గ్రామీణం 2.0 | More Josh for Village Development | Sakshi
Sakshi News home page

గ్రామీణం 2.0

Published Sat, Jul 6 2019 5:22 AM | Last Updated on Sat, Jul 6 2019 5:22 AM

More Josh for Village Development - Sakshi

బంపర్‌ విజయంతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ సర్కారు.. రెట్టించిన ఉత్సాహంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. పల్లెవాసులకు ఇళ్లు, రోడ్లు ఇతరత్రా మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో మొదలైన ప్రతిష్టాత్మక పథకాల్లో కొన్నింటి లక్ష్యాలు సాకారమయ్యాయి. దీంతో వీటి ప్రాధాన్యాలను పెంచి తాజా బడ్జెట్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించారు. గ్రామీణాభివృద్ధికి గేరు మార్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన గత లక్ష్యం అనుకున్నదానికంటే మూడేళ్లు ముందే నెరవేరడంతో మూడో దశ కింద 1,25,000 కిలోమీటర్ల పల్లె రహదారులను మెరుగుపరచనున్నారు. ఇందుకు రూ.80వేల కోట్లకుపైగానే వెచ్చించనున్నారు. ఇక గ్రామీణ ఇళ్ల నిర్మాణంలో కూడా కొత్తగా వచ్చే మూడేళ్లలో 1.95 లక్షల గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. మొత్తంమీద మోదీ సర్కారు.. గ్రామీణాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఫ్లాగ్‌షిప్‌ 2.0 వెర్షన్‌ను పట్టాలెక్కించిందని పరిశీలకులు భావిస్తున్నారు.    
– న్యూఢిల్లీ

అంచనాలకు మించి ఉపాధి హామీ 
2019–20 కేటాయింపు: రూ. 60,000 కోట్లు 
2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.61,084 కోట్లు 

- 2005లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గతేడాది బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఈ దఫా 11% పెరిగింది. అయితే, సవరించిన అంచనాలతో పోలిస్తే కాస్త తగ్గింది. 
దీనికి ప్రధాన కారణం చాలా రాష్ట్రాల్లో లక్ష్యాలను మించి ఉపాధి పనులను కల్పించడంతోపాటు నిధులను కూడా అవసరాన్ని మించి ఖర్చుచేశారు. 
అవసరమైతే డిమాండ్‌ మేరకు తాజా కేటాయింపులు మరింత పెంచుతారు. 

స్వచ్ఛ భారత్‌ సాకారం 
2019–20 కేటాయింపు: రూ. 12644 కోట్లు. 
2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.16,978కోట్లు 

- 2014 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి రోజున మొదలైన ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 
బహిరంగ మలవిసర్జన (ఓడీఎఫ్‌) అలవాటు దాదాపు కనుమరుగైంది. 
ఓడీఎఫ్‌ రహిత గ్రామాల సంఖ్య 5.6 లక్షలకు చేరింది. 
గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98% పారిశుద్ధ్య లక్ష్యాల్లో విజయం. 
ఈ ఏడాది అక్టోబర్‌ 2 నాటికి భారత్‌ను ఓడీఎఫ్‌ రహిత దేశంగా ప్రకటించనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్‌ఘాట్‌ వద్దనున్న గాంధీ దర్శన్‌ ప్రాంగణంలో ‘రాష్ట్రీయ స్వచ్ఛత కేంద్రం’ను నెలకొల్పనున్నామని వెల్లడించారు. 

దేశమంతా విద్యుత్‌ వెలుగులు 
2019–20 కేటాయింపు: రూ.4,066 కోట్లు. 
2018–19 కేటాయింపు
(సవరించిన అంచనా): రూ.3,800 కోట్లు. 

- దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజనలో భాగంగా 2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ లక్ష్యం ఇటీవలే సాకారమైనట్లు కేంద్ర ప్రకటించింది. 
దీనికోసం ఇప్పటివరకూ రూ. 16,320 కోట్ల వినియోగం. 
ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌కు కేటాయింపులు రూ.3,970 కోట్ల నుంచి రూ.5,280 కోట్లకు పెంచారు.  
ఉజాల స్కీమ్‌ కింద పేద, మధ్యతరహా కుటుంబాలకు ఉచితంగా 143 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను అందజేయాలని లక్ష్యం. 
ఎల్‌ఈడీ బల్బులతో ఏటా రూ.18,341 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు ఆదా  
సోలార్‌ స్టవ్‌లు, బ్యాటరీ చార్జర్లను ప్రోత్సహిచేందుకు కూడా ఈ ఎల్‌ఈడీ బల్బుల అమలు విధానాన్ని ఉపయోగించుకోనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 

గ్రామీణ రోడ్లకు ఇక మహర్దశ 
2019–20 కేటాయింపు:రూ.19,000 కోట్లు 
2018–19 కేటాయింపులు
(సవరించిన అంచనా): రూ.15,500 కోట్లు 

- ముందుగా అనుకున్నట్లు 2022 నాటి లక్ష్యం కంటే ముందే.. 2019 మార్చినాటికే దాదాపు 97% ఆవాసాలను రోడ్లతో అనుసంధానించారు.  
మొత్తం 17.84 లక్షల ఆవాసాల్లో 15.8 లక్షల ఆవాసాలకు పక్కా రోడ్లు వచ్చాయి. 
గడిచిన 1,000 రోజుల్లో సగటున రోజుకు 130–135 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగినట్లు అంచనా. 
ఇందులో 30,000 కిలోమీటర్ల రోడ్లను పర్యావరణ అనుకూల (గ్రీన్‌) సాంకేతికతతో నిర్మించడం విశేషం. 
పీఎంజీఎస్‌వై ఫేజ్‌–3ను ఇప్పుడు అమలు చేయనున్నారు. 
ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో 1,25,000 కిలోమీటర్ల రోడ్లను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. దీనికి రూ.80,250 కోట్లు ఖర్చవుతుందని తాజా బడ్జెట్‌లో అంచనా వేశారు. 

గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కొత్త జోష్‌ 
2019–20 కేటాయింపులు: రూ.25,853 కోట్లు 
2018–19 కేటాయింపులు
(సవరించిన అంచనా): రూ.26,405 కోట్లు 

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)లో భాగంగా 2022 కల్లా దేశవ్యాప్తంగా ఇళ్లు లేని బలహీనవర్గాలకు పక్కా ఇళ్లను కట్టిఇవ్వడమే కేంద్రం లక్ష్యం. 
పీఎంఏవై తొలి దశను 2016–17 నుంచి 2018–19 వరకూ మూడేళ్లపాటు అమలుచేశారు. దీనికింద గ్రామాల్లో కొత్తగా కోటి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకు రూ.81,975 కోట్లు ఖర్చయింది. గడిచిన ఐదేళ్లలో 1.54 కోట్ల ఇళ్లను నిర్మించారు. 
- ఇప్పుడు రెండో దశ కింద 2019–20 నుంచి 2021–22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. 
- అంతేకాదు ఈ ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్‌ కనెక్షన్లు కూడా ఉచితంగా కల్పించనున్నారు. 
- ఇక పట్టణ ప్రాంతాలకొస్తే 81 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, 47 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 26 లక్షలు పూర్తయ్యాయి. 24 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. 
- ఒక్కో ఇంటి నిర్మాణానికి 2015–16లో 314 రోజులు పట్టగా.. 2017–18 నాటికి ఇది 114 రోజులకు తగ్గిందని కేంద్రం వెల్లడించింది.  

తాగునీటికి ‘జల్‌ జీవన్‌’ 
2019–20 కేటాయింపులు: రూ.10,001 కోట్లు 
2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.5,500 కోట్లు 

- వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి కష్టాల నేపథ్యంలో జాతీయ గ్రామీణ తాగునీటి పథకానికి (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) మరింతగా నిధుల పెంపు. 
- తాజాగా జల్‌ జీవన్‌ మిషన్‌ను బడ్జెట్‌లో ప్రకటించారు. దీనికింద 2024 నాటికి గ్రామీణ కుటుంబాలన్నింటికీ (హర్‌ ఘర్‌ జల్‌) తాగునీటిని అందించడమే లక్ష్యం. 
- వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తగిన మౌలిక వసతుల కల్పన, భూగర్భజలాల పెంపు, మురుగునీటి నిర్వహణ కూడా జల్‌జీవన్‌ మిషన్‌లో భాగమే. 

గ్రామీణ టెలిఫోన్‌ 
2019–20 కేటాయింపు: రూ.8,350 కోట్లు. 
2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.5,000 కోట్లు. 

- భారత్‌ నెట్‌ ఫేజ్‌–1 కింద 1,21,652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ పూర్తి. 1.16లక్షల పంచాయతీల్లో అందుబాటులో సర్వీసులు. 
- దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాంక్‌ యాక్సెస్‌ లభించింది. మరింత వేగం పెంచేందుకు పీపీపీ పద్ధతిలో పనులు. 
- 39,359 పంచాయతీల్లో వైఫై హాట్‌స్పాట్స్‌ ఇన్‌స్టలేషన్‌ పూర్తి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement