi
Sakshi News home page

Sri Lanka Economic Crisis: మహా పతనం.. ఒక కప్పు చాయ్‌ రూ.100, లీటర్‌ పెట్రోల్‌ 280, కిలో చికెన్‌ 1000

Published Mon, Mar 21 2022 5:43 AM | Last Updated on Mon, Mar 21 2022 1:14 PM

Sri Lanka forced into IMF U-turn after financial crisis sparks protests - Sakshi

శ్రీలంకలో పెట్రోల్‌ బంక్‌ వద్ద బారులు తీరిన వాహనదారులు

రావణుడి పాలనలో శ్రీలంక భోగభాగ్యాలతో తులతూగేదని చదివాం! కానీ ప్రస్తుత లంక పరిస్థితి మాత్రం ఆంజనేయుడు దహనం చేసిన తర్వాత లంక లాగా ఉంది. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి క్షీణించడంతో లంక ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. కరోనాతో ప్రారంభమైన ఆర్థిక కష్టాలు ఉక్రెయిన్‌ యుద్ధంతో చెప్పలేనంతగా పెరిగాయి. వీటిని దాటుకొని శ్రీలంక నిలబడుతుందా? లేక దివాలా తీస్తుందా? అని ఆర్థికవేత్తలు అనుమానపడుతున్నారు.

స్వాతంత్య్రానంతరం ఎన్నడూ చూడని మహా ఆర్థిక సంక్షోభం శ్రీలంకను చుట్టుముట్టింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు విదేశీ నిల్వలు అడుగంటి అల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదలతో  ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. విద్యార్థుల పరీక్షలు నిర్వహించేందుకు తగిన పేపర్లు లేవని ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేయడం, పెట్రోలు కోసం క్యూలో నిలబడి ఇద్దరు సామాన్య పౌరులు చనిపోవడం లంకలో పరిస్థితికి అద్దం పడుతోంది.

ఈ దుస్థితికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని సామాన్యుల నుంచి ప్రతిపక్షం దాకా ఆరోపిస్తున్నాయి. లంక విదేశీ మారక నిల్వల్లో క్షీణత 2020 ఆగస్టు నుంచే ఆరంభమైంది. 2021 నవంబర్‌లో ఈ నిల్వలు ప్రమాదకర హెచ్చరిక స్థాయి దిగువకు చేరాయి. జనవరి 2022లో శ్రీలంక విదేశీ నిల్వలు మరింత దిగజారి 230 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. నిల్వల తరుగుదలతో ప్రభుత్వం నిత్యావసరాల దిగుమతులు చేసుకోవడానికి, అప్పులు చెల్లించడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి.

దీంతో త్వరలో లంక డిఫాల్ట్‌ (ఎగవేత) దేశంగా మారే ప్రమాదం ఉందన్న భయాలు పెరిగాయి. స్వతంత్రం వచ్చినప్పటినుంచి లంక విత్తలోటుతో సతమతమవుతూనే ఉంది.  2019లో ఈస్టర్‌ దాడుల ప్రభావం లంక టూరిజంపై పడి విదేశీ నిధుల రాక తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం కోవిడ్‌ లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. 2020 ఏప్రిల్, జూన్‌ కాలంలో కేంద్రబ్యాంకు విదేశీ నిధులను ఉపయోగించి 10 వేల కోట్ల డాలర్ల ప్రభుత్వ విదేశీ రుణాలను తీర్చింది. ఇలా ఉన్న నిధులు అప్పుల కింద చెల్లించాల్సిరావడం లంక పరిస్థితిని ఇక్కట్ల పాలు చేసింది.  

అన్నిటికీ కొరతే
విదేశీ నిల్వల తరుగుదలకు ఇంధన ధరల పెరుగుదల తోడవడంతో దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఎక్కడ చూసినా నిత్యావసరాల కొరత కనిపిస్తోంది. వీటికి విద్యుత్‌ కోతలు, నీటి సరఫరా కోతలు తోడవుతున్నాయి. కిరాణా కొట్లు, పెట్రోల్‌ బంకులు, మెడికల్‌ షాపుల ముందు భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు. దేశంలో విదేశీ మారకం కొరత కారణంగా దిగుమతి దారులు బ్యాంకుల నుంచి ఎల్‌ఓసీ (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) పొందటం కష్టంగా మారింది. దీనివల్ల నౌకాశ్రయాల్లో కంటైనర్లు పేరుకుపోతున్నాయి.

దేశవ్యాప్తంగా ఇంధన లేమితో పలు విద్యుత్‌ ప్లాంట్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల వ్యవసాయానికి ఉంచిన నీటిని వాడి విద్యుదుత్పాదన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని వల్ల తీవ్రమైన ఆహారకొరత ఎదురుకానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మా రంగంలో ఔషధాల కొరత తీవ్రతరమైందని లంక ఫార్మా ఓనర్ల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.  సంక్షోభ కారణంగా లంక రేటింగ్‌ను ఏజెన్సీలు మరింత డౌన్‌గ్రేడ్‌ చేసే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే ఇప్పట్లో దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్లు రావడం జరగకపోవచ్చని భయాలున్నాయి.

పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతర్గతంగా పలు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.  విత్తలోటుకు కారణమయ్యే లగ్జరీ వాహనాలు, రసాయన ఎరువులు, పసుపులాంటి ఆహార వస్తువుల దిగుమతిని నిషేధించింది.దేశీయ బ్యాంకులు కుదుర్చుకునే ఫార్వార్డ్‌ కాంట్రాక్టులపై కేంద్ర బ్యాంకు పరిమితులు విధించింది. విదేశీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల ఆకర్షణకు, చెల్లింపుల ప్రవాహం (రెమిటెన్స్‌ ఫ్లో– దేశంలోకి వచ్చే విదేశీ నిధులు) పెరుగుదలకు కీలక పాలసీలు ప్రకటించింది.  

విదేశీ సాయం
లంకకు సాయం చేయడం కోసం బంగ్లా, చైనాలు కరెన్సీ స్వాపింగ్‌(అసలును ఒక కరెన్సీలో, వడ్డీని మరో కరెన్సీలో చెల్లించే వెసులుబాటు) సదుపాయాన్ని పొడిగించాయి. దీంతో పాటు చైనా 70 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేసింది. ఇండియా సైతం 240 కోట్ల డాలర్ల విలువైన పలు రకాల సహాయాలు ప్రకటించింది. పాకిస్తాన్‌ సిమెంట్, బాస్మతీ రైస్, ఔషధాల సరఫరాకు ముందుకు వచ్చింది.

ఖతార్‌ తదితర దేశాలు కూడా తగిన సహాయం ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్‌ సాయాన్ని అంగీకరించాలంటే పలు కఠిన షరతులను లంక అంగీకరించాల్సి వస్తుంది. బెయిల్‌ అవుట్‌ లేకుండానే తాము గట్టెక్కుతామని, పరిస్థితి త్వరలో చక్కబడుతుందని లంక ప్రభుత్వం, లంక కేంద్ర బ్యాంకు (సీబీఎస్‌ఎల్‌) ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై అటు ఆర్థికవేత్తలు, ఇటు ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. చైనా సాయం పేరిట దేశాన్ని కబళిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఐఎంఎఫ్‌ను సంప్రదిస్తామని ప్రకటించింది.

కప్పు టీ రూ.100
► దేశంలో టోకు ద్రవ్యోల్బణం 15.1 శాతాన్ని, ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతాన్ని తాకాయి. ఇవి ఆసియాలోనే గరిష్టం.
► వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర గత అక్టోబర్‌లో 1500 రూపాయలుండగా, ప్రస్తుతం 3వేల రూపాయలకు దగ్గరలో ఉంది.  
► పాల పౌడర్‌ ధరలు పెరగడంతో ప్రస్తుతం కప్పు టీ ధర రూ. 100కు చేరింది.
► ఒక గుడ్డు ధర రూ.35కు చేరగా, కిలో చికెన్‌ రూ.1,000ని తాకింది.
► లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 280ని దాటేసింది.  
► లంక రూపాయి 30 శాతం క్షీణించి అమెరికా డాలర్‌తో మారకం 275కు చేరింది.


ఇదీ పరిస్థితి
► గత నవంబర్‌నాటికి శ్రీలంక మొత్తం విదేశీ రుణాలు 3200 కోట్ల డాలర్లున్నాయి.  
► శ్రీలంక 2021– 26 కాలంలో 2,900 కోట్ల డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది.
► కరోనాకు ముందు లంక టూరిజం ఆదాయం 360 కోట్ల డాలర్లుండగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది.
► లంకకు వచ్చే టూరిస్టుల్లో రష్యన్లు, ఉక్రేనియన్ల వాటా దాదాపు 25 శాతం. యుద్ధం కారణంగా వీరి రాక ఆగిపోయింది.
► లంక ఎగుమతుల్లో కీలకమైన తేయాకును దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా, ఉక్రేనియన్‌ కీలకం.
► కరోనాకు ముందు చైనా నుంచి లంకకు లక్షల్లో టూరిస్టులు వచ్చేవారు. కరోనా దెబ్బకు వీరంతా తగ్గిపోయారు.

– నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement