
లక్నో : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబించేలా బడ్జెట్ ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇంత మంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీని, నూతన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని అభినందిస్తున్నాను. ఈ బడ్జెట్ భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తుంది. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంది. అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి బడ్జెట్ ఉపకరిస్తుంది. మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. రానున్న ఐదేళ్లలో భారత్ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది’ అన్నారు యోగి.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు ఉండాలనేది మోది కల అన్నారు యోగి. 2024 నాటికి దేశ వ్యాప్తంగా 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి సురక్షిత నీరు, గ్యాస్ కనెక్షన్, విద్యుత్, చిరు వ్యాపారస్తులకు పెన్షన్ సౌకర్యం కల్పించడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఈ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడుతుందన్నారు యోగి ఆదిత్య నాథ్.