ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’ | Kothapally-Manoharabad railway Line Works Going In Karimnagar | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’

Published Tue, Jul 16 2019 10:47 AM | Last Updated on Tue, Jul 16 2019 10:47 AM

Kothapally-Manoharabad railway Line Works Going In Karimnagar - Sakshi

మనోహరాబాద్‌ రైల్వేస్టేపన్‌

సాక్షి,  కరీంనగర్‌ : కరీంనగర్‌లో రైలు ఎక్కి హైదరాబాద్‌లో దిగాలనే ఇక్కడ ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరడానికి మరి కొన్నేళ్లు పట్టొచ్చు. కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ మొదటి దశ పనులు వేగంగానే సాగుతున్నాయి. మనోహరాబాద్‌ నుంచి తూప్రాన్‌ మీదుగా గజ్వేల్‌ వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. సిద్దిపేట వరకు భూసేకరణ పూర్తి కాగా, సిరిసిల్ల వరకు భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వేబడ్జెట్‌లో ఏటా కేటాయింపులు చేస్తున్న నేపథ్యంలో సిద్దిపేట వరకు రైల్వేలైన్‌ పూర్తవ్వడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ రైల్వే బడ్జెట్‌లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కేవలం కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే లైన్‌కు రూ.200 కోట్లు కేటాయించడం చూస్తుంటే కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. 

13 రైల్వేస్టేషన్లు ... 160 బ్రిడ్జిలు
కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ కోసం ఇప్పటికే తూప్రాన్‌ వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రైల్వేలైన్‌తోపాటు 13 రైల్వేస్టేషన్ల నిర్మాణం, అవసరమైన వంతెనల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. ఈ లైన్‌లో 160 బ్రిడ్జిలు, 7 రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు, 49 రోడ్డు అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం జరపాల్సి ఉంటుంది. 

→ నాలుగు దశలు... 151.40 కిలోమీటర్లు..
→ మొదటి దశ: మనోహరాబాద్‌ – గజ్వేల్‌ (32 కి.మీ), 
→ రెండో దశ: గజ్వేల్‌– దుద్దెడ (32.15 కి.మీ)
→ మూడో దశ: దుద్దెడ –సిరిసిల్ల ( 48.65 కి.మీ),  
→ నాలుగో దశ: సిరిసిల్ల – కొత్తపల్లి (38.60 కి.మీ)

కేసీఆర్‌ కలల ప్రాజెక్టుగా... 
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని హరీష్‌రావుకు వదిలేసి 2004లో కరీంనగర్‌ ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించిన కేసీఆర్‌.. యూపీఏ–1 ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన విషయం విదితమే. అప్పుడు ఆయన మదిలో మెదిలో ఆలోచనే కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఐదుగురు ఎంపీలతో కలిసి అప్పటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, రైల్వే శాఖ మంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌లను ఒప్పించి రైల్వేలైన్‌ను సాధించారు. కొత్తపల్లి నుంచి వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, తూప్రాన్‌ మీదుగా మనోహరాబాద్‌ స్టేషన్‌కు అనుసంధానం చేసే విధంగా ఈ లైన్‌ను నిర్ధారిస్తూ 2006లోనే సర్వే చేశారు.

రూ.800 కోట్ల అంచనాతో కొత్త రైల్వేలైన్‌ ప్రారంభించబోతున్నట్లు యూపీఏ ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌లో స్పష్టం చేశారు. 2006లో కేంద్ర మంత్రివర్గం నుంచి కేసీఆర్‌ బయటికి రావడం, ఎంపీ స్థానానికి రాజీనామా, తిరిగి ఎన్నిక, తదితర ఉద్యమ, రాజకీయ పరిణామాల్లో రైల్వేలైన్‌పై ప్రగతి కనిపించలేదు. 2009లో పొన్నం ప్రభాకర్‌ ఎంపీగా విజయం సాధించి, కొత్తపల్లి రైల్వేలైన్‌ ప్రగతి కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. వివిధ కారణాల వల్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వేలైన్‌ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. 

2014 తరువాతే బడ్జెట్‌ కేటాయింపులు
2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా ఢిల్లీలో మంత్రాంగం జరిపి కొత్తపల్లి రైల్వేలైన్‌ ముందుకు కదిలేలా తనవంతు ప్రయత్నం చేశారు. 151.40 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు అంచనా వ్యయం రూ.1160 కోట్లుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్రం ఈ లైన్‌కు సంబంధించి పలు ఆంక్షలు విధించింది. రైల్వేలైన్‌ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, రైలు నడవడం ప్రారంభమయిన తరువాత మొదటి ఐదేళ్లు నష్టాలను భరించాలనే ఒప్పందం మేరకు కేంద్రం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరిపింది. నాలుగు దశల్లో జరిగే రైల్వేలైన్‌ నిర్మాణం పనులకు సంబంధించి 2017–18 బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయించగా, 2018–19లో మరో రూ.125 కోట్లు కేటాయించారు. ఈసారి మరో రూ.200 కోట్లు కేటాయించడంతో తొలిదశ పనులు పూర్తయినట్లేనని చెప్పవచ్చు.

సిద్దిపేట వరకు దాదాపు భూసేకరణ పూర్తి – సిరిసిల్లలో నోటీసులు
రైల్వేలైన్‌కు సంబంధించి ఒకవైపు మొదటి దశ పనులు జరుగుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. గజ్వేల్‌ వరకు రైల్వేలైన్‌ వేసే పనులు సాగుతుండగా, సిద్దిపేట వరకు భూసేకరణ దాదాపుగా పూర్తయింది. సిరిసిల్ల జిల్లాలో రైల్వేలైన్‌ సందర్భంగా భూములు కోల్పోతున్న వారికి భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు. సిరిసిల్లలో మిడ్‌మానేర్‌ బ్యాక్‌ వాటర్‌ మీదుగా కిలోమీటరు పొడవునా బ్రిడ్జి నిర్మాణం జరపాల్సి ఉంటుంది. సిరిసిల్ల వరకు భూసేకరణ పూర్తయితే మూడు దశల నిర్మాణం పనులకు ఆటంకాలు తొలగినట్టే.

రైల్వే లైన్‌ హైలైట్స్‌
►  2004లో కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదన
►    2006 : యూపీఏ–1 ప్రభుత్వం సర్వే చేసి, రూ.800 కోట్ల అంచనాతో బడ్జెట్‌ నివేదిక
►    2014: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత పనుల్లో కదలిక
►    2015: తాజా సర్వేలో కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ అంచనా వ్యయం రూ.1160 కోట్లు
►    2016: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
►  2017–18 : రైల్వే బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయింపు
►    2018–19 : రైల్వే బడ్జెట్‌లో మరో రూ.125 కోట్లు కేటాయింపు
►    2019–20 : ఈసారి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించిన కేంద్రం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement