2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రబడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు అన్ని రంగాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌తో ఏ రంగాలు ఉత్తేజ పడతాయో, ఏవి డీలా పడతాయో చూద్దాం..
సానుకూల ప్రభావం
గ్రామీణ భారతం: గ్రామాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణ వ్యయాలను పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని గృహాల నిర్మాణం, పశుదాణా ఉత్పత్తి చేసే చిన్న వ్యాపారులకు మద్దతు లాంటి చర్యలు గ్రామీణ భారతంతో సంబంధమున్న కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రకటించిన చర్యలతో ఎఫ్‌ఎంసీజీ రంగం ఉత్తేజం పొందనుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు: పీఎస్‌యూ బ్యాంకులకు బడ్జెట్లో రూ.70వేల కోట్ల రీక్యాప్ సాయం ప్రకటించారు. దీంతో పాటు షాడో బ్యాంకుల రుణ డిఫాల్టులపై పాక్షిక వన్‌టైమ్ గ్యారెంటీ కల్పన కూడా పీఎస్‌బీలకు మేలు చేయనుంది. డిఫాల్టయ్యే అవకాశమున్న ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్‌బీఐ నియంత్రణా పరిధిలోకి తీసుకురావడం ద్వారా బ్యాంకులను బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ఎస్‌బీఐ, బీఓబీ, కెనరాబ్యాంక్, యూబీఐ, బీఓఐ, పీఎన్‌బీ తదితరాలకు ప్రయోజనం దక్కనుంది.
జలవనరులు: 2024 నాటికి దేశంలో అన్ని గృహాలకు తాగునీటి సరఫరా లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న నీటికొరత నివారణపై దృష్టి సారించాలని నిర్ణయించింది. దీంతో వాటర్‌పైప్, ఇరిగేషన్ తదితర జల సంబంధిత రంగాలకు ప్రయోజనం కలగనుంది.
విమానయానం: ఏవియేషన్ రంగంలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు నష్టాల ఊబిలో ఉన్న ఎయిరిండియాను విక్రయించేందుకు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల లీజు, ఫైనాన్సింగ్ విభాగాల్లోకి ప్రవేశించేందుకు కొత్త ప్రణాళికలను ప్రకటించింది.
అద్దెదారులు: పట్టణాల్లో నానాటికీ పెరిగిపోతున్న జనాభాలో అధికభాగం అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారు. ఇలాంటివారికి ప్రయోజనం కలిగేలా ఒక నమూనా అద్దె చట్టం తీసుకువస్తామని ప్రభుత్వం బడ్జెట్లో హామీ ఇచ్చింది.
రియల్టీ, నిర్మాణం: వచ్చే మూడేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 1.95 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు కనెక్టివిటీ పెంచేందుకు రహదారులు, ఇతర రకాల రోడ్ల నిర్మాణంపై ఎక్కువ శ్రద్ధ పెడతామని తెలిపింది. ఈ ప్రకటన మౌలిక వసతులు, నిర్మాణం, సిమెంట్ రంగాలకు ఉత్తేజాన్నిస్తుంది.
ప్రతికూల ప్రభావం
ఆభరణాలు, బంగారం దిగుమతిదారులు: పసిడిపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడంతో బంగారం, ఆభరణ రంగాలకు చెందిన కంపెనీలు డీలాపడ్డాయి. సుంకం పెంపుతో నగలు, బంగారం మరింత ప్రియం అవుతాయి. పసిడిపై పన్నులు తగ్గిస్తారని ప్రపంచ పసిడి సమాఖ్య అంచనా వేసినా, చివరకు ప్రభుత్వం సుంకాల పెంపునకే మొగ్గు చూపింది.
రక్షణ: రక్షణ రంగానికి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన 3.05 లక్షల కోట్ల రూపాయలనే కొత్త బడ్జెట్లో ఖరారు చేశారు. అదనపు కేటాయింపులు లేవు. ఈ మొత్తం గతేడాది కన్నా ఎక్కువే ఐనా పెరిగిన ధరలతో పోలిస్తే ఏమంత పెద్ద మొత్తం కాదని నిపుణులు భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే మిలటరీ సామగ్రిపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడం ఒక్కటే ఈ రంగానికి ఊరటనిచ్చే అంశం.
మధ్యతరగతి: పెట్రో ఉత్పత్తులపై అదనపు సెస్సుతో మధ్యతరగతి వర్గంపై భారం పెరగనుంది.
ఆటో విడిభాగాలు: విద్యుత్ వాహానాల దిశగా సమాజాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. అయితే ఈ క్రమంలో ఆటో విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఆటో రంగానికి రుచించని అంశం.
పర్యావరణం: జలరవాణాను ప్రోత్సహిస్తూ ఇందుకోసం నదులను ఎక్కువగా వినియోగిం చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ చర్యలు పర్యావరణ సమస్యలు తీసుకువస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికాదాయ వర్గాలు: ఏడాదికి రూ. 2 కోట్ల కన్నా ఎక్కువ ఆర్జించే వ్యక్తులపై బడ్జెట్లో పన్ను పెంచారు, సంవత్సరానికి కోటి రూపాయలకు మించి బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తే 2 శాతం లెవీ విధించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment