Kothapalli-manoharabad
-
ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లో రైలు ఎక్కి హైదరాబాద్‌లో దిగాలనే ఇక్కడ ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరడానికి మరి కొన్నేళ్లు పట్టొచ్చు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ మొదటి దశ పనులు వేగంగానే సాగుతున్నాయి. మనోహరాబాద్ నుంచి తూప్రాన్ మీదుగా గజ్వేల్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. సిద్దిపేట వరకు భూసేకరణ పూర్తి కాగా, సిరిసిల్ల వరకు భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వేబడ్జెట్‌లో ఏటా కేటాయింపులు చేస్తున్న నేపథ్యంలో సిద్దిపేట వరకు రైల్వేలైన్ పూర్తవ్వడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ రైల్వే బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కేవలం కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్‌కు రూ.200 కోట్లు కేటాయించడం చూస్తుంటే కొత్త రైల్వేలైన్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. 13 రైల్వేస్టేషన్లు ... 160 బ్రిడ్జిలు కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం ఇప్పటికే తూప్రాన్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రైల్వేలైన్‌తోపాటు 13 రైల్వేస్టేషన్ల నిర్మాణం, అవసరమైన వంతెనల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. ఈ లైన్లో 160 బ్రిడ్జిలు, 7 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, 49 రోడ్డు అండర్ బ్రిడ్జిల నిర్మాణం జరపాల్సి ఉంటుంది. → నాలుగు దశలు... 151.40 కిలోమీటర్లు.. → మొదటి దశ: మనోహరాబాద్ – గజ్వేల్ (32 కి.మీ), → రెండో దశ: గజ్వేల్– దుద్దెడ (32.15 కి.మీ) → మూడో దశ: దుద్దెడ –సిరిసిల్ల ( 48.65 కి.మీ), → నాలుగో దశ: సిరిసిల్ల – కొత్తపల్లి (38.60 కి.మీ) కేసీఆర్ కలల ప్రాజెక్టుగా... సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని హరీష్‌రావుకు వదిలేసి 2004లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించిన కేసీఆర్.. యూపీఏ–1 ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన విషయం విదితమే. అప్పుడు ఆయన మదిలో మెదిలో ఆలోచనే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎంపీలతో కలిసి అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, రైల్వే శాఖ మంత్రి లాలూప్రసాద్ యాదవ్‌లను ఒప్పించి రైల్వేలైన్‌ను సాధించారు. కొత్తపల్లి నుంచి వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, తూప్రాన్ మీదుగా మనోహరాబాద్ స్టేషన్‌కు అనుసంధానం చేసే విధంగా ఈ లైన్‌ను నిర్ధారిస్తూ 2006లోనే సర్వే చేశారు. రూ.800 కోట్ల అంచనాతో కొత్త రైల్వేలైన్ ప్రారంభించబోతున్నట్లు యూపీఏ ప్రభుత్వం రైల్వే బడ్జెట్లో స్పష్టం చేశారు. 2006లో కేంద్ర మంత్రివర్గం నుంచి కేసీఆర్ బయటికి రావడం, ఎంపీ స్థానానికి రాజీనామా, తిరిగి ఎన్నిక, తదితర ఉద్యమ, రాజకీయ పరిణామాల్లో రైల్వేలైన్‌పై ప్రగతి కనిపించలేదు. 2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా విజయం సాధించి, కొత్తపల్లి రైల్వేలైన్ ప్రగతి కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. వివిధ కారణాల వల్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వేలైన్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. 2014 తరువాతే బడ్జెట్ కేటాయింపులు 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బోయినపల్లి వినోద్‌కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఢిల్లీలో మంత్రాంగం జరిపి కొత్తపల్లి రైల్వేలైన్ ముందుకు కదిలేలా తనవంతు ప్రయత్నం చేశారు. 151.40 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు అంచనా వ్యయం రూ.1160 కోట్లుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్రం ఈ లైన్‌కు సంబంధించి పలు ఆంక్షలు విధించింది. రైల్వేలైన్ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, రైలు నడవడం ప్రారంభమయిన తరువాత మొదటి ఐదేళ్లు నష్టాలను భరించాలనే ఒప్పందం మేరకు కేంద్రం బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిపింది. నాలుగు దశల్లో జరిగే రైల్వేలైన్ నిర్మాణం పనులకు సంబంధించి 2017–18 బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించగా, 2018–19లో మరో రూ.125 కోట్లు కేటాయించారు. ఈసారి మరో రూ.200 కోట్లు కేటాయించడంతో తొలిదశ పనులు పూర్తయినట్లేనని చెప్పవచ్చు. సిద్దిపేట వరకు దాదాపు భూసేకరణ పూర్తి – సిరిసిల్లలో నోటీసులు రైల్వేలైన్‌కు సంబంధించి ఒకవైపు మొదటి దశ పనులు జరుగుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. గజ్వేల్ వరకు రైల్వేలైన్ వేసే పనులు సాగుతుండగా, సిద్దిపేట వరకు భూసేకరణ దాదాపుగా పూర్తయింది. సిరిసిల్ల జిల్లాలో రైల్వేలైన్ సందర్భంగా భూములు కోల్పోతున్న వారికి భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు. సిరిసిల్లలో మిడ్‌మానేర్ బ్యాక్ వాటర్ మీదుగా కిలోమీటరు పొడవునా బ్రిడ్జి నిర్మాణం జరపాల్సి ఉంటుంది. సిరిసిల్ల వరకు భూసేకరణ పూర్తయితే మూడు దశల నిర్మాణం పనులకు ఆటంకాలు తొలగినట్టే. రైల్వే లైన్ హైలైట్స్ ► 2004లో కరీంనగర్ ఎంపీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదన ► 2006 : యూపీఏ–1 ప్రభుత్వం సర్వే చేసి, రూ.800 కోట్ల అంచనాతో బడ్జెట్ నివేదిక ► 2014: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత పనుల్లో కదలిక ► 2015: తాజా సర్వేలో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ అంచనా వ్యయం రూ.1160 కోట్లు ► 2016: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన ► 2017–18 : రైల్వే బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయింపు ► 2018–19 : రైల్వే బడ్జెట్లో మరో రూ.125 కోట్లు కేటాయింపు ► 2019–20 : ఈసారి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించిన కేంద్రం -
మళ్లీ ఎక్కడికో..!
పునరావాస కాలనీల్లోంచే రైలుమార్గం ఆందోళనలో చింతలఠాణా, చీర్లవంచ, శివపార్వతులకాలనీవాసులు మళ్లీరోడ్డున పడనున్న 200కు పైగా కుటుంబాలు కొత్తపల్లి–మనోహారాబాద్ రైలుమార్గం తెచ్చిన తంటా మధ్యమానేరు ప్రాజెక్టు కోసం ఎవుసం పొలాలు వదిలి పెట్టారు.. పాడిగేదెలను కాదనుకున్నారు.. ఎండ, వాన, చలి నుంచి కాపాడిన గూడును విడ్చిపెట్టారు.. పెంచుకున్న అనుబంధాన్ని పక్కనబెట్టారు.. ప్రాజెక్టు కడితే తమలాంటోళ్లు లక్షలాదిమంది బాగుపడుతారని సర్వం ధారపోశారు.. పాలకుల మాటలు నమ్మి.. అధికారులు చెప్పినట్లు తలూపారు.. ఉన్న ఊరును ఖాళీ చేసి పునరావాసకాలనీల్లో తలదాచుకునేందుకు వచ్చారు.. ఇక్కడా విధి వక్రీకరించింది. కొత్తపల్లి– మనోహరాబాద్ రైలు మార్గం నిర్మాణం ద్వారా వారు మళ్లీ నిర్వాసితులు కాబోతున్నారని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. చింతలఠాణా, చీర్లవంచ, శివపార్వతులకాలనీ పునరావాస ప్రాంతాల్లోంచే రైలుమార్గం నిర్మించేందుకు అధికారులు సర్వే ప్రారంభించడం వారిలో గుబులు రేపుతోంది. – వేములవాడ రూరల్ -
ఐదేళ్లలో రెలైక్కిస్తా.!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాబోయే ఐదేళ్లలో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను పూర్తి చేయడమే కాకుండా జిల్లా ప్రజలందరికీ రైలు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మార్చి తెలంగాణ చిత్రపటంలో అగ్రభాగాన ఉంచుతానన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ అనుబంధం) ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన ‘మీట్‌ది ప్రెస్’లో పాల్గొన్న వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు పార్లమెంట్లో లేవనెత్తిన అంశాలు, జిల్లా అభివృద్ధికి చేస్తున్న కృషితోపాటు తన ముందున్న కర్తవ్యాలను మీడియా ముందుంచారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరుణాకర్, శ్రీనివాస్‌లతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో వినోద్‌కుమార్ చెప్పిన మాటల్లోని ముఖ్యాంశాలివే. 16వ లోక్‌సభలో ఎన్నో రాజకీయ పార్టీలున్నప్పటికీ అసలు సిసలైన ప్రతిపక్షంగా వ్యవహరించిన పార్టీ టీఆర్ఎస్సే. దేశంలోని అన్ని సమస్యలను ప్రస్తావించాం. 92 ప్రశ్నలను సంధించాం. అనేక చర్చల్లో పాల్గొన్నాం. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ స్టాట్యుటరీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాను. రాజ్యాంగపరమైన సందేహాలైనందున కోర్టుకు వెళ్లాలని లోక్‌సభ స్పీకర్ రూలింగ్ ఇవ్వడం కూడా కనీవినీ ఎరుగనిది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్‌కు ఏళ్ల తరబడి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించగలిగా. భూసేకరణకు అయ్యే ఖర్చు, ప్రాజెక్టు పనుల్లో మూడో వంతు వ్యయంతోపాటు ఐదే ళ్లపాటు నిర్వహణ నష్టాన్ని భరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాను. వారం రోజుల్లో భూసేకరణ పనులు మొదలవుతాయి. తరువాత తొలుత వాగులు, కాలువలున్న చోట వంతెనలు నిర్మాణాలు ప్రారంభమవుతాయి. ఐదేళ్లలో రైల్వేలైన్ పనుల పూర్తి కావడం కష్టమే. అయినప్పటికీ ఐదేళ్లలో జిల్లా ప్రజలందరినీ రెలైక్కించేందుకు కృషి చేస్తా. {పాణహిత-చేవెళ్లకు జాతీయహోదా కల్పించాలనే ఏకైక లక్ష్యంతోనే కేసీఆర్ ఆదేశాల మేరకు జలవనరులకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న. అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చేలా కృషి చేస్తున్నా. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి జాతీయహోదా సాధిస్తా. గొర్రెల పెంపకాన్ని ‘పెద్ద మిషన్’గా రూపొందిస్తున్నా. కేంద్రం నుంచి సబ్సిడీ అందించేందుకు యత్నిస్తున్నా. కరీంనగర్ మిల్క్ డెయిరీ ప్రతిరోజూ రెండు లక్షల లీటర్ల పాలసేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా పాడిరైతులకు అదనంగా మరో రెండు గేదెలను కొనుగోలు చేసేందుకు వడ్డీలేని రుణాలందించేందుకు యత్నిస్తున్నా. చేనేత, పవర్‌లూం ఉత్పత్తులకు మార్కెటింగే అసలు సమస్య. బ్రాండెడ్ సంస్థల ప్రతినిధులను ఇక్కడికి తీసుకొచ్చి వారి అవసరాలకు అనుగుణంగా ఇక్కడికి కార్మికులకు సాంకేతిక నైపుణ్యతలో శిక్షణనిపిస్తా. వారి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఇబ్బంది లేకుండా చేస్తా. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా రూపొందించాలనే కలను నెరవేరుస్తా. సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందివ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులను కోరాను. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఏదో ఒక ఫ్యాకల్టీలో శాతవాహన యూనివర్సిటీని ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నా. వర్సిటీ అధికారులతో చర్చించడంతోపాటు అవసరమైన సహాయాన్ని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశాను. కరీంనగర్ జిల్లాను జాతీయ రహదారికి అనుసంధానించే ప్రణాళికలు రూపొందిస్తున్నా. ఇది కార్యరూపం దాల్చేందుకు ఫిబ్రవరిలో కేంద్ర అధికారుల బృందాన్ని ఇక్కడికి తీసుకొస్తా. సిరిసిల్లలో కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన భూసేకరణ వివరాలను కేంద్రానికి పంపాను. ఈ ఏడాది తరగతులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తా. కరీంనగర్ రహదారికి దగ్గర్లోనే ఎయిమ్స్‌ను స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నా. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై పోటీ ఉన్నా కరీంనగర్‌కే దక్కేలా కృషి చేస్తా. పాస్‌పోర్ట్ కార్యాలయంలో త్వరలోనే సకల సౌకర్యాలు కల్పిస్తా. నకిలీ వీసాల ఏజెంట్ల బెడద లేకుండా ఉండేందుకు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి కార్యక్రమాలు చేపడతాం. నేదునూరును థర్మల్ ప్రాజెక్టుగా రూపొందించేందుకు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిని. ఎందుకంటే బొగ్గును ఉపయోగిస్తే కరీంనగర్లో కాలుష్యం పెరుగుతుంది. ఎంత ఇబ్బంది ఉన్నా గ్యాస్ కేటాయింపుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తా. హైదరాబాద్-కరీంనగర్-వేములవాడ-ధర్మపురి-మహదేవ్పూర్-హన్మకొండ-యాదగిరిగుట్ట-హైదరాబాద్ పేరిట తెలంగాణలో అతిపెద్ద టూరిస్ట్ సర్క్యూట్ ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా ఉంది. వంద శాతం అనుమతి లభించేందుకు కృషి చేస్తా. జిల్లాలోని పర్యాట ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేలా చేస్తా. -
పట్టాలపైకి కలల లైన్
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు అనుమతి ప్రాజెక్టు వ్యయం 925 కోట్లు మూడోవంతు భారం రాష్ట్రంపైనే రైల్వే లైన్ పొడవు 149 కి.మీ. భూసేకరణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బోర్డు లేఖ సికింద్రాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్ వరకూ.. సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లా ప్రజల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర రాజధానితో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. కరీంనగర్ నుంచి సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే బోర్డు కార్యనిర్వాహక సంచాలకుడు అంజుమ్ పర్వేజ్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో దాదాపు 149 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దాదాపు పదేళ్ల కింద కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడి మేరకు రైల్వే శాఖ ఈ లైన్ సర్వేకు సమ్మతించగా.. ఇప్పుడు తెలంగాణ సీఎం హోదాలో ఆయన ప్రయత్నం ఫలించి పనులు ప్రారంభించేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 925 కోట్లు అవసరమవుతాయని తాజా అంచనా. మనోహరాబాద్ లైన్‌తో అనుసంధానం.. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు ఈ రైల్వేలైన్ నిర్మించనున్నారు. అయితే హైదరాబాద్ శివారులోని బొల్లారంలో రక్షణ శాఖ భూములుండటంతో... ఈ లైన్‌ను నేరుగా సికింద్రాబాద్ స్టేషన్‌తో అనుసంధానం చేయడం సాధ్యం కాలేదు. దీంతో సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైన్‌కు మనోహరాబాద్ వద్ద అనుసంధానిస్తారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ దాటిన తరువాత మనోహరాబాద్ వస్తుంది. అక్కడి నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి మండలాల నుంచి కరీంనగర్ శివారులోని కొత్తపల్లికి ఈ రైల్వేలైన్ చేరుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు నేరుగా వేములవాడ పుణ్యక్షేత్రానికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. 3 షరతులకు ఓకే అన్నాకే..: ఈ ప్రాజెక్టును పట్టాలెక్కేందుకు రైల్వే శాఖ అంత సులభంగా అంగీకరించలేదు. నష్టాలను బూచిగా చూపి షరతుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపింది. వాటి ప్రకారం నిర్మాణ వ్యయంలో మూడోవంతు (33 శాతం) భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత లెక్కన దాదాపు రూ. 308 కోట్లను రాష్ట్రం భరించాలి. ఇక భూసేకరణ భారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. దీనికితోడు ఐదేళ్లదాకా ఏవైనా నష్టాలు వస్తే.. వాటిని రాష్ట్రప్రభుత్వమే భరించాలనే (యాన్యుటీ విధానం) షరతు కూడా ఉంది. వీటన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో... రైల్వే లైన్‌కు ఆమోదం వచ్చింది. కేసీఆర్ ప్రతిపాదన ఇది... ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలల ప్రాజెక్టు ఇదని, 2004లో ఆయన కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు దీనికి ప్రతిపాదన చేశారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, తేజావత్ రాంచ ంద్రు, ఎంపీ వినోద్‌కుమార్ బుధవారం వెల్లడించారు. 2006-07 బడ్జెట్లోనే సర్వేకోసం దీన్ని పొందుపరిచారని, దక్షిణ మధ్య రైల్వే సమగ్ర అంచనా నివేదికను తయారు చేసి రైల్వే బోర్డుకు ఇచ్చిందని వారు చెప్పారు. ‘‘సాధారణంగా రేట్ ఆఫ్ రిటర్న్ (ఆర్ఓఆర్) 14 శాతం ఉంటే గానీ కొత్త రైల్వేలైన్ మంజూరు చేయరు. ఈ లైన్ ఆర్ఓఆర్ 2.64 శాతం మాత్రమే ఉండడంతో.. కేంద్రం పలు షరతులు పెట్టింది. టీఆర్ఎస్ 2006లో యూపీఏ నుంచి వైదొలిగింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో కదలిక లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. మేం ముగ్గురం తరచుగా రైల్వే బోర్డు అధికారులను కలిసి ఒత్తిడి తెచ్చాం. దాంతో పాటు షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో దీనికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. వెనకబడిన ప్రాంతంలో కొత్త రైల్వే లైను రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రైలు మార్గం ద్వారా భవిష్యత్‌లో సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా ఢిల్లీకి రైలు సౌకర్యం ఏర్పడే అవకాశముంది.’’ అని వారు పేర్కొన్నారు.