సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్ల ఉత్థాన పతనాలను ఒడిసిపట్టుకోవడం అంత ఆషామాషీ వ్యవహారేమీ కాదు. దేశీయంగా తాజా ఆర్థిక,రాజకీయ పరిణామాల విశ్లేషణ, గ్లోబల్ మార్కెట్ల ఆటుపోట్లు తదితర అంశాల పట్ల చురుకుగా ఉండాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ముఖ్యంగా కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలకు చేరి ఇన్వెస్టర్లను బాగా ఊరించాయి. కానీ ఈ ఉత్సాహాన్ని తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సార్వత్రిక బడ్జెట్ భారీగా దెబ్బతీసింది. 40 వేలస్థాయికి చేరుకున్న సెన్సెక్స్ కుప్పకూలి ఇన్వెస్టర్లను వణికించింది. రెండు సెషనల్లోనే ఏకంగా రూ. 5.61 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరై పోయింది.
బడ్జెట్ డే రోజు 394 కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం మరింత దిగజారి 793 పాయింట్ల మేర పతనమైంది. సోమవారం ఒక్కరోజే 3.39 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్ల బలహీనత కూడా మార్కెట్లను దెబ్బతీసినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా హెవీ వెయిట్ స్టాక్స్ కూడా పేకమేడల్లా కూలిపోవడంతో ఇన్వెస్టర్లు షాక్‌లో ఉండిపోయారు. ఒక్క ఐటీ మినహా అన్ని రంగాలు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ, మీడియా, ఆటో, మెటల్, ఫార్మా రంగ సూచీల్లో నష్టం అత్యధికంగా ఉంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా రెండున్నర శాతం వరకూ కోల్పోయాయి. గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజున ఈ స్థాయిలో పతనాన్ని నమోదు చేసిందన మార్కెట్ నిపుణులు తెలిపారు. ఎఫ్‌సీఐల్లో ఉన్న 40-45 శాతం మంది ఈ కొత్త పన్నుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉండడంతో ఎఫ్‌పీఐ అమ్మకాల జోరందుకుందన్నారు.
తాజా గణాంకాల ప్రకారం స్టాక్‌మార్కెట్‌లోని బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 4న (బడ్జెట్‌కు ముందు రోజు) రూ.153.58 లక్షల కోట్లుగా ఉంది. జూలై 5 (బడ్జెట్ డే) నాటికి రూ.151.35 లక్షల కోట్లుగా ఉంది. జూలై 8న సోమవారం రూ.147.96 లక్షల కోట్లకు పతనమైంది. అంటే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.5.61 లక్షల కోట్లకుపైగా క్షీణించిందన్నమాట. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా బలహీనంగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment