
న్యూఢిల్లీ: ఒక కంపెనీలో ప్రజలకుండే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. కంపెనీలో ప్రజల వాటాను 35 శాతానికి పెంచడానికి ఇదే సరైన సమయమని తన తొలి బడ్జెట్‌లో ఆమె ప్రతిపాదించారు. క్యాపిటల్ మార్కెట్‌ను ప్రజలకు మరింత చేరువ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అందుకే ఈ ప్రతిపాదన తెస్తున్నామని ఆమె వివరించారు. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే మార్కెట్ నియంత్రణ సంస్థ;సెబీకి ఇప్పటికే ఒక లేఖ రాసిందని పేర్కొన్నారు.
రూ.3.87 లక్షల కోట్ల విలువైన విక్రయాలు...
ఈ ప్రతిపాదన కారణంగా దాదాపు 1,174 కంపెనీల ప్రమోటర్లు తమ వాటాను విక్రయించాల్సి ఉంటుంది. టీసీఎస్, విప్రో, డిమార్ట్, కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలివర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీలు దాదాపు 4,700 వరకూ ఉంటాయని, వీటిల్లో 1,174 కంపెనీల్లో ప్రమోటర్ల వాటా 65 శాతానికి మించి ఉంటుందని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఈ 1,174 కంపెనీలన్నీ కలసి రూ.3.87 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించాల్సి ఉంటుందని ఈ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది.
నిఫ్టీలోకి కొత్త కంపెనీలు....
ఈ వాటా విక్రయానికి సెబీ తగినంత సమయం ఇవ్వాలని సెంట్రమ్ బ్రోకింగ్ ఎనలిస్ట్ జగన్నాథమ్ తునుగుంట్ల పేర్కొన్నారు. లేకుంటే ప్రమోటర్ల వాటా విక్రయాలు మార్కెట్లో వెల్లువెత్తుతాయని వివరించారు. ఈ తాజా ప్రతిపాదన కారణంగా రెండేళ్లలో పలు కంపెనీలు వాటా విక్రయ ఆఫర్లను ప్రకటిస్తాయని ఇండియానివేశ్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ వినయ్ పండిట్ చెప్పారు. ప్రస్తుతం ఫ్రీ–ఫ్లోట్ మెథడాలజీ ఆధారంగా నిఫ్టీలో షేర్లను చేరుస్తున్నారని, ఈ తాజా ప్రతిపాదన కారణంగా పలు షేర్లు నిఫ్టీ నుంచి వైదొలగాల్సి వస్తుందని, కొత్త కంపెనీలు నిఫ్టీలోకి వస్తాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment