జైపూర్: కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనలతో పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ పెంపును ప్రకటించారు. కొత్త రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంధనంపై సెస్‌పెంపుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ .5 వరకు పెరిగాయి.
పెట్రోల్‌పై వ్యాట్ రేటును 26 శాతం నుంచి 30 శాతానికి, డీజిల్‌పై 18 శాతం నుంచి 22 శాతానికి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఆ మేరకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పెట్రోల్ ధర రూ .4.62 మేర పెరిగిందని రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీత్ బాగై వెల్లడించారు. దీంతో జైపూర్‌లో పెట్రల్ ధర లీటరుకు 75.77 రూపాయలకు చేరింది. ఇంతకుముందు 71.15 రూపాయలుగా ఉంది. అలాగే డీజిల్ ధర లీటరుకు 4.59 రూపాయలు పెరిగి 66.65 రూపాయలు నుంచి రూ.71.24 కు చేరింది.
మధ్యప్రదేశ్‌లో కూడా లీటరు పెట్రోల్ ధర రూ. 4.5 చొప్పున పెరిగింది. తాజా పెంపుతో లీటరు పెట్రోలు ధర రూ. 78.19 గానూ, డీజిల్ ధర రూ. 70.02గా ఉంది. సార‍్వత్రిక బడ్జెట్‌లో కేంద్రం నిర్ణయంతో అదనపు పన్నుభారం విధించక తప్పలేదని రాష్ట్రమంత్రి జితు పట్వారి తెలిపారు.
వివిధ నగరాల్లో పెరిగిన ఇంధన ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్: పెట్రోలు ధర లీటరుకు రూ. 77.48 డీజిల్ ధర లీటరుకు రూ. 72.62
అమరావతి: పెట్రోలు ధర లీటరుకు రూ. 77.17 డీజిల్ ధర లీటరుకు రూ. 71.96
చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 75.76 డీజిల్ ధర లీటరుకు రూ. 70.48
ముంబై : పెట్రోలు ధర లీటరుకు రూ. 78.57 డీజిల్ ధర లీటరుకు రూ. 69.90
Comments
Please login to add a commentAdd a comment